పిల్లల కోసం... సెక్యూరిటీ గార్డుగా పనిచేశా!

పెళ్లైన మూడేళ్లకే భర్త చనిపోతే... పిల్లలకోసం సెక్యూరిటీ గార్డ్‌గా మారారామె. బతకడానికి ఏ దారీ దొరక్క కన్నీళ్లు తాగి బతికిన కొండా ఉషారాణి ఈ రోజు స్వచ్ఛమైన సేంద్రియ ఆహారాన్ని పండించే వందలాది రైతులకు మార్గదర్శిగా ఎలా మారారు? అది తెలుసుకోవాలంటే... కష్టాలకు ఎదురీదిన ఆమె జీవితం గురించి తెలుసుకోవాల్సిందే...

Updated : 05 Jan 2023 07:56 IST

పెళ్లైన మూడేళ్లకే భర్త చనిపోతే... పిల్లలకోసం సెక్యూరిటీ గార్డ్‌గా మారారామె. బతకడానికి ఏ దారీ దొరక్క కన్నీళ్లు తాగి బతికిన కొండా ఉషారాణి ఈ రోజు స్వచ్ఛమైన సేంద్రియ ఆహారాన్ని పండించే వందలాది రైతులకు మార్గదర్శిగా ఎలా మారారు? అది తెలుసుకోవాలంటే... కష్టాలకు ఎదురీదిన ఆమె జీవితం గురించి తెలుసుకోవాల్సిందే...

ర్త, పిల్లలు, పాలవెల్లిలాంటి సంసారం.. అందరిలా నా జీవితమూ సాగిపోయుంటే అసలీ వ్యవసాయ విధానం గురించి తెలుసుకునే దాన్నే కాదేమో! మాది గుంటూరు జిల్లా, మంగళగిరి మండలం నూతక్కి. పదో తరగతి కాగానే పెళ్లైంది. ఇద్దరు పిల్లలు. నాకు ఇరవై ఏళ్ల వయసులో ఆయన ఆక్సిడెంట్‌ వల్ల దూరమయ్యారు. తీరని విషాదమే అయినా పిల్లల కోసం బతకాలనుకున్నా. దాంతో మూడు నెల్లకే ఓ పొగాకు పరిశ్రమలో సెక్యురిటీ గార్డుగా చేరా. పరువుపోతోందని చుట్టాలు మాన్పించారు. తర్వాత హైదరాబాద్‌లో టెలికాలర్‌గా, సెక్యూరిటీ గార్డుగా పనిచేశా. తెల్లారకముందే ఉద్యోగానికి వెళ్లడం, పిల్లలు పడుకొన్నాక రావడం. ఇలా కొన్నేళ్లు సాగాక ఒక బట్టల దుకాణం తెరిచా. దొంగతనం జరిగి... ఉన్నదంతా పోయింది. మళ్లీ రోడ్డు మీదకొచ్చా. క్రిమి సంహారక మందుల మార్కెటింగ్‌ పనిలో కుదురుకున్నా. ఒక్క పాకెట్‌ అమ్మితే.. నలభై రూపాయలు మిగిలేవి. దాని కోసం రోజంతా పొలాల వెంట తిరుగుతూ రైతులతో మాట్లాడేదాన్ని. అలా మొక్కలకు సోకే అనేక వ్యాధుల గురించి నాకు పట్టొచ్చింది. ఆ క్రమంలోనే విజయవాడలో జీవ ఎరువులు అమ్మే ఓ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నా. రోజంతా పొలాల్లో తిరుగుతూ పంటలకేం వ్యాధులు సోకుతున్నాయో పరిశీలించి.. సాయంత్రం అదే ఊర్లో రైతులతో మాట్లాడి, తగిన మందులు అమ్మేదాన్ని. ఖర్చు ఎక్కువ కాకూడదని పునుగులు తిని.. నీళ్లు తాగి కడుపు నింపుకొనేదాన్ని. కాలి నడకన నాలుగేసి మండలాలు తిరిగేదాన్ని. అలా నా జీవితం క్రమంగా ప్రకృతితో మమేకం అవ్వడం మొదలుపెట్టింది.

