Vijayasanthi: ప్రధాని రెండు సార్లు ప్రశంసించారు!
మహిళా సాధికారతకు వ్యాపారమే మార్గమనుకుంది. దాంతో పాటూ పర్యావరణ పరిరక్షణా తన బాధ్యతని భావించింది. అందుకే అవకాశాలను సృష్టించుకుంది.
మహిళా సాధికారతకు వ్యాపారమే మార్గమనుకుంది. దాంతో పాటూ పర్యావరణ పరిరక్షణా తన బాధ్యతని భావించింది. అందుకే అవకాశాలను సృష్టించుకుంది. తాను ఉపాధి పొందుతూ మరికొందరికీ చేయూతనిస్తోంది. ఆ కృషే మణిపూర్‌కి చెందిన విజయశాంతిని ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్‌కీబాత్’లో మూడేళ్లలో రెండు సార్లు గుర్తు చేసుకునేలా చేసింది. ఆమె స్ఫూర్తి ప్రయాణాన్ని తెలుసుకుందాం...
విజయశాంతిది మణిపూర్‌లోని బిష్ణుపూర్ జిల్లా, తంగా టోంగ్‌బ్రామ్ అనే చిన్న గ్రామం. తండ్రి జోయ్ కుమార్. మణిపూర్ మత్స్యశాఖలో చిరుద్యోగి. తల్లి సనాహల్ గృహిణి. ముగ్గురు తోబుట్టువుల్లో పెద్దది విజయశాంతి. ఇంఫాల్ జీపీ ఉమెన్స్ కాలేజ్ బోటనీ ఆనర్స్ చేసిన ఆమె... అగ్రిటూరిజం స్టార్టప్ ప్రారంభించాలనుకుంది. అయితే, వనరుల కొరతతో ఆ ప్రయత్నాన్ని మధ్యలోనే వదిలేసింది. మరో కొత్త దారికోసం వెతుకుతున్న సమయంలోనే కుటుంబ స్నేహితుడొకరు లోటస్ ఫైబర్, దాని అనుబంధ ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ వంటి వివరాలను ఆమెతో పంచుకున్నారు. కలువ పూలను దేవతలకు సమర్పించడానికీ, అలంకరణ కోసం మాత్రమే ఉపయోగించడం తెలిసిన విజయకు ఇది కొత్తగా అనిపించింది. పరిశోధిస్తే ఇందులో ఉండే ఔషధ గుణాలూ, ఉపయోగాలు తనను మరింతగా ఆకర్షించాయి. ఈ తరహా దుస్తులకు విదేశాల్లో ముఖ్యంగా మయన్మార్, కంబోడియాలో ఉన్న ఆదరణ గుర్తించి దీన్నే వ్యాపారంగా మలచుకోవాలని నిర్ణయించుకుంది.
వృథా కానివ్వకుండా...
విజయ వాళ్లింటికి కొన్ని కిలోమీటర్ల దూరంలో లోక్‌టాక్ సరస్సు ఉంది. ఇది ఈశాన్య భారతంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు. ఇందులో వేలాదిగా పూసే తామర పూలను చూడటానికి పెద్ద ఎత్తున పర్యటకులూ వస్తుంటారు. ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున తామరపూలను దేవాలయాలు, పూల మార్కెట్లలో విక్రయించడానికి తీసుకెళ్తుంటారు. ఆ సమయంలో కాడలను కత్తిరించి పక్కన పారేస్తుంటారు. వీటి నుంచి నారను తీయడం నేర్చుకుంది విజయ. దీన్ని ఉపాధిగా మలచుకునేలా ఇతర మహిళల్నీ ప్రోత్సహించాలనుకుంది. ఇందుకోసం ‘సనాజింగ్ సనా తంబల్’ సంస్థను ప్రారంభించింది. నార తీయడం, నూలుగా వడకడం వంటి వాటిపై శిక్షణ ఇచ్చింది. మఫ్లర్లు, టీషర్టులూ, స్కార్ఫ్‌లూ, దుపట్టాలు, కండువాలు వంటివెన్నో చేస్తోంది. ‘2019లో నేను మా చుట్టు పక్కల లోటస్ ఫైబర్ ఉత్పత్తుల తయారీ గురించి ప్రచారం చేసినప్పుడు ఏడుగురు మహిళలు నాతో చేరారు. ఈ విషయం చుట్టుపక్కల గ్రామాల్లోనూ తెలియడంతో మెల్లగా మరికొందరు స్త్రీలూ ముందుకు వచ్చారు. ఇప్పుడు మాతో పాటు 40 మంది ఉపాధి పొందుతున్నారు’ అంటోందామె. ఇదంతా చెప్పినంత సులువేం కాదు... ఇలా తీసిన ఫైబర్ పట్టుదారాల కంటే సున్నితంగా ఉంటుంది. వీటితో యంత్రాల మీద నేయడం మరింత కష్టం. అందుకే అన్నీ చేత్తోనే చేస్తారిక్కడ. అదే విజయ తయారు చేస్తోన్న వస్త్రాలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది,. 2020లో మన్‌కీబాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంశలతో పెద్ద ఎత్తున ప్రచారం దక్కింది. బోలెడు ఆర్డర్లూ అందుకుంది. వాటర్‌ప్లాంట్స్ విభాగంలో మణిపూర్ స్టార్ట్-అప్ విభాగం సాయంతో పాటూ, ‘హర్ అండ్ నౌ ఇంక్యుబేషన్’ ప్రోగ్రాంకీ ఎంపికైంది. ‘మా ఉత్పత్తుల అమ్మకాల కోసం వెబ్‌సైట్‌నీ అందుబాటులోకి తెచ్చా. త్వరలోనే ఎగుమతులకూ వెళ్లబోతున్నాం’ అంటోంది విజయశాంతి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.