అప్పుల ఊబిని దాటి.. ఆదర్శప్రాయమయ్యారు..

ఏ చిన్న అనారోగ్యం వచ్చినా.. వారంతా ఆసుపత్రికెళ్లేముందు వడ్డీకి అప్పిచ్చేవారి గుమ్మాన్ని తొక్కాల్సిందే. శ్రమటోడ్చి సంపాదించినదంతా వడ్డీకే చెల్లించాల్సి వచ్చేది. అటువంటి గ్రామంలో మహిళలంతా కలిసి స్వయం ఉపాధిని సాధించి..  మరెందరికో ఆదర్శమయ్యారు. 

Published : 21 Jan 2023 00:02 IST

ఏ చిన్న అనారోగ్యం వచ్చినా.. వారంతా ఆసుపత్రికెళ్లేముందు వడ్డీకి అప్పిచ్చేవారి గుమ్మాన్ని తొక్కాల్సిందే. శ్రమటోడ్చి సంపాదించినదంతా వడ్డీకే చెల్లించాల్సి వచ్చేది. అటువంటి గ్రామంలో మహిళలంతా కలిసి స్వయం ఉపాధిని సాధించి..  మరెందరికో ఆదర్శమయ్యారు. తమిళనాడు రాష్ట్రముఖ్యమంత్రి చేతులమీదుగా అవార్డు అందుకొన్న ఈ తన్వా బృందం స్ఫూర్తి కథనమిది.

విల్లుపురం సమీపంలోని తొడర్నదనూరు గ్రామానికి చెందిన కుటుంబాలన్నీ దాదాపు అప్పులబారిన పడినవే. వడ్డీలు చెల్లిస్తూ.. అసలును మాత్రం తీర్చలేక కూలబడిపోయారు. దాంతో స్థానిక మహిళలకొచ్చిన ఓ ఆలోచనే.. అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచింది. మా కుటుంబాలన్నీ అప్పుల బారి నుంచి బయటపడే మార్గాన్ని మేమే వెతకాలనుకున్నాం అంటారు 52 ఏళ్ల అముద. ‘మేమంతా మా కాళ్లపై మేం నిలబడాలనుకున్నాం. అలా నా నేతృత్వంలో 2006లో 12 మందితో స్వయం సహాయక బృందం ‘తన్వా (తమిళనాడు వుమెన్‌ ఇన్‌ అగ్రికల్చర్‌)’ ప్రారంభమైంది. మాలో టైలరింగ్‌ వచ్చినవాళ్లు చుట్టుపక్కలవారికి దుస్తులు కుట్టి ఇవ్వడం, అలాగే మరికొందరు స్వీట్లు, స్నాక్స్‌, పచ్చళ్లు, పాల ఉత్పత్తులు వంటివి తయారు చేయడం ప్రారంభించారు. వారి పెట్టుబడికి అందరూ తలాకొంతా ఇచ్చేవాళ్లం. వచ్చే లాభాలను ఖర్చులుపోగా.. అవసరమైనవారికి రుణంగా అందించి చేయూతగా నిలిచేవాళ్లం. ఆసక్తి ఉన్నవారిని చేర్చుకొని రుణమిచ్చేవాళ్లం. క్రమేపీ సభ్యుల సంఖ్య పెరిగింది. స్వయం ఉపాధిని ప్రోత్సహించడంతో ప్రతి ఇంట్లో మహిళలు తమకు నచ్చిన రంగంలోకి అడుగుపెట్టడం మొదలుపెట్టారు. మా లక్ష్యాలను గుర్తించి, స్థానిక అధికారులు చిరువ్యాపారాలకు గ్రామీణబ్యాంకుల్లో రుణాలు ఇప్పించడానికి ముందుకొచ్చారు. దీంతో మా సభ్యులు ఆర్థికంగా ఎదగడమే కాకుండా వారి కుటుంబాలను అప్పుల నుంచి బయటపడేలా చేశారు’ అని వివరిస్తారు అముద.


17 ఏళ్లకు..

న్వా బృందంలో ఈ 17 ఏళ్లలో సభ్యుల సంఖ్య 150కి పెరిగింది. ‘ఉత్పత్తుల తయారీ నుంచి మార్కెటింగ్‌ వరకు ప్రతి అంశంలోనూ సభ్యులందరిదీ సమాన భాగస్వామ్యం. మాలో చాలామంది ఇప్పుడు సొంతంగా టైలరింగ్‌ యూనిట్స్‌, రిఫ్రెష్‌మెంట్‌ షాప్స్‌, పశువుల పెంపకం, పాల ఉత్పత్తుల పంపిణీ వంటివి నిర్వహించే స్థాయికెదిగారు. తన్వా ప్రారంభించినప్పుడు మా గ్రామంలో ఎన్నో విమర్శలెదుర్కోవలసి వచ్చింది. అయినా ఆర్థికంగా మా కాళ్లపై మేం నిలబడటానికి చేసే ప్రయత్నాన్ని మానలేదు. ధైర్యంగా అడుగు ముందుకేశాం. ఛాలెంజ్‌లెన్నో ఎదురయ్యాయి. అందరం సమిష్టిగా సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించేవాళ్లం. గ్రామ మహిళలందరిలో అవగాహన కలిగించడానికి రోజూ సమావేశాలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేవాళ్లం. స్థానిక అధికారులను కలిసి మా బృందానికి ఆర్థిక చేయూత ఇప్పించాలని కోరేవాళ్లం. ఇబ్బందులెన్ని వచ్చినా మేం ఆత్మవిశ్వాసాన్ని వీడలేదు. బ్యాంకుల్లో రుణాలనెలా పొందొచ్చు అనేదానిపై అందరిలో అవగాహన కలిగించే దాన్ని. నచ్చిన, తెలిసిన రంగంలోకి అడుగుపెట్టి లక్ష్యాన్ని ఎలా చేరుకోవచ్చో వివరించేదాన్ని. అప్పులవల్ల ఎదురయ్యే నష్టాలను చెప్పేదాన్ని. అవగాహన పెరగడంతో క్రమేపీ వడ్డీకి అప్పు తీసుకోవడం తగ్గించారు. వీళ్లేం సాధించగలరంటూ అవమానాలెన్నో ఎదుర్కొన్న మేమంతా ఇప్పుడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ చేతులమీదుగా ‘ఉత్తమ మహిళా స్వయం సహాయక బృందం అవార్డు’నందుకోవడం గర్వంగా ఉంది. ఈ గౌరవం మా ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. మరికొందరికి మేం ఆదర్శప్రాయంగా నిలవడం సంతోషంగా ఉంది’ అని చెప్పుకొచ్చారు అముద.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్