యాసిడ్ నా ముఖాన్ని కాల్చగలిగిందేమో.. నా ఆశయాన్ని కాదు!

మగాళ్లు తప్పు చేసినా.. అందుకు ఆడవాళ్లే కారణం అంటుంది ఈ సమాజం! ఏ పాపం ఎరగకపోయినా వాళ్లనే నిందిస్తుంది. ఆమ్లదాడి బాధితులదీ ఇలాంటి పరిస్థితే! దాడి చేసిన వారిని పక్కన పెట్టి.. బాధితుల అందాన్నే విమర్శిస్తుంది.. అంద విహీనంగా ఉన్నారంటూ ఎగతాళి చేస్తుంది. కోల్‌కతాకు చెందిన సంచయితా జాదవ్‌ దే కూ ఇలాంటి....

Published : 09 Jun 2022 18:35 IST

(Photos: Instagram)

మగాళ్లు తప్పు చేసినా.. అందుకు ఆడవాళ్లే కారణం అంటుంది ఈ సమాజం! ఏ పాపం ఎరగకపోయినా వాళ్లనే నిందిస్తుంది. ఆమ్లదాడి బాధితులదీ ఇలాంటి పరిస్థితే! దాడి చేసిన వారిని పక్కన పెట్టి.. బాధితుల అందాన్నే విమర్శిస్తుంది.. అంద విహీనంగా ఉన్నారంటూ ఎగతాళి చేస్తుంది. కోల్‌కతాకు చెందిన సంచయితా జాదవ్‌ దే కూ ఇలాంటి అవమానాలు తప్పలేదు. ప్రియుడి చేతిలో మోసపోయి ఆమ్లదాడికి గురైన ఆమె.. ఈ సమాజం నుంచి ఎన్నో ఛీత్కారాలు ఎదుర్కొంది.. కుంగిపోయింది. ‘అయినా చేయని తప్పుకి నేనెందుకు బాధపడాలని’ రియలైజ్‌ అయిన ఆమె.. తనపై దాడి చేసిన వాడికి శిక్ష పడే దాకా నిద్రపోలేదు. అలాగని తన జీవితం ఇంతేనని బాధపడలేదు. తనకంటూ ఓ ఆర్థిక భరోసా కల్పించుకుంది.. సమాజానికీ తానంటే ఏంటో నిరూపించింది. ‘యాసిడ్‌ నా ముఖాన్ని కాల్చగలిగిందేమో.. కానీ నా ఆశయాన్ని కాదం’టోన్న సంచయిత స్ఫూర్తి గాథ ఇది!

పన్నెండేళ్ల క్రితం.. కోల్‌కతాలో తన తల్లిదండ్రులతో కలిసి హాయిగా జీవితం సాగిస్తోంది సంచయిత. తన తండ్రి అన్నింటా ఆమెను ప్రోత్సహించేవారు. చిన్న వయసు నుంచే పోలీసాఫీసర్‌ కావాలన్నది ఆమె లక్ష్యం. తల్లిదండ్రులూ ఆమె కోరికను కాదనలేదు. అయితే కాలేజీలో ఉన్నప్పుడే ఓ అబ్బాయితో ప్రేమలో పడిందామె. ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. పెద్దల్నీ ఒప్పించారు. కానీ అతడికి ఉద్యోగం లేకపోవడం పెళ్లికి ప్రధాన ఆటంకంగా మారింది. పైగా అదే సమయంలో సంచయిత తండ్రి మరణించడంతో వివాహం మరికొన్నాళ్లు వాయిదా పడింది.

ఆ కోపంతో దాడి చేశాడు!

తన తండ్రి మరణం సంచయిత జీవితంలో పూడ్చలేని లోటుగా మిగిలిపోయింది. అయితే కొన్నాళ్లకు ఆ బాధ నుంచి క్రమంగా బయటపడిన ఆమె వద్దకు మళ్లీ పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాడు ఆమె బాయ్‌ఫ్రెండ్‌. కానీ ఉద్యోగం సంపాదించాకే పెళ్లి చేసుకుందామని ఈసారి తేల్చి చెప్పేసిందామె. ఇది అతనికి నచ్చలేదు.. పైగా ఉద్యోగం చేయాలి.. చీకూచింతా లేకుండా జీవించాలన్న ఆలోచన అతనిలో ఇసుమంతైనా కనిపించలేదామెకు. ఇన్నాళ్లూ అతని కల్లబొల్లి కబుర్లు నమ్మి మోసపోయానని గుర్తించిన ఆమె.. అతనితో ప్రేమ బంధానికి స్వస్తి పలకాలని నిర్ణయించుకుంది. ఇదే విషయం అతనితో చెప్పడంతో కోపంతో ఊగిపోయాడు. ఓరోజు పని మీద బయటికి వెళ్లిన ఆమె ముఖంపై అదను చూసి ఆమ్ల దాడి చేశాడు. వెంటనే అక్కడున్న వారు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె ముఖం చాలా వరకు కాలిపోయింది. ఓ కన్ను కూడా కోల్పోయింది సంచయిత.

