అందుకే ఆ గ్రహానికి ఆమె పేరు!

చుట్టూ ఏం జరిగినా ‘మనకెందుకులే!’ అనుకునే వారే ఎక్కువ. అందులోనూ కాలుష్యాన్ని తగ్గించడమంటే అది మన పని కాదన్నట్లుగా వ్యవహరిస్తుంటారు చాలామంది. కానీ చేయీ చేయీ కలిపితేనే ఈ పెను విపత్తును సమూలంగా అంతమొందించగలమంటోంది యువ పర్యావరణవేత్త సాహితీ పింగళి. ఓ చేదు అనుభవంతో....

Published : 08 Mar 2023 14:16 IST

చుట్టూ ఏం జరిగినా ‘మనకెందుకులే!’ అనుకునే వారే ఎక్కువ. అందులోనూ కాలుష్యాన్ని తగ్గించడమంటే అది మన పని కాదన్నట్లుగా వ్యవహరిస్తుంటారు చాలామంది. కానీ చేయీ చేయీ కలిపితేనే ఈ పెను విపత్తును సమూలంగా అంతమొందించగలమంటోంది యువ పర్యావరణవేత్త సాహితీ పింగళి. ఓ చేదు అనుభవంతో చిన్న వయసులోనే నీటి కాలుష్యానికి సంబంధించిన పూర్వాపరాల్ని అర్థం చేసుకున్న ఆమె.. నదులు, సరస్సుల పరిరక్షణకు నడుం బిగించింది. దీనికి సాంకేతికతను జత చేసి.. నీటి నాణ్యతా ప్రమాణాల్ని పరిశీలించడానికి ఓ యాప్‌ను కూడా రూపొందించింది. ఇలా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆమె చేస్తోన్న కృషికి గుర్తింపుగా మన పాలపుంతలోని ఓ చిన్న గ్రహానికి ‘పింగళి సాహితి’గా నామకరణం కూడా చేశారు. డిజిటల్‌ పరిజ్ఞానంతో నీటి కాలుష్యానికి అడ్డుకట్ట వేస్తోన్న ఈ యువ ఇంజినీర్‌ గురించి.. ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా.. కొన్ని ఆసక్తికర విశేషాలు..

సాహితి తనకు ఎనిమిదేళ్ల వయసొచ్చే దాకా ఆంధ్రప్రదేశ్‌లోనే చదువుకుంది. ఆపై తన కుటుంబంతో కలిసి బెంగళూరులో స్థిరపడిన ఆమె.. అక్కడి ‘ఇన్వెంచర్‌ అకాడమీ’లో స్కూలింగ్‌ పూర్తిచేసింది. చిన్న వయసు నుంచే పర్యావరణంపై మక్కువ పెంచుకున్న సాహితి.. స్కూలింగ్‌ దశ నుంచే డిజిటల్‌ పరిజ్ఞానం పైనా దృష్టి సారించింది.

ఆ అనుభవం కదిలించింది!

మన జీవితంలో ఎదురయ్యే కొన్ని చేదు అనుభవాలు మనలో సరికొత్త ఆలోచనల్ని రేకెత్తిస్తాయి. కొత్త మార్గాన్ని ఎంచుకునేందుకు ఊతమిస్తాయి. సాహితి విషయంలోనూ ఇదే జరిగింది. బెంగళూరులో తాను నివసించే ఇంటికి సమీపంలో ఒక చెరువు ఉండేది. అందులోకి వ్యర్థాలు, రసాయనాలు పెద్ద ఎత్తున చేరడంతో అది దాదాపు కలుషితమైపోయింది. అయితే ఓ రోజు ఆ చెరువు ఉపరితలంపై అనుకోకుండా మంటలు చెలరేగాయి. దాంతో ఆ చుట్టు పక్కల ఉన్న ఇళ్ల సముదాయాలు ఇబ్బంది పడడం గమనించిన ఆమె.. నీటి కాలుష్యానికి అడ్డుకట్ట వేయాలని ఆ క్షణమే నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే కలుషితమవుతోన్న చెరువులు, సరస్సులు, నదుల గురించి తెలుసుకోవడానికి ఓ చిన్నపాటి అధ్యయనమే చేసింది సాహితి. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న 80 శాతం మంచి నీటి వనరులు ఇప్పటికే కలుషితమైనట్లు గుర్తించింది. ఇక ఈ నీటి కాలుష్యానికి అడ్డుకట్ట వేసే క్రమంలో తొలి అడుగుగా.. బెంగళూరులోని అత్యంత కలుషితమైన పది సరస్సులపై అధ్యయనం చేపట్టేందుకు నిధులు సమీకరించింది. మరోవైపు ఈ అధ్యయనంలో భాగంగా.. అక్కడి ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (IISc)’ ప్రొఫెసర్స్‌ని కలిసి అందులోని ప్రయోగశాలల్లో ప్రయోగాలు చేసేందుకు అనుమతి కోరింది. ఈ క్రమంలో కొంతమంది ‘ఇంత చిన్న వయసులో ఎందుకింత శ్రమపడుతున్నావు. అయినా నీ వయసు, అనుభవం ఈ అధ్యయనానికి సరిపోవు.. కాబట్టి ప్రయోగాలు మానుకో!’ అంటూ నిరుత్సాహపరిచినా వెనకడుగు వేయలేదు సాహితి.