ప్రకృతి వ్యవసాయం చేసి...

రైతు దుక్కి దున్ని పంటను మాత్రమే వేస్తాడు. నిజమైన వ్యవసాయమంతా మిత్ర పురుగులుగా పిలిచే వానపాములు, సాలీళ్లు, బ్యాక్టీరియాలే చేస్తాయి. ఇదే సేంద్రియ వ్యవసాయ మూల సిద్ధాంతం. దీని మీద ఆసక్తితో సుభాష్‌ పాలేకర్‌ తరగతులకు హాజరయ్యాను. మాకున్న 70 సెంట్ల భూమికి తోడు మరికొంత కౌలుకి తీసుకుని అరటి, మునగ, అంతర పంటగా పసుపు పండించా. రసాయన ఎరువుల ద్వారా నేలకు, ప్రజలకు ఎంత హాని కలుగుతోందో అర్థం చేసుకున్నా. సింథటిక్‌ పురుగుల మందులకు బదులుగా ప్రకృతిలో వృథాగా పోయే ఆవు పేడ, గోమయం, ఆకులతో కషాయాలు వంటివి సొంతగా చేసుకుని మంచి దిగుబడులు సాధించా. రైతు సాధికారిక సంస్థలో ఇంటర్నల్‌ క్లస్టర్‌ రిసోర్స్‌ పర్సన్‌ (ఐసీఆర్‌డీ)గా.. గ్రామంలోని రైతులకు ప్రకృతి వ్యవసాయం అవసరాన్ని చెప్పేదాన్ని. క్రమంగా ఈ విధానం వైపు రైతులు కూడా మొగ్గు చూపారు. 2019లో దిల్లీలో.. వరల్డ్‌ ఆర్గానిక్‌ ఎక్స్‌పో జరిగింది. ఇందులో మా ఉత్పత్తులకు మొదటి బహుమతి లభించింది. ఈ ఏడాది నవంబరులో దిల్లీలో.. నీతి ఆయోగ్‌, స్త్రీ శిశుసంక్షేమ మంత్రిత్వశాఖల ఆధ్వర్యంలో.. ‘భారత సుస్థిరాభివృద్ధిలో.. మహిళల పాత్ర’ అంశంపై సదస్సు నిర్వహించారు. అందులో నా పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌కి పురస్కారాన్ని అందుకున్నా.

సలహా కేంద్రాన్ని ఏర్పాటు చేశా..

మా గ్రామంలో రైతు సాధికారిక సంస్థ సహకారంతో ఒక నాన్‌ పెస్టిసైడ్స్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాంట్‌, సలహా కేంద్రాన్ని ఏర్పాటు చేశా. ప్రకృతి సేద్యానికి కావాల్సిన మందులు తయారు చేసి నేరుగా రైతుల పొలానికే డెలివరీ చేస్తున్నా.  వివిధ రకాల సేంద్రియ ఆహార ఉత్పత్తులను ప్రాసెసింగ్‌ చేసి ఆర్డర్లపై డోర్‌ డెలివరీ చేస్తున్నాను. ఈ ప్లాంట్‌ చూడ్డానికి విదేశీయులూ వస్తున్నారు. ఆన్‌లైన్‌ సాయంతో అనేక మంది రైతులకు అవసరమైన ఆర్గానిక్‌ క్రిమిసంహారక మందులు అందిస్తున్నాం. రెండు సార్లు అమెరికా, ఫ్రాన్స్‌ అంతర్జాతీయ రేడియోల్లో మాట్లాడాను. ఇప్పుడు నా సూచనలతో దాదాపు 400 ఎకరాల్లో సేంద్రియ సాగు చేస్తున్నారు. త్వరలో హైదరాబాద్‌ కోకాపేటలో మా సేంద్రియ ఆహార ఉత్పత్తుల కేంద్రం ప్రారంభించబోతున్నా.

- మాకినేని ప్రేమసాయి, గుంటూరు

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్