Shyama - Nihal Kaviratne: క్యాన్సర్‌ బాధిత చిన్నారుల కోసం..

రోడ్డువారన ఎండలో చికిత్స కోసం ఎదురుచూస్తున్న క్యాన్సర్‌ బాధిత చిన్నారుల దుస్థితి చూసి ఆ దంపతుల మనసు చివుక్కుమంది. సాయం అందించాలనుకున్నారు.

Published : 10 Mar 2023 00:01 IST

రోడ్డువారన ఎండలో చికిత్స కోసం ఎదురుచూస్తున్న క్యాన్సర్‌ బాధిత చిన్నారుల దుస్థితి చూసి ఆ దంపతుల మనసు చివుక్కుమంది. సాయం అందించాలనుకున్నారు. దేశవ్యాప్తంగా క్యాన్సర్‌ ఆసుపత్రులున్న నగరాల్లో వీరికి బస, పోషకాహారం, చికిత్సకు చేయూత అందేలా చూస్తున్న శ్యామ, నిహల్‌ కవిరత్నే దంపతుల స్ఫూర్తి కథనమిది.

శ్యామ భర్త నిహల్‌ కవిరత్నే విదేశంలో యూనిలివర్‌ సంస్థలో పదవీ విరమణ పొంది స్వదేశానికి బయలుదేరారు. ఈ జంట ముంబయికి చేరుకున్నప్పుడు దారిలో ఓ చోట పెద్ద ఎత్తున జనాన్ని చూశారు. ఆరా తీస్తే టాటా మెమోరియల్‌ క్యాన్సర్‌ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వచ్చిన చిన్నారులు, వారి కుటుంబాలని తెలిసింది. రోడ్డుమీద ఎండను కూడా లెక్క చేయకుండా అలా పడిగాపులు కాస్తున్న వారిని చూసి ఆ దంపతుల మనసు వేదనతో నిండిపోయింది.  గ్రామీణ ప్రాంతాల నుంచి తమ పిల్లలకు క్యాన్సర్‌ చికిత్స చేయించడానికి వచ్చారని, బస లేక అలా రోడ్డుమీదే ఉంటారని తెలిసింది. అటువంటి వారికి చేయూతనందించాలని నిశ్చయించుకున్నారా దంపతులు. 2006లో టాటా ఆసుపత్రికి సమీపంగా మొదటి ‘సెయింట్‌ జూడ్‌ ఇండియా చైల్డ్‌కేర్‌ సెంటర్‌’ ప్రారంభించారు. ఇందులో ఎనిమిదిమంది చిన్నారులకు తొలిసారిగా తమ కుటుంబసభ్యులతో బస సౌకర్యాన్ని పొందారు. చికిత్స జరిగినంత కాలం ఇక్కడే ఉండేలా ఏర్పాట్లతోపాటు వారికి అవసరమయ్యే పోషకాహారాన్ని అందేలా చేశారు శ్యామ, నిహల్‌ దంపతులు.

దేశవ్యాప్తంగా..

ముంబయిలో ప్రారంభమైన వీరి సేవలు ఈ 17 ఏళ్లలో తొమ్మిది నగరాల్లో 39 కేంద్రాలకు విస్తరించాయి. బసతోపాటు క్యాన్సర్‌ బాధిత చిన్నారులకు అవసరమయ్యే మౌలికసేవలనూ అందిస్తున్నామంటారు శ్యామ. ‘ఈ పిల్లలకు విద్యతోపాటు మానసికారోగ్యం పెంపొందేలా కృషి చేస్తున్నాం. క్యాన్సర్‌ చికిత్స సమయంలో పోషకాహారం తీసుకుంటేనే వారిలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. అందుకే పోషక విలువలున్న ఆహారంతోపాటు సహబృందంతో కలిసి చర్చలు, రకరకాల ప్రయోగాలు చేపట్టడం, మనసుకు నచ్చిన ఆర్ట్‌ లేదా క్రాఫ్ట్‌ చేయడంలో ప్రోత్సహిస్తున్నాం. ఛార్ట్‌లు, పోస్టర్స్‌ రూపొందించడం, హోంవర్క్‌ షీట్స్‌నెలా నింపాలో నేర్పుతాం. క్విజ్‌, నాటకాలు, కంప్యూటర్‌ శిక్షణ సహా కౌన్సెలింగ్‌ ఉంటాయి. వీటన్నింటికీ ఉపాధ్యాయులున్నారు. తమకున్న వ్యాధి నయమవుతుందో లేదో ఆలోచనలో ఒత్తిడి, ఆందోళనకు గురికాకుండా ఇవన్నీ చేస్తున్నాం. చికిత్స ముగిసేలోపు ఎటువంటి భావోద్వేగాలకు వీరు లోనుకారు. ఆ తర్వాత నెమ్మదిగా జనజీవన స్రవంతిలో తేలికగా కలవగలుగుతారు’ అంటారీమె.

ఆసుపత్రులతో..

క్యాన్సర్‌ ఆసుపత్రులకు సమీపంలో ఏర్పాటు చేసే ఈ కేంద్రాలన్నీ ఆసుపత్రులతో కలిసి పనిచేస్తాయి. ఇప్పటివరకు దాదాపు 18వేల మంది వీరి సేవలను అందుకున్నారు. ‘ప్రతి చిన్నారికి చికిత్స అందే రెండేళ్లలో ఇక్కడికొచ్చి వెళుతుంటారు. ఇక్కడే ఉంటూ ఆసుపత్రికి వెళ్లి వస్తారు. ఆ సమయంలో వారి రవాణా ఖర్చులు, మందులు మేమే భరిస్తాం. ఈ సేవలో మాతోపాటు బార్‌క్లేస్‌, మహానగర్‌ గ్యాస్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, సిటీబ్యాంక్‌, అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ వంటి సంస్థలు విరాళాలనందించి సహకరిస్తున్నాయి’ అంటున్న శ్యామ దంపతులు మరెందరికో స్ఫూర్తినందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్