Hamida: శరణార్థ శిబిరంలో పుట్టి...

యుద్ధాల్లో, సాయుధ తిరుగుబాట్ల సమయాల్లో అక్కణ్ణించి తప్పించుకున్నవారికి రక్షణ కల్పించేదే శరణార్థ శిబిరమని మనందరికీ తెలుసు.

Updated : 24 May 2023 14:20 IST

యుద్ధాల్లో, సాయుధ తిరుగుబాట్ల సమయాల్లో అక్కణ్ణించి తప్పించుకున్నవారికి రక్షణ కల్పించేదే శరణార్థ శిబిరమని మనందరికీ తెలుసు. ఆ నీడలో ప్రాణం నిలబెట్టుకోగలరే తప్ప అంతకు మించి సౌకర్యాలూ సౌలభ్యాలూ ఏముంటాయక్కడ?! అలాంటి చోట పుట్టిన హమీదా అహ్మద్‌ నిరాశతో కుంగిపోలేదు. అభివృద్ధి దిశగా అడుగులేస్తోంది. తనలాంటి వారికి చేయూత నందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. సామాజికసేవతో సంతోషాలు ప్రోది చేసుకుంటోంది. మనసుకు హత్తుకునే హమీదా కథనం ఆమె మాటల్లోనే..

‘నాకిప్పుడు ఇరవైనాలుగేళ్లు. పీజీ చేశాను. కానీ నేను పుట్టింది ఒక శరణార్థ శిబిరంలో. ఏడేళ్లు అక్కడే గడిచాయి. మాది తూర్పు ఆఫ్రికాలోని సోమాలియా. అక్కడ యుద్ధం సృష్టించిన బీభత్సంతో అమ్మానాన్నా కెన్యా వెళ్లి శిబిరంలో తల దాచుకున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేక నానా యాతనా పడ్డారు. అక్కడే నేను పుట్టాను. నన్నూ మిగిలిన పిల్లలను కాపాడుకోవడానికి అమ్మానాన్నా చేసిన త్యాగాలకు లెక్కలేదు. 

శిబిరంలో ఉండగా నాన్న డెలివరీ మ్యాన్‌గా పనిచేసేవాడు. ఒక చక్రాల బండిని అద్దెకు తీసుకుని వస్తువులను కొనుగోలుదారులకు చేరవేసేవాడు. అలా మమ్మల్ని పోషించారాయన. అమ్మ ఎదుర్కొన్న సవాళ్లకైతే లెక్కే లేదు. శిబిరంలో నానా అరాచకాలూ జరిగేవి. ఆమె జీవితమంతా సమస్యలతోనే పోరాడింది. కానీ ఎన్నడూ కుంగిపోలేదు. దృఢమైన స్త్రీకి నిర్వచనం మా అమ్మ అంటే అతిశయోక్తి కాదు. తన గురించి ఒక పెద్ద పుస్తకమే రాయొచ్చు. మా కుటుంబం అమెరికా చేరడానికీ, తర్వాత అక్కడ జీవనం గడపటానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సాయం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఛారిటీ సంస్థలూ, మనసున్నవారు తోడ్పడకపోతే నేను చదువుకోవడం సాధ్యమయ్యేదే కాదు. నేనేం చేసినా అమ్మానాన్నలు గర్వించాలన్నదే ధ్యేయం.

లోకంలో ఎన్నో అన్యాయాలూ, అక్రమాలూ చూస్తూ పెరిగాను. రగిలిపోయాను. అవి నన్నెంతో ప్రేరేపించాయి. ప్రజల పక్షంగా పోరాటం చేయాలనుకున్నాను. అందుకోసమే పట్టుదలగా చదివాను. ఓరెగాన్‌లోని పోర్ట్‌ల్యాండ్‌ యూనివర్సిటీ నుంచి పబ్లిక్‌ పాలసీలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేశాను. మా కుటుంబం పడిన కష్టాలే నన్ను సామాజికవేత్తను చేశాయి. నాకు చేతనైనంతగా నిస్సహాయులకు చేయూతనందించేందుకు ప్రయత్నిస్తుంటాను. అందులో భాగంగా చందాలు పోగుచేస్తోంటే ఒక తెల్లమనిషి నేను కుంభకోణాలు చేస్తున్నానంటూ ప్రచారం చేశాడు. నేను ఎవరి నుంచి ఎంత సొమ్ము పొందాను, అదంతా వేటికోసం ఖర్చుపెట్టానో రసీదులు చూపిస్తే ఇక ఏం మాట్లాడాలో తెలియక కళ్లు తేలేశాడు. ఇలాంటి అవమానాలూ, పరాభవాలూ ఎదుర్కోకూడదనే ప్రతిదీ లెక్క రాస్తాను, రసీదులు దాస్తాను. అవసరంలో ఉన్నవారిని ఆదుకోవాలన్నదే నా లక్ష్యం. అందులో ఎలాంటి అడ్డంకులు ఎదురైనా లక్ష్యపెట్టను’ అంటోన్న హమీదా అహ్మద్‌ కథ స్ఫూర్తి నింపేలా ఉంది కదూ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్