193/193.. ఒక్క దేశాన్నీ వదల్లేదు!

సినిమా బ్యాక్‌డ్రాప్‌లో కనిపించే అందమైన లొకేషన్లు, ప్రకృతి అందాలు, చారిత్రక కట్టడాలు మనల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తుంటాయి. జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి ప్రదేశాల్ని సందర్శిస్తే జన్మ ధన్యమైనట్లే అనుకుంటాం. కానీ అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అయితే 79 ఏళ్ల లుయ్‌సా యు మాత్రం ఏది ఏమైనా ఈ విషయంలో రాజీ పడాలనుకోలేదు.

Published : 16 Feb 2024 13:12 IST

(Photos: Instagram)

సినిమా బ్యాక్‌డ్రాప్‌లో కనిపించే అందమైన లొకేషన్లు, ప్రకృతి అందాలు, చారిత్రక కట్టడాలు మనల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తుంటాయి. జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి ప్రదేశాల్ని సందర్శిస్తే జన్మ ధన్యమైనట్లే అనుకుంటాం. కానీ అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అయితే 79 ఏళ్ల లుయ్‌సా యు మాత్రం ఏది ఏమైనా ఈ విషయంలో రాజీ పడాలనుకోలేదు. ప్రపంచాన్ని చుట్టేయాలని టీనేజ్‌లోనే కలలు కన్న ఆమె.. 50 ఏళ్ల పాటు అన్ని దేశాల్లో పర్యటించి తన కలను నెరవేర్చుకుంది. ఇటీవలే సెర్బియాను చుట్టేసి.. తద్వారా 193 దేశాల పర్యటనను ముగించిన ఈ ట్రావెల్‌ లవర్‌కు తన స్నేహితులు విమానాశ్రయంలోనే ఘనస్వాగతం పలికారు. దీంతో ఈ బామ్మ సాహసయాత్ర గురించి ప్రపంచమంతా పాకింది. ఈ నేపథ్యంలో ఈ బామ్మ ప్రపంచయాత్ర విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

సినిమాలే స్ఫూర్తి!

లుయ్‌సా యుది ఫిలిప్పీన్స్‌. ఆమెకు సినిమాల పిచ్చి ఎక్కువ. కొత్త చిత్రం విడుదలైందంటే చాలు.. తన ఫ్రెండ్స్‌తో కలిసి ఏకంగా బెనిఫిట్‌ షోకి వెళ్లిపోయేది. అయితే అలా సినిమాల్ని ఆస్వాదించే క్రమంలోనే ప్రపంచాన్ని చుట్టేయాలన్న ఆలోచన వచ్చిందంటోందామె.

‘నాకు సినిమాలంటే విపరీతమైన ఆసక్తి. స్నేహితులతో కలిసి చూడడానికి మరింత ఇష్టపడేదాన్ని. అయితే ఇలా సినిమాల్ని ఆస్వాదించే క్రమంలో.. అనుకోకుండా ఆ బ్యాక్‌డ్రాప్‌లో కనిపించే అందమైన ప్రదేశాలపైకి నా దృష్టి మళ్లేది. అక్కడి అందమైన లొకేషన్లు, ప్రకృతి అందాలు, నదులు, పర్వతాలు.. ఇవన్నీ నన్ను కట్టిపడేసేవి.. మరో లోకంలోకి తీసుకెళ్లేవి. ఎప్పటికైనా ఆ ప్రదేశాల్లో పర్యటించాలనిపించేది. ఇలా ప్రపంచ పర్యటన చేయాలన్న తృష్ణ టీనేజ్‌లోనే మొదలైనా.. 30 ఏళ్లొచ్చాకే నా కలను నెరవేర్చుకోవడంపై దృష్టి పెట్టా..’ అంటోందీ బామ్మ.

ట్రావెల్‌ ఏజెంట్‌గా!

ఫిలిప్పీన్స్‌లో ఉన్నత విద్యనభ్యసించిన యు.. తన 23 ఏళ్ల వయసులో పైచదువుల కోసం అమెరికా చేరుకుంది. ఇక్కడికొచ్చాకే ప్రపంచయాత్రకు బీజం పడిందంటున్నారీ బామ్మగారు.
‘విద్యార్థిగానే అమెరికాలో అడుగుపెట్టా. కానీ పర్యటనలపై నాకున్న ఇష్టం.. నన్ను అమెరికా మొత్తం చుట్టేలా చేసింది. అప్పుడు నాకంటూ సొంత సంపాదన లేకపోవడంతో దేశం దాటలేకపోయా. ఈ క్రమంలోనే ఇక్కడి ఇంటర్‌సిటీ బస్సుల్లో ప్రయాణిస్తూ యూఎస్‌ఏలోని 50 రాష్ట్రాల్ని సందర్శించా..’ అంటోన్న యు చదువు పూర్తయ్యాక మెడికల్‌ టెక్నాలజీ రంగంలో కెరీర్‌ ప్రారంభించారు. కానీ ప్రయాణాలపై మక్కువతో ట్రావెల్‌ ఏజెంట్‌గా స్థిరపడ్డారు. అయితే ఈ రంగంలోకి వచ్చాకే ప్రపంచయాత్రపై పూర్తి దృష్టి పెట్టే అవకాశం దొరికిందంటున్నారామె.

