Nandita Venkatesan: టీబీపై గెలిచి.. ‘టైమ్’ జాబితాలో నిలిచి..!

జీవితంలో ఏదైనా చెడు జరిగితే.. మన అదృష్టాన్ని నిందిస్తుంటాం. అదే దురదృష్టాన్ని కూడా సానుకూలంగా స్వీకరించి.. మరొకరు అలాంటి సమస్యల వలలో చిక్కుకోకుండా చేయాలన్న గొప్ప ఆలోచన అతి కొద్ది మందికే వస్తుంది.

Updated : 16 Sep 2023 12:22 IST

(Photos: Instagram)

జీవితంలో ఏదైనా చెడు జరిగితే.. మన అదృష్టాన్ని నిందిస్తుంటాం. అదే దురదృష్టాన్ని కూడా సానుకూలంగా స్వీకరించి.. మరొకరు అలాంటి సమస్యల వలలో చిక్కుకోకుండా చేయాలన్న గొప్ప ఆలోచన అతి కొద్ది మందికే వస్తుంది. అలాంటి వ్యక్తుల్లో నందితా వెంకటేశన్‌ ఒకరు. క్షయ వ్యాధితో జీవన్మరణ పరిస్థితుల్ని ఎదుర్కొన్న ఆమె.. అదృష్టం బాగుండి ఆ సమస్య నుంచి బయటపడినా.. దురదృష్టవశాత్తూ వినికిడి శక్తిని  కోల్పోయింది. అయినా తనలాంటి పరిస్థితి మరొకరికి రాకూడదన్న ఆలోచనతో ఇటు దేశవ్యాప్తంగా, అటు ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధిపై అవగాహన కల్పిస్తోంది. మరోవైపు టీబీ వ్యాధిగ్రస్థులకు అత్యంత సురక్షితమైన, ప్రభావవంతమైన మందును దేశంలో అతి తక్కువ ధరకే లభించేలా కృషి చేసిందామె. ఇలా ఆమె కృషికి గుర్తింపుగానే తాజాగా టైమ్‌ పత్రిక విడుదల చేసిన ‘ప్రపంచంలోనే వంద మంది వర్ధమాన నాయకుల (టైమ్‌ 100 నెక్స్‌ట్‌)’ జాబితాలో చోటు దక్కించుకుంది నందిత. ఈ నేపథ్యంలో నందిత గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..

ముంబయిలో పుట్టి పెరిగింది నందిత. ఆమెకు సంగీతం, నృత్యం అంటే ప్రాణం. ఈ మక్కువతోనే చిన్నతనం నుంచే భరతనాట్యంలో శిక్షణ తీసుకుంది. ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ (IIMC)’లో పీజీ పూర్తిచేశాక.. కొన్నేళ్ల పాటు మీడియా రంగంలో పనిచేసింది నందిత.

అప్పుడు డ్యాన్స్‌తో కవరయ్యా!

అయితే డిగ్రీ చదువుతున్నప్పుడే నందితకు ప్రాణాంతక క్షయ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆ సమయంలో తన ఫ్రెండ్సంతా చదువు, సినిమాలు, షికార్లు అంటూ ఎంజాయ్‌ చేస్తుంటే.. తను మాత్రం టీబీ చికిత్స కోసం ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చిందంటోంది నందిత.

‘టీబీ వ్యాధి కారణంగా నా కాలేజీ రోజుల్లో అత్యంత ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొన్నా. దాదాపు 14 నెలలు ఆస్పత్రిలోనే గడపాల్సి వచ్చింది. ఆ సమయంలో శారీరకంగా, మానసికంగా తిరిగి దృఢంగా మారడానికి నాకెంతో ఇష్టమైన డ్యాన్స్‌పై దృష్టి పెట్టా. ఆ సమయంలో నేను టీబీ నుంచి కోలుకోగలిగానంటే డ్యాన్స్‌ కూడా ఓ కారణమే! ఏడేళ్ల వయసు నుంచే భరతనాట్యం నేర్చుకుంటున్నా. స్కూల్లో, ఇతర వేదికలపై పలు ప్రదర్శనలు కూడా ఇచ్చా..’ అంటోన్న నందితపై.. సరిగ్గా ఆరేళ్ల తర్వాత మళ్లీ టీబీ దాడి చేసింది.

