Bhagwani Devi @ 94 : పతకాల బామ్మ!

చిన్న వయసులోనే భర్తను కోల్పోయింది.. ఆపై 11 ఏళ్ల కూతురూ శాశ్వతంగా దూరమైందామెకు. వయసు పెరుగుతున్న కొద్దీ చుట్టుముట్టే అనారోగ్యాలు.. వాటికి తోడు బైపాస్‌ సర్జరీ కూడా చేయించుకుందామె. నిజానికి ఇలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్య రిస్క్‌ చేయడానికి.....

Published : 27 Mar 2023 19:33 IST

(Photos: Instagram)

చిన్న వయసులోనే భర్తను కోల్పోయింది.. ఆపై 11 ఏళ్ల కూతురూ శాశ్వతంగా దూరమైందామెకు. వయసు పెరుగుతున్న కొద్దీ చుట్టుముట్టే అనారోగ్యాలు.. వాటికి తోడు బైపాస్‌ సర్జరీ కూడా చేయించుకుందామె. నిజానికి ఇలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్య రిస్క్‌ చేయడానికి ఎవరూ సాహసించరు. కానీ అలా భయపడుతూ కూర్చోలేదు హరియాణాకు చెందిన భగ్‌వానీ దేవి దాగర్‌. 94 ఏళ్ల వయసులో ఆటలపై తనకున్న మక్కువను గుర్తించిన ఆమె.. తన మనవడి స్ఫూర్తి, సహకారంతో అథ్లెట్‌గా సరికొత్త అవతారమెత్తింది. ఏడాది కాలంగా షాట్‌పుట్‌, డిస్కస్‌ త్రో, స్ప్రింట్‌.. వంటి క్రీడల్లో దేశానికి పతకాల పంట పండిస్తోన్న ఈ బామ్మ.. తాజాగా పోలండ్‌లో జరుగుతోన్న ‘వరల్డ్‌ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ ఇండోర్‌ ఛాంపియన్‌షిప్‌’లో డిస్కస్‌ త్రో విభాగంలో బంగారు పతకం అందుకుంది. ‘వయసు సంఖ్య మాత్రమే’ అంటూ తన విజయాలతో నిరూపిస్తోన్న ఈ బామ్మ కథ ఎంతోమందికి స్ఫూర్తిదాయకం!

కొంతమంది జీవితాలను తరచి చూస్తే అడుగడుగునా కష్టాలే స్వాగతం పలుకుతుంటాయి. భగ్‌వానీ దేవి దాగర్‌ జీవితమూ ఇందుకు మినహాయింపు కాదు. హరియాణాలో పుట్టిన ఆమెకు 12 ఏళ్లకే పెళ్లైంది. 30 ఏళ్లొచ్చే సరికి భర్తను కోల్పోయింది. అప్పటికి ఆమె గర్భవతి. ఇది వరకే ఓ కూతురున్నా.. 11 ఏళ్ల వయసులో ఆమె కూడా చనిపోవడంతో తీవ్ర మానసిక వేదనను అనుభవించింది దాగర్.

మనవడి స్ఫూర్తితో..!

ఇలా తన జీవితంలో ఒక్కో సవాలునూ ఎదుర్కొంటూ ముందుకు సాగిన ఈ బామ్మకు ఆపై అన్నీ తన కొడుకే అయ్యాడు. పిల్లాడిని పెంచే క్రమంలో కూలీనాలీ చేయడంతో పాటు పలు కష్టాలకోర్చిన ఆమెను వయసు పెరుగుతున్న కొద్దీ పలు అనారోగ్యాలు ఇబ్బంది పెట్టేవి. మరోవైపు బైపాస్‌ సర్జరీ కూడా చేయించుకుంది దాగర్‌. కొన్నేళ్లకు తన కొడుకును ఇంటి వాడిని చేశాక కానీ ఆమె కష్టాలు తీరలేదు. ఆపై మనవలు, మనవరాళ్లతో శేష జీవితాన్ని ఆనందంగా గడిపే క్రమంలో ఆమెలో అనూహ్యంగా ఆటలపై మక్కువ కలిగింది. తన మనవడు వికాస్‌ దాగర్‌ మన దేశానికి చెందిన పారా అథ్లెట్‌. ఆయన స్ఫూర్తితోనే 94 ఏళ్ల వయసులో అథ్లెట్‌గా కొత్త అవతారమెత్తిందీ బామ్మ.

