ఆ విజయం వెనుక ‘ఆమె’!

ఆస్కార్‌ నుంచి నిన్నమొన్నటి ఫిఫా ప్రపంచకప్‌ వరకు ఈ ఏడాది ప్రముఖ ఘటనలెన్నో! వాటిలో ఎంతోమంది హీరోలు! వాళ్ల శ్రమ మనకు కనిపించేదైతే.. వాళ్ల వెనక, వాళ్లతో సమానంగా.. ఒక్కోసారి వాళ్లకు మించిన బరువును మోశారు వాళ్ల అర్ధభాగాలు.

Updated : 30 Dec 2022 09:00 IST

ఆస్కార్‌ నుంచి నిన్నమొన్నటి ఫిఫా ప్రపంచకప్‌ వరకు ఈ ఏడాది ప్రముఖ ఘటనలెన్నో! వాటిలో ఎంతోమంది హీరోలు! వాళ్ల శ్రమ మనకు కనిపించేదైతే.. వాళ్ల వెనక, వాళ్లతో సమానంగా.. ఒక్కోసారి వాళ్లకు మించిన బరువును మోశారు వాళ్ల అర్ధభాగాలు. ఆ హీరోల జీవితాలపై వాళ్ల ప్రభావమేంటో చూద్దాం.


ఆమెపై గౌరవంతోనే!

పెద్ద స్టార్‌ అవ్వాలని హాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు జాడాస్మిత్‌. రాణిస్తున్న సమయంలోనే పెళ్లి, పిల్లలు. ఇద్దరిలో ఒకరు త్యాగం చేయాలనుకున్నప్పుడు తన కెరియర్‌ని పక్కనపెట్టి అగ్రనటుడైన భర్త విల్‌స్మిత్‌కు అండగా నిలిచారు. పిల్లలు పెద్దయ్యాక తిరిగి నటనపై దృష్టిపెట్టారు. ‘ఆడంబరంగా పెళ్లి జాడాకి నచ్చదు. తన తల్లి, నా కోరిక మేరకు ఒప్పుకొంది. తను రాజీపడటం అప్పట్నుంచే మొదలైంది. కానీ ప్రతిదాన్నీ ఇష్టంగా చేసింది. నా ప్రతి విజయం, అపజయంలో తోడుంది. తను నా రెండో భార్య. మొదటి భార్యకు బాబు పుట్టినప్పుడు తండ్రిగా నేనేమీ చేయలేదు. జాడావల్లే మంచి నాన్నను కాగలిగా’నని చెబుతారు విల్‌స్మిత్‌. అలోపేసియా ఏరియేటా కారణంగా జాడాకు జుట్టంతా రాలిపోయింది. దానిపై జోక్‌ వేశారనే ఆస్కార్‌ అవార్డుల వేదికపై తోటి నటుడి చెంప పగలకొట్టారు స్మిత్‌. ప్రపంచమంతా తప్పు పట్టినా తన భార్య గౌరవం ముందు తనకేదీ ఎక్కువ కాదన్నారాయన.


అప్పట్నుంచే అండగా..

భార్య అండ బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌కి పెళ్లికి ముందు నుంచే లభించింది. ఇన్ఫోసిస్‌ అధినేత నారాయణ మూర్తి కూతురిగా ఒకరకంగా అక్షతా మూర్తిది యువరాణి హోదానే. పట్టుబట్టి, నాన్నని ఒప్పించి రిషిని పెళ్లి చేసుకున్నారామె. అలా మొదలైన తోడుగా నిలిచే అలవాటు ఇప్పటికీ కొనసాగుతోంది. ‘18 ఏళ్ల క్రితమే అక్షత నన్ను నమ్మి నావెంట నడిచింది. ఎన్నికల్లో నా తరఫు ప్రచారం చేసింది. వివాదాలు ఎదురైనా వెరవలేదు. నా గెలుపులో ఆమెకీ భాగస్వామ్యం ఉంది’ అంటారు రిషి. వ్యాపారవేత్తగా రాణిస్తూనే తల్లిగా, భార్యగా బాధ్యతలు సమర్థంగా నిర్వర్తిస్తోందంటూ గర్వంగా చెబుతారు కూడా.


