‘అమ్మ’లా అనాథల సేవలో..

దివ్యాంగురాలైనా అధైర్యపడలేదు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసింది. బతకడానికి పోరాటం చేసింది. తను పడుతున్న బాధలు ఇంకెవరు పడకూడదనుకుంది.

Published : 02 Jan 2023 03:22 IST

దివ్యాంగురాలైనా అధైర్యపడలేదు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసింది. బతకడానికి పోరాటం చేసింది. తను పడుతున్న బాధలు ఇంకెవరు పడకూడదనుకుంది. బతకడమే కష్టంగా ఉన్న స్థితి నుంచి కోలుకుని ఇతరులకు అండగా ఉంటున్న అలత్తూరు కృష్ణవేణి తన ప్రయాణాన్ని వసుంధరతో పంచుకున్నారిలా...

నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ల ఎదురు చూపులు ఎలా ఉంటాయో నాకు తెలుసు. కన్నవారికి భారం కాలేక చావే శరణ్యం అనుకుంటారు. నేనూ ఆ పరిస్థితి నుంచి వచ్చిన దాన్నే కదా!  అందుకే నాలాంటి వారికి సాయపడాలి అనుకున్నా. మాది నాయుడుపేటలోని అలత్తూరు. ఐదో తరగతి వరకు చదువుకున్నా. అమ్మానాన్నలు సుబ్బమ్మ, వెంకట రమణయ్యలు. పేద కుటుంబం. ఏడాది వయసులో జ్వరం వచ్చి నా రెండుకాళ్లూ చచ్చుబడిపోయాయి. బడికి వెళ్లలేక.. ఇంటికే పరిమితమయ్యాను. బీడీలు చుడుతూ రోజుకు రూ.500 సంపాదించేదాన్ని. పింఛను తీసుకోవడానికీ, ట్రైసైకిల్‌ కోసం.. ఇలా ఏ పని చేయాలన్నా అనేక సవాళ్లు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి అలసిపోయినా పని జరిగేది కాదు. స్వయం ఉపాధి కోసం చిల్లర దుకాణం పెట్టుకునే డబ్బు కూడా లేదు. పొదుపు బృందాల్లో చేరనిచ్చేవారు కాదు. ఇలా ఎటు చూసినా దారులు మూసుకుపోయేవి. నా ప్రతి కష్టంలో తోడున్న అమ్మ నాలుగేళ్ల కిందట చనిపోయింది. అదొక నిరాశ. దాన్నుంచి బయటపడటానికి చాలా సమయం పట్టింది. ఒంటరితనం నుంచి దూరం కావడానికి ఇతరులకు సాయపడాలి అనుకున్నా. తల్లి లేని వారికి తల్లిని కావాలనుకున్నా. అందుకే ‘అమ్మ’ పేరుతో స్వచ్ఛంద సంస్థను స్థాపించా. దివ్యాంగులు, అనాథలు, హెచ్‌ఐవీ బాధిత చిన్నారులు, ఆదరణకు దూరమైన వృద్ధులను చేరదీస్తున్నా. 25 మంది హెచ్‌ఐవీ బాధితుల బాధ్యత తీసుకున్నా. దాతల సాయంతో ఆహారం, చదువు, మౌలిక సదుపాయాలు సమకూరుస్తున్నా. ఇదంతా నేను చక్రాల కుర్చీపై వెళ్లే చేస్తున్నా. 300 ఇళ్ల నుంచి బియ్యం సేకరించి.. బిక్షాటన చేసే వారికి వీటితో భోజనం అందిస్తున్నా. నా పింఛనూ, దాతల సహకారం...కలిసి ప్రతినెల రూ.30 వేల దాకా పోగవుతాయి. ఆ మొత్తాన్ని వృద్ధులకు పోషకాహారం అందించడానికి వినియోగిస్తున్నా. పింఛను రాని అర్హులకు ధ్రువపత్రాలు సమకూర్చుకోవడంలో సాయపడుతున్నా. నేను చేస్తోన్న కార్యక్రమాలను చూసి కొంతమంది ఉద్యోగులు, గృహిణులు తమ వంతు సాయం చేస్తున్నారు. దివ్యాంగురాలే ఇంత చేస్తుంటే మనం ఇంకెంత చేయాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో కలిగిస్తున్నా. నా బాధ నుంచి బయట పడటానికి మొదలు పెట్టిన పని ఇంతమంది ఆకలి తీర్చడం సంతోషంగా ఉంది. చుట్టుపక్కల వారిలో కలిగిన చైతన్యం నాలాంటి చాలా మందిని ఆదుకుంటోంది. సేవలను విస్తృతం చేయడానికి ప్రయత్నిస్తున్నాను. బతికున్నంత వరకు ఇది కొనసాగించాలని ఆశపడుతున్నా.

- నాగరాజు, చిత్తూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్