నడకతో మొదలుపెట్టి..!

లేటు వయసులో క్రీడలపై మక్కువ పెంచుకున్న దాగర్‌.. తన మనవడి సహకారం, శిక్షణతో డిస్కస్‌ త్రో, రన్నింగ్ (స్ప్రింట్‌), షాట్‌పుట్‌.. వంటి క్రీడల్లో ఆరితేరింది. ఈ క్రమంలో తాను ప్రత్యేకంగా వ్యాయామాలేవీ చేయలేదని, నడకతోనే ఫిట్‌గా మారానంటోందీ బామ్మ.

‘సాధారణంగా వృద్ధాప్యంలో గాయాల బెడద ఎక్కువ. అందుకే ఫిట్‌గా మారడానికి నడక వంటి సులభమైన వ్యాయామాన్ని ఎంచుకున్నా. ఉదయం ఐదు కిలోమీటర్లు, సాయంత్రం ఐదు కిలోమీటర్లు నడుస్తున్నా.. అంతేకానీ ఎప్పుడూ జిమ్‌కు వెళ్లలేదు. ఈ వయసులో నేను ఆటల్ని ఎంచుకుంటానంటే.. ముందు మా కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. కానీ ‘నాకు నచ్చినట్లుగా జీవించాలనుకుంటున్నా.. నాకేదో అవుతుందన్న భయం వద్దు..’ అని చెప్పాను. ఈ సానుకూల దృక్పథమే నన్ను అప్పుడు, ఇప్పుడు ముందుకు నడిపిస్తోంది..’ అంటోందీ దాదీ.

వయసు కాదు.. పట్టుదల ముఖ్యం!

గతేడాది తన 94 ఏళ్ల వయసులో తొలుత షాట్‌పుట్‌ సాధన చేసిన ఆమె.. అప్పట్నుంచే తన పతకాల వేట మొదలుపెట్టింది. గతేడాది ఫిన్లాండ్‌లో జరిగిన ‘ప్రపంచ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌’లో 100 మీటర్ల పరుగులో పసిడి, షాట్‌పుట్‌, డిస్కస్‌ త్రో ఈవెంట్లలో తలా ఒక కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్న ఈ బామ్మ.. ఆపై దిల్లీ, చెన్నైలలో జరిగిన జాతీయ స్థాయి ఈవెంట్లలో తలా మూడు బంగారు పతకాల చొప్పున గెలుచుకుంది. ఇక తాజాగా పోలండ్‌లో జరుగుతోన్న ‘వరల్డ్‌ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ ఇండోర్‌ ఛాంపియన్‌షిప్‌’లో డిస్కస్‌ త్రోలో బంగారు పతకం కైవసం చేసుకుంది దాగర్.

‘నా పట్టుదల, ఆత్మవిశ్వాసమే నా విజయాలకు కారణం. చిన్నవయసు నుంచే అథ్లెట్‌ కావాలన్న కోరిక నాలో ఉన్నప్పటికీ ఆ దిశగా ఆలోచించే, ప్రయత్నించే అవకాశం ఎప్పుడూ నాకు రాలేదు. వృద్ధాప్యంలోనైనా నా తపనను నెరవేర్చుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. మన లక్ష్యాల్ని చేరుకోవడానికి పట్టుదల కావాలే కానీ.. వయసు ముఖ్యం కాదు..’ అంటూ తన మాటలతోనూ ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతోన్న ఈ గ్రానీ.. ఇటీవలే దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ చేతుల మీదుగా ప్రశంసా పత్రం కూడా అందుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్