Commonwealth Games: ‘ఇదేం ఆట?’ అన్న వాళ్లతోనే.. ‘ఇదీ ఆటంటే!’ అనిపించారు!

ఆ నలుగురికీ ఆటలంటే ప్రాణం. చిన్న వయసు నుంచే క్రీడారంగంలో స్థిరపడాలని కలలు కన్నారు. వేర్వేరు ఆటల్ని ఎంచుకొని తమ ప్రతిభ చాటుకున్నారు. అంతిమంగా ‘లాన్‌ బౌల్స్‌’ను కెరీర్‌గా మలచుకొని పతకాలు కొల్లగొడుతున్నారు. ఇక ఇప్పుడు ప్రతిష్టాత్మక ‘కామన్వెల్త్‌ గేమ్స్‌’లోనూ పసిడి ముద్దాడి.. ఈ క్రీడలో దేశానికి తొలి పతకం అందించి....

Published : 04 Aug 2022 18:19 IST

ఆ నలుగురికీ ఆటలంటే ప్రాణం. చిన్న వయసు నుంచే క్రీడారంగంలో స్థిరపడాలని కలలు కన్నారు. వేర్వేరు ఆటల్ని ఎంచుకొని తమ ప్రతిభ చాటుకున్నారు. అంతిమంగా ‘లాన్‌ బౌల్స్‌’ను కెరీర్‌గా మలచుకొని పతకాలు కొల్లగొడుతున్నారు. ఇక ఇప్పుడు ప్రతిష్టాత్మక ‘కామన్వెల్త్‌ గేమ్స్‌’లోనూ పసిడి ముద్దాడి.. ఈ క్రీడలో దేశానికి తొలి పతకం అందించి చరిత్ర సృష్టించారు. 92 ఏళ్ల కామన్వెల్త్‌ గేమ్స్‌ చరిత్రలో లాన్‌ బౌల్స్‌లో దేశానికి తొలిసారి పతకం దక్కడం, అదీ స్వర్ణ పతకం కావడంతో ఆ నలుగురమ్మాయిల పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. ఆ ‘బంగారు’ కొండలే లవ్లీ ఛౌబే, రూపా రాణి తిర్కే, పింకీ, నయన్మోని సైకియా. కెరీర్‌లో వేర్వేరు వృత్తుల్లో స్థిరపడిన వీరు.. లాన్‌ బౌల్స్‌తో జట్టు కట్టి ఇప్పుడు దేశానికే గర్వకారణమయ్యారు. ఈ నలుగురు మహిళల క్రీడా ప్రస్థానమే ఇది!

లాన్‌ బౌల్స్‌.. నిన్నటి వరకు ఈ క్రీడ గురించి తెలిసింది చాలా తక్కువమందికి! కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కారణం.. లవ్లీ ఛౌబే, రూపా రాణి తిర్కే, పింకీ, నయన్మోని సైకియా.. అనే నలుగురు అమ్మాయిలు. ప్రతిష్టాత్మక కామన్వెల్త్‌ క్రీడల్లో ‘లాన్‌ బౌల్స్‌ ఉమెన్స్‌ ఫోర్స్‌’ విభాగంలో స్వర్ణం సాధించి.. ఈ క్రీడలో దేశానికి తొలి పతకం అందించిన వీరి పేర్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగుతున్నాయి. 92 ఏళ్ల కామన్వెల్త్‌ క్రీడల చరిత్రలో లాన్‌ బౌల్స్‌ అనే క్రీడ ఒకటుందని, అందులోనూ భారత్‌ సత్తా చాటగలదని నిరూపించిన ఈ అమ్మాయిలు అసలు ఈ క్రీడలోకి ఎలా వచ్చారో తెలుసుకుందాం..!

లాంగ్‌ జంప్‌ నుంచి లాన్‌ బౌల్స్‌కు!

లాన్‌ బౌల్స్‌ విభాగంలో దేశానికి స్వర్ణం సాధించి పెట్టిన భారత బృందంలో లవ్లీ ఛౌబే సీనియర్‌, బృంద నాయకురాలు కూడా! 1980లో జార్ఖండ్‌లోని రాంచీలో జన్మించిన లవ్లీది మధ్య తరగతి కుటుంబం. ఆమె తండ్రి కోల్‌ ఇండియాలో పనిచేసి రిటైరయ్యారు.. తల్లి గృహిణి. పెరిగి పెద్దయ్యే క్రమంలో అథ్లెట్‌గా రాణించాలని కలలు కన్న ఆమె.. కెరీర్‌ ప్రారంభంలో స్ప్రింట్‌, లాంగ్‌ జంప్‌.. వంటి క్రీడల్లో పోటీ పడింది. అయితే గాయం కారణంగా ఈ క్రీడల్లో ఎక్కువ రోజులు కొనసాగలేకపోయింది. అయినా తన తపనను వీడలేదామె. బిహార్‌ ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ అంపైర్‌, లాన్‌ బౌల్స్‌ కోచ్‌ అయిన మధుకాంత్‌ పథక్‌ ప్రోత్సాహంతో లాన్‌ బౌల్స్‌ క్రీడలోకి అడుగుపెట్టిన ఆమె.. ఈ క్రీడ పైనే ప్రాణం పెట్టి సాధన చేసింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో పలు టోర్నీల్లోని గ్రూప్‌ ఈవెంట్లలో పాల్గొని పతకాలు గెలుచుకుంది. ఇదే ఉత్సాహం, నిండైన ఆత్మవిశ్వాసాన్ని తాజా కామన్వెల్త్‌ గేమ్స్‌లో పునరావృతం చేసి.. ఈ చరిత్రాత్మక గెలుపులో భాగమైంది లవ్లీ. ప్రస్తుతం జార్ఖండ్‌ పోలీస్‌ శాఖలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తోన్న ఆమె.. మరోవైపు లాన్‌ బౌల్స్‌ క్రీడనూ బ్యాలన్స్‌ చేస్తూ సత్తా చాటుతోంది.