రెండోసారి.. నరకమే!

అయితే తొలిసారి క్షయ వ్యాధి నుంచి ఎలాగోలా బయటపడ్డా.. రెండోసారి మాత్రం నరకం చూశానంటోంది నందిత.

‘క్షయ వ్యాధి ఎంత ప్రాణాంతక సమస్యో.. రెండోసారి దాని బారిన పడ్డాక గానీ నాకు అర్థం కాలేదు. ఈ సమయంలోనూ నెలల కొద్దీ ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చింది. రోజుకు పదుల సంఖ్యలో మాత్రలు వేసుకోవాల్సి రావడంతో రోజంతా వికారంగా అనిపించేది. వాంతులయ్యేవి. కడుపునొప్పి, ఆకలి లేకపోవడంతో తక్కువ సమయంలోనే కిలోల కొద్దీ బరువు తగ్గాను. మరోవైపు జుట్టు ఎక్కువగా రాలిపోయి.. బట్టతలలా కనిపించేది. అద్దంలో చూసుకొని నన్ను నేనే గుర్తుపట్టలేనంతగా మారిపోయా.. అయితే ఎన్ని చికిత్సలు చేసినా ఫలితం లేకపోవడంతో సర్జరీ చేసి ఇన్ఫెక్షన్‌ సోకిన పొట్ట భాగాన్ని తొలగించాలన్నారు వైద్యులు. అలా కొన్ని సర్జరీలు పూర్తయ్యే సరికి విపరీతమైన ఒత్తిడి, ఆందోళనకు గురయ్యా. అయినా ప్రాణాలపై ఆశను మాత్రం వదులుకోలేదు. ఈ క్రమంలోనే ఎలాగైనా త్వరగా కోలుకోవాలని నిర్ణయించుకున్నా.. పాజిటివిటీతో ముందుకు సాగడం ప్రారంభించా.. ఇప్పటికీ అది తలచుకుంటే ఈ ఆశే తిరిగి నన్ను బతికించిందేమో అనిపిస్తుంటుంది..’ అని చెబుతుంది నందిత.

వినికిడి.. కోల్పోయి!

చికిత్సలు, సర్జరీలు పూర్తయ్యాయి.. ఇక జరిగిందేదో జరిగిపోయింది.. క్షయ నుంచి బతికి బయటపడ్డ నందిత.. తిరిగి పాజిటివిటీతో తన జీవితాన్ని ప్రారంభించాలనుకునే తరుణంలో మరో సమస్య ఆమెను అధఃపాతాళానికి నెట్టేయాలని చూసింది. చికిత్సలు నిర్వహించే క్రమంలో ఓ మందు వికటించి.. వినికిడి శక్తిని ఆమెకు శాశ్వతంగా దూరం చేసింది.

‘అసలే వరుస సర్జరీలతో విపరీతమైన నొప్పి వేధించేది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్యే ఓరోజు ఉదయాన్నే నిద్ర లేచాను. అందరూ నా ముందే ఉండి నన్ను పిలుస్తున్నా.. వినిపించట్లేదు.. ఏ శబ్దమూ నా చెవిని చేరట్లేదు. దాంతో మళ్లీ హడావిడిగా ఆస్పత్రికి పరిగెత్తాల్సి వచ్చింది. నా చికిత్సలో భాగంగా ఓ మందు వికటించడంతోనే ఈ పరిస్థితి తలెత్తినట్లు వైద్యులు తేల్చారు. అప్పటిదాకా నా జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నా. అయినా సానుకూలంగా ముందుకు సాగాను. ఇకపై వినలేనన్న చేదు నిజాన్నీ జీర్ణించుకోవడం మొదలుపెట్టా. అలా జీవితంపై మళ్లీ ఆశలు చిగురించాయి. ఇక ఈ సారీ డ్యాన్స్‌ సాధనతోనే తిరిగి మామూలు మనిషినయ్యా. వినికిడి లోపాలున్న డ్యాన్సర్ల అనుభవాలు చదవడం మొదలుపెట్టా. సంగీతం వినలేకపోయినా.. నృత్య సాధన చేయడంలో మెలకువలు నేర్చుకున్నా. ఇవన్నీ నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాయి. వినికిడి పరికరాలతో వైబ్రేషన్స్‌ తెలుసుకొని.. లయకు తగ్గట్లుగా డ్యాన్స్‌ చేసేలా శిక్షణ తీసుకున్నా..’ అంటోన్న నందిత ఇప్పటికీ పలు స్టేజీ ప్రదర్శనలిస్తూ ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకుంటోంది.

