ఆ బాధితులకు అమ్మయ్యారు!

ప్రమాదాల్లో పెద్ద గాయాల కారణంగా రక్తం పోయి మరణించడం ఒకెత్తు! కొందరిలో చిన్న గాయాలకీ రక్తం గడ్డకట్టదు. హీమోఫిలియాగా పిలిచే దీని చికిత్సా ఖరీదైనదే! ఆ బాధితుల కోసం ఉద్యోగాన్నీ పక్కనపెట్టారు డాక్టర్‌ నళినీ పార్థసారధి.

Published : 28 Jan 2023 00:14 IST

ప్రమాదాల్లో పెద్ద గాయాల కారణంగా రక్తం పోయి మరణించడం ఒకెత్తు! కొందరిలో చిన్న గాయాలకీ రక్తం గడ్డకట్టదు. హీమోఫిలియాగా పిలిచే దీని చికిత్సా ఖరీదైనదే! ఆ బాధితుల కోసం ఉద్యోగాన్నీ పక్కనపెట్టారు డాక్టర్‌ నళినీ పార్థసారధి. వారికి ఉచిత వైద్యం, మందులు అందిస్తూ అమ్మగా ఆదుకున్నారు. ఆ 30ఏళ్ల సేవకు, అంకిత భావానికి గుర్తింపుగా ‘పద్మశ్రీ’ అందుకున్నారు.

ప్రొఫెసర్‌గా కెరియర్‌ ప్రారంభించిన డాక్టర్‌ నళిని.. తర్వాత పుదుచ్చేరి జిప్‌మర్‌లో చిన్నారుల చికిత్సా విభాగానికి అధిపతి అయ్యారు. అక్కడ చిన్నారుల్లో హీమోఫిలియా బాధితులు ఎక్కువగా ఉండటం గమనించారామె. చిన్న గాయమూ వీరి ప్రాణానికి ముప్పు కాగలదు. దీని చికిత్సకు వాడే మందులూ ఖరీదే! అంత ఖర్చు పెట్టలేక ప్రాణాలను కోల్పోతున్న వారిని చూసి నళిని చలించిపోయారు. ఆమె అమ్మ మనసు తల్లడిల్లేది. తన పరిధిలో వీలైనంత సాయం అందించడానికి ప్రయత్నించేవారు. అది ఏపాటికి సరిపోతుంది? మరింత మందికి చేరువవ్వాలనుకున్నారామె. ఆ ఆలోచన ఉద్యోగంలో 10 ఏళ్లకన్నా ఎక్కువ ఉండనివ్వలేదు. దాంతో జిప్‌మర్‌ నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు.

ఉచిత సేవ..

‘పుదుచ్చేరిలో ‘హీమోఫిలియా సొసైటీ’ ప్రారంభించా. బాధితులకు ఉచితంగా మందులు అందించేవాళ్లం. మా సంస్థకు ప్రచారం పెరిగింది. క్రమేపీ బాధితులు పెరిగారు. స్థానికంగానే కాదు.. తమిళనాడు నుంచీ సాయం కోసం రావడం మొదలుపెట్టారు. దీంతో తమిళనాడులోని తట్టన్‌ చావడిలోనూ హీమోఫిలియా హెల్త్‌ సెంటర్‌ తెరిచాం. ఇక్కడ ప్రస్తుతం 300 మందికి చికిత్సనందిస్తున్నాం. మొదట్లో ఎన్నో సవాళ్లు. అన్నింటినీ ఎదుర్కొంటూ వచ్చా. సొసైటీ స్థాపనకు నేను నేను పొదుపు చేసిన మొత్తాన్నే వినియోగించా. రోగుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఖర్చు ఎక్కువయ్యేది. అప్పట్లోనే ఒక్కొక్క మందు రూ.10వేలకు పైగా ధర ఉండేది. పైగా వీటిని విదేశాల నుంచే తెప్పించుకోవాలి. అందుకే నిరుపేదలు, దిగువ మధ్యతరగతి వారికి వీటిని తెప్పించుకోగలిగే స్థోమత ఉండేది కాదు. నేను సొంతంగా తెప్పించి, ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ అందుబాటులో ఉంచా. నా చేతిలో ఉన్న మొత్తమంతా వీటికే ఖర్చు అయ్యింది. ఆ పరిస్థితుల్లో హీమోఫిలియా సొసైటీ ఆఫ్‌ ఇండియా నుంచి సాయం అందడంతో కొనసాగించడం సులువైంది. అలా జిప్‌మర్‌, ఇందిరాగాంధీ ప్రభుత్వ జనరల్‌ హాస్పిటల్‌, పుదుచ్చేరిలోని పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌తోపాటు కారైక్కాల్‌లోనూ ఉచితంగా మందులు పంపిణీ చేసేలా ఏర్పాటు చేయగలిగాం. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులన్నింటిలో ఈ మందులు లభ్యమయ్యేలా కృషి చేస్తున్నా. మా అసోసియేషన్‌ తరఫున హీమోఫిలియా బాధిత విద్యార్థులకు ఉపకారవేతనాలనూ అందిస్తున్నాం. వీటితో డాక్టర్లు, ఇంజినీర్లు అయినవారూ ఉన్నారు. వాళ్లను చూస్తోంటే నా పిల్లలే అన్నంత గర్వంగా ఉంటుంది. ఇలా హీమోఫిలియా బాధితులకు సేవలందించి.. పద్మశ్రీ అవార్డునందుకున్న తొలివ్యక్తిని నేనే అనుకుంటున్నా. ఈ అవార్డును హీమోఫిలియా బాధితులకు, వారికి సేవలందిస్తున్న సొసైటీలకు అంకితమిస్తున్నా’ అంటున్న డాక్టర్‌ నళిని అందరికీ స్ఫూర్తిదాయకమే కదూ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్