Laxmi: యోగ లక్ష్మి!

నాలుగు పదులు దాటితే సెకెండ్‌ ఇన్నింగ్స్‌లోకి అడుగుపెట్టిన భావన. యాభై దాటితే బీపీ, షుగర్‌ అంటూ జబ్బులు వరుస కడతాయి. ‘ఫిట్‌గా ఉండాలని మాకు మాత్రం ఉండదా? ఆహారంలో సత్తువ లేదు..’ లాంటి సాకులు చెబుతాం.

Updated : 26 May 2023 07:53 IST

నాలుగు పదులు దాటితే సెకెండ్‌ ఇన్నింగ్స్‌లోకి అడుగుపెట్టిన భావన. యాభై దాటితే బీపీ, షుగర్‌ అంటూ జబ్బులు వరుస కడతాయి. ‘ఫిట్‌గా ఉండాలని మాకు మాత్రం ఉండదా? ఆహారంలో సత్తువ లేదు..’ లాంటి సాకులు చెబుతాం. కానీ  62 ఏళ్ల లక్ష్మి దగ్గర మాత్రం మన పప్పులు ఉడకవు. ఎందుకంటే ఆవిడ ఈ వయసులోనూ అనారోగ్యాన్ని జయించి, యోగాలో క్లిష్టమైన ఆసనాలు వేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు...

‘నువ్వు ఎక్కువ కాలం బతకవు. బతికినన్నాళ్లూ మందులు, ఇంజెక్షన్లతోనే’ అని డాక్టర్‌ చెప్పిన మాటలకి భయపడ్డారామె. ఆమె వెంటే ఉన్న భర్త అప్పన్న మాత్రం ఈ మందులతో కాకపోతే యోగాతో ప్రయత్నిద్దాంలే అంటూ ధైర్యం చెప్పారు. ఈ మాట అని పాతికేళ్లు అవుతోంది. లక్ష్మి ఆరోగ్యంగా ఉన్నారు. పైగా ఎంతోమందిని సంపూర్ణ ఆరోగ్యంవైపు అడుగులు వేయిస్తున్నారు. లేటు వయసులో యోగ సాధన చేస్తూ అంతర్జాతీయ యోగా పోటీల్లో 30కి పైగా బంగారు పతకాలు సాధించారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస ‘లగుడు లక్ష్మి’ సొంతూరు. పాతికేళ్ల క్రితం తీవ్రమైన గుండె జబ్బు వచ్చింది. కీళ్ల నొప్పులు, మెగ్రైన్‌.. ఇలా చాలా సమస్యలు. డాక్టర్‌ దగ్గరకు వెళ్తే తనకున్న జబ్బులకు వైద్యం లేదని, బతకడం కష్టమని.. మందులు, ఇంజెక్షన్లూ రోజూ వాడాల్సిందే అన్నారు. ఇల్లంతా మందుల దుకాణంలా ఉండేది. దాంతో నిరాశలో కూరుకుపోయిన ఆమెకి భర్త ధైర్యం చెప్పారు. ఆయన జలవనరుల శాఖలో విశ్రాంత ఉద్యోగి. ఎలాగైనా భార్యను బతికించుకోవాలనుకుని తనకు తెలిసిన యోగశాస్త్రాన్ని భార్యకు నేర్పించి, సాధన చేయించారు. తక్కువ కాలంలోనే మందులు వాడాల్సిన అవసరం తప్పింది. తమ జీవితంలో ఎదురైన అనుభవంతోనే భార్యాభర్తలిద్దరూ స్థానికంగా పతంజలి యోగ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. వివిధ రకాల అనారోగ్యాలతో బాధపడుతున్న గృహిణులకు ఉచితంగా యోగ విద్యను అందిస్తున్నారు. వారిలో ఆసక్తి ఉన్నవారిని రాష్ట్ర, జాతీయ స్థాయి యోగా పోటీలకు తమ సొంత ఖర్చులతో పంపిస్తున్నారు.

భర్త శిక్షణతో..

‘మావారు ఆంధ్రప్రదేశ్‌ యోగా అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌. 38 ఏళ్ల వయసులో యోగ ప్రారంభించా. ఈ వయసులోనా అని ఎగతాళి చేశారు. అయినా సాధన ఆపలేదు. ఐదేళ్ల తర్వాత.. 43 ఏళ్లప్పుడు వరంగల్‌లో రాష్ట్రస్థాయి పోటీల్లో తొలి సారి పాల్గొని కాంస్య పతకం సాధించా. దాంతో ఆసక్తి పెరిగి నిరంతర సాధనతో క్లిష్టమైన ఆసనాల్లో నేర్పు సంపాదించాను. జాతీయ స్థాయిలో జరిగే ప్రతి యోగా పోటీకీ వెళ్తూ బంగారు పతకాలు సొంతం చేసుకున్నా. ఆ ఆత్మవిశ్వాసంతోనే 2013లో థాయ్‌లాండ్‌లో అంతర్జాతీయ పోటీల్లో నాలుగు విభాగాల్లో నాలుగు బంగారు పతకాలు సాధించి.. ఓవరాల్‌ ఛాంపియన్‌గా నిలిచా. థాయ్‌లాండ్‌ యోగ సొసైటీ వారు ‘మిసెస్‌ యోగ యూనివర్స్‌’ బిరుదుతో సత్కరించారు. 2015లో చైనాలో పోటీల్లోనూ పాల్గొన్నా’ అనే లక్ష్మి మహిళలు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే యోగసాధన తప్పనిసరి అంటున్నారు.

ఉచితంగా శిక్షణ...

మొదట్లో గృహిణుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వారికి శిక్షణ ఇచ్చారు లక్ష్మి. తర్వాత చుట్టుపక్కల పేద విద్యార్థులకు ఉచితంగా యోగ శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు. వాళ్లలో మెరికలను ఎంపిక చేసుకుని రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు ప్రోత్సహించారు. అందుకయ్యే ఖర్చునీ తనే భరిస్తున్నారు. ‘2001 నుంచి ఇంతవరకూ 5000 మందికి శిక్షణ ఇచ్చాం. వాళ్లలో వందమందికిపైగా విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయుల్లో పతకాలు సాధించి యోగవిద్యను ప్రచారం చేస్తున్నారు’ అనే లక్ష్మి ఈ విద్య నలుగురికీ తెలియడమే నాకు సంతోషం అంటున్నారు.

- వెంకట మహేష్‌ వెల్లంకి, ఈటీవీ, శ్రీకాకుళం


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్