అప్పుడు చంపుకొన్న కోరికల్ని.. ఇప్పుడు నెరవేర్చుకుంటున్నా!

మహిళగా మనపై ఎన్నో బాధ్యతలుంటాయి. ఇటు ఇంటిని, అటు వృత్తిని బ్యాలన్స్‌ చేసుకునే క్రమంలో మన వ్యక్తిగత ఇష్టాయిష్టాలు, అభిరుచుల్నీ పక్కన పెట్టేస్తుంటాం. అలాగని మన కోరికల్ని పూర్తిగా చంపుకోవడం సరికాదంటోంది బెంగళూరుకు...

Published : 02 Jun 2023 11:22 IST

(Photos: Instagram)

మహిళగా మనపై ఎన్నో బాధ్యతలుంటాయి. ఇటు ఇంటిని, అటు వృత్తిని బ్యాలన్స్‌ చేసుకునే క్రమంలో మన వ్యక్తిగత ఇష్టాయిష్టాలు, అభిరుచుల్నీ పక్కన పెట్టేస్తుంటాం. అలాగని మన కోరికల్ని పూర్తిగా చంపుకోవడం సరికాదంటోంది బెంగళూరుకు చెందిన గాయత్రి మొహంతీ. నలభై ఏళ్లొచ్చే దాకా ఇటు కుటుంబం, అటు ఉద్యోగ బాధ్యతలకే పరిమితమైన ఆమె.. తన జీవిత లక్ష్యం అది కాదని గ్రహించింది. ఒకానొక దశలో పర్వతారోహణపై మక్కువ పెంచుకున్న గాయత్రి.. ఇప్పటికే మూడు ఖండాల్లో అత్యంత ఎత్తైన పర్వతాల్ని అధిరోహించింది. ఏడు ఖండాల్లో ఏడు అత్యున్నత శిఖరాల్ని అధిరోహించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆమె.. మోడల్‌, మోటివేషనల్‌ స్పీకర్‌, ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ కూడా! చిన్న వయసు నుంచి తానెదుర్కొన్న కష్టాలు, విమర్శలే తనను దృఢంగా మార్చాయంటోన్న గాయత్రి.. స్ఫూర్తిదాయక ప్రయాణం గురించి తెలుసుకుందాం..!

మధ్యతరగతి కుటుంబం, ఇంటికి పెద్ద కూతురైతే పరిస్థితి ఎలా ఉంటుంది? నచ్చినా నచ్చకపోయినా అన్ని విషయాల్లోనూ సర్దుకుపోవాల్సి వస్తుంది. గాయత్రి పరిస్థితీ ఇదే! ఇంటికి పెద్ద కూతురిగా, ఇద్దరు చెల్లెళ్లకు అక్కగా చిన్న వయసు నుంచే ఇంట్లో పలు బాధ్యతల్ని తన భుజాన వేసుకోవడం అలవాటు చేసుకుందామె. ఆర్మీలో చేరాలన్న ఆశయంతో స్కూల్లో ఉన్నప్పుడే ఎన్‌సీసీలో చేరిందామె. అయితే ఇంట్లో ఆమె కోరికను అందరూ వ్యతిరేకించడంతో మనసు మార్చుకుంది గాయత్రి.

‘ప్రవర్తన అమ్మాయిలా లేద’న్నారు!

చిన్నప్పట్నుంచి చాలా డేరింగ్‌ అండ్‌ డ్యాషింగ్‌గా ఉండేది గాయత్రి. నడక, నడత.. ఇలా ప్రతి విషయంలోనూ ఎంతో బోల్డ్‌గా ఉండే గాయత్రిని చాలామంది విమర్శించేవారు. అయినా అవేవీ పట్టించుకోలేదంటోందామె.

