Shrestha Tiwari : ‘ఇలా ఉంటే నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు?’ అన్నారు!

బుగ్గ మీద చిన్న మొటిమొస్తేనే తట్టుకోలేం.. అలాంటిది చర్మ సంబంధిత సమస్య ఉందని తేలితే జీవితమే తలకిందులైనట్లుగా అనిపిస్తుంది.

Published : 02 Dec 2023 20:59 IST

(Photos: Instagram)

బుగ్గ మీద చిన్న మొటిమొస్తేనే తట్టుకోలేం.. అలాంటిది చర్మ సంబంధిత సమస్య ఉందని తేలితే జీవితమే తలకిందులైనట్లుగా అనిపిస్తుంది. ఎనిమిదేళ్ల వయసులో ఇలాంటి చేదు అనుభవాన్నే ఎదుర్కొంది శ్రేష్ఠా తివారి. రోజులు గడుస్తున్న కొద్దీ సొరియాసిస్‌ తన చర్మాన్ని ఆక్రమిస్తుంటే.. ఇంటా, బయటా ఎన్నో అవమానాలు, అవహేళనలు ఎదుర్కొంది. నిజానికి ఈ విమర్శలే తనను సానుకూల దృక్పథం వైపు అడుగులేయించాయంటోన్న శ్రేష్ఠ.. ప్రస్తుతం స్వీయ ప్రేమతో బాడీ పాజిటివిటీని చాటుతోంది. అంతేకాదు.. డిజిటల్‌ క్రియేటర్‌గా అవతారమెత్తి సొరియాసిస్‌ బాధితుల్లో వ్యాధి పట్ల అవగాహన పెంచుతోంది. ఆమె స్ఫూర్తిదాయక ప్రయాణమిది!

శ్రేష్ఠది బెంగళూరు. అక్కడి క్రైస్ట్‌ యూనివర్సిటీలో ‘బ్యాచిలర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (BBA)’ పూర్తిచేసిన ఆమె.. కొన్నేళ్ల పాటు పలు సంస్థల్లో ఉద్యోగం చేసింది.. ఇంకొన్నాళ్లు ఫ్రీలాన్సర్‌గానూ పనిచేసింది. అయితే ఎనిమిదో ఏట సొరియాసిస్‌ బారిన పడిన ఆమె.. వ్యాధి తీవ్రమవడంతో వ్యక్తిగత జీవితంలో సమస్యలు ఎదుర్కోవడమే కాదు.. కెరీర్‌నూ పక్కన పెట్టాల్సి వచ్చింది.

అబద్ధం చెప్పేదాన్ని!

శ్రేష్ఠ చిన్న వయసు నుంచి చాలా చలాకీగా ఉండేది. అయితే తనకు ఎనిమిదేళ్ల వయసున్నప్పుడు తన చర్మంపై చిన్న బొబ్బ కనిపించింది. ఇది సాధారణమేనేమో అని భావించిన ఆమె.. దాన్ని అంతగా పట్టించుకోలేదు. కానీ కొన్నాళ్లకే తన చర్మంపై పలు చోట్ల ఇలాంటి పొక్కులు ఏర్పడ్డాయి.. తద్వారా అక్కడ చర్మం పొట్టులా ఊడిపోవడం గమనించిందామె. దీంతో ఆమె తల్లిదండ్రులు శ్రేష్ఠను ఆస్పత్రికి తీసుకెళ్లారు. పలు పరీక్షల అనంతరం దీన్ని సొరియాసిస్‌ వ్యాధిగా వైద్యులు గుర్తించారు.

‘మొదట్లో నా చర్మంపై బయటికి కనిపించని ప్రదేశాల్లోనే ఈ బొబ్బలు ఏర్పడ్డాయి. స్కూల్‌ యూనిఫాం ధరించడం వల్ల అవి సులభంగా కవరైపోయేవి. కానీ రాన్రానూ సొరియాసిస్‌ నా చర్మమంతా క్రమంగా విస్తరించడం మొదలైంది. దీంతో నా స్కూల్‌ ఫ్రెండ్స్‌, టీచర్లు.. దీనిపై వివిధ రకాల ప్రశ్నలు వేసేవారు. కాలిన మరకలని, సైకిల్‌పై నుంచి కింద పడడం వల్ల ఏర్పడిన గాయాలని అబద్ధం చెప్పేదాన్ని. ఎలాగూ కొన్నాళ్లకు ఇవి మానిపోతాయి కదా.. అప్పుడు ఇలాంటి ప్రశ్నలే ఎదురు కావు.. అనుకునేదాన్ని. కానీ ఆ తర్వాత రియలైజ్‌ అయ్యా.. ఇది దీర్ఘకాలిక సమస్య అని!’ అంటూ చెబుతోంది శ్రేష్ఠ.

అవమానాలెన్నో భరించా!

15 ఏళ్ల వయసులోనే సొరియాసిస్‌ శ్రేష్ఠ శరీరమంతా వ్యాపించింది. ఎర్రటి బొబ్బలకు తోడు దురద కూడా వేధించేది. గోకితే రక్తం కారేది. ఇలా తన చర్మ సమస్యతో శారీరకంగా కుంగిపోయిన ఆమెను.. చుట్టూ ఉన్న వాళ్లు తమ మాటలతోనూ ఇబ్బంది పెట్టేవారు.

