జేఆర్‌డీ టాటాని ఎదిరించి...

ప్రతిష్ఠాత్మక ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌- అహ్మదాబాద్‌ పేరుచెబితే మొదట గుర్తొచ్చే పేరు డాక్టర్‌ కమలాచౌదరి.

Updated : 06 Mar 2023 07:51 IST

ప్రతిష్ఠాత్మక ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌- అహ్మదాబాద్‌ పేరుచెబితే మొదట గుర్తొచ్చే పేరు డాక్టర్‌ కమలాచౌదరి. అక్కడ ఫ్యాకల్టీ సభ్యురాలిగా, డైరెక్టర్‌గా.. మహిళల అభ్యున్నతి కోసం పోరాడారామె...

పౌరసేవాధికారి (సివిల్‌ సర్వీసెస్‌) ఖేమ్‌ చౌదరిని పెళ్లాడారామె. పక్కనే నిద్రిస్తోన్న భర్త హత్యకు గురవడంతో నిలువెల్లా వణికిపోయారామె. నిరాశతో పోరాడుతూ సోషల్‌ సైకాలజీ చేసేందుకు అమెరికా వెళ్లారు. పీహెచ్‌డీ చేసి అహ్మదాబాద్‌ టెక్స్‌టైల్‌ ఇండస్ట్రీ రిసెర్చ్‌ అసోసియేషన్‌లో చేరారు. దాంతో 1960 నాటికి ఆమెకి అనేక ఉద్యోగావకాశాలు వచ్చాయి. కానీ డాక్టర్‌ సారాభాయ్‌ ప్రోత్సాహంతో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో అధ్యాపక బాధ్యతలు చేపట్టారు. యూనిలీవర్‌ వంటి ప్రధాన కార్పొరేషన్‌ల కేస్‌ స్టడీస్‌ను రూపొందించారామె. బోధన, పరిశోధనల వైపు దృష్టి సారించారు. వివిధ సంస్థల్లో కన్సల్టెంట్‌గా కొనసాగారు. హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్లో విజిటింగ్‌ ఫాకల్టీగా నియమితులైన తొలి మహిళ. అంత మేధోమూర్తిని కూడా లింగవివక్ష వదల్లేదు. ఎంబీఎలో ఎక్కువమంది మహిళలను చేర్చుకోవడానికి బలమైన పోరాటమే చేశారామె. ఐఐఎం తర్వాత ఫోర్డ్‌ ఫౌండేషన్‌ ఇండియా ఆఫీస్‌ పబ్లిక్‌ ప్లానింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీకి సలహాదారుగా, నేషనల్‌ వేస్ట్‌ల్యాండ్స్‌ డెవలప్‌మెంట్‌ బోర్డ్‌ అధినేత్రిగా చేశారు. టాటా సంస్థ తమ ఉద్యోగ ప్రకటనలో ‘మహిళలు దరఖాస్తు చేయనవసరం లేదు’ అని రాయడం చూసి జేెఆర్‌డీ టాటానే ఎదిరించారు. ఫలితంగా మరుసటి సంవత్సరం అది రద్దయ్యింది. 85 ఏళ్ల వయసులో 2006 జనవరి 4న కన్నుమూశారు. కానీ ఆమె ఖ్యాతి మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయింది. ఐఐఎంఏలో ప్రధానంగా మహిళల విభాగమైన డార్మిటరీ 1కు ఆమె గౌరవార్థం పేరు మార్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్