యుద్ధంలోనూ తోడుగా

అత్యంత శక్తిమంతమైన శత్రువుతో పోరాటం. ఏ క్షణంలోనైనా భర్తను మరణం తాకొచ్చు. కుటుంబానికీ ముప్పే. అయినా వెనకాడలేదు ఒలెనా జెలెన్‌స్కా. రష్యా సేనలు ఆధిపత్యం కోసం ఏడాదిపైగా ప్రయత్నిస్తున్నా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ ధైర్యంగా ఎదుర్కోగలుగుతున్నాడంటే ఆమె వెన్నంటే ఉందన్న ధైర్యమే. దేశ ప్రథమ మహిళగా ప్రజల్లో ధైర్యాన్ని నింపడమే కాదు.. అంతర్జాతీయ మద్దతుకూ ప్రయత్నిస్తున్నారు. అమెరికా వెళ్లినపుడు ‘అమ్మగా యుద్ధానికి వ్యతిరేకం. అలాంటిది వేల చిన్నారుల మరణాలు చూశాక ఈ కోరిక కోరాలనిపిస్తోంది. మాకు ఆయుధాలివ్వండి. ఇంటినీ, మా చిన్నారులనీ రక్షించుకుంటాం’ అని చేతులు జోడించింది. అందుకే జెలెన్‌స్కీ ఆమె గురించి చెబుతూ ‘తను నా ప్రాణ స్నేహితురాలు కూడా. యుద్ధ సమయంలో తన తోడే నన్ను ధైర్యంగా నడిపిస్తోంద’ని చెబుతారు.


ఆమెకు ఫిదా

తన ఆటతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను గెలుచుకున్న లియోనెల్‌ మెస్సీ చిన్నతనంలోనే ఆంటోనెలాకి ఫిదా అయ్యాడు. చాలా బిడియస్థుడు.. కానీ తనలో మార్పుకు ఆమెనే కారణమంటాడు. డెంటిస్ట్‌ అవ్వాలన్న కలనూ మెస్సీ కోసమే పక్కనపెట్టారామె. ‘ఆంటోనెలా నా జీవితాన్ని అందంగా తీర్చిదిద్దింది. ఎప్పుడూ ఆహ్లాదంగా ఉంటూ చుట్టూ ఉన్నవారిలోనూ సంతోషాన్ని నింపుతుంది. ఏ సమస్యైనా చాకచక్యంగా పరిష్కరిస్తుంది. కుటుంబ బాధ్యతంతా తనదే. ఆమె తోడుంటే ఏదైనా సాధించగలననిపిస్తుంది’ అంటూ మురిసిపోతాడు మెస్సీ.


చీకటిలో వెలుగులా..

బ్యాట్‌తో రాణిస్తూ మిస్టర్‌ 360గా గుర్తింపు తెచ్చుకున్నాడు సూర్యకుమార్‌ యాదవ్‌. తాజాగా భారత జట్టుకు వైస్‌ కెప్టెన్‌ కూడా అయ్యాడు. కానీ కెరియర్‌ ప్రారంభంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు తనీ స్థాయిలో ఉండటానికి భార్య దేవిషానే కారణమంటాడు. ‘ఎంత శ్రమించినా జట్టులో స్థానం సంపాదించలేకపోయా. దీనికితోడు గాయాలు. నామీద నాకే అపనమ్మకం ఎదురైనప్పుడు దేవిషా నన్ను నమ్మింది. నువ్వు చేయగలవని ప్రోత్సహించింది. తను లేకపోతే ఏమైపోయేవాడినో’ అని చెబుతాడు సూర్య.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్