ఏడు గర్భస్రావాలయ్యాకనే..

ఒకటీ రెండు సార్లు కాదు... ఏడుసార్లు గర్భస్రావం అంటే ఏ తల్లికైనా అంతకు మించిన బాధేముంటుంది ఆ కష్టం మరో అమ్మకు కలగకూడదని తనపై తానే పరిశోధనలు చేసుకున్నారు అమీబెక్లే.

Updated : 09 Jan 2023 04:17 IST

ఒకటీ రెండు సార్లు కాదు... ఏడుసార్లు గర్భస్రావం అంటే ఏ తల్లికైనా అంతకు మించిన బాధేముంటుంది ఆ కష్టం మరో అమ్మకు కలగకూడదని తనపై తానే పరిశోధనలు చేసుకున్నారు అమీబెక్లే. ప్రతి మహిళా సొంతంగా తన గర్భధారణ సామర్థ్యాన్ని తెలుసుకొనేందుకు వీలుగా ప్రూవ్‌ విధానాన్ని కనిపెట్టారు. ఎంతోమంది తల్లుల కలలని సాకారం చేస్తున్న ఈ ఆలోచన హైదరాబాద్‌లో జరిగిన టైగ్లోబల్‌ పోటీలో రూ.20 లక్షల్ని గెలుచుకొంది. ఆ సందర్భంగా ఆవిడ వసుంధరతో తన అనుభవాలను పంచుకున్నారు...

‘అమ్మాయ్‌ ఏదైనా విశేషమా’ బంధువులు, స్నేహితులు ఈ ప్రశ్నని నవ్వుతూ వేసినా.. అమీకి మాత్రం గుండెకోతలా ఉండేది. తనకో బిడ్డనిమ్మని ఆవిడ దేవుడిని మొక్కని రోజు లేదు. మూడేళ్లు పిల్లల కోసం ఎదురుచూపులు చూశాక.. ఆమె నెల తప్పింది. ఇంటిల్లిపాది మనసుల్లోనూ సంతోషాన్ని నింపిందా శుభవార్త. కానీ గర్భస్రావం కావడంతో.. ఆ సంతోషం కాస్తా తుడిచి పెట్టుకుపోయింది. అందరిలోనూ నిరాశ. రెండోసారీ అలాగే జరిగింది. ఆ తర్వాతా మళ్లీ.. మళ్లీ గర్భస్రావాలు. ఇలా ఏడుసార్లు వేదనే మిగిలింది. అమీది అమెరికాలోని కొలరాడో.

‘ప్రతి సారీ పరీక్షలన్నీ చేసేవారు. అంతా బాగానే ఉంది. ఎందుకు గర్భస్రావం అవుతోందో తెలియట్లేదన్నారు. చివరికి డాక్టర్లు ఐవీఎఫ్‌ చేయించుకోమని సూచించారు. ఒకో సారికీ 30వేల డాలర్లు అయ్యేది. అలా రెండు సార్లు చేయించుకున్న తర్వాతే బాబు పుట్టాడు. ఇప్పుడు వాడికి పదేళ్లు. బిడ్డను కనగలిగానంటే నాకు సంతానోత్పత్తి సామర్థ్యం ఉన్నట్టే. అటువంటప్పుడు సమస్య ఏంటో తెలిసి ఉంటే ఇంత కష్టం ఉండేది కాదు కదా అనుకొన్నా. అప్పుడే నాకో ఆలోచన వచ్చింది’ అంటూ ప్రూవ్‌ ఆలోచనకు కారణాన్ని వివరించారు అమీ.


పాపకోసం...

శాస్త్రవేత్తగా తనపై తానే పరిశోధన చేసుకోవాలనుకున్నారు అమీ. ‘బిడ్డ పుట్టే అవకాశం ఉందా లేదా అనేది తెలుసుకోడానికి హార్మోన్‌ పరీక్షలు చేస్తారు. వీటి ద్వారా నెలసరి తర్వాత ఫలదీకరణకు అనుకూలమైన సమయాన్ని గుర్తిస్తారు. ప్రతి మహిళ తన రుతు చక్రంలో గర్భం దాల్చడానికి అనుకూల సమయాన్ని ఇంట్లోనే స్వయం పరీక్షలతో గుర్తించే వీలుంటే మంచిది కదా అనిపించింది. సంతానోత్పత్తి, సంతాన లేమి వంటివాటిపై పరిశోధన మొదలు పెట్టా. సాధారణంగా ఐవీఎఫ్‌ పద్ధతిలో గర్భందాల్చే ముందు చేసే హార్మోన్‌ పరీక్షలకు రూ.16వేలు అవుతాయి. అయితే ఈ చిన్న పరీక్షకోసం చాలామంది లక్షల రూపాయలు ఖర్చు చేయడం చూశా. మధ్య, దిగువ తరగతి వారికి ఇది భరించలేని ఖర్చు కదా. ఇది నన్ను మరింత ఆలోచింపచేసింది. వీటన్నింటికీ పరిష్కారంగా కనిపెట్టిందే ‘ప్రూవ్‌’. ఇది గర్భాశయం లోపల హార్మోన్ల మార్పులను కనిపెట్టగలిగే ఒక యాప్‌ లాంటిది. అండం ఎప్పుడు విడుదలవుతుందో కూడా దీంతో గుర్తించొచ్చు. గర్భధారణకు సరైన సమయాన్ని తెలుసుకోవచ్చు. ఈ పద్ధతిని పాటించి డాక్టరుకు వివరించి హార్మోన్‌ సప్లిమెంట్స్‌ తీసుకోగలిగా. ఇలా నాపై నేను చేసుకొన్న ప్రయోగ ఫలితంతో రెండో కాన్పులో పాప పుట్టింది. ఇప్పుడు తనకు ఏడేళ్లు. మరి అన్నిసార్లు గర్భస్రావం జరిగింది కదా, దానికీ కారణాన్ని కనుక్కోగలిగా. నా సమస్యకు పరిష్కారాన్ని కనిపెట్టాక దాన్ని అందరికీ ఉపయోగపడేలా చేయాలనిపించింది’ అని చెబుతున్న అమీ ఆ తర్వాత ఆవిష్కరించిన వైద్యపరికరం ‘ప్రూవ్‌’ తనను టైగ్లోబల్‌ పోటీలో రెండో విజేతగా నిలిపింది. ప్రూవ్‌తో స్వయం పరీక్ష ద్వారా మహిళలు తమ సంతానోత్పత్తి సామర్థ్యాన్ని తెలుసుకోవచ్చు. డాక్టర్‌ అమీ బెక్లే ‘ఎంఎఫ్‌బీ ఫెర్టిలిటీ’ సంస్థ వ్యవస్థాపకురాలు కూడా. ‘చిన్నప్పటి నుంచి వైద్య విద్య చదవాలనేది నా కల. కాలేజీలో ఉన్నప్పుడు వలంటీర్‌గా ఆసుపత్రిలో పనిచేశా. ఆ వాతావరణం నన్ను భయపెట్టింది. దాంతో డాక్టరు కలను పక్కన పెట్టి, బయోటెక్‌ సంస్థలో చేరిపోయా. తర్వాత ఫార్మకాలజీలో పీహెచ్‌డీ చేశా. అప్పుడే హార్మోన్‌ సిగ్నలింగ్‌పై అంశంపై అధ్యయనం చేశా’ అంటున్నారు అమీ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్