‘చిన్నప్పట్నుంచి నాకు ముక్కుసూటితనం ఎక్కువ. దీంతో చాలామంది ‘నీ ప్రవర్తన అమ్మాయిలా లేదు.. ఇలా అయితే నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు?’ అనేవారు. అయినా నేను వాళ్ల మాటలు పట్టించుకోకపోయేదాన్ని. అయితే ఇంట్లో మా నాన్న నన్ను ప్రోత్సహించేవారు. నా కోరిక మేరకే ఎంబీఏ పూర్తి చేశా. ప్రాంగణ నియామకాల్లోనే ఉద్యోగం సంపాదించా. ఆపై రెండేళ్లకు పెళ్లైంది.. అమ్మనయ్యా. అయితే ఆ సమయంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉండేది. ఓవైపు బిడ్డ ఆలనా పాలనా చూసుకోలేక.. మరోవైపు ఉద్యోగంపై పూర్తి దృష్టి పెట్టలేక.. చాలా సతమతమయ్యా. ఈ ఒత్తిడి నేను మరింత బరువు పెరిగేలా చేసింది. ఒకానొక దశలో ఉద్యోగం మానేద్దామనుకున్నా.. కానీ నా ఆర్థిక స్వతంత్రత దెబ్బతింటుందన్న ఉద్దేశంతో మా ఇంట్లో నా నిర్ణయానికి అడ్డు చెప్పారు. అయినా ఆ సమయంలో ఉద్యోగం మానేసి ఇంటి బాధ్యతలకే ప్రాధాన్యమిచ్చా..’ అంటూ తన జీవితంలోని ప్రతికూల పరిస్థితుల గురించి చెప్పుకొచ్చింది గాయత్రి.

పర్వతారోహణ.. అలా పరిచయమైంది!

12 ఏళ్ల పాటు ఉద్యోగం చేసి.. ఇంటి బాధ్యతల రీత్యా కెరీర్‌కు విరామమిచ్చిన గాయత్రి.. తన ఆరోగ్యంపై దృష్టి పెట్టింది.. బరువు తగ్గే ప్రయత్నాల్లో నిమగ్నమైంది. ఇదే సమయంలో ఓరోజు బెంగళూరులోని మౌంటెనీరింగ్‌ క్లబ్‌ను సందర్శించిందామె. ఇక్కడే పర్వతారోహకురాలు కావాలన్న కోరిక పుట్టిందంటోంది గాయత్రి.

‘జీవితమంటే ఇల్లు, పిల్లలు, ఉద్యోగం మాత్రమే అనుకున్న నాకు అనుకోకుండా పర్వతారోహణ పరిచయమైంది. ఆ క్షణం నా జీవిత లక్ష్యం ఇదే అనిపించింది. అయితే ఇది అనుకున్నంత సులభం కాదు.. దీనికి తోడు చాలామంది నా నిర్ణయాన్ని వ్యతిరేకించారు. పెళ్లైన మహిళ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. ఆ సమయంలోనూ నా కుటుంబం నాకు తోడుగా నిలిచింది.. నన్ను ప్రోత్సహించింది. అలా నా 40 ఏళ్ల వయసులో పర్వతారోహణ శిక్షణ తీసుకున్నా. ఆపై -40 డిగ్రీల ఉష్ణోగ్రతలో లద్దాఖ్‌లోని చాదర్‌ ట్రెక్‌ పూర్తి చేయడం అతి పెద్ద సవాలుగా అనిపించింది. ఆ తర్వాత సిక్కింలోని పిండారీ గ్లేసియర్‌ పర్వతాలు ఎక్కుతున్న సమయంలో కాలు ఎముక ఫ్రాక్చర్‌ అయింది. అయినా లక్ష్యాన్ని పూర్తి చేశా..’ అంటూ చెప్పుకొచ్చిందామె.

3 పూర్తి చేశా.. మరో 4 ఉన్నాయి!

తపనకు పట్టుదల తోడైతే.. అసాధ్యమనేదే ఉండదంటోన్న గాయత్రి.. ఏడు ఖండాల్లో ఏడు అత్యంత ఎత్తైన శిఖరాల్ని అధిరోహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో ఇప్పటికే మూడు పూర్తి చేశానంటోంది.

