‘నిప్పు’ కణిక.. ఈ మేఘన!

ఇంట్లో పెద్ద వాళ్లను స్ఫూర్తిగా తీసుకొని కెరీర్‌ దారుల్ని ఎంచుకోవడం చాలామందికి అలవాటే! అయితే వీరిలోనూ పురుషాధిపత్యం ఉన్న రంగాల్ని ఎంచుకునే అమ్మాయిలు అరుదుగా కనిపిస్తుంటారు.

Updated : 26 Feb 2024 21:04 IST

(Photos: Instagram)

ఇంట్లో పెద్ద వాళ్లను స్ఫూర్తిగా తీసుకొని కెరీర్‌ దారుల్ని ఎంచుకోవడం చాలామందికి అలవాటే! అయితే వీరిలోనూ పురుషాధిపత్యం ఉన్న రంగాల్ని ఎంచుకునే అమ్మాయిలు అరుదుగా కనిపిస్తుంటారు. 26 ఏళ్ల మేఘనా సక్పాల్‌ ఇదే కోవకు చెందుతుంది. తన తాతయ్య, తండ్రిని ప్రేరణగా తీసుకున్న ఆమె.. నిత్యం సవాళ్లతో కూడుకున్న అగ్నిమాపక దళంలోకి అడుగుపెట్టాలని సంకల్పించుకుంది. శిక్షణలో ఎన్ని సవాళ్లు ఎదురైనా వెన్నుచూపక లక్ష్యాన్ని చేరుకుంది. పుణే అగ్నిమాపక దళంలో తాజాగా పోస్టింగ్‌ అందుకున్న మేఘన.. ఈ ఘనత సాధించిన తొలి మహిళగా చరిత్రకెక్కింది. ఈ దళానికి ఎంపికైన 167 మందిలో తనొక్కర్తే మహిళ కావడం మరో విశేషం. ఈ నేపథ్యంలో ఈ యంగ్‌ ఫైర్‌ లేడీ గురించి కొన్ని విశేషాలు మీకోసం..!

మేఘన పుణేలోని గర్వారే కాలేజీలో ‘కామర్స్‌’ విభాగంలో డిగ్రీ పూర్తిచేసింది. ఆమెకు చిన్న వయసు నుంచి సవాళ్లతో సహవాసం చేయడమంటే ఇష్టం. ఇందుకు కారణం ఆమె తాతయ్య, తండ్రి ఇద్దరూ అగ్నిమాపక దళంలో సేవలందించడమే! మేఘన తాతగారు సదాశివ్‌ సక్పాల్‌ పుణే అగ్నిమాపక దళంలో పనిచేసి.. రెండేళ్ల క్రితం తన 80 ఏళ్ల వయసులో పదవీ విరమణ పొందారు. ఇక ఆమె తండ్రి మహేంద్ర సక్పాల్‌ ప్రస్తుతం ఇక్కడే సర్వింగ్‌ ఫైర్‌మ్యాన్‌గా సేవలందిస్తున్నారు. ఇలా వీళ్లిద్దరినీ చూస్తూ పెరిగిన మేఘనకూ ఈ రంగంలోకి రావాలన్న ఆసక్తి పెరిగింది.

ఆ మూడు నెలలు ఒళ్లు హూనమైంది!

ఈ మక్కువతోనే డిగ్రీ పూర్తయ్యాక అగ్నిమాపక దళానికి సంబంధించిన ప్రవేశ పరీక్షలు రాసింది మేఘన. ఇందులో అర్హత సాధించిన ఆమె.. ఆరు నెలల ట్రైనింగ్‌ కోర్సుకు ఎంపికైంది. అయితే ఈ కఠోర శిక్షణ తనకు జీవితానికి సంబంధించిన ఎన్నో పాఠాలు నేర్పిందంటోందామె.

