Nasima Gain: ఊరు వెలేసింది..

మోసమంటే తెలియని అమాయకత్వం ఆమెను వేశ్యాగృహానికి విక్రయించేలా చేసింది. తప్పించుకొని ఇంటికి చేరుకుంటే ఊరంతా వెలేసింది. ఆ బాధ తనది మాత్రమే కాదు.. మరెందరిదో అని అర్థమైన ఆమె అలాంటివారికి బాసటగా నిలవాలనుకుంది. సమాజానికి ఎదురు నిలిచి, అన్నీ కోల్పోయామని కుంగుబాటుకు గురవుతున్న వాళ్లకి భరోసా అవుతోన్న నసీమా జెయిన్‌.

Published : 01 Apr 2023 00:15 IST

మోసమంటే తెలియని అమాయకత్వం ఆమెను వేశ్యాగృహానికి విక్రయించేలా చేసింది. తప్పించుకొని ఇంటికి చేరుకుంటే ఊరంతా వెలేసింది. ఆ బాధ తనది మాత్రమే కాదు.. మరెందరిదో అని అర్థమైన ఆమె అలాంటివారికి బాసటగా నిలవాలనుకుంది. సమాజానికి ఎదురు నిలిచి, అన్నీ కోల్పోయామని కుంగుబాటుకు గురవుతున్న వాళ్లకి భరోసా అవుతోన్న నసీమా జెయిన్‌ స్ఫూర్తి కథనమిది!

సీమాది పశ్చిమ్‌బంగలోని మస్లందపుర్‌ గ్రామం. పేద కుటుంబమైనా బాల్యమంతా సంతోషంగా గడిచింది. అప్పుడామెకు 13 ఏళ్లు. ఊరంతా పండగ సందట్లో ఉండగా... అదే గ్రామానికి చెందిన వ్యక్తి నసీమాను కారులో తిరుగుదామంటూ షికారుకు పిలిచాడు. సరదాపడి స్నేహితురాలితో బయలుదేరింది. ‘మమ్మల్ని తీసుకెళ్లిన వ్యక్తి ఒకచోట కారు ఆపించి, ఇప్పుడే వస్తానని డ్రైవరుకు అప్పజెప్పి వెళ్లాడు. చీకటి పడినా రాలేదు. అమ్మానాన్న తిడతారనే భయంతో ఏడుస్తుంటే, ఇంటికి వెళదామని డ్రైవరు కారెక్కించాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. మెలకువ వచ్చేసరికి ఓ ఇంట్లో ఉన్నాం. వారి భాష అర్థంకాదు. బిహార్‌లో ఉన్నామని, ఆ వ్యక్తి మాఇద్దరినీ అమ్మేశాడని తెలిసి మెదడు మొద్దుబారింది. తేరుకున్నాక ఇంటికెళతామని వాళ్ల కాళ్లపై పడి ప్రాధేయపడినా, ఏడ్చినా కనికరించలేదు. బాగా కొట్టి గదిలో బంధించారు. వాళ్లు చెప్పింది చేస్తామని ఒప్పుకొనేంతవరకు కనీసం నీళ్లు కూడా ఇవ్వలేద’ని చెబుతారు నసీమా.  

ఇంటికే..

‘విటులెదుట డ్యాన్స్‌ చేయడం మా పని. నిత్యం మాపై నిఘా ఉండేది. దాంతో తప్పించుకుంటామనే ఆశ పోయింది. ఓసారి ప్రొఫెసర్‌ ఇంటికి పనికి పంపించారు. ఆయన్ని చూస్తే సాయం చేస్తాడనిపించింది. మా కష్టాన్ని చెప్పుకొన్నా. ఆయన మావాళ్ల నెంబరు తీసుకొని సమాచారం అందించారు. ఇది తెలిసిన దుండగులు మమ్మల్ని మరోచోటకు తరలించారు. చీకటి గదిలో ఎన్ని వారాలు గడిచాయో తెలీదు. ఓ రోజు పోలీసులు మమ్మల్ని ట్రాక్‌ చేసి రక్షించారు. స్టేషన్‌లో తీవ్రంగా అవమానించి మరీ ఊరికి పంపించారు. ఇంటికెళ్తే అమ్మానాన్న దగ్గరకు తీసుకున్నా.. సమాజం మాత్రం వెలేసింది. అందరూ నన్ను నిందితురాలిగా చూసేవారు. తీవ్ర కుంగుబాటుతో 5 ఏళ్లు ఇంటికే పరిమితమయ్యా. నన్ను ఆ భాధ నుంచి బయటకు తీసుకురావడానికి ఇంట్లోవాళ్లు ఓ ఎన్జీవోకు కౌన్సెలింగ్‌కు తీసుకెళ్లారం’టారీమె.

సాయం..

ఆ ఎన్జీవోకు తనలాంటివారు ఎందరో రావడం నసీమా చూశారు. వారి కష్టాలన్నీ విన్నాక.. నెమ్మదిగా కుంగుబాటు నుంచి బయటపడ్డారీమె. వాళ్లకి సాయం చేయాలనుకొని  2016లో ‘ఉత్తాన్‌ కలెక్టివ్‌’ స్థాపించారు. ఎన్జీవో సాయంతో అక్కడికొచ్చే బాధితులందరికీ తానే కౌన్సెలింగ్‌ ఇవ్వడం ప్రారంభించారు. ‘బలవంతంగా వేశ్యా వృత్తిలోకి వెళ్లి, వేధింపులకు గురైన అబలలెందరో రక్షించిన తర్వాత కూడా ఇంటిని వీడి బయటకు రాలేకపోతున్నారు. చేయని తప్పుకి సమాజం విధిస్తున్న శిక్షకు గురవుతున్నారు. వారికి సాయమందించడానికి 2019లో ‘ఇండియన్‌ లీడర్స్‌ ఫోరం అగైనెస్ట్‌ ట్రాఫికింగ్‌ (ఐఎల్‌ఎఫ్‌ఏటీ)’ ప్రారంభించా. బాధితులు సభ్యులుగా చేరొచ్చు. కౌన్సెలింగ్‌ ఉంటుంది. వీరిలో కొందరిని కుటుంబం, మరికొందరిని సమాజం వెలేస్తున్నాయి. అటువంటివారికి నీడతోపాటు స్వయం ఉపాధి పొందేలా శిక్షణనిప్పిస్తున్నాం. చదువులో ప్రోత్సహిస్తున్నాం. ఆర్థిక స్వావలంబనతో వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. 9 రాష్ట్రాల నుంచి 4,500మంది ఇందులో సభ్యులయ్యారు. వీరికి ప్రభుత్వం నుంచి ఆర్థిక చేయూతనిచ్చే దిశగా కోర్టు ద్వారా కృషి చేస్తున్నా. పలు ఎన్జీవోలు మా విధానాలను అనుసరిస్తోంటే గర్వంగా ఉంది’ అంటారు నసీమా.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్