Happiness Coach: సంతోషంగా ఉండడమెలాగో నేర్పిస్తోంది..!

‘మనం సంతోషంగా ఉంటే సరిపోదు.. మన చుట్టూ ఉన్న వారినీ సంతోషంగా ఉంచాలి..’ ఇదీ పాతికేళ్ల అన్షులా వర్మ దావర్‌ సిద్ధాంతం. పెరిగి పెద్దయ్యే క్రమంలో వివిధ కారణాల వల్ల మానసిక వేదనను, ఒంటరితనాన్ని...

Published : 05 Jul 2023 17:43 IST

(Photos: happyfityou.co)

‘మనం సంతోషంగా ఉంటే సరిపోదు.. మన చుట్టూ ఉన్న వారినీ సంతోషంగా ఉంచాలి..’ ఇదీ పాతికేళ్ల అన్షులా వర్మ దావర్‌ సిద్ధాంతం. పెరిగి పెద్దయ్యే క్రమంలో వివిధ కారణాల వల్ల మానసిక వేదనను, ఒంటరితనాన్ని అనుభవించిన ఆమె.. ఉన్నతోద్యోగం సంపాదించినా ఈ భావన నుంచి బయటపడలేదు. అప్పుడే ఫిట్‌నెస్‌ను తన జీవనశైలిలో భాగం చేసుకున్న అన్షుల.. తాను పొందిన ఈ సంతోషాన్ని నలుగురికీ చేరువ చేయాలనుకుంది. ఇదే ఆమెను వ్యాపారవేత్తగా నిలబెట్టింది. దేశంలోనే యువ హ్యాపీనెస్ కోచ్‌లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న ఆమె.. ఆత్మవిశ్వాసంతోనే ఏదైనా సాధించచ్చంటోంది.

అన్షుల తండ్రి వృత్తిరీత్యా ఆర్మీ ఆఫీసర్‌. ఆమె తల్లి వ్యాపారి. ఇలా తీరిక లేని తల్లిదండ్రుల షెడ్యూల్‌ కారణంగా.. ఆమె చాలావరకు తన గ్రాండ్‌పేరెంట్స్‌ సంరక్షణలోనే పెరగాల్సి వచ్చింది. తన తండ్రి బదిలీల రీత్యా పలుమార్లు స్కూళ్లు మారడం, అక్కడ కొత్త వాతావరణానికి అలవాటు పడడానికి సమయం పట్టడంతో మరింత ఒత్తిడికి గురయ్యానంటోంది అన్షుల.

ఉద్యోగంలోనూ అసంతృప్తి!

‘సెలవు రోజుల్లో నా స్నేహితులంతా తమ తల్లిదండ్రులతో కలిసి అలా బయటికి వెళ్లడం చూసి చాలా బాధపడేదాన్ని. అమ్మానాన్నలు వారి పనులు, బాధ్యతల్లో బిజీగా ఉండడం వల్ల వారితోనూ తగిన సమయం గడపలేకపోయా. ఈ క్రమంలో ఒంటరితనం వేధించేది. ఒత్తిడికి గురయ్యేదాన్ని. అయితే దీన్నుంచి విముక్తి పొందడానికే ఆటల్ని నా జీవనశైలిలో భాగం చేసుకున్నా. ఈత, స్క్వాష్‌, జిమ్నాస్టిక్స్‌, డ్యాన్స్‌.. వంటివి సాధన చేసేదాన్ని. మరోవైపు చదువు పైనా దృష్టి పెట్టా. ఆర్ట్స్‌లో డిగ్రీ పూర్తయ్యాక ఇంటర్న్‌షిప్స్‌ చేశా. ప్రముఖ సంస్థల్లో ఉద్యోగావకాశాలొచ్చాయి. అయినా అసంతృప్తే వెంటాడేది. ఆపై జుంబా ట్రైనర్‌గా సర్టిఫికేషన్‌ పూర్తి చేశా. కార్పొరేట్‌ సంస్థల్లో ఫిట్‌నెస్‌ వర్క్‌షాప్స్‌ నిర్వహించడం మొదలుపెట్టా. ఈ క్రమంలో ఏదో తెలియని సంతృప్తి నాకు దక్కేది..’ అని చెప్పుకొచ్చింది అన్షుల.

