ఎత్తైన గ్రామంలో.. స్వర్గానికి దగ్గరగా.. నాన్నకు చేరువలో..!

కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన బాధ నుంచి బయటపడడం కష్టం. అందుకే వాళ్ల జ్ఞాపకాలు స్ఫురించేలా ఏదో ఒక మంచి పనికి శ్రీకారం చుడుతుంటారు కొందరు. వారిలో పోర్షియా పుతతుండా ఒకరు.

Updated : 03 Feb 2024 13:26 IST

(Photos: Facebook)

కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన బాధ నుంచి బయటపడడం కష్టం. అందుకే వాళ్ల జ్ఞాపకాలు స్ఫురించేలా ఏదో ఒక మంచి పనికి శ్రీకారం చుడుతుంటారు కొందరు. వారిలో పోర్షియా పుతతుండా ఒకరు. ఒకానొక సమయంలో నాన్న మరణంతో కుంగిపోయిన ఆమె.. ఈ బాధ నుంచి బయటపడేందుకు తన తండ్రికిష్టమైన సమాజ సేవను తన జీవిత గమ్యంగా మార్చుకోవాలనుకుంది. ఈ క్రమంలోనే ఓ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి.. పేద చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఓ స్కూల్‌ కూడా తెరిచింది. ప్రస్తుతం వారికి విద్యతో పాటు దుస్తులు, మూడు పూటలా భోజనం అందిస్తూ.. సకల సదుపాయాలూ సమకూర్చుతోంది. ప్రపంచంలోనే అతి ఎత్తైన గ్రామంగా పేరుగాంచిన కోమిక్‌లో తన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తోన్న పోర్షియా స్ఫూర్తి గాథ ఇది!

పోర్షియాది జార్ఖండ్‌లోని రాంచీ. మీడియా రంగంపై ఆసక్తితో జర్నలిజంలో డిగ్రీ పూర్తిచేసిన ఆమె.. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసింది. అయితే పోర్షియాకు ఆమె తండ్రితో అనుబంధం ఎక్కువ. టీచింగ్‌ వృత్తిలో ఉన్న నాన్నను చూసి ఎంతగానో స్ఫూర్తి పొందేదామె.

‘నాన్నకు పిల్లలంటే చాలా ఇష్టం. స్కూల్లో టీచర్‌గా కంటే ఓ నాన్నలా, స్నేహితుడిలా వాళ్లతో కలిసిపోయేవాడు. ఖాళీ సమయాల్లోనూ చుట్టుపక్కల పిల్లలకు గుణింతాలు, పద్యాలు చెప్పేవారు. వీలు చిక్కినప్పుడల్లా గ్రామీణ ప్రాంతాలకు వెళ్తూ అక్కడి చిన్నారులకు ఉచితంగా పుస్తకాలు పంచేవారు. ఇలా ఆయన వేసే ప్రతి అడుగూ నాలో స్ఫూర్తి నింపేది’ అంటోంది పోర్షియా.

నాన్న మరణం కుంగదీసింది!

ఇలా హాయిగా సాగిపోతోన్న పోర్షియా జీవితంలో అనుకోకుండా ఓ ఉపద్రవం సంభవించింది. అనారోగ్యంతో తన తండ్రి కన్నుమూయడంతో ఆమె ప్రపంచం ఒక్కసారిగా తలకిందులైంది.
‘నాన్న పోవడంతో నన్ను నేనే కోల్పోయిన భావన కలిగింది. ఆయనెప్పుడూ నా వెన్నంటే ఉండేవారు. ప్రతి విషయంలో నన్ను ప్రోత్సహించేవారు. అలాంటి తోడు ఇకపై ఉండదన్న ఆలోచనే నన్ను డిప్రెషన్‌లోకి నెట్టేసింది. చాలా రోజుల పాటు ఎవరితో మాట్లాడకుండా ఇంట్లో ఒంటరిగానే గడిపాను. కానీ కొన్నాళ్లకు రియలైజ్‌ అయ్యా. ఇలా బాధపడుతూ కూర్చోవడం కంటే నాన్న జ్ఞాపకాల్ని పదిలపరచుకునేలా ఆయనకిష్టమైన ఓ మంచి పనికి శ్రీకారం చుడితే బాగుంటుందనిపించింది. ఇదే నన్ను హిమాచల్‌ ప్రదేశ్‌లోని స్పితి లోయకు తీసుకెళ్లింది. గతంలో ఓసారి ఈ ప్రాంతాన్ని సందర్శించా.. ఆ సమయంలో ఇక్కడి ప్రకృతి అందాలు, లోయలు, కొండ ప్రాంతాలు నన్ను కట్టిపడేశాయి. అన్నింటికంటే ముఖ్యంగా ఇక్కడి కోమిక్‌ అనే గ్రామం ప్రపంచంలోనే అతి ఎత్తైన ప్రదేశంగా పేరుగాంచింది. ఆ మంచి పనేదో ఇక్కడే ప్రారంభిస్తే స్వర్గానికి దగ్గరగా, ఎప్పుడూ నాన్నకు చేరువలో ఉండచ్చనిపించింది..’ అంటూ చెప్పుకొచ్చింది పోర్షియా.

