అందుకే ఆ ప్రమాదం తర్వాత మళ్లీ పుట్టా..!

ప్రతి పుట్టుకకూ ఓ పరమార్థం ఉన్నట్లే.. ప్రాణాపాయ పరిస్థితుల్లో మళ్లీ బతికి బట్ట కట్టడం వెనుకా ఓ బలమైన కారణం ఉంటుందంటోంది హరియాణాలోని ఫరీదాబాద్‌కు చెందిన కిరణ్‌ కనోజియా. ప్రమాదవశాత్తూ ఎడమ మోకాలి కింది భాగాన్ని కోల్పోయిన ఆమె.. ఒక దశలో తీవ్ర మానసిక వేదనకు లోనైంది. దీనికి తోడు సమాజం నుంచీ నిరుత్సాహపూరిత.....

Updated : 19 Dec 2022 20:23 IST

(Photos: Instagram)

ప్రతి పుట్టుకకూ ఓ పరమార్థం ఉన్నట్లే.. ప్రాణాపాయ పరిస్థితుల్లో మళ్లీ బతికి బట్ట కట్టడం వెనుకా ఓ బలమైన కారణం ఉంటుందంటోంది హరియాణాలోని ఫరీదాబాద్‌కు చెందిన కిరణ్‌ కనోజియా. ప్రమాదవశాత్తూ ఎడమ మోకాలి కింది భాగాన్ని కోల్పోయిన ఆమె.. ఒక దశలో తీవ్ర మానసిక వేదనకు లోనైంది. దీనికి తోడు సమాజం నుంచీ నిరుత్సాహపూరిత మాటల్ని భరించింది. అయినా ఇవేవీ తన కలకు అడ్డుపడకూడదని బలంగా నిర్ణయించుకుంది. ఇక ఈ అమ్మాయి ఎట్టిపరిస్థితుల్లోనూ నడవలేదనుకున్న తన కాలికి బ్లేడ్‌తో కూడిన పెట్టుడు కాలిని అమర్చుకొని పరుగు పెట్టడం ప్రారంభించింది. ఆ పరుగు కిలోమీటర్లు, మైళ్లు దాటుకొని.. ఇప్పుడు దేశంలోనే తొలి మహిళా బ్లేడ్‌ రన్నర్‌గా ఆమెకు గుర్తింపు సంపాదించి పెట్టింది. విధికి ఎదురీది తన తలరాతను తానే రాసుకున్న కిరణ్‌.. ఇప్పుడు తనలాంటి ఎంతోమందికి స్ఫూర్తిప్రదాత!

కష్టాలే మనలో సంకల్ప బలాన్ని పెంచుతాయంటారు. నా చిన్నతనమూ ఇందుకు మినహాయింపు కాదు. మేం ముగ్గురం తోబుట్టువులం. అమ్మానాన్నలు చదువుకోకపోయినా మమ్మల్ని ఉన్నత చదువులు చదివించాలని ఆరాటపడ్డారు. అందుకు తగ్గట్లుగానే కష్టపడి చదివి ఇంటర్మీడియట్‌ పూర్తిచేశాను. ఆ తర్వాత స్కాలర్‌షిప్‌ సహాయంతో బీటెక్‌ పూర్తిచేసి.. క్యాంపస్‌ సెలక్షన్స్‌లో హైదరాబాద్‌ ఇన్ఫోసిస్‌లో ఉద్యోగానికి ఎంపికయ్యా. ఆరు నెలలు తిరిగే సరికి ఆఫర్‌ లెటర్‌ అందుకున్నా.

ఆరు నెలలు ఆస్పత్రి బెడ్ పైనే..!

మంచి ఉద్యోగం, తల్లిదండ్రుల కలను నెరవేర్చానన్న ఆనందం.. నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఈ సంతోషాన్ని డిసెంబర్‌ 25న నా పుట్టినరోజున అమ్మానాన్నలతో పంచుకోవాలని ముందు రోజు ఫరీదాబాద్‌ బయల్దేరా. రైలు దిగడానికి తలుపు దగ్గర నిల్చున్నా. అదే సమయంలో ఇద్దరు దుండగులు నా చేతిలో ఉన్న బ్యాగ్‌ లాక్కొని పారిపోయారు. దాంతో ప్రమాదవశాత్తూ కదిలే రైల్లోంచి కింద పడిపోయా. రైలు బోగీలు నా ఎడమ కాలి పైనుంచి వెళ్లిపోయాయి. మరుసటి రోజు కళ్లు తెరిచి చూసే సరికి ఆస్పత్రి బెడ్‌పై ఉన్నా. అప్పటికే వైద్యులు నా కాలికి సర్జరీ చేసి మోకాలి వరకు తొలగించారు. ఇకపై నేను నడవలేనని డాక్టర్లు చెప్పే మాటలు విని మానసికంగా కుంగిపోయా. ‘ఒంటి కాలితో ఎలా ఉద్యోగానికి వెళ్లాలి?’, ‘నా కుటుంబానికి ఎలా అండగా నిలవాలి?’ ఇలా ఎన్నో ప్రశ్నలు నన్ను వేధించేవి. ఈ ప్రతికూలతల మధ్యే కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ కావడానికి ఆరు నెలలు పట్టింది. దీనికి తోడు ఈ సమాజం నన్ను చేతకాని దానిలా చూసింది. ‘ఒక కాలు పోగొట్టుకుంది.. అలాంటిది ఈ అమ్మాయి తన కాళ్లపై తాను ఎలా నిలబడగలదు?!’ అన్నట్లుగా మాట్లాడుకునేవారు. ఈ సమయంలోనే నాన్న నాకు అండగా నిలిచారు. నాట్యమయూరి సుధా చంద్రన్‌ జీవిత కథను నాకు వివరించి నాలో స్ఫూర్తి నింపారు.

