Anand Mahindra: ప్రీతి గురించి తెలుసుకొని ఉప్పొంగిపోయా..!

ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే ముందు భయాన్ని జయించాలన్నారు పెద్దలు. ప్రీతి కొంగర కూడా ఇదే సూత్రాన్ని నమ్మింది. నీళ్లంటే భయపడే ఆమె.. ఆ భయాన్ని జయించే క్రమంలోనే సెయిలింగ్‌ను తన కెరీర్‌గా ఎంచుకుంది. ఆటలో ఆరితేరడమే కాదు.. ఈ క్రీడలో తనదైన ప్రతిభ ప్రదర్శిస్తూ దేశానికి.....

Updated : 31 Jan 2023 12:34 IST

(Photos: Twitter)

ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే ముందు భయాన్ని జయించాలన్నారు పెద్దలు. ప్రీతి కొంగర కూడా ఇదే సూత్రాన్ని నమ్మింది. నీళ్లంటే భయపడే ఆమె.. ఆ భయాన్ని జయించే క్రమంలోనే సెయిలింగ్‌ను తన కెరీర్‌గా ఎంచుకుంది. ఆటలో ఆరితేరడమే కాదు.. ఈ క్రీడలో తనదైన ప్రతిభ ప్రదర్శిస్తూ దేశానికి గర్వకారణంగా నిలుస్తోంది.. మరోవైపు తన పేదరికం పైనా విజయం సాధిస్తూ ముందుకు సాగుతోంది. ఇలా తన పట్టుదల, అంకితభావంతో ఎంతోమంది యువతలో స్ఫూర్తి నింపుతోన్న ప్రీతి కథ.. తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రానూ కదిలించింది. ఈ నేపథ్యంలోనే ప్రీతి కథను ట్విట్టర్లో పంచుకున్న ఆయన.. ఆమెను కలవడానికి, ఆమె వద్ద సెయిలింగ్‌ నైపుణ్యాలు నేర్చుకోవడానికి ఉత్సుకతతో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఇలా ఆయన పెట్టిన ట్వీట్‌ వైరల్‌గా మారిన నేపథ్యంలో.. ప్రీతి స్ఫూర్తి కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

17 ఏళ్ల ప్రీతి కొంగరది హైదరాబాద్‌. చిన్న వయసులోనే ఆమె తండ్రి చనిపోవడంతో కుటుంబ భారమంతా ఆమె తల్లి విజయలక్ష్మి పైనే పడింది. ఓ టైలర్‌ షాపులో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవారామె. ఇలా వచ్చిన డబ్బు వాళ్ల పొట్ట పోసుకోవడానికి కూడా సరిపోయేది కాదు. ఇలాంటి పేదరికం నుంచి వచ్చిన ప్రీతి వెస్ట్‌ మారేడ్‌పల్లిలోని నల్లగుట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకుంది.

ఆయన మాటలతో..!

మన జీవితంలోని కొన్ని పనులు.. మనం ఎలాంటి ప్రణాళిక వేసుకోకపోయినా, అకస్మాత్తుగా జరిగిపోతాయి. తన జీవితంలో సెయిలింగ్‌ క్రీడలోకి ప్రవేశించడం కూడా అలానే జరిగిందంటోంది ప్రీతి. నిజానికి నీళ్లంటే ప్రీతికి చచ్చేంత భయం. ఈ భయంతోనే స్కూల్లో నీటికి సంబంధించిన ఆటలకూ దూరంగా ఉండేదామె. అయితే ఒకానొక సందర్భంలో కోచ్‌ చెప్పిన మాటల్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ క్రీడలోకి ప్రవేశించానంటోందీ యంగ్‌ సెయిలర్.

‘నా జీవితంలో సెయిలింగ్‌లోకి రావడం అనేది అకస్మాత్తుగా జరిగిపోయింది. నాకు చిన్నతనం నుంచి ఆటలంటే ఇష్టమున్నా ఈ క్రీడ గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు.. దీని గురించి కనీస అవగాహన కూడా నాకు లేదు. పైగా ఈ క్రీడను కెరీర్‌గా ఎంచుకుంటానని కలలో కూడా అనుకోలేదు. ఎందుకంటే నాకు నీళ్లంటే చచ్చేంత భయం. అందుకే నీళ్లతో కూడిన ఆటలకు నేను ముందు నుంచే దూరంగా ఉండేదాన్ని. కానీ హైదరాబాద్‌ యాచ్‌ క్లబ్‌ ప్రెసిడెంట్‌, నా కోచ్‌ సుహేమ్‌ సర్‌ ఓసారి నాకో మాట చెప్పారు. ‘మనం ఏ విషయంలోనైతే ఎక్కువగా భయపడతామో.. ముందు ఆ భయాన్ని జయించాల’ని! ఇలా ఆయన చెప్పిన మాటలు నాలో స్ఫూర్తి నింపాయి. ఎలాగైనా ఈ భయాన్ని జయించాలనుకున్నా. ఈ పట్టుదలే సెయిలింగ్‌లోకి రావడానికి కారణమైంది..’ అంటూ చెప్పుకొచ్చింది ప్రీతి.

