ఒక అమ్మ... ఇద్దరు కలెక్టరమ్మలు!

ఇంట్లో ఒక ఐఏఎస్‌ అధికారి ఉంటేనే గొప్ప... అలాంటిది ఆ ఇంట్లో ఇద్దరున్నారు. ఇద్దరూ అమ్మాయిలు. వాళ్లని కలెక్టరమ్మలని చేయడం కోసం వాళ్లమ్మ చేసిన త్యాగం కూడా చిన్నదేం కాదు! ఆమె కూడా యూపీఎస్సీ విజేతనే. ఇంతకీ ఆ తల్లీకూతుళ్లు ఎవరు? ఆమె చేసిన త్యాగం ఏంటి? టీనాదాబీ, రియాదాబీ.. వాళ్లమ్మ హిమానీకాంబ్లే.. ఇప్పుడు ఎంతోమందికి స్ఫూర్తిగా మారారు..  

Updated : 18 Mar 2023 07:39 IST

ఇంట్లో ఒక ఐఏఎస్‌ అధికారి ఉంటేనే గొప్ప... అలాంటిది ఆ ఇంట్లో ఇద్దరున్నారు. ఇద్దరూ అమ్మాయిలు. వాళ్లని కలెక్టరమ్మలని చేయడం కోసం వాళ్లమ్మ చేసిన త్యాగం కూడా చిన్నదేం కాదు! ఆమె కూడా యూపీఎస్సీ విజేతనే. ఇంతకీ ఆ తల్లీకూతుళ్లు ఎవరు? ఆమె చేసిన త్యాగం ఏంటి? టీనాదాబీ, రియాదాబీ.. వాళ్లమ్మ హిమానీకాంబ్లే.. ఇప్పుడు ఎంతోమందికి స్ఫూర్తిగా మారారు..  

రాజస్థాన్‌లోని జైసల్మేర్‌కి కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తోంది టీనాదాబీ. అదే రాష్ట్రంలోని... ఆల్వార్‌కి కలెక్టర్‌ రియాదాబీ. టీనా 2016 టాపర్‌గా నిలిచి అందరి దృష్టినీ ఆకర్షించింది. అప్పటికి రియా హైస్కూల్‌ విద్యార్థిని. అక్క సాధించిన విజయం.. ఆమెలోనూ ఐఏఎస్‌ సాధించాలన్న స్ఫూర్తిని రగిల్చింది. అలా రియా కూడా 2020లో సివిల్స్‌ సాధించింది. ఈ అక్కాచెల్లెళ్లలిద్దరికీ యువతలో ఎంత ఫాలోయింగ్‌ ఉందంటే.. ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్లలో లక్షలమంది వీళ్లని అనుసరిస్తుంటారు. టీనాకి ఇన్‌స్టాలో 16లక్షలు, ట్విట్టర్‌లో నాలుగు లక్షలమంది అనుసరిస్తున్నారు. చెల్లెలు రియాకి ఇన్‌స్టాలో ఐదున్నరలక్షల మందికి పైగా అభిమానులున్నారు. అందుకే వీళ్లని అభిమానంగా సెలబ్రిటీ కలెక్టరమ్మలంటారంతా! వీళ్లిద్దరినీ తీర్చిదిద్దిన గొప్పతనం తల్లి హిమానీ కాంబ్లేదే. ఇందుకోసం ఆమె తన కెరియర్‌నే వదులుకున్నారు.  

తన కలని త్యాగం చేసి...

