Kilambi Pankaja Valli: ఉగ్రవాదులు చంపేస్తామన్నారు!

ఉగ్రవాద ప్రాంతంలో నివసించడానికే చాలా ధైర్యం కావాలి. వాళ్లకి ఎదురు నిలుస్తూ.. చంపుతామన్న బెదిరింపులను తట్టుకుంటూ సాగాలంటే ఇంకెంత గుండె బలం కావాలి?

Published : 10 Mar 2023 00:01 IST

ఉగ్రవాద ప్రాంతంలో నివసించడానికే చాలా ధైర్యం కావాలి. వాళ్లకి ఎదురు నిలుస్తూ.. చంపుతామన్న బెదిరింపులను తట్టుకుంటూ సాగాలంటే ఇంకెంత గుండె బలం కావాలి? ఆ పనిని ఏళ్లుగా చేస్తున్నారు తెలుగు ఆడపడుచు కిళాంబి పంకజవల్లి! అలాగని ఆమేమీ సైనికురాలు కాదు.. ఉగ్రవాద బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తోన్న సమాజ సేవకురాలు!

మ్ములోని డోడా  ప్రాంతం. ఉగ్రవాద దాడులు ఇక్కడ నిత్యకృత్యం. అన్న చావుకి కారణమైన వారిపై ఓ యువతి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తీవ్రవాదులకు విషయం తెలిసి ఆమెను అపహరించి, రోజుల తరబడి సామూహిక అత్యాచారం చేశారు. రక్తమోడుతున్న ఆమెను రోడ్డుపై వదిలి.. ఆదరించిన వారికీ ఇదే గతన్నారు. దీంతో కుటుంబ సభ్యులూ ఆమె దగ్గరకు రావడానికి భయపడ్డారు. కానీ 50 ఏళ్ల పంకజ వల్లి మాత్రం ధైర్యంగా ఆమెను అక్కున చేర్చుకున్నారు. సురక్షిత ప్రాంతానికి తరలించి.. శారీరక, మానసిక చికిత్స అందించారు. కోలుకున్నాక పెళ్లి చేసి, కొత్త జీవితాన్నీ అందించారు. ఆవిడ జీవితంలో ఇలాంటి సంఘటనలెన్నో!

పదేళ్ల వయసులో..

నాన్న శ్రీనివాసన్‌ది తమిళనాడు. పోస్టల్‌ ఉద్యోగి. విజయవాడలో స్థిరపడ్డారు. అమ్మ సరస్వతి. ఇద్దరూ ఆర్‌ఎస్‌ఎస్‌లో పనిచేసేవారు. వాళ్ల స్ఫూర్తితో వల్లి పదేళ్ల ప్రాయంలోనే రాష్ట్ర సేవికా సమితిలో చేరారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఏ సోషియాలజీ, కర్ణాటక సంగీతంలో డిప్లొమా చేసినావిడ ఆ సంస్థ తరఫున వివిధ హోదాల్లో ఆంధ్రప్రదేశ్‌, నాగపూర్‌ల్లో పనిచేశారు. రూట్‌ మార్చిలో పాల్గొనే వారికి వివిధ వాద్యాల్లో శిక్షణిచ్చేవారు. 1996లో పంకజవల్లి ప్రచారికగా జమ్మూ వెళ్లారు. అప్పటివరకూ సామాజిక సేవే! ఇక్కడ నుంచీ పోరాటంలానే సాగిందావిడ జీవితం.

అక్కగా.. అమ్మగా..

జమ్మూలో ఉగ్రవాదుల దాష్టీకాలు చూసి చలించిపోయిన ఆవిడ తొలిరోజుల్లో దాడుల్లో గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రులకు తీసుకెళ్లి, దగ్గరుండి చూసుకునేవారు. కానీ ఎంతోమంది కుటుంబాలనీ, సర్వస్వాన్నీ కోల్పోవడం గమనించి వారినీ ఆదరించడం మొదలుపెట్టారు. ట్రస్ట్‌ తరఫున అదితి ప్రతిష్ఠాన్‌ ప్రారంభించి వాళ్లకి అమ్మగా, అక్కగా మారారు. పునరావాసం దగ్గర్నుంచి చదువు, పెళ్లి సహా.. వాళ్ల జీవితాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నారు. విద్యా, ఉద్యోగావకాశాలు కల్పించి, జీవితాల్ని గాడిన పెడుతున్నారు. కార్గిల్‌ యుద్ధంలో గాయపడిన వారికీ సేవలందించారామె. ఈ క్రమంలో ఉగ్రవాదుల హెచ్చరికలూ, చంపేస్తామన్న లేఖలెన్నో అందుకున్నారు. తప్పుడు కేసులు పెట్టించినా వెరవలేదు. ‘ఒక అమ్మాయి తన భర్త ఉగ్రవాదని తెలుసుకుని..  కాపాడమని నాకు సందేశం పంపింది. ఆర్మీ వాళ్ల సాయంతో అతన్ని పట్టుకొని, ఆమెకు విముక్తి కలిగించాం. ఇలాంటప్పుడు నా అంతు చూస్తానన్న బెదిరింపులెన్నో. పోలీసులు రక్షణ కల్పిస్తామన్నా సున్నితంగా తిరస్కరించేదాన్ని. నాకు సమాజ సేవే పరమావధి. దేశమే కుటుంబం. ఉగ్రదాడుల్లో ఒంటరిగా మిగిలిన వారికి కొత్త జీవితాన్ని ఇవ్వడంలో తెలియని ఆనందం. అందుకే పెళ్లి ఆలోచనా రానివ్వలేదు’ అనే వల్లి.. జాతీయ స్థాయిలో బయా కర్వే సహా ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. ప్రస్తుతం మహిళలను సంఘటితం చేసేందుకు తెలుగు రాష్ట్రాలు సహా దేశమంతా పర్యటిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లిష్‌ సహా పలు భాషలూ అనర్గళంగా మాట్లాడగలరీమె.

- ఉప్పాల రాజాపృథ్వీ, ఏలూరు

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్