ఆ ఘనత ఆమెదే!

పేద బాలికల కలలకు రెక్కలు తొడుగుతోన్న ‘నాంది ఫౌండేషన్’ సహకారంతో హైదరాబాద్‌ యాచ్‌ క్లబ్‌లో సెయిలింగ్ శిక్షణలో చేరిన ప్రీతి.. మూడున్నరేళ్ల పాటు ఈ ఆటలో మెలకువలు నేర్చుకుంది. శిక్షణ అనంతరం ‘11వ జాతీయ ర్యాంకింగ్‌ మాన్‌సూన్‌ రెగెట్టా ఛాంపియన్‌షిప్’లో పాల్గొని విజయం సాధించింది. తద్వారా హైదరాబాద్‌ యాచ్‌ క్లబ్‌లో శిక్షణ పొంది ఈ పోటీల్లో విజయం సాధించిన తొలి మహిళా సెయిలర్‌గా కీర్తి గడించిందామె. ఇటు రాష్ట్ర, అటు జాతీయ స్థాయుల్లో నిర్వహించిన పలు పోటీల్లో సత్తా చాటుతోన్న ప్రీతి.. ప్రస్తుతం ‘ఒలింపిక్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ 470 క్లాస్‌ ఈవెంట్‌’లో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకులో కొనసాగుతోంది. గతేడాది నిర్వహించిన ‘తొలి ఏషియన్‌ గేమ్స్‌ సెలక్షన్‌ ట్రయల్స్‌’లో 470 మిక్స్‌డ్‌ క్లాస్‌ ఈవెంట్లో బంగారు పతకం సాధించి మరోసారి తన సెయిలింగ్‌ నైపుణ్యాల్ని చాటిచెప్పిందీ హైదరాబాదీ.

గెలుపే లక్ష్యంగా..!

ఒకప్పుడు నీళ్లను చూసి భయపడిన తాను.. సెయిలింగ్‌ను ఎంచుకొని గెలుపే లక్ష్యంగా నీళ్లలోకి దిగుతున్నానంటోంది. ‘సెయిలింగ్‌ నా జీవితం. ప్రతి రోజూ నీళ్లలోకి దిగే ముందు నా ప్రదర్శనను మరింత మెరుగుపరచుకోవాలని నాకు నేను ప్రతిజ్ఞ చేసుకుంటా. ఇక నీళ్లలోకి దిగాక గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతాను. ప్రతి విజయం నాలో సరికొత్త ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది. ఈ క్రీడ నన్ను కెరీర్పరంగానే కాదు.. వ్యక్తిగతంగానూ పరిణతి చెందేలా చేసింది. ఆర్థిక కష్టాల్ని నాకు దూరం చేసింది. మా అమ్మ, కోచ్‌ల ప్రోత్సాహంతోనే నేను ఇక్కడిదాకా రాగలిగాను..’ అంటోన్న ప్రీతి ప్రతి సెయిలింగ్‌ పోటీ నుంచి ఏదో ఒక కొత్త పాఠం నేర్చుకుంటున్నానంటోంది.


మహీంద్రాకూ స్ఫూర్తిప్రదాత!

ఇలా పేదరికాన్ని జయించి తన సెయిలింగ్‌ నైపుణ్యాలతో ఎంతోమంది యువతకు స్ఫూర్తి ప్రదాతగా మారిన ప్రీతి.. తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రాలోనూ ప్రేరణను నింపింది. అదెలాగంటే.. ‘పేదరికంలో పుట్టి, ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ, నీళ్లంటే భయపడే ఒక అమ్మాయి.. మన జాతీయ సెయిలింగ్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉందంటారా? ప్రీతి కొంగర ఈ సందేహాల్ని పటాపంచలు చేసింది. ప్రస్తుతం ఒలింపిక్‌ మిక్స్‌డ్‌ డబుల్ 470 క్లాస్‌ ఆఫ్‌ బోట్‌కు జాతీయ స్థాయిలో నం.1 ర్యాంకర్‌గా కొనసాగుతోన్న ఆమె.. ఆటతో ఎంతటి పేదరికాన్నైనా జయించచ్చని రుజువు చేసింది..’ అంటూ ఆమె కథను నాంది ఫౌండేషన్‌ సీఈఓ మనోజ్‌ కుమార్ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ కాస్తా ఆనంద్‌ మహీంద్రా కంట పడింది.
దీనికి ఆయన రీట్వీట్‌ చేస్తూ.. ‘ఇది నిజంగా స్ఫూర్తి గాథే! ప్రీతి గురించి తెలుసుకొని ఉప్పొంగిపోయా. తనకు కాస్త విరామం దొరికితే నేను తనను కలవాలనుకుంటున్నా.. ఆమె దగ్గర సెయిలింగ్‌ నైపుణ్యాలు నేర్చుకోవాలనుకుంటున్నా..’ అంటూ స్పందించారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. చాలామంది నెటిజన్లు ప్రీతి కథ తెలుసుకొని స్ఫూర్తి పొందుతున్నారు. ‘సెల్యూట్‌.. మీరు దేశానికే గర్వకారణం!’ అంటూ ప్రీతిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్