‘పర్వతారోహణకు శారీరకంగా ఫిట్‌గా ఉంటే సరిపోదు.. మానసికంగానూ దృఢంగా ఉండాలి. ఏడు ఖండాల్లో ఏడు అత్యున్నత శిఖరాల్ని అధిరోహించడమే నా లక్ష్యం. ఈ క్రమంలో ఇప్పటికే మూడు శిఖరాల్ని అధిరోహించా. యూరప్‌లోని ‘మౌంట్‌ ఎల్‌బ్రస్’, ఆఫ్రికాలోని ‘మౌంట్‌ కిలిమంజారో’.. ఆస్ట్రేలియాలోని ‘Mount Kosciuszko’ పర్వతాలను అధిరోహించా. తర్వాతి లక్ష్యం ఎవరెస్ట్‌. రెండేళ్ల క్రితమే బేస్‌క్యాంప్‌ వరకు ఎక్కా. ఈసారి శిఖరాగ్రానికి చేరుకోవడమే లక్ష్యంగా సాధన చేస్తున్నా. ఆపై మరో మూడు శిఖరాల్నీ అధిరోహించి.. నా ఆశయాన్ని నెరవేర్చుకుంటా.. అయితే పర్వతారోహణను కెరీర్‌గా ఎంచుకునే వారు ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్లనూ అధిగమించేందుకు సిద్ధంగా ఉండాలి. నా జీవితంలో నేను నమ్మిన సూత్రమొక్కటే.. ఎంత కష్టమైనా ఎంచుకున్న మార్గాన్ని మార్చుకోకూడదని!’  అంటూ తన మాటలతో నేటి మహిళల్లో స్ఫూర్తి నింపుతోందీ మహిళా మౌంటెనీర్.

మోడల్‌గా.. ట్రైనర్‌గా..!

గాయత్రికి మోడలింగ్‌ అన్నా మక్కువే! మరోవైపు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకునే క్రమంలో ఫిట్‌నెస్‌పై ప్రేమను పెంచుకుందామె. ప్రస్తుతం ఓవైపు పర్వతారోహకురాలిగా కొనసాగుతూనే.. ఈ రెండింటి పైనా దృష్టి పెట్టింది గాయత్రి.

‘పలు కారణాల వల్ల చిన్నప్పట్నుంచి ఎన్నో కోరికల్ని చంపుకొన్నా. 40 దాటాక గానీ వాటిని నెరవేర్చుకునేందుకు సమయం రాలేదు. మోడలింగ్‌పై మక్కువతో ‘మిసెస్‌ కర్ణాటక-2019’ పోటీల్లో పాల్గొని తొలి రన్నరప్‌గా నిలిచా. అదే ఏడాది ‘మిసెస్‌ ఇండియా గ్లోబల్‌ యూనివర్స్‌’ టైటిల్‌నూ దక్కించుకున్నా. అయితే ఇలా నేను అందాల పోటీల్లో పాల్గొన్నప్పుడూ పలు విమర్శలు ఎదుర్కొన్నా. ఈ వయసులో ఇలాంటి దుస్తులు ధరించడమేంటని చాలామంది అన్నారు. అయినా నేను వెనక్కి తగ్గలేదు. నా దృష్టిలో ఫలానా పని చేయడానికి ఆడ, మగ, వయసు.. అన్న పరిమితులు పెట్టుకోను. ఇక్కడిదాకా రాగలిగానంటే ఈ పాజిటివిటీనే కారణం..’ అంటోన్న ఈ మౌంటెనీరింగ్‌ బ్యూటీ.. అమ్మాయిల్ని చదువుతో పాటు తమకు నచ్చిన రంగాల్లో ప్రోత్సహించడం ముఖ్యమంటోంది. మరోవైపు ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గానూ మహిళలకు శిక్షణనిస్తోన్న గాయత్రి.. మోటివేషనల్‌ స్పీకర్‌గానూ వారిలో స్ఫూర్తి నింపుతుంటుంది. ఇలా తన బహుముఖ ప్రజ్ఞకు గుర్తింపుగా.. ‘ఇంటర్నేషనల్‌ విమెన్‌ అఛీవర్స్‌ అవార్డ్‌ - 2019’, ‘సౌతిండియా విమెన్‌ అఛీవర్‌ అవార్డు - 2020’, ‘విమెన్‌ అఛీవర్‌ అవార్డ్‌ - 2021’.. వంటి పురస్కారాలూ అందుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్