నాలుగేళ్ల పోరాటానికి ఫలితమది!

ప్రియుడు చేసిన యాసిడ్‌ దాడి వల్ల అటు వ్యక్తిగతంగా, ఇటు సమాజం నుంచి పడరాని పాట్లు పడ్డానంటోంది సంచయిత. ‘దాడి తర్వాత నా ముఖాన్ని అద్దంలో చూసుకోవడానికి కూడా భయపడేదాన్ని. పెదాలు, నోరు బాగా కాలిపోవడంతో ఆహారం తీసుకోవడం కష్టమయ్యేది. చుట్టుపక్కల వాళ్లు, బంధువులు నా ముఖాన్ని చూసి ఎగతాళి చేసేవారు. దీంతో నెలల పాటు ఇంటికే పరిమితమయ్యా. అయితే ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో మా అమ్మ, నా బెస్ట్‌ ఫ్రెండ్‌ సుబ్రో నాకు అండగా నిలిచారు. వాళ్ల మాటలతో నాలో పాజిటివిటీ నూరిపోశారు. అమ్మ అప్పటిదాకా కూడబెట్టిన డబ్బుతో సర్జరీలు, చికిత్సలు చేయించింది. అయినా.. చేయని తప్పుకి నాకు ఇంత పెద్ద శిక్ష వేసిన వాడిని ఊరికే వదిలిపెట్టాలనుకోలేదు. ఆమ్ల దాడి బాధితులకు అండగా నిలిచిన ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో అతనిపై కోల్‌కతా హైకోర్టులో కేసు పెట్టా. నాలుగేళ్ల పోరాటం అనంతరం నిందితుడికి 14 ఏళ్లు జైలు శిక్ష పడింది..’ అంటూ జీవితంలో తానెదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకుంది సంచయిత.

అమ్మ పోయాక అన్నీ తానై..!

తాను కేసు పెట్టడానికి సహకరించిన స్వచ్ఛంద సంస్థలోనే చేరి.. ఆమ్లదాడి బాధితుల అభ్యున్నతికి పాటు పడుతోంది సంచయిత. అయితే ఈ క్రమంలోనే 2019లో తన తల్లినీ కోల్పోయిందామె. కొన్నేళ్ల వ్యవధిలోనే పేరెంట్స్‌ని కోల్పోయి అనాథగా మారిన ఆమెకు తన స్నేహితుడు సుబ్రో అండగా నిలిచాడు. ఈ స్నేహం ప్రేమకు దారితీయడంతో 2020లో ఇద్దరూ పెళ్లితో ఒక్కటయ్యారు. ఏడాది తిరిగే సరికి ఈ జంటకు అర్న అనే పాప పుట్టింది. ‘ఓవైపు అమ్మానాన్నను కోల్పోయి, మరోవైపు ఆమ్ల దాడికి గురై అస్తవ్యస్థమైన నా జీవితాన్ని సుబ్రో మళ్లీ గాడిలో పెట్టాడు. నెగెటివిటీలోకి కూరుకుపోతున్న ప్రతిసారీ తన మాటలతో నాలో ఆత్మవిశ్వాసం నింపాడు. ఓ రకంగా ఇదే నా కాళ్లపై నేను నిలబడేలా చేసిందని చెప్పచ్చు. ప్రస్తుతం నా భర్త, అత్తింటి వారు నన్నెంతో అపురూపంగా చూసుకుంటున్నారు. ఎదురు దెబ్బలు తగిలినంత మాత్రాన జీవితం అక్కడే ఆగిపోకూడదు.. మరింత శక్తిని కూడగట్టుకొని ముందుకు సాగాలి.. నా జీవితం నుంచి నేను నేర్చుకున్న పాఠమిదే!’ అంటోంది సంచయిత.

ప్రస్తుతం ఓవైపు ఎన్జీవోలో సేవలందిస్తూనే.. మరోవైపు ఓ సంస్థలో ఇన్వెంటరీ ఇన్‌ఛార్జిగా విధులు నిర్వర్తిస్తోందీ డేరింగ్‌ లేడీ. పలు రియాల్టీ షోలలో పాల్గొంటూ తన జీవితకథను పంచుకుంటోంది.. ఎంతోమంది ఆమ్ల దాడి బాధితుల్లో స్ఫూర్తి నింపుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్