ఆటకు భవిష్యత్తు లేదన్నారు!

కబడ్డీతో తన క్రీడా ప్రస్థానాన్ని మొదలుపెట్టింది రాంచీకి చెందిన రూపా రాణి తిర్కే. అయితే దీనికంటే లాన్‌ బౌన్స్‌కు ఉండే గుర్తింపు, ప్రయోజనాలేంటో తెలుసుకొన్న ఆమె.. ఈ క్రీడలో స్థిరపడాలని నిర్ణయించుకుంది. 2010 నుంచి కామన్వెల్త్‌ గేమ్స్‌లో పాల్గొంటూ వస్తున్న ఆమె.. ట్రిపుల్స్‌, ఫోర్స్‌ విభాగాల్లో పాల్గొన్నా పతకాలు గెలవలేకపోయింది. అయినా పట్టు వీడకుండా వివిధ జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో పోటీ పడి కాంస్య పతకాల్ని కైవసం చేసుకుంది. డిగ్రీ వరకు చదువుకున్న రాణి.. 2020 నుంచి జార్ఖండ్‌ ప్రభుత్వంలో జిల్లా క్రీడాధికారిగా విధులు నిర్వర్తిస్తోంది.

 ‘నేను ఈ క్రీడను ఎంచుకున్నప్పుడు చాలామంది.. ‘ఇదేం ఆట..? అసలు దీనికి భవిష్యత్తే ఉండదు..’ అన్నారు. కానీ నేను మాత్రం ఇదే క్రీడలో రాణించాలని నిర్ణయించుకున్నా. ఆస్ట్రేలియా లాన్‌ బౌల్స్‌ క్రీడాకారిణి కరెన్‌ మర్ఫీ నా స్ఫూర్తి ప్రదాత. ఆమెలా అత్యుత్తమ క్రీడాకారిణి కావాలనుకుంటున్నా. గతంలో కామన్వెల్త్‌ క్రీడల్లో పాల్గొన్నా పతకాలు సాధించలేకపోయాం.. అయితే ఈసారి ఆ లోటును భర్తీ చేయాలనుకున్నాం.. ఏకంగా స్వర్ణం గెలిచి మరపురాని విజయాన్ని అందుకున్నాం..’ అంటూ తన సంతోషాన్ని పంచుకుందామె. ఈ ఏడాదే వివాహం చేసుకున్న రాణి.. పెళ్లి తర్వాతా కెరీర్లో రాణించడానికి తన భర్త, కుటుంబ ప్రోత్సాహమే కారణమంటోంది.


సచిన్‌కు వీరాభిమాని!

ఆటలపై మక్కువతో దిల్లీ యూనివర్సిటీ నుంచి స్పోర్ట్స్‌ డిగ్రీ పట్టా అందుకుంది దిల్లీకి చెందిన పింకీ. ఆపై పటియాలాలోని స్పోర్ట్స్‌ అథారిటీ నుంచి డిప్లొమా పూర్తిచేసిన ఆమె.. కళాశాలలో ఉన్నప్పుడు క్రికెట్‌ అంటే ప్రాణం పెట్టేది. ఈ క్రమంలోనే పలు క్రికెట్‌ మ్యాచుల్లో పోటీ పడి సత్తా చాటిన ఆమె.. సచిన్‌ తెందూల్కర్‌కు వీరాభిమాని! అయితే క్రికెట్‌ను ఆరాధించే మీరు లాన్‌ బౌల్స్‌లోకి ఎలా వచ్చారని అడగ్గా.. ‘దిల్లీ ఆర్కేపురంలోని దిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో పీఈటీగా పని చేస్తున్నప్పుడు ప్రాక్టీస్‌ సెషన్‌లో భాగంగా నాకు లాన్‌ బౌల్స్ పరిచయమైంది. ఎందుకో నాకు ఆ ఆట నచ్చింది. అందులో నా అదృష్టాన్ని పరీక్షించుకుందామని ప్రయత్నించా. జాతీయ జట్టులో చోటు దక్కింది. ఆ తర్వాత పాల్గొన్న పోటీల్లోనూ పతకాలు, గుర్తింపు రావడంతో ఇందులోనే కొనసాగాలని ఫిక్సయ్యా. అయితే ఓటమి ఎదురైన ప్రతిసారీ ఎన్నో రాత్రులు నిద్ర పట్టేది కాదు. ఈ క్రమంలో- మేం చేసిన తప్పులు సరిదిద్దుకుంటూ తదుపరి మ్యాచ్‌లకు సన్నద్ధమయ్యేవాళ్లం. ఇక ఇప్పుడు కామన్వెల్త్‌ వంటి ప్రతిష్టాత్మక వేదికపై దేశానికి తొలి పతకం, అదీ స్వర్ణం అందించడం మర్చిపోలేని అనుభూతి!’ అంటోంది పింకీ. ప్రస్తుతం తను చదువుకున్న ‘సాల్వన్‌ గర్ల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌’లో పీఈటీగా విధులు నిర్వర్తిస్తోందీ మహిళా అథ్లెట్.


వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి..!

కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం గెలిచిన భారత లాన్‌ బౌల్స్‌ బృందంలో పిన్న వయస్కురాలు నయన్మోనీ సైకియా. అసోంలోని గోలాఘాట్ జిల్లాకు చెందిన ఆమె తండ్రి వృత్తిరీత్యా రైతు. వ్యవసాయాధారిత కుటుంబంలో నుంచి వచ్చినా పైచదువులు చదవాలని సంకల్పించుకుందామె. ఈ క్రమంలోనే గోలాఘాట్‌ కామర్స్‌ కాలేజీలో చదువు పూర్తి చేసుకున్న ఆమె.. 2011 నుంచి అసోం అటవీ శాఖలో ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. 2013లో స్థానిక వ్యాపారవేత్తను పెళ్లాడిన ఆమెకు ఓ కూతురుంది. అయితే మిగతా ముగ్గురిలాగే నయన్మోని కూడా వేరే క్రీడతోనే తన క్రీడా కెరీర్‌ను ప్రారంభించింది. తొలుత వెయిట్‌ లిఫ్టర్‌గా ప్రతిభ చాటిన ఆమెను.. ఒకానొక దశలో గాయాలు వేధించాయి. ఈ క్రమంలోనే అయిష్టంగానే ఈ క్రీడను వదులుకున్న ఆమె.. లాన్‌ బౌల్స్‌పై దృష్టి పెట్టింది. ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటిన నయన్మోనికి ఇవి మూడో కామన్వెల్త్‌ క్రీడలు. ఇలా ముచ్చటగా మూడోసారి తన బృందంతో కలిసి దేశానికి చరిత్రాత్మక విజయాన్ని అందించి పెట్టిందీ అసోం అథ్లెట్.


అసలేంటీ లాన్‌ బౌల్స్?

లాన్ బౌల్స్ అనేది ఓ ఔట్‌డోర్‌ క్రీడ. దీన్ని లాన్ బౌలింగ్ అని కూడా పిలుస్తారు. ‘జాక్’ అని పిలిచే చిన్న బంతి వైపు క్రీడాకారులు బౌల్‌ను విసురుతారు. ఈ ఆటను సాధారణంగా 40–42 గజాల ఫ్లాట్‌గా ఉండే గ్రీన్‌లాన్‌లో ఆడతారు. ఈ గేమ్‌లోని ప్రధాన లక్ష్యం క్రీడాకారులు కొంత దూరంలో నిల్చొని తమ బౌల్‌ను ‘జాక్’కు దగ్గరికి వెళ్లే విధంగా రోల్ చేస్తూ విసరాలి. అది వెళ్లి జాక్‌కు అత్యంత సమీపంలో నిలవాలి. అలా ఒక మ్యాచ్‌ పూర్తవ్వాలంటే ఇరు జట్లు 18 మూలల నుంచి బౌల్స్‌ను విసరాలి. అయితే, ఇది పూర్తిగా వృత్తాకార పద్ధతిలో నిర్వహిస్తారు. 18 రౌండ్ల తర్వాత ఎక్కువ పాయింట్లు సాధించిన జట్టే విజేతగా నిలుస్తుంది. ఈ లాన్‌బౌల్స్‌ ఈవెంట్‌లో మొత్తం నాలుగు ఫార్మాట్‌లు ఉంటాయి. సింగిల్స్, పెయిర్స్, ట్రిపుల్స్, ఫోర్స్‌. ప్రతి జట్టులోని వ్యక్తుల సంఖ్య ఆధారంగా ఆయా ఫార్మాట్లకు ఆ పేరు పెట్టారు. అయితే బాలే కదా.. ఎంత దూరమైనా అలవోకగా విసరచ్చు అని తక్కువ అంచనా వేయద్దు. ఎందుకంటే ఈ బాల్‌ చెక్క, రబ్బర్‌, ప్లాస్టిక్‌ రెసిన్‌.. వంటి మెటీరియల్‌తో తయారుచేస్తారు. పైగా ఇవి చుట్టూ గుండ్రంగా ఉండవు.. దీనిపై చదునైన ఉపరితలాలూ ఉంటాయి. ఒక్కో బాల్‌ బరువు సుమారు 1.59 కిలోలుంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్