Shark Tank India : వివక్షను దాటి.. వ్యాపారాల్లో రాణిస్తున్నారు!

షార్క్‌ ట్యాంక్‌ ఇండియా.. దేశంలోని వ్యాపారవేత్తల్ని ప్రోత్సహిస్తూ వారికి పెట్టుబడులు అందించే టీవీ షో ఇది. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తిచేసుకున్న ఈ కార్యక్రమం మూడో సీజన్‌ ప్రస్తుతం కొనసాగుతోంది. గతంలో ఆరుగురు షార్క్‌లు/జడ్జిలు/పెట్టుబడిదారులతో నడిచిన ఈ టీవీ షోలో.. ప్రస్తుతం 12 మంది షార్క్‌లున్నారు.

Published : 03 Feb 2024 21:17 IST

(Photos: Instagram)

షార్క్‌ ట్యాంక్‌ ఇండియా.. దేశంలోని వ్యాపారవేత్తల్ని ప్రోత్సహిస్తూ వారికి పెట్టుబడులు అందించే టీవీ షో ఇది. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తిచేసుకున్న ఈ కార్యక్రమం మూడో సీజన్‌ ప్రస్తుతం కొనసాగుతోంది. గతంలో ఆరుగురు షార్క్‌లు/జడ్జిలు/పెట్టుబడిదారులతో నడిచిన ఈ టీవీ షోలో.. ప్రస్తుతం 12 మంది షార్క్‌లున్నారు. వీరిలో ముగ్గురు మహిళలు. తమ వ్యాపార ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకుల్ని ఎదుర్కొని ఈ స్థాయికి చేరిన వీరు.. తమ వ్యాపారదక్షతతో ఎంతోమంది యువ, ఔత్సాహిక వ్యాపారవేత్తల్లో ప్రేరణ కలిగిస్తున్నారు. మరి, ఎవరా ముగ్గురు? వారి స్ఫూర్తిదాయక వ్యాపార ప్రయాణమేంటో తెలుసుకుందాం రండి..

ఓర్పు, నేర్పులే మన ఆయుధాలు!

దేశంలోనే విజయవంతమైన మహిళా వ్యాపారవేత్తల్లో ఒకరిగా పేరుగాంచారు ‘ఎమ్‌క్యూర్‌ ఫార్మాస్యూటికల్స్‌’ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నమితా థాపర్‌. పుణేకు చెందిన ఓ గుజరాతీ కుటుంబంలో పుట్టిపెరిగిన ఆమె.. చిన్న వయసు నుంచే చదువుకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు. తరగతి గదిలో తెలివిగా, చురుగ్గా ఉండే నమిత.. 21 ఏళ్ల వయసులోనే ఛార్టర్డ్‌ అకౌంటెన్సీ పూర్తిచేశారు. ఆపై నార్త్‌ కరోలినాలోని ‘డ్యూక్‌ యూనివర్సిటీ - ది ఫుఖా స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌’లో ఎంబీఏ పూర్తిచేశారు. చదువు పూర్తయ్యాక అక్కడే మార్కెటింగ్‌, ఫైనాన్స్‌ రంగాల్లో ఆరేళ్ల పాటు పనిచేసిన అనంతరం ఇండియాకు తిరిగొచ్చారామె. ఇక్కడికొచ్చాక తన తండ్రి స్థాపించిన ‘ఎమ్‌క్యూర్‌ ఫార్మాస్యూటికల్స్‌’ సంస్థలో ‘చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ (సీఎఫ్‌వో)’గా చేరిన నమిత.. ప్రస్తుతం ఈ సంస్థకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.

అయితే తనకంటూ సొంత గుర్తింపును ఏర్పరచుకోవాలన్న ఆలోచనతో సొంతంగా పలు వ్యాపారాల్నీ ప్రారంభించారామె. ఈ క్రమంలోనే మహిళల ఆరోగ్యమే లక్ష్యంగా కరోనా సమయంలో ‘అన్‌కండిషన్‌ యువర్‌సెల్ఫ్‌ విత్‌ నమిత’ పేరుతో ఓ యూట్యూబ్‌ టాక్‌ షోను ప్రారంభించారు. మహిళల ఆరోగ్యానికి సంబంధించిన అపోహలు దూరం చేసి.. ఆయా అంశాలపై ప్రామాణిక సమాచారాన్ని అందించడమే ముఖ్యోద్దేశంగా ఈ ఛానల్‌ను కొనసాగిస్తున్నారామె. అంతేకాదు.. ‘ఇంక్రెడిబుల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌’ అనే మరో సంస్థను స్థాపించిన ఈ బిజినెస్‌ లేడీ.. ఈ వేదికగా 11-18 ఏళ్ల వయసున్న యువతకు వ్యాపార మెలకువలు నేర్పుతున్నారు. ఉన్నత కుటుంబంలో పుట్టినా, వ్యాపార నేపథ్యంలో పెరిగినా.. ఓ మహిళగా వివక్షనూ ఎదుర్కొన్నానంటున్నారు నమిత.

