Sagarika Chakravarthy: ఓ అమ్మ పోరాటం..

ఒక అమ్మ తన బిడ్డల కోసం ఏం చేయగలదు? ఏదైనా చేయగలదు! ఒక దేశానికి వ్యతిరేకంగా పోరాటమూ చేయగలదు.. అని నిరూపించిందామె. తన బిడ్డలని తనకి అప్పగించాలని కొన్నేళ్ల క్రితం నార్వే ప్రభుత్వంపై సాగరిక చక్రవర్తి చేసిన పోరాటం ఇప్పుడు సినిమాగా వచ్చి అందరి ప్రశంసలు అందుకుంటోంది.

Updated : 22 May 2023 13:37 IST

ఒక అమ్మ తన బిడ్డల కోసం ఏం చేయగలదు? ఏదైనా చేయగలదు! ఒక దేశానికి వ్యతిరేకంగా పోరాటమూ చేయగలదు.. అని నిరూపించిందామె. తన బిడ్డలని తనకి అప్పగించాలని కొన్నేళ్ల క్రితం నార్వే ప్రభుత్వంపై సాగరిక చక్రవర్తి చేసిన పోరాటం ఇప్పుడు సినిమాగా వచ్చి అందరి ప్రశంసలు అందుకుంటోంది..

సాగరిక చక్రవర్తి కోల్‌కతాలో పుట్టిపెరిగిన అమ్మాయి. భర్త అనిరూప్‌ భట్టాచార్య జియో ఫిజిసిస్ట్‌. పెళ్లయ్యాక అందరిలానే ఎన్నో కలలతో భర్త ఉద్యోగరీత్యా నార్వేలో అడుగుపెట్టింది.

మొదట బాబు. అభిజ్ఞాన్‌. తర్వాత ఓ పాప.. ఐశ్వర్య. ఇద్దరు పిల్లలతో ఆనందంగా రోజులు గడుపుతున్న ఆమె జీవితంలో ఓ రోజు అనుకోని సంఘటన. నార్వేలో పిల్లల సంరక్షణ చూసే బార్నివెర్‌నెట్‌ సభ్యులు సాగరిక నుంచి రెండేళ్ల వయసున్న అభిజ్ఞాన్‌ని, ఐదునెలల ఐశ్వర్యని బలవంతంగా తీసుకెళ్లి, ఫోస్టర్‌ పేరెంటింగ్‌లో ఉంచారు. ఇలా చేయడానికి సాగరిక ‘బ్యాడ్‌ పేరెంటింగ్‌’నే కారణం అని వివరణ ఇచ్చుకున్నారు. పిల్లలకి చేత్తో అన్నం తినిపించడం, పాలు తాగే పాపాయితో కలిసి పడుకోవడం, దిష్టిచుక్క పెట్టడం, కోపమొచ్చి పిల్లాడిపై చేయిచేసుకోవడం, అన్న దుస్తులు చెల్లికి వేయడం, మంచి బొమ్మలు ఇవ్వకపోవడం, ఇంట్లో తగినంత ఆటస్థలం లేకపోవడం ఇవన్నీ అనిరూప్‌ దంపతులు చేసిన నేరాలుగా చూపించారు బార్నివెర్‌నెట్‌ సభ్యులు. పిల్లలకు చేత్తో తినిపించడం, వాళ్లతో కలిసి పడుకోవడం, దిష్టిచుక్క పెట్టడం వంటివి మనకు ఎంత సహజమో నార్వేలో అంత అసహజం. అక్కడ పిల్లల సంరక్షణ కోసం కఠినమైన చట్టాలు ఉంటాయి. పిల్లలపై దెబ్బ వేయడాన్ని పెద్దనేరంగా పరిగణిస్తారు. పైగా అభిజ్ఞాన్‌కి ఆటిజం లక్షణాలు కూడా ఉండటంతో సాగరిక తీరుని తీవ్రమైన నేరంగా పరిగణించారు. ఆమె దగ్గర ఉంటే పిల్లలు పెంపకం సరిగా ఉండదని నిరూపించి, వాళ్లకు పద్దెనిమిదేళ్లు వచ్చేంతవరకూ ఫోస్టర్‌ పేరెటింగ్‌ సంరక్షణలో ఉంచాలని నార్వే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ తీర్పు సరైంది కాదంటూ సాగరిక చేసిన పోరాటం రెండేళ్లపాటు సాగింది. ఈ కథ తెలిసి కదిలిపోయిన ప్రజలు ఆమెకు మద్దతు ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ సాంస్కృతిక చిచ్చు రెండు దేశాల మధ్య వివాదంగా మారే స్థాయికి వెళ్లింది. ఈ క్రమంలో సాగరికకి భర్త, అత్తింటివాళ్లతో గొడవలయ్యాయి. చివరికి నార్వే ప్రభుత్వం తలొగ్గి పిల్లల బాధ్యతని సాగరిక అత్తింటివారికి అప్పగించింది. వాళ్లని పెంచే బాధ్యత పెళ్లికాని తన మరిదికి అప్పగించింది. ఇది మరింత బాధించింది ఆమెని. దాంతో కోల్‌కతా హైకోర్టు ద్వారా మళ్లీ తన పోరాటం మొదలుపెట్టింది. చివరికి రెండేళ్ల తర్వాత తన పిల్లల బాధ్యతని పూర్తిగా తీసుకుంది సాగరిక. ఈ మొత్తం పోరాటాన్ని ‘ది జర్నీ ఆఫ్‌ మదర్‌’ అనే పుస్తక రూపంలోకి తీసుకొచ్చింది. 12 ఏళ్ల క్రితం జరిగిన ఈ సంఘటనే ఆషిమా చిబ్బర్‌ దర్శకత్వంలో రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలో ‘మిసెస్‌ ఛటర్జీ వర్సస్‌ నార్వే’గా విడుదలై అందరి ప్రశంసలు అందుకుంటోంది.


‘నేను మంచి తల్లిని, చెడ్డ తల్లిని అని చెప్పను. నేను అమ్మను. పిల్లలకోసం ఏమైనా చేయగలను. కానీ ఆ పోరాటం ఈ రోజు ఇంతమంది మనసులను గెలుస్తుందని అనుకోలేదు’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది సాగరిక.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్