Neelima Bogadi: 70 దేశాలతో పోటీపడి.. ఆ చేతులు అద్భుతం చేశాయి!

పర్యావరణ స్పృహ పెరిగాక సహజ వర్ణాలని అద్దుకొన్న అద్భుతమైన ఏటికొప్పాక బొమ్మలకు ఆదరణ లభిస్తోంది. వాటిని అంత అందంగా తీర్చిదిద్దే అతివ చేతులకూ అంతర్జాతీయ గుర్తింపు దక్కాలనుకున్నారు ప్రొఫెసర్‌ నీలిమ బొగాది.

Updated : 29 Apr 2023 06:46 IST

పర్యావరణ స్పృహ పెరిగాక సహజ వర్ణాలని అద్దుకొన్న అద్భుతమైన ఏటికొప్పాక బొమ్మలకు ఆదరణ లభిస్తోంది. వాటిని అంత అందంగా తీర్చిదిద్దే అతివ చేతులకూ అంతర్జాతీయ గుర్తింపు దక్కాలనుకున్నారు ప్రొఫెసర్‌ నీలిమ బొగాది. బొమ్మలకు రంగులద్ది, జీవంపోసే ఏటికొప్పాక మహిళల జీవితాలపై ఆమె తీసిన చిత్రం 70 దేశాల డాక్యుమెంటరీలతో పోటీపడి రెండో స్థానంలో నిలిచింది..

జీవకళ ఉట్టిపడే ఈ బొమ్మలకు విదేశాల నుంచీ ఆర్డర్లు వస్తున్నాయి. వీటిని ఎగుమతి చేయడానికి ఎలమంచిలి తపాళా కార్యాలయంలో ప్రత్యేక పార్శిల్‌ సేవలను అందుబాటులో ఉంచారు.

ప్లాస్టిక్‌ బొమ్మల ప్రభావంతో మధ్యలో కాస్త కళ తప్పినా.. ఏటికొప్పాక లక్కబొమ్మల జోరు మళ్లీ ఊపందుకుంది. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ల పుణ్యమాని ఈ లక్కబొమ్మలు విదేశాలకూ ఎగుమతి అవుతున్నాయి. వీటికి జీవం పోసే మహిళల వృత్తి నైపుణ్యాన్ని ఆకట్టుకునేలా చిత్రీకరించి ప్రపంచ మేధో సంపత్తి సంస్థ(విపో) నిర్వహించిన అంతర్జాతీయ పోటీల్లో.. రెండో స్థానం దక్కించుకున్నారు నీలిమ. ‘నాలుగేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో జీఐ గుర్తింపు పొందిన అంశాలపై పీహెచ్‌డీ చేశా. అందులో భాగంగా ఉప్పాడ చీరలు, బొబ్బిలి వీణ, ఏటికొప్పాక బొమ్మల గొప్పతనం గురించి దగ్గరగా చూసి తెలుసుకున్నా. నాకు కళలంటే మక్కువ.. వీడియోగ్రఫీ అన్నా ఆసక్తే. దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయంలో ఆచార్యురాలిగా పనిచేస్తూ.. వీలుచిక్కినప్పుడల్లా ప్రేరణ కలిగించే వీడియోలు, కథనాలు తీసి బోనఫైడ్‌ వాయిసెస్‌ అనే ఆన్‌లైన్‌ మాగజైన్‌, యూట్యూబ్‌ ఛానల్‌లో పెడుతుంటా. వరల్డ్‌ ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ ఆర్గనైజేషన్‌ (విపో) ఈ ఏడాది ‘మేధో సంపత్తిలో మహిళల పాత్ర, వారి ఆవిష్కరణలు..’ అనే థీమ్‌తో పోటీలు నిర్వహిస్తోందని తెలిసింది. గతంలో ఏటికొప్పాక బొమ్మలపై అధ్యయనం చేసినప్పుడు అక్కడి మహిళల నైపుణ్యాన్ని దగ్గరుండి చూశాను. నేను చూసిన ఆ అద్భుతాన్నే అందరి కళ్లకీ చూపించాలనుకున్నా. మావారితో కలిసి వరహానది ఒడ్డునున్న ఆ గ్రామానికి వెళ్లి మహిళల కష్టం, సృజనపై గంటన్నర వీడియోని తీశా. ఈ లక్క బొమ్మల తయారీపై 200 కుటుంబాలు ఆధారపడ్డాయి. పరోక్షంగా వందల కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. కానీ విదేశీ, ప్లాస్టిక్‌ బొమ్మలతో పోటీపడలేక కాస్త వెనుకబడ్డాయి. దాంతో ఈ వృత్తిని నమ్ముకున్న మగవాళ్లు ఇతర పనులు చూసుకుని వలసలు వెళ్లిపోయారు. అలా అందరూ వదిలేసిన బాధ్యతని మహిళలు తమ భుజానికెత్తుకున్నారు. మగవారికి ఏమాత్రం తీసిపోని విధంగా నైపుణ్యం ప్రదర్శిస్తున్నారు. చౌకగా, తేలిగ్గా దొరికే కృత్రిమ రంగులని వాడకుండా.. ఎంతో శ్రమకోర్చి చెట్ల వేర్లు, విత్తనాలు, బెరడు, పూలు, ఆకులతో సహజ రంగులను తయారుచేసి వినియోగిస్తున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యావరణ ప్రేమికులు ఏటికొప్పాక బొమ్మల గొప్పతనాన్ని గుర్తించారు. డిమాండూ పెరిగింది. ప్రస్తుతం విదేశాలకూ ఎగుమతి అవుతున్నాయి. అక్కడి మహిళల ఈ విజయగాథనే ‘సాగా ఆఫ్‌ ఉమెన్‌ ఇన్‌ ఏటికొప్పాక’ పేరుతో 90 సెకెండ్ల డాక్యుమెంటరీగా చిత్రీకరించి విపో పోటీలకు పంపించా. మా వీడియో 70 దేశాల నుంచి వచ్చిన 180కి పైగా ఎంట్రీలతో పోటిపడింది. ఈనెల 26న ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం సందర్భంగా విజేతలను విపో ప్రకటించింది. దాన్లో నా డాక్యుమెంటరీ రెండో స్థానంలో నిలిచింది. బహుమతిగా రూ.3 లక్షలు విలువైన డిజిటల్‌ ఎక్విప్‌మెంట్‌ ఇస్తామన్నారు. ఈ విజయం నాలో ఆత్మవిశ్వాసం నింపింది. అవకాశం ఉంటే దేశంలోని భౌగోళిక సూచిక (జీఐ) పొందిన ఉత్పత్తులన్నింటిపైనా డాక్యుమెంటరీ తీయాలనుకుంటున్నా’ అంటున్నారు నీలిమ.

బొద్దల పైడిరాజు, విశాఖపట్నం


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్