ఆమె మాటలే స్ఫూర్తిగా..!

తన జుంబా సెషన్స్‌, ఫిట్‌నెస్‌ వర్క్‌షాప్స్‌తో కార్పొరేట్‌ ఉద్యోగుల్ని పాజిటివిటీ దిశగా నడిపిస్తున్న క్రమంలోనే.. తన ఆలోచనల్ని వ్యాపారం దిశగా మళ్లించానంటోంది అన్షుల.
‘ఓరోజు వర్క్‌షాప్‌ పూర్తయ్యాక ఒక మహిళ నా వద్దకొచ్చి నాకు కృతజ్ఞతలు తెలిపింది. తన వ్యక్తిగత, వైవాహిక జీవితంలో ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటున్నట్లు.. అయితే నా సెషన్స్‌ ద్వారా ఆ ఒత్తిళ్లు, ఆందోళనలు క్రమంగా దూరమైనట్లు చెప్పుకొచ్చింది. అది విని నా మనసు సంతోషంతో నిండిపోయింది. నా వల్ల ఒకరి జీవితంలో సానుకూల మార్పులు చోటుచేసుకోవడం నాకూ ఉత్సాహంగానే అనిపించింది. ఇలా ఆలోచిస్తున్న క్రమంలోనే ఫిట్‌నెస్‌ సెషన్స్‌తో పాటు మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుందనిపించింది. ఇదే 2017లో ‘హ్యాపీ ఫిట్‌ యూ’ పేరుతో వెల్‌నెస్‌ సంస్థను ప్రారంభించడానికి దోహదం చేసింది..’ అంటూ తన వ్యాపార ప్రయాణం ప్రారంభమైన తొలినాళ్లను గుర్తుకు తెచ్చుకుందామె.

‘CCC’.. ముఖ్యోద్దేశమిదే!

అయితే ఇలా వ్యాపారం ప్రారంభించిన తొలినాళ్లలో అటు ఆర్థికంగా పలు ఇబ్బందుల్ని ఎదుర్కొన్న అన్షుల.. మరోవైపు తన చుట్టూ ఉన్న వాళ్ల నుంచి విమర్శల్ని, నిరుత్సాహకరమైన మాటల్నీ ఎదుర్కొంది. అయినా స్వీయ నమ్మకంతో ముందుకు సాగానంటోంది.

‘వ్యాపారం ప్రారంభించిన తొలినాళ్లలో.. ఇందులో స్థిరత్వం ఉండదని చాలామంది నన్ను నిరుత్సాహపరచాలని చూశారు. కానీ నేను నా ఆలోచనలు, ఆశయాల పైనే నమ్మకముంచాను. నా సంస్థ వేదికగా.. కార్పొరేట్‌ ఉద్యోగులు (C), కాలేజీ విద్యార్థులు (C), కమ్యూనిటీల్లో (C).. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, భావోద్వేగ పరంగా ఆరోగ్యాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నా. అయితే వీరిలోనూ కార్పొరేట్‌ ఉద్యోగులు, వృత్తిఉద్యోగాల్లో కొనసాగేవారే.. వివిధ కారణాల రీత్యా మానసిక ప్రశాంతతను కోల్పోతున్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు.. ప్రపంచవ్యాప్తంగా సంభవించే మరణాల్లో.. ఒత్తిడి ఐదో ప్రధాన కారణమనీ తేలింది. అందుకే వీరిలో ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం నింపడానికి, ఉత్పాదకతను పెంచడానికి, వర్క్‌లైఫ్‌ బ్యాలన్స్‌, ఏకాగ్రతతో పనిచేయడం, లీడర్‌షిప్‌, టీమ్‌ వర్క్‌.. తదితర అంశాలపై ప్రత్యేక సెషన్స్‌ నిర్వహిస్తున్నాం. ఇక కాలేజీ పిల్లల విషయానికొస్తే.. పరీక్షల భయాన్ని తొలగించడం, ఒంటరితనం-కుటుంబ సమస్యల్ని అధిగమించడంతో పాటు భవిష్యత్‌ లక్ష్యాలపై అవగాహనా కల్పిస్తున్నాం. మరోవైపు కమ్యూనిటీల్లో వర్క్‌షాప్స్‌ నిర్వహిస్తూ.. సామాజిక సత్సంబంధాల్ని, వ్యక్తుల మధ్య సానుకూల వాతావరణాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తున్నాం..’ అంటూ తన సంస్థ కార్యకలాపాల గురించి చెప్పుకొచ్చిందీ హ్యాపీనెస్‌ కోచ్.