‘షార్క్‌ ట్యాంక్‌ జడ్జిగానే కాదు.. వ్యాపారంలోకి అడుగుపెట్టినప్పట్నుంచి ఓ మహిళగా పలుమార్లు విమర్శల్ని ఎదుర్కొన్నా. నేననే కాదు.. ఉన్నత స్థాయిలో ఉన్న అమ్మాయిలకు ఇవన్నీ సాధారణం. కాబట్టి వాటిని చూసి బాధపడడం, భయపడడం కంటే.. ఎవరికి వారు ఎంత వరకు సురక్షితంగా, ఆనందంగా ఉన్నామన్నదే ముఖ్యం. ఓర్పు, నేర్పులే మన ఆయుధాలు.. వ్యాపార రంగంలో రాణించే ఎంతోమంది మహిళల్ని నడిపించేవి ఇవే!’ అంటూ ఔత్సాహిక వ్యాపారవేత్తల్లో స్ఫూర్తి నింపుతున్నారీ బిజినెస్‌ లేడీ. తన వ్యాపార దక్షతతో ‘వరల్డ్‌ విమెన్‌ లీడర్‌షిప్‌ కాంగ్రెస్‌ సూపర్‌ అఛీవర్‌ అవార్డు’తో పాటు పలు పురస్కారాలూ అందుకున్న నమిత.. ఫోర్బ్స్‌ వంటి జాబితాల్లోనూ చోటుదక్కించుకున్నారు. ప్రస్తుతం నమిత నికర ఆస్తుల విలువ రూ. 600 కోట్లకు పైమాటే! అలాగే ‘ఎమ్‌క్యూర్‌ ఫార్మాస్యూటికల్స్‌’ సంస్థ విలువ 3 బిలియన్‌ డాలర్లు.


కోటి రూపాయల కొలువు కాదని..!

‘వ్యాపారంలో మహిళలు రాణించలేరు’, ‘వాళ్ల వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే ఇక అంతే సంగతులు!’ తాను వ్యాపారం ప్రారంభించిన తొలినాళ్లలో ఇలాంటి ఎన్నో విమర్శల్ని ఎదుర్కొంది ప్రముఖ వ్యాపారవేత్త వినీతా సింగ్‌. ఆమెది ఉన్నత విద్యావంతుల కుటుంబం. ఒక్కగానొక్క కూతురే అయినా క్రమశిక్షణతో పెంచారు ఆమె పేరెంట్స్‌. ఏ రంగం ఎంచుకున్నా కెరీర్‌లో అత్యుత్తమంగా నిలవమని వెన్నుతట్టేవారు. సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగమని ధైర్యం నూరిపోసేవారు. ఈ ప్రోత్సాహంతోనే ఐఐటీ-మద్రాస్‌ నుంచి ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, ఐఐఎం-అహ్మదాబాద్‌ నుంచి ఎంబీఏ పూర్తిచేసిన ఆమెకు.. Deutsche Bankలో కోటి రూపాయల వార్షిక వేతనంతో కూడిన ఉద్యోగ అవకాశమొచ్చింది. అయితే వ్యాపారాన్నే తన జీవిత లక్ష్యంగా మార్చుకున్న ఆమె.. ఆ ఉద్యోగాన్ని తిరస్కరించారు. ‘ఓటమి గెలుపుకి నాంది’ అన్నట్లు పలు స్టార్టప్స్‌ ప్రారంభించి విఫలమైనా.. 2012లో తన భర్త కౌశిక్‌తో కలిసి ‘షుగర్‌ కాస్మెటిక్స్‌’ సంస్థను ప్రారంభించి సక్సెసయ్యారు. ప్యారబెన్‌ వంటి రసాయనాలు లేకుండా, జంతువులకు సంబంధించిన ఉత్పత్తులు వాడకుండా.. పూర్తిస్థాయి వీగనిజంతో కూడిన మేకప్‌, బ్యూటీ ఉత్పత్తుల్ని తయారుచేయడం ఈ సంస్థ ముఖ్యోద్దేశం. ఇలా ఆమె తయారుచేస్తోన్న సౌందర్యోత్పత్తులు సామాన్య మహిళల వార్డ్‌రోబ్‌లోనే కాదు.. ఎంతోమంది సెలబ్రిటీల బ్యూటీ కిట్స్‌లోనూ కనిపిస్తాయి.