జపాన్‌ టు సెర్బియా!

అలా 30 ఏళ్ల వయసులో ప్రపంచయాత్రకు సంకల్పించుకున్న ఆమె.. ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలైన 193 దేశాల్లో పర్యటించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే గత ఐదు దశాబ్దాలుగా నిర్విరామంగా విశ్వయాత్ర చేసిన యు.. యూరోపియన్‌, ఆసియా, ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాల నలుమూలల్నీ చుట్టేశారు. అంతేకాదు.. మహిళలకు సురక్షితం కాని ప్రాంతాల్లోనూ కాలుమోపారామె.

‘నా 50 ఏళ్ల ప్రపంచయాత్రలో ప్రపంచపటంలోని దేశాలన్నింటినీ సందర్శించా. జపాన్‌తో మొదలుపెట్టి ఇటలీ, థాయ్‌ల్యాండ్‌, లిబియా, ఇరాన్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌.. వంటి ఐరాస సభ్యదేశాలన్నింటిలోనూ పర్యటించా. వీటిలో మహిళలకు అసురక్షితమైన ప్రాంతాలూ కొన్నున్నాయి. వాటినీ వదల్లేదు. ఎందుకంటే అక్కడి చారిత్రక ప్రదేశాలు, చరిత్రాత్మక కట్టడాలు నన్ను ఆకర్షించాయి. వాటిని నా కళ్లతోనే నేరుగా చూడాలనుకున్నా. అందుకే నా ఫ్రెండ్స్‌, కుటుంబ సభ్యులు వారించినా ఆ దేశాల్నీ సందర్శించా. గతేడాది నవంబర్‌లో 193 దేశాల్లో ఆఖరి దేశమైన సెర్బియాలో పర్యటించా. 30 ఏళ్లలో మొదలైన నా ప్రపంచయాత్ర.. 79 ఏళ్లకు పూర్తైంది. నా కల నెరవేరింది.. ఇటలీ, థాయ్‌ల్యాండ్‌, ఫిలిప్పీన్స్‌.. వంటి దేశాల్లో పర్యటించిన అనుభవాల్ని, దుబాయ్‌లో స్కైడైవింగ్‌ చేసిన అనుభూతిని ఎప్పటికీ మర్చిపోలేను..’ అంటూ ఉబ్బితబ్బిబ్బవుతున్నారీ బామ్మ.

ధైర్యంగా ముందుకెళ్లండి!

ఓవైపు వయసు పైబడుతున్నా, చిన్న చిన్న వృద్ధాప్య సమస్యలు తనను వెనక్కి లాగాలని చూసినా.. అన్నింటినీ అధిగమించి తన కల నెరవేర్చుకున్నారు ఈ బామ్మ. అంతేకాదు.. ఈ దేశాలన్నీ ఒంటరిగానే చుట్టేస్తూ సోలో ట్రావెలర్‌గానూ, సాహసిగానూ పేరు తెచ్చుకున్నారామె. ఇలా మొత్తానికి ఇటీవలే సెర్బియాతో తన ప్రపంచయాత్ర ముగించుకొని తిరిగి అమెరికాలో అడుగుపెట్టిన ఈ గ్రానీకి.. విమానాశ్రయంలో ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యులు ఘనస్వాగతం పలికారు. ఆపై గ్రాండ్‌గా పార్టీ ఏర్పాటుచేసి ఆమెను ఆనందోత్సాహాల్లో ముంచెత్తారు. ఇలా తన సుదీర్ఘ ప్రపంచయాత్రతో మూటగట్టుకున్న అనుభవాలు, అనుభూతుల్ని ఫొటోలు, వీడియోల రూపంలో సోషల్‌ మీడియాలో పంచుకుంటూ మురిసిపోయారీ ట్రావెల్‌ లవర్‌.

‘ఏ విషయంలోనూ భయపడకండి.. ధైర్యంగా ముందుకెళ్లండి.. ఎవరికోసం ఎదురుచూడద్దు.. ఎందుకంటే ఈ ఎదురుచూపులే ఒక్కోసారి మన కలలకు అడ్డుపడుతుంటాయి..’ అంటూ తన మాటలతోనూ మహిళల్లో స్ఫూర్తి నింపుతున్నారు యు. ఇలా తన ప్రపంచ పర్యటనలకు గుర్తింపుగా.. ‘నొమాడ్‌ మేనియా అవార్డు’, ‘గ్లోబల్‌ ఎక్స్‌ప్లోరర్‌ అవార్డు’, ‘మోస్ట్‌ అడ్వెంచర్‌ ఎక్స్‌ప్లోరర్‌ అవార్డు’.. వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలూ అందుకున్నారామె.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్