అంతా నాకు పిచ్చి పట్టిందన్నారు!

తన తండ్రి మరణానంతరం సమాజ సేవ చేయాలనుకున్న పోర్షియా.. ఈ ఆలోచనతోనే స్పితి లోయలోని కాజా అనే ప్రాంతానికి చేరుకుంది. అయితే గతంలో ఈ లోయను సందర్శించిన సమయంలోనే పేదరికం కారణంగా ఇక్కడి చిన్నారులు చదువుకు నోచుకోకపోవడం గమనించింది. ఎలాగైనా వారికి నాణ్యమైన విద్యను అందించాలనుకుంది.

‘ఇక్కడి పేద చిన్నారులకు విద్యనందించాలన్న లక్ష్యంతో 2021లో ‘ప్లానెట్‌ స్పితి ఫౌండేషన్‌’ను స్థాపించా. ఆ మరుసటి ఏడాదే ‘ప్లానెట్‌ స్పితి రెసిడెన్షియల్ స్కూల్‌’కు శ్రీకారం చుట్టాను. ఇందులో చేరే పిల్లలకు ఉచితంగా చదువు చెప్పడంతో పాటు.. దుస్తులు, ఆహారం.. వంటివీ అందిస్తున్నా. గణితం, సైన్స్‌, ఇంగ్లిష్‌, ఆర్ట్స్‌.. వంటి సబ్జెక్టుల్ని బోధించడంతో పాటు గార్డెనింగ్‌, డ్యాన్స్‌, ఆటపాటలూ నేర్పిస్తున్నా. ప్రస్తుతం నా స్కూల్లో 3-10 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారులు విద్యనభ్యసిస్తున్నారు. సొంత డబ్బుతోనే స్కూల్‌, ఫౌండేషన్‌ను ఏర్పాటుచేసినా.. వీటి నిర్వహణకు బయటి నుంచి కొన్ని నిధులు సమీకరిస్తున్నా.. అయితే ఉద్యోగం వదిలేసి ఎన్జీవో, స్కూల్‌ ప్రారంభిస్తానన్నప్పుడు చాలామంది నాకు పిచ్చిపట్టిందన్నారు.. అయినా నేను వెనకడుగు వేయలేదు..’ అంటోంది పోర్షియా.

అది సవాలుగా అనిపించింది!

అయితే స్కూల్‌ ప్రారంభించిన మొదట్లో పిల్లల్ని రప్పించడం కాస్త ఇబ్బందిగా, సవాలుగా అనిపించిందంటోంది పోర్షియా. ఇందుకు అక్కడి తల్లిదండ్రుల్లో పాతుకుపోయిన మూఢనమ్మకాలే కారణమంటోందామె.

‘ఇక్కడి కుటుంబాల్లో చాలామంది నిరక్షరాస్యులే! పిల్లల్ని బడికి పంపించమని వాళ్లిళ్లకు వెళ్లినప్పుడు ‘చదువుకుంటే ఏమొస్తుంది? ఏవైనా పనులు నేర్చుకుంటే డబ్బు సంపాదించచ్చు కదా!’ అనేవారు. ఇలా వాళ్లలో ఉన్న మూఢనమ్మకాల్ని, ఆలోచనల్ని మార్చడానికి చాలానే ప్రయత్నించాను. ఆ కుటుంబాల్ని ఒక్క చోట పోగేసి గంటల తరబడి వాళ్లకు విద్య ప్రాముఖ్యం గురించి వివరించి చెప్పాను. ఈ క్రమంలో ఒక్కొక్కరూ నా మాటల్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. వాళ్ల పిల్లల్ని బడికి పంపించడం ప్రారంభించారు. కానీ ఇందుకు వాళ్లను ఒప్పించడం, వాళ్ల మనసులు మార్చడం మాత్రం సవాలుగా అనిపించింది. ప్రస్తుతం నా ఫౌండేషన్‌ వేదికగా చిన్నారులకు చదువుతో పాటు అప్పుడప్పుడూ ఆరోగ్య శిబిరాలు కూడా నిర్వహిస్తున్నా. తద్వారా వారిలో, వారి కుటుంబాల్లో తలెత్తే అనారోగ్యాల్ని దూరం చేస్తున్నా. ఈ చిన్నారుల చిరునవ్వు చూసి నా బాధలన్నీ మర్చిపోతున్నా.. త్వరలోనే మరికొంతమంది చిన్నారుల్ని స్కూల్లో చేర్చుకునే లక్ష్యంతో ముందుకు సాగుతున్నా..’ అంటోన్న ఈ యూత్‌ ఐకాన్ తన సమాజ సేవలకు గుర్తింపుగా పలు అవార్డులూ అందుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్