‘నా ఎదుగుదలలో మా అమ్మానాన్నల ప్రోత్సాహం ఎంతో! అయితే వ్యాపారం ప్రారంభించిన తొలినాళ్లలో నేనూ లింగ వివక్షను ఎదుర్కొన్నా. ఈ క్రమంలో మహిళలు ప్రారంభించిన సంస్థల్లో పెట్టుబడులు పెట్టమని కొంతమంది మొహమ్మీదే చెప్పేవారు.. మీ వ్యాపారంలో మీ భర్త చేరితేనే మీ చేతికి చెక్‌ ఇస్తామనేవారు. ఇక అంతకుముందు ఇంటర్న్‌షిప్‌ చేసే సమయంలోనూ డ్రస్సింగ్ విషయంలో పలు కామెంట్లు ఎదుర్కొన్నా..’ అంటూ చెప్పుకొచ్చారామె. మనం ఎదుగుతూనే తోటి మహిళలకు అవకాశాలు కల్పించాలన్న నినాదంతో ముందుకెళ్తోన్న వినీత.. తన సంస్థ ద్వారా దాదాపు 2800 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ సంస్థ విలువ 500 మిలియన్‌ డాలర్లు, కాగా వినీత ఆస్తుల విలువ రూ. 300 కోట్లకు పైమాటే!


నీకంటే మీ అమ్మే అందంగా ఉందనేవారు!

‘లోపాలనేవి ప్రతి ఒక్కరిలోనూ సహజం.. అయితే వాటిని ప్రత్యేకతలుగా స్వీకరించినప్పుడే జీవితాన్ని గెలవగలం..’ అంటున్నారు ‘ఎడెల్‌వీస్‌ మ్యూచువల్‌ ఫండ్‌’ సంస్థ సీఈఓ రాధికా గుప్తా. పుట్టుకతోనే మెడ వంకరతో జన్మించిన ఆమెను స్కూల్లో అందరూ దూరం పెట్టేవారు. ఏవేవో కార్టూన్‌ క్యారక్టర్ల పేర్లతో పిలుస్తూ ఏడిపించేవారు. ‘నీకంటే మీ అమ్మే అందంగా ఉంది’ అంటూ ఆటపట్టించేవారు. ఇవన్నీ ఆమె ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాయి. ఒక రకమైన ఆత్మన్యూనతలోకి నెట్టేశాయి. ఇక చదువు పూర్తయ్యాక ఉద్యోగ ప్రయత్నాల్లోనూ దురదృష్టమే ఆమెను వెంబడించింది. పెన్సిల్వేనియా యూనివర్సిటీ నుంచి డబుల్‌ డిగ్రీ పూర్తిచేసిన అనంతరం.. వరుసగా ఏడుసార్లు ఇంటర్వ్యూలో విఫలమవడంతో ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేశారు రాధిక. విధి వక్రించి ఇలా శారీరకంగా, మానసికంగా కుంగిపోయిన రాధికకు అదే సమయంలో నళిన్‌ మోనిజ్‌తో పరిచయమైంది. వీళ్లిద్దరూ కలిసి ఓ అసెస్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీని ప్రారంభించారు. కొన్నేళ్లలోనే మంచి పేరు సంపాదించడంతో ‘ఎడెల్‌వీస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ’ ఈ కంపెనీని కొనుగోలు చేసింది. రాధికకు సీఈవోగా పగ్గాలూ అప్పగించింది. తన వ్యాపార దక్షతతో ఈ సంస్థను లాభాల బాట పట్టిస్తోన్న ఆమె.. దేశంలోనే మేటి వ్యాపారవేత్తల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. తన జీవితంలోని గత అనుభవాలన్నీ రంగరించి ‘లిమిట్‌లెస్‌’ పేరుతో ఓ పుస్తకం కూడా రాశారు రాధిక.

‘నా జీవితంలో నేను సాధించిన గొప్ప విజయం ఏంటంటే.. ఎలా ఉన్నా నన్ను నేను అంగీకరించడం. ఇప్పటికీ నన్ను చూసి కొందరు కామెంట్లు చేస్తుంటారు. అలాంటి వాళ్లకు ఒకటే ప్రశ్న వేస్తా.. ‘అవును.. నా కళ్లలో మెల్ల ఉంది.. మెడ కాస్త వంకర.. అయితే ఏంటి? అదే నా ప్రత్యేకత! మరి, మీలో ఉన్న ప్రత్యేకత ఏంటి?’ అంటూ విమర్శకుల నోటికి తాళం వేస్తుంటారామె. ప్రస్తుతం రాధిక కంపెనీ విలువ 684 మిలియన్‌ డాలర్లు కాగా, ఆమె నికర ఆస్తులు రూ. 41 కోట్ల దాకా ఉంటుందట!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్