టీనా, రియాలు చదువుల్లో చురుగ్గా ఉండటం చూసి తన కెరియర్‌నే త్యాగం చేశారు హిమానీ కాంబ్లే. భూపాల్‌లోని మౌలానా అజాద్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ టాపర్‌ ఆమె. యూపీఎస్సీ రాసి ఇండియన్‌ ఇంజినీరింగ్‌ సర్వీస్‌(ఐఈఎస్‌) ఆఫీసర్‌ అయ్యారు. ఎన్నో కలలు, ఆశయాలతో ఐఈఎస్‌ అయిన ఆమె పిల్లల లక్ష్యాలకు ప్రాధాన్యమిచ్చారు. ఉద్యోగం చేస్తూ కూడా పిల్లలను చదివించొచ్చు. కానీ వాళ్ల కోసం తన పూర్తి సమయాన్ని కేటాయించాలనుకున్నారు. ‘యూపీఎస్‌సీ కొట్టడం ఎంత కష్టమో నా కంటే ఎక్కువగా ఎవరికి తెలుసు? అందుకే పిల్లల కలలని నిజం చేయడం కోసం నా ఉద్యోగం వదలుకున్నా’ అంటారామె. ‘నాన్న బీఎస్‌ఎన్‌ఎల్‌లో జనరల్‌ మేనేజర్‌. అమ్మ మా చదువుల కోసం వాలంటరీ రిటైర్‌మెంట్‌ తీసుకుంది. ఆడపిల్లలు మగపిల్లలకన్నా తీసిపోరని పదేపదే చెప్పింది. అనుకున్న లక్ష్యాలను సాధించడానికి, ఆ దిశగా అడుగులేయడానికి పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ప్రతి అవకాశాన్నీ వినియోగించుకోవడమెలాగో మాకు అమ్మే నేర్పింది. తనను తాను త్యాగం చేసుకొని మమ్మల్ని ఉన్నతంగా తీర్చిదిద్దిన అమ్మకంటే మాకెవరూ ఎక్కువ కాద’ని చెబుతుంది టీనా.  

టాపర్‌గానే కాదు..

గూగుల్‌లో అత్యధికంగా వెతికే సెలబ్రిటీల జాబితాలో టీనా కూడా ఒకరు. సివిల్స్‌ టాపర్‌గా నిలిచే నాటికి ఆమెకు 22 ఏళ్లే. మొదటి సారి ఓ దళిత అమ్మాయి టాపర్‌ అయ్యిందంటూ ప్రశంసలు వెల్లువెత్తాయి. అది మొదలు ఐఏఎస్‌ కావాలని కలలు కనే లక్షలాదిమంది ఆమెని అనుసరించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆమె వివాహం, రెండోపెళ్లి కూడా పెద్ద సంచలనమే. అయినా ఆమెని అనుసరించేవారి సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. కలెక్టర్‌గా ఆమె నిర్ణయాలనినే కాదు తన స్టైల్‌ని అభిమానించేవాళ్లూ ఎక్కువే! ఆమె పెట్టే ఒక్కో వీడియోకి లక్షల వీక్షణలుంటాయి.

చెల్లితో కలిసి...

పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగం ప్రధానాంశాలుగా సాగే అమృతసేన్‌ రచనలంటే టీనాకి చాలా ఇష్టం. ఆ పుస్తకాల ప్రభావంతోనే ప్రజాసేవలో అడుగుపెట్టానంటుంది టీనా. ‘పుస్తకాలు చదివే సామాజికపరమైన ఎన్నో అంశాలపై అవగాహన, స్ఫూర్తి పొందా. విధుల్లో పారదర్శకంగా ఉండటానికి అవే కారణం. మనల్నిచూసి మరికొందరు స్ఫూర్తి పొందాలనుకుంటా’ అని చెప్పే టీనా సమయం ఉన్నప్పుడల్లా మధుబని చిత్రాలని వేసి ఒత్తిడిని దూరం చేసుకుంటుందట. ఇక అక్క ప్రభావంతో ఐఏఎస్‌ అయిన రియా రాజస్థాన్‌ గ్రామాల్లో ఎంతోమంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. పిల్లల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్నందుకు ఆ అధికారులని సస్పెండ్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో లక్షలమంది అభిమానులని సంపాదించుకుంది.


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్