పేద తల్లుల ఆరోగ్యం కోసం...

చిన్న వయసులోనే పెళ్లి... ఆ వెంటనే పిల్లలు... అయినా... జీవితం హాయిగానే సాగుతున్నా... ఏళ్లు గడిచేకొద్దీ ఏదో కోల్పోతున్నాననే భావన ఆమెను తొలిచేసేది. అందుకే మూడు పదుల వయసులో మళ్లీ చదువు మొదలు పెట్టారామె. యోగానీ ఔపోసన పట్టారు. అయినా సంతృప్తి కలగలేదు... తన విద్య నలుగురికీ ఉపయోగపడాలనుకున్నారు.

Published : 27 Dec 2022 00:28 IST

చిన్న వయసులోనే పెళ్లి... ఆ వెంటనే పిల్లలు... అయినా... జీవితం హాయిగానే సాగుతున్నా... ఏళ్లు గడిచేకొద్దీ ఏదో కోల్పోతున్నాననే భావన ఆమెను తొలిచేసేది. అందుకే మూడు పదుల వయసులో మళ్లీ చదువు మొదలు పెట్టారామె. యోగానీ ఔపోసన పట్టారు. అయినా సంతృప్తి కలగలేదు... తన విద్య నలుగురికీ ఉపయోగపడాలనుకున్నారు. మురికివాడల మహిళలకు ఆరోగ్య పాఠాలు చెబుతూ, పోషకాహారాన్ని అందిస్తున్నారు. ఆమే హనుమకొండకు చెందిన కంచేటి శోభారాణి.

స్తులు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు. ఆరోగ్యం పోతే తిరిగి రాదు. డబ్బున్న వాళ్తైతే చికిత్సలు చేయించుకుంటారు. మరి పేదలు? దీనికి పరిష్కారం.. వారిలో ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించడం. ఈ ఆలోచనలే నన్ను యోగా గురువుగా మార్చాయి. సేవా మార్గం పట్టించాయి. మాది వరంగల్‌ జిల్లా సంగెం మండలం గాంధీనగర్‌. 17 ఏళ్లకే పెళ్లిచేశారు. పదేళ్లు ఊళ్లోనే వ్యవసాయం చేశాం. ఇద్దరమ్మాయిలు. వాళ్ల చదువుల కోసం హనుమకొండకు వచ్చేశాం. మా వారు వెంకటేశ్వరరావు, వ్యాపారి. పిల్లలు కాస్త పెద్ద చదువులకు వచ్చే వరకూ తీరిక లేకుండా గడచిపోయింది. తర్వాత జీవితం అంటే ఇంతేనా? పెళ్లి, పిల్లలు, ఇల్లు.. నా పాత్ర ఇంత వరకే పరిమితమా? అని అనిపించేది. ఇంకా ఏదో చేయాలని ఆరాటపడే దాన్ని. అందుకే 30 ఏళ్ల వయసులో ఓపెన్‌ యూనివర్సిటీ నుంచి డిగ్రీ, తర్వాత ఎమ్మే చేశా. అప్పుడు నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. తర్వాత ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా నేర్చుకున్నా.

మార్పు కోసం...

ఎప్పుడూ మన గురించి మనం ఆలోచించుకోవడమే కాదు... చుట్టూ ఉన్న వారినీ పట్టించుకోవాలనే తత్వం నాది. అందుకే ‘ఏకం’, ‘లోక’ వంటి స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేయడం మొదలుపెట్టా. అందులో భాగంగా ఓ మురికివాడకు వెళ్తే అక్కడి మహిళలు శారీరకంగా, మానసికంగా ఎంత బలహీనంగా ఉన్నారో అర్థమయ్యింది. ఇలాంటి వారికోసం ప్రత్యేకంగా ఏదైనా చేయాలనుకున్నా. ‘ప్రేరణ’ సంస్థతో కలిసి వారికి ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ప్రారంభించా. నేరుగా ఉపన్యాసం ఇచ్చినట్లు చెబితే వినరు... అందుకే కొన్ని వీడియోలు, పవర్‌ పాయింట్ ప్రెజెంటేషన్స్‌ తయారు చేశాం. వాటి సాయంతో ఎడ్యూ అండ్‌ ఎంటర్‌టైన్‌ పేరుతో శారీరక, మానసిక ఆరోగ్యంపై తరగతులు నిర్వహిస్తున్నాం. వారికి యోగా, ధ్యానం కూడా నేర్పిస్తున్నా. ఇలా ఓరుగల్లు నగరంలోని అంబేడ్కర్‌నగర్‌, సూర్జిత్‌నగర్‌, శాయంపేట.. ఇలా ఇప్పటికి 50 మురికి వాడల్లోని వేల మంది మహిళలకు యోగా నేర్పించడంతో పాటు తినడానికి కొన్నాళ్లు  పౌష్టికాహారాన్ని అందిస్తున్నా. ఇలా ప్రతి మురికివాడలోనూ ప్రతినెలా మూడేసి రోజులు చేస్తున్నాం. వీళ్లకి కుటుంబ పోషణే పెద్ద సమస్య. మరి యోగా, ధాన్యం చేస్తారా అంటే... ఒకేసారి అలవాటు కాదు. ముందు ఆరోగ్యం, ఆహారంపై అవగాహన కలుగుతుంది. మెల్లగా చేయడం ప్రారంభిస్తారు. ఇప్పుడిప్పుడే మార్పు కనిపిస్తోంది. శుభ్రంగా ఉంటున్నారు. పోషక విలువల పట్ల కాస్తో కూస్తో అవగాహన కలగడంతో ఉన్నంతలో మంచి ఆహారం తింటున్నారు. పిల్లలనూ క్రమం తప్పకుండా బడికి పంపిస్తున్నారు. నా కార్యక్రమాల గురించి తెలిసి చాలా ప్రాంతాల వాళ్లు మా దగ్గరకూ వచ్చి నేర్పండి అని అడిగే వారు. అన్ని చోట్లకూ వెళ్లలేను కాబట్టి ఓ ఏడాది పబ్లిక్‌గార్డెన్స్‌లో మహిళలకు ఉచితంగా యోగా, ధాన్యం నేర్పాను. కాలేజీ విద్యార్థులకూ, జువైనల్‌ హోంలోని బాలలకూ కౌన్సెలింగ్‌ కూడా నిర్వహిస్తున్నా. మా పెద్దమ్మాయి రవళి అమెరికాలో ఎం.ఎస్‌. చదివి అక్కడే ఉద్యోగం చేస్తోంది. చిన్నమ్మాయి రష్మిత ఉస్మానియాలో హౌస్‌సర్జన్‌. నేను సంతోషంగా ఉంటే చాలదు... నలుగురూ బాగుండాలన్న తపనతో చేస్తోన్న ఈ పనులకు మించిన సంతృప్తి ఏముంటుంది. అందుకే నా సేవల్ని మరింత విస్తరించాలని అనుకుంటున్నా.

- గుండు పాండురంగశర్మ, వరంగల్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్