‘నా జీవితంపై మా నాన్న, తాతయ్య ప్రభావం ఎంతో ఉంది. అగ్నిమాపక దళంలో పనిచేస్తూ నిత్యం వాళ్లెదుర్కొనే సవాళ్లను చూస్తూ పెరిగిన నాకూ.. ఈ రంగంలో చేరాలన్న ఆసక్తి ఏర్పడింది. అయితే ఈ లక్ష్యాన్ని చేరుకోవడం అంత సులభమేమీ కాదని ఆ తర్వాతే తెలుసుకున్నా. పరీక్షలో అర్హత సాధించి ఆరు నెలల శిక్షణకు ఎంపికయ్యాక ఎన్నో ఒడిదొడుకుల్ని ఎదుర్కొన్నా. మొదటి మూడు నెలలైతే చాలా కఠినంగా గడిచాయి. ఫిట్‌నెస్‌ ట్రైనింగ్‌తో ఒక్కోసారి ఒళ్లు హూనమైపోయేది. మా బ్యాచ్‌లో 30 మంది ఉంటే అందులో నేను చివర్లో నిల్చోవడానికే ప్రాధాన్యమిచ్చేదాన్ని. అంత కఠినంగా గడిచాయి ఆ మూడు నెలలు. ఇలా శిక్షణలో వెనకబడిపోవడం చూసుకొని.. నా మీద నాకే సందేహం కలిగేది. నేను అసలు ఈ రంగానికి/ఉద్యోగానికి ఫిట్టవుతానా? అనిపించేది. కానీ ఈ సమయంలోనూ మా తాతయ్య, నాన్న స్ఫూర్తితోనే ముందుకు సాగాను. నా తోటి ట్రైనర్స్‌ సహకారంతో ఈ సవాళ్లన్నీ జయించగలిగాను. అంతలోనే కరోనా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ట్రైనింగ్‌కు బ్రేక్‌ పడింది. అయినా ఈ విరామ సమయాన్ని నాకు నేను శారీరకంగా, మానసికంగా సన్నద్ధమయ్యేందుకు, ఫిట్‌గా మారేందుకు వినియోగించుకున్నా..’ అంటోంది మేఘన.

167 మందిలో తనొక్కర్తే!

తొలి మూడు నెలలు శిక్షణలో ఎదుర్కొన్న సవాళ్లతో ప్రతికూల ఆలోచనల్లో కూరుకుపోయిన మేఘన.. లాక్‌డౌన్‌ తర్వాత 2022లో తిరిగి సానుకూల దృక్పథంతో శిక్షణను పునఃప్రారంభించింది. ఇక ఈసారి వెనుతిరిగి చూడలేదామె.

‘శిక్షణ తొలినాళ్లలో అన్నింట్లోనూ వెనకబడిపోయిన నేను.. కరోనా లాక్‌డౌన్‌ తర్వాత ప్రారంభించిన రెండో ఇన్నింగ్‌్వలో రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగాను. 2022లో మహారాష్ట్ర ఫైర్‌ సర్వీసెస్‌ కోర్సు పూర్తిచేసిన నేను.. 2023లో ‘పుణే ఫైర్‌ బ్రిగేడ్‌’ ఉద్యోగ నియామకాల్లో సత్తా చాటి ఈ అగ్నిమాపక దళానికి ఎంపికయ్యా. నేను ఎంచుకుంది ముళ్ల దారి అని నాకు తెలుసు! అయినా ఏదో తెలియని ఉత్సాహం , ఎంతోమంది ఫైర్‌ఫైటర్స్‌ స్ఫూర్తిదాయక కథలు నన్ను సానుకూలంగా ముందుకు నడిపించేవి..’ అంటోన్న మేఘన ఈసారి పుణే అగ్నిమాపక దళానికి ఎంపికైన 167 మందిలో ఏకైక మహిళ. ఇలా తన విజయంతో ఈ రంగంలో ఆసక్తి ఉన్న ఎంతోమంది అమ్మాయిలకు తన కూతురు స్ఫూర్తినివ్వడం ఆనందంగా ఉందంటూ మేఘన తండ్రి పొంగిపోతున్నారు. ఇలా తమ కుటుంబానికి చెందిన మూడు తరాల వ్యక్తులు దేశసేవలో, ప్రజా సేవలో మమేకం కావడం గర్వంగా, ఆనందంగా ఉందంటూ మురిసిపోతోందీ యంగ్‌ ఫైర్‌ఫైటర్.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్