Neetu Nagpuri: కలిసికట్టుగా.. ప్రగతి దిశగా
ఉన్నత విద్య నభ్యసించిన ఆమె... పెళ్లి తర్వాత కట్టుబాట్లకు విలువిచ్చి ఇంటికే పరిమితమైంది. అయితే ఆ గ్రామంలోని మహిళలు కనీస అవగాహన లేక ఎలా వెనకబడ్డారో గమనించి... వారిని సాధికారత దిశగా నడిపించాలనుకుంది.
ఉన్నత విద్య నభ్యసించిన ఆమె... పెళ్లి తర్వాత కట్టుబాట్లకు విలువిచ్చి ఇంటికే పరిమితమైంది. అయితే ఆ గ్రామంలోని మహిళలు కనీస అవగాహన లేక ఎలా వెనకబడ్డారో గమనించి... వారిని సాధికారత దిశగా నడిపించాలనుకుంది. అందుకోసం స్వయం సహాయకబృందాలను ఏర్పాటు చేసింది. ఆమే మధ్యప్రదేశ్‌కు చెందిన నీతూ నాగ్‌పురి. ఆ విశేషాలు తన మాటల్లోనే....
మార్పు లేదని బాధపడితే సరిపోదు...అందుకోసం మొదటి అడుగు మనమే వేయాలనేది నా తత్వం. మాది బాలాఘాట్ జిల్లాలోని థేమా అనే చిన్న పల్లెటూరు. హిందీలో పీజీ చేశాను. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పుడే పెళ్లికుదిరింది. మావారిది ఈ దగ్గర్లోని బొడా అనే గ్రామం. పెళ్లయ్యాక అత్తింట్లో అడుగుపెట్టిన కొన్ని రోజులకే... ఆ ఊరి మహిళల స్థితిగతులు అర్థమయ్యాయి. వారెవరికీ కనీస స్వేచ్ఛ లేదు. వ్యవసాయమే ప్రధాన వృత్తిగా జీవించే ఈ ఊళ్లో ఆడవాళ్ల పరిస్థితి, జీవనవిధానం మారాలంటే...వారు ఆర్థిక సాధికారత దిశగా అడుగువేయాలని భావించా. ఆ మార్పుకి నేను ముందడుగు వేయాలనుకున్నా. నా ఆలోచనను మా వారికి చెప్పాను. ఆయన చాలా సంతోషించి నాకు వెన్నుదన్నుగా నిలుస్తానన్నారు.
స్వయం సహాయక సంఘాలతో... మా గ్రామంలో మొట్టమొదటి స్వయం సహాయక సంఘాన్ని 2017లో ప్రారంభించాను. స్థానిక మహిళల్లో చైతన్యం తీసుకురావడానికి ఇల్లిల్లూ తిరిగేదాన్ని. ఈ కార్యక్రమాలతో రోజంతా తీరిక లేకుండా గడిపేదాన్ని. ఆ సమయంలో నా భర్తే ఇంటి పనుల్లో సాయం చేసేవారు. రెండేళ్ల బాబుని అత్తమామలు చూసుకునేవారు. కొన్నిసార్లు పిల్లాడు... నన్ను వదిలిపెట్టలేనప్పుడు వెంట సమావేశాలకు తీసుకెళ్లేదాన్ని. మహిళల్లో మార్పు తీసుకువస్తానని చెప్పినప్పుడు... నన్ను మొదట నమ్మింది నా భర్తే. ఇప్పుడు ఊరు ఊరంతా నాపై నమ్మకాన్ని ఉంచింది. ఈ క్రమంలో మా బంధువు తారా నాగ్‌పురి నా ప్రయాణంలో తోడయ్యారు. ఇద్దరం కలిసి పది స్వయం సహాయక సంఘాలు ఏర్పాటుచేశాం. ఇంతకు ముందు కుటుంబ పెద్ద ఇచ్చిన కొద్దిపాటి మొత్తాన్నే ఆడవాళ్లు వ్యక్తిగత అవసరాలకు వినియోగించాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు వారి చేతిలోనూ ఎక్కువ మొత్తంలో డబ్బు ఉంటోంది. దీనిద్వారా వారు పొదుపూ, మదుపూ చేయగలుగుతున్నారు. అంతకు ముందు 7 నుంచి 8 వేలు ఉన్న వారి నెలవారీ ఆదాయం ఇప్పుడు పదివేలకు పెరిగింది. మహిళలు ఈ మొత్తాన్ని పిల్లల చదువుల కోసం వినియోగిస్తారు. మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తున్నారు. వ్యవసాయం, స్టాక్స్ వంటి వాటి గురించిన సమాచారం తెలుసుకుంటున్నారు.
మా ఊరి మహిళల్లో వచ్చిన చైతన్యం గురించి తెలిసిన రిలయన్స్ ఫౌండేషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్(ఆర్‌ఎఫ్‌ఐఎస్)మా గ్రామంలో మరిన్ని సేవాకార్యక్రమాలకు చేయూత నివ్వాలనుకుంది. ముఖ్యంగా వ్యవసాయంలో దిగుబడులకు నిపుణుల ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ సంస్థ సలహాతో ఎకరాకు రూ.400 ఖర్చుతోనే ఆకుతొలుచు పురుగుని అరికట్టి అధిక దిగుబడులను సాధించగలిగాం. భవిష్యత్తులో... సామూహిక వ్యవసాయానికి ప్రణాళికలూ వేసుకుంటున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.