Meenakshi-Aishwarya: ప్రకృతి హితం.. ఈ తల్లీకూతుళ్ల వ్యాపార మంత్రం!

కొత్తగా ప్రయత్నించడానికి వయసు అడ్డుకాదని ఆ అమ్మ అభిప్రాయం. చేసేది ఏదైనా ప్రకృతికీ.. చుట్టూ ఉన్నవారికీ సాయపడాలన్నది కూతురి భావన.

Published : 22 May 2023 00:14 IST

కొత్తగా ప్రయత్నించడానికి వయసు అడ్డుకాదని ఆ అమ్మ అభిప్రాయం. చేసేది ఏదైనా ప్రకృతికీ.. చుట్టూ ఉన్నవారికీ సాయపడాలన్నది కూతురి భావన. ఇద్దరూ కలిసి ప్రారంభించిన వ్యాపారం విజయవంతమవడమే కాదు.. ఎంతోమంది గృహిణులకీ ఉపాధినిస్తోంది. మీనాక్షి, ఐశ్వర్యల ప్రయాణమేంటో చదివేయండి.

వృథాని అందమైన వస్తువులుగా మలచడంలో మీనాక్షి జావర్‌ది అందెవేసిన చేయి. అత్తగారితో కలిసి వృథా వస్త్రాలు, పాత్రలను గృహాలంకరణ వస్తువులుగా తీర్చిదిద్దేవారు. ఈమె కూతురు ఐశ్వర్య డిజైనింగ్‌లో బ్యాచిలర్స్‌ పూర్తిచేసింది. వీళ్లది రాజస్థాన్‌లోని కోటా. అమ్మ చేతి మాయ చూసిన ఐశ్వర్యకి ‘సస్టెయినబుల్‌ బ్రాండ్‌’ ప్రారంభించాలనిపించింది. ‘అమ్మ, బామ్మ చేతి పనితనం చిన్నతనం నుంచీ చూస్తున్నా. వాళ్ల గొప్పతనం మాత్రం ప్రాజెక్టు సమయంలో తెలిసింది. నేను చదివింది కర్ణాటకలో. ప్రాజెక్టు పనిలో భాగంగా బీదర్‌ వెళ్లా. అప్పుడు ఎంతోమంది గృహిణులు పాత వస్తువులు, వస్త్రాలను అందమైన కళాకృతులుగా తీర్చిదిద్దడం గమనించా. వాళ్ల సృజనాత్మకత చూసి ఆశ్చర్యమేసింది. వాటిని ప్రపంచానికి అందించే వేదిక ఉంటే బాగుండేది అనిపించింది. అప్పుడే అమ్మ ప్రతిభ ఇంటికే పరిమితమైందే అనిపించింది. గృహిణుల చేతుల్లో దాగున్న ఈ మ్యాజిక్‌ని ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నా’ అంటుంది ఐశ్వర్య.

అమ్మతో తన ఆలోచన పంచుకొని, చేయి కలపమంది. అందరూ ‘ఈ వయసులోనా?’ అన్నా మీనాక్షి మాత్రం ‘ఇన్నేళ్లు కుటుంబాన్ని నడిపించా. ఇప్పుడైనా నచ్చింది ఎందుకు ప్రయత్నించకూడదు? అయినా ఏదైనా చేయడానికి వయసుతో పనేముంది’ అనుకొని ముందుకే సాగారు. అలా 2019లో ‘ఏకత్ర’ మొదలైంది. వెబ్‌సైట్‌ ప్రారంభించి ప్రకృతిలో త్వరగా కలిసిపోయే పేపర్‌, వస్త్రాలతో చేసిన, అప్‌సైకిల్డ్‌ వస్తువులను  అమ్ముతున్నారు. దీన్ని గమనించిన ‘ఫ్యాబ్‌ ఇండియా’ వీళ్లకో భారీ ఆర్డర్‌ ఇచ్చింది. తమ ఉత్పత్తులను ప్యాక్‌ చేయడానికి అందమైన పేపర్‌, వస్త్ర బ్యాగులను రూపొందించమంది. విజయవంతంగా పూర్తిచేయడంతో పేరుతోపాటు కలిసి పనిచేసే అవకాశం దక్కించుకున్నారు. అలా వ్యాపారం పెరిగింది.

ఉద్యోగం చేస్తూనే వెబ్‌సైట్‌ వ్యవహారాలన్నీ ఐశ్వర్య చూసుకునేది. తయారీ, పంపిణీ వంటివి మీనాక్షి బాధ్యతలు. ‘మనమే ఎదిగితే ఏం లాభం? నలుగురికీ సాయమవ్వాలిగా’ అన్న ఆలోచన వచ్చింది మీనాక్షికి. దీంతో చుట్టుపక్కల గృహిణులతో మాట్లాడి, వారికి శిక్షణిచ్చారు. వాళ్లు తయారు చేసినవాటినీ వెబ్‌సైట్‌లో ఉంచడం మొదలుపెట్టారు. వ్యాపారం విస్తరిస్తుండటంతో ఐశ్వర్య 2021లో ఉద్యోగాన్నీ వదిలేసి, పూర్తిగా దీనిపైనే దృష్టిపెట్టింది. నలుగురితో మొదలై ఇప్పుడు ఆ సంఖ్య 32 మందికి చేరింది. ‘చిన్నముక్కలనీ తిరిగి అప్‌సైకిల్‌ చేస్తాం. ఇప్పటివరకూ 75 వేలకుపైగా మీటర్ల వస్త్రాన్ని అప్‌సైకిల్‌ చేశాం. ఇదే పెట్టుబడి దారుల్నీ ఆకర్షిస్తోంద’నే వీళ్ల వ్యాపారం కోట్లకు చేరుకుంది, షార్క్‌ట్యాంక్‌ నుంచి రూ.20లక్షల పెట్టుబడీ దక్కించుకుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్