ఆత్మవిశ్వాసమే అడుగులేయించింది!

ఇలా నాన్న అండతో ప్రోస్థటిక్‌ కాలిని అమర్చుకున్న నేను.. నిదానంగా ఒక్కో అడుగు వేయడం ప్రారంభించా. ఇక నన్ను కుంగదీసే మానసిక ఆలోచనల్ని కట్టిపెట్టడానికి నా స్నేహితురాలి సలహా మేరకు హైదరాబాద్‌లోని ‘దక్షిణ్‌ రీహ్యాబిలిటేషన్‌ సెంటర్‌’లో చేరాను. అక్కడే నా జీవితానికి అర్థం, పరమార్థం దొరికినట్లయింది. ఇకపై మునుపటిలా నడవలేనేమో అనుకున్న నేను.. ఎలాగైనా పరిగెత్తాలని నిర్ణయించుకున్నా. ఇందుకు ఓ ప్రోస్థటిక్‌ డాక్టర్‌ సహకారం తోడైంది. నాలోని ఆత్మస్థైర్యాన్ని గుర్తించిన ఆయన.. ప్రోస్థటిక్‌ కాలికి బదులు బ్లేడ్‌ ప్రోస్థటిక్‌ కాలిని నాకోసం ప్రత్యేకంగా తయారు చేయించారు. ఇలా పెట్టుడు కాలితో నడక ప్రారంభించిన నేను క్రమంగా పరిగెత్తడం నేర్చుకున్నా. ఈ ఆత్మవిశ్వాసంతోనే మారథాన్‌లలో పాల్గొనడం మొదలుపెట్టా. 2014లో ‘హైదరాబాద్‌ ఎయిర్‌టెల్‌ మారథాన్’లో పాల్గొని తొలి మెడల్‌ అందుకున్నా. దాంతో నాలో ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. ఒకప్పుడు కనీసం అడుగే వేయలేనని నన్ను కించపరిచిన ఈ సమాజం.. ఇప్పుడు నన్ను ప్రశంసిస్తుంటే గర్వంగా అనిపిస్తోంది. ‘దేశంలోనే తొలి మహిళా బ్లేడ్‌ రన్నర్‌’గా గుర్తింపు పొందిన నాకు.. దిల్లీ, ముంబయిల్లో జరిగే మారథాన్లను ప్రారంభించేందుకు ఆహ్వానాలూ అందుతున్నాయి.

ఆ సంతృప్తి చాలు!

ఇప్పుడు నేను పరిగెత్తడమే కాదు.. సైక్లింగ్‌, స్విమ్మింగ్‌.. వంటివీ అలవోకగా చేసేయగలను. మరోవైపు వృత్తికీ సమప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతున్నా. నీతి ఆయోగ్‌, యూఎన్‌ ఇండియా నుంచి 2017లో ‘ఉమన్‌ ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఇండియా అవార్డు’నూ అందుకున్నా. నా జీవిత లక్ష్యం ఒక్కటే.. నాలా శారీరక వైకల్యాలున్న వారిలో స్ఫూర్తి నింపడం! ఈ క్రమంలో స్కూళ్లు, కళాశాలలకు వెళ్లి స్ఫూర్తిదాయక ప్రసంగాలివ్వడంతో పాటు ఇలాంటి వారికి కౌన్సెలింగ్‌ కూడా ఇస్తున్నా. అంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడి పునర్జన్మ ఎత్తానంటే.. నేను చేయాల్సింది ఇంకా ఎంతో ఉందనిపించేది. ఈ క్రమంలో ఇలా నలుగురిలో స్ఫూర్తి నింపుతూ ముందుకు సాగడం సంతృప్తికరంగా అనిపిస్తోంది. మరోవైపు.. పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లల తల్లిగా అమ్మతనాన్నీ ఆస్వాదిస్తున్నా.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్