మెంటర్‌గా, వక్తగా..!

ఈ ఆరేళ్లలో టాప్‌ విద్యాసంస్థలు, ప్రముఖ కంపెనీలతో కలిసి పనిచేసిన అన్షుల.. తన సంస్థ ద్వారా దాదాపు 16 వేల మందికి పైగా చేరువైంది. ప్రస్తుతం ‘స్కిల్‌ అప్‌ ప్రాజెక్ట్‌’ అనే మరో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ.. భారత్‌, ఆఫ్రికా దేశాల్లోని మారుమూల ప్రాంతాల్లో యువతకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పించడమే ముఖ్యోద్దేశంగా ముందుకు సాగుతోందామె. అంతేకాదు.. 2030 నాటికి పది లక్షల మంది జీవితాల్లో ప్రశాంతతను నింపి.. వారిని పాజిటివిటీ వైపు నడిపించడమే లక్ష్యంగా పెట్టుకున్న అన్షుల.. ఇందుకోసం ‘మేక్‌ హ్యాపీనెస్‌ గో వైరల్‌’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. మరోవైపు.. నీతీ ఆయోగ్‌తో కలిసి పనిచేస్తోన్న అన్షుల.. ఈ క్రమంలో ‘GOAL (Going Online As Leaders)’ అనే మెంటర్‌షిప్‌ ప్రోగ్రామ్‌కి మెంటర్‌గా వ్యవహరిస్తోంది. దేశంలోని గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు చెందిన యువతను నాయకత్వం దిశగా ప్రోత్సహించడమే దీని లక్ష్యం.

‘మనకంటూ కొన్ని లక్ష్యాలుండాలి. వాటిని చేరుకునే క్రమంలో వచ్చే అవరోధాల్ని, సవాళ్లను అధిగమించే ఓర్పును కూడగట్టుకోవాలి. మనలోని బలాలు, బలహీనతల్ని బేరీజు వేసుకోవాలి. అలాగే ఎదుటివారిని విమర్శించడం, వారిని జడ్జ్‌ చేయడం కాకుండా.. వీలైతే వారికి సహాయపడాలి.. మనలోని ఒత్తిళ్లను అధిగమించి.. ప్రశాంతతను, సంతోషాన్ని సొంతం చేసుకోవడానికి ఇవీ మార్గాలే!’ అంటోన్న అన్షుల.. ఇటు దేశవ్యాప్తంగా, అటు ఇతర దేశాల్లోనూ మానసిక ఆరోగ్యానికి సంబంధించిన అంశాలపై ప్రసంగిస్తుంటుంది కూడా!

దేశంలోనే యువ హ్యాపీనెస్ కోచ్‌లలో ఒకరిగా గుర్తింపు పొందిన అన్షుల.. ఇంటర్నేషనల్‌ కోచింగ్‌ కమ్యూనిటీ (ICC) నుంచి ‘లైఫ్‌ కోచింగ్‌’, హ్యాపీనెస్‌ స్టడీస్‌ అకాడమీ (HSA) నుంచి ‘హ్యాపీనెస్‌ కోచింగ్‌’.. వంటి కోర్సుల్నీ పూర్తి చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్