‘యాప్‌’తో పరిష్కారం!

తన అధ్యయనంతో పాటు నీటి కాలుష్యంపై మరింత లోతుగా పరిశోధనలు చేసేందుకు దేశవిదేశాల్లో పలు ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌ కూడా చేసింది సాహితి. ఇలా ఈ గ్లోబల్‌ సమస్య పూర్వాపరాలు తెలుసుకున్న ఆమె.. నీటి కాలుష్యానికి అడ్డు కట్ట వేసే క్రమంలో ‘వాటర్‌ ఇన్‌సైట్స్‌’ అనే యాప్‌ను అభివృద్ధి చేసింది. దీంతో పాటు సెన్సార్‌ ఆధారిత కిట్‌ను కూడా రూపొందించింది. ఈ కిట్‌తో నీటి నాణ్యతా ప్రమాణాల్ని కొలిచి, దానికి సంబంధించిన సమాచారాన్ని యాప్‌ ద్వారా అందిస్తోంది. ఈ యాప్‌ను, కిట్‌ను.. ఇంట్లో, స్కూల్లో, ఇతర ప్రదేశాల్లో.. ఇలా ఎక్కడైనా ఉపయోగిస్తూ నీటి కాలుష్యాన్ని గుర్తించి.. ప్రతి ఒక్కరూ దాన్ని తగ్గించేందుకు కృషి చేయడమే తన లక్ష్యమంటోంది సాహితి.

ఇలా పర్యావరణ పరిరక్షణ గురించి అందరిలో అవగాహన కల్పిస్తూ.. సమాజంలో మార్పు దిశగా ప్రయత్నిస్తోన్న సాహితి స్ఫూర్తి గాథను ‘ఇన్వెంటింగ్‌ టుమారో’ అనే డాక్యుమెంటరీలో భాగంగా చిత్రీకరించారు. ఇప్పటికే ఇది ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రతిష్టాత్మక చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై.. పలు అవార్డులూ అందుకుంది. అంతేకాదు.. ‘టీన్‌ వోగ్‌ 21 అండర్‌ 21’ జాబితాలోనూ చోటు దక్కించుకుంది సాహితి. దీంతో పాటు పలు ప్రతిష్టాత్మక అవార్డులూ అందుకుంది. ఈ క్రమంలో ‘MIT Lincoln Laboratory’ పాలపుంతలోని ఓ చిన్న గ్రహానికి ‘పింగళి సాహితి’గా నామకరణం చేయడం విశేషం.

డ్యాన్సర్‌ కూడా!

క్యాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో డిగ్రీ, మాస్టర్స్‌ పూర్తిచేసిన సాహితి.. ప్రస్తుతం ‘సస్టైనబిలిటీ- కన్సల్టెంట్ ఇంజినీర్‌’గా కొనసాగుతోంది. ఇలా అమెరికాలో చదువుకునే క్రమంలోనూ అక్కడి నీటి కాలుష్యం పైనా అధ్యయనం చేసిందామె. ప్రస్తుతం తన యాప్‌తో భారత్‌, అమెరికా దేశాల్లో నీటి కాలుష్యాన్ని తగ్గించేందుకు కృషి చేస్తోన్న సాహితి మంచి డ్యాన్సర్‌ కూడా! ‘నాకు భరతనాట్యంలో ప్రవేశం ఉంది. వీణ కూడా బాగా వాయించగలను. పుస్తకాలు చదవడమన్నా, కథలు రాయడమన్నా నాకు మక్కువే! ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడానికి, కొత్త వ్యాపకాలు అలవాటు చేసుకోవడానికి ఆసక్తి చూపుతా. అయితే నిరంతరం రీసెర్చ్‌ అంటూ బిజీగా గడిపే మీకు వీటన్నింటికీ సమయమెలా దొరుకుతుందని అడుగుతుంటారు చాలామంది. కానీ నచ్చిన పనులు చేయడానికి సమయం వెచ్చించడం పెద్ద కష్టం కాదేమోనన్నది నా భావన!’ అంటూ తన బహుముఖ ప్రజ్ఞ గురించి బయటపెట్టిందీ బెంగళూరు టీన్.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్