‘నా పరిస్థితి చూసి కొంతమంది స్నేహితులు నన్ను అర్థం చేసుకునేవారు.. వారికి తోచిన సలహాలిచ్చేవారు. కానీ చాలామంది నా వెనక ఏదేదో మాట్లాడుకుంటూ నవ్వుకునేవారు. ఓసారి మా టీచర్‌.. ‘ఇలా నువ్వు ఇబ్బంది పడుతూ, అందరినీ ఇబ్బంది పెట్టే బదులు శరీరమంతా కప్పుకొనేలా దుస్తులు వేసుకురావచ్చుగా’ అన్న మాటలు నేనెప్పుడూ మర్చిపోలేను. బంధువులు, తెలిసిన వాళ్లలో ‘ఇలా ఉంటే నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు?’ అన్న వాళ్లూ లేకపోలేదు. ఇలా ఎదుటివారి మాటలు, చేతలు, చూపులు నా మనసులో బాణాల్లా గుచ్చుకునేవి. ఒకానొక దశలో నా శరీరాన్ని నేనే అసహ్యించుకునే స్థాయికి చేరుకున్నా.. ఎలాగైనా ఈ సమస్య నుంచి బయటపడాలని ఎన్నో క్రీములు వాడాను.. అయినా ఫలితం కనిపించలేదు.. పైగా ఇవి నా చర్మంపై ప్రతికూల ప్రభావం చూపడంతో.. ఆపై ఆలివ్‌/కొబ్బరి నూనె వంటి సహజసిద్ధమైన పదార్థాలు వాడడం మొదలుపెట్టా.. జీవనశైలి, ఆహార నియమాల్లో పలు మార్పులు-చేర్పులు చేసుకున్నా..’ అంటోంది శ్రేష్ఠ.

ఆ మార్పు తీసుకురావాలనే..!

ఎదుటివారి చూపులు, మాటలతో కొన్నేళ్ల పాటు ప్రతికూల ఆలోచనల మధ్యే గడిపిన శ్రేష్ఠ.. ఆపై తన చర్మ సమస్యను అంగీకరించడం ప్రారంభించింది. దీనికి తోడు ఆమె అలవాటు చేసుకున్న జీవనశైలి కూడా క్రమంగా సానుకూల ఫలితాలు చూపడం గమనించింది. ఈ పాజిటివీనే తన జీవితాన్ని మలుపు తిప్పిందంటోన్న ఈ సొరియాసిస్‌ వారియర్‌.. ప్రస్తుతం ఈ సమస్య గురించి, తన జీవనశైలి గురించి సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతూ అందరిలో అవగాహన కల్పిస్తోంది. ఈ క్రమంలో తన చర్మ సమస్య బయటికి కనిపించేలా ఉన్న ఫొటోల్ని పోస్ట్‌ చేయడానికీ వెనకాడట్లేదామె.

‘ఒకప్పుడు నా చర్మ సమస్య బయటికి కనిపించకుండా నిండైన దుస్తులు ధరించేదాన్ని. అలా దాదాపు 15 ఏళ్ల పాటు ఆత్మన్యూనత, అభద్రతా భావంతో నాలో నేనే మథనపడ్డా. ఇక సొరియాసిస్‌ కారణంగా చర్మంపై ఏర్పడిన నొప్పి, మంట వల్ల కెరీర్‌ని పూర్తిగా పక్కన పెట్టేయాల్సి వచ్చింది. కానీ ఎప్పుడైతే నా చర్మ సమస్యను అంగీకరించడం, స్వీయ ప్రేమను పెంచుకోవడం మొదలుపెట్టానో.. అప్పట్నుంచి కొత్త జీవితం ప్రారంభించిన అనుభూతి నాకు కలుగుతోంది. నా సమస్యను బయటికి చూపించుకోవడానికీ నేను ఇబ్బంది పడట్లేదు. ప్రస్తుతం నేను సోషల్‌ మీడియాలో పెట్టే పోస్టులు, ఫొటోలు, వీడియోలకు.. విమర్శల కంటే ప్రశంసలే ఎక్కువగా వస్తున్నాయి. చాలామంది సానుకూలంగా స్పందిస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. కొంతమంది తమకున్న చర్మ సమస్యల గురించీ పంచుకుంటున్నారు. గతేడాది ‘Psafe Space’ పేరుతో ఓ ఆన్‌లైన్‌ కమ్యూనిటీని ప్రారంభించా. సొరియాసిస్‌, ఇతర చర్మ సమస్యలున్న వారు ఈ వేదికగా తమ సమస్యలు, అనుభవాల్ని పంచుకోవచ్చు.. ఇలా ఒక్కొక్కరూ తమ సమస్యల్ని బయటపెట్టినప్పుడే వీటికి పరిష్కార మార్గాలు దొరుకుతాయి.. ఈ సమస్యలపై అందరిలో అవగాహన పెరుగుతుంది..’ అంటోందీ సొరియాసిస్‌ వారియర్‌. అంతేకాదు.. ఎదుటివారికి సహాయపడకపోయినా పర్లేదు.. కానీ మనసును గాయపరిచే మాటలతో మాత్రం ఇబ్బంది పెట్టద్దంటూ ఈ సమాజాన్ని కోరుతోందామె.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్