టీబీపై అవగాహన!

ప్రతికూల పరిస్థితుల్నీ సానుకూల దృక్పథంతో జయించిన నందిత.. ప్రస్తుతం మీడియా రంగంలో పనిచేస్తోంది. మరోవైపు తన ప్రవృత్తి అయిన డ్యాన్స్‌నూ కొనసాగిస్తోంది. అంతటితో ఆగకుండా.. తనలాంటి ఆరోగ్య సమస్యలు మరెవరూ ఎదుర్కోకూడదని.. క్షయ వ్యాధిపై అందరిలో అవగాహన కల్పిస్తోంది. ఇందులో భాగంగా జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రసంగాలు చేస్తూ వ్యాధి తీవ్రత, దాన్ని నిర్మూలించే మార్గాల్ని కళ్లకు కడుతోంది. ప్రస్తుతం టీబీపై వేసిన ‘లాన్సెట్‌ కమిషన్‌’లో సభ్యురాలిగా ఉన్న నందిత.. 2018లో ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీలో భాగంగా ప్రసంగించి.. ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. మరోవైపు ‘బోలో దీదీ’ అనే సోషల్‌ మీడియా వేదికను ప్రారంభించి.. క్షయపై అవగాహన కల్పించేలా పలు కార్యక్రమాలు చేపడుతోంది. ఈ వ్యాధిని జయించిన వారి స్ఫూర్తి గాథల్ని పంచుకునేలా ప్రోత్సహిస్తూ.. మరింతమందిలో జీవితంపై ఆశలు రేకెత్తిస్తోందీ హెల్త్‌ వారియర్.

‘టైమ్‌’ మెచ్చింది!

క్షయ వ్యాధి నిర్మూలనలో భాగంగా తాను చేస్తోన్న కృషికి గుర్తింపుగా పలు అవార్డులు-రివార్డులు అందుకుంది నందిత. అయితే టీబీ చికిత్సలో భాగంగా ఉపయోగించే ఓ అత్యంత ప్రభావవంతమైన, సురక్షితమైన ఔషధం పేటెంట్‌ చట్టాల కారణంగా దేశంలో చాలామందికి అందట్లేదన్న విషయం తెలుసుకుందామె. దీంతో సదరు సంస్థ తన పేటెంట్‌ పొడిగింపు కోసం దాఖలు చేసుకున్న అభ్యర్థనను రద్దు చేసి, ఆ మందును వెంటనే దేశంలో వినియోగానికి అంగీకరించాల్సిందిగా.. దక్షిణాఫ్రికాకు చెందిన టీబీ బాధితురాలు ఫుమేజా తిసిలేతో కలిసి గతేడాది కోర్టులో పిటిషన్‌ వేసింది నందిత. వీరి అభ్యర్థనను స్వీకరిస్తూ సదరు ఔషధ సంస్థ పేటెంట్‌ పొడిగింపును రద్దు చేస్తూ.. ఈ ఏడాది మార్చిలో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఇలా నందిత చొరవతో దేశంలో అత్యంత తక్కువ ధరకే ఆ జనరిక్‌ మందులు టీబీ పేషెంట్స్‌కి అందుబాటులోకొచ్చాయి. ఇలా టీబీపై ఆమె చేస్తోన్న పోరాటానికి గుర్తింపుగానే తాజాగా టైమ్‌ పత్రిక విడుదల చేసిన ‘ప్రపంచంలోనే వంద మంది వర్ధమాన నాయకుల (టైమ్‌ 100 నెక్స్‌ట్‌)’ జాబితాలో చోటు దక్కించుకుంది నందిత. ఈ గౌరవాన్ని తన తోటి పిటిషనర్ ఫుమేజాతో కలిసి పంచుకుందామె.

ఇక ఈ ‘టైమ్‌ 100 నెక్స్‌ట్‌’ జాబితాలో భారత్‌ నుంచి మహిళల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ కూడా చోటు దక్కించుకుంది. ఓవైపు దేశ మహిళల క్రికెట్‌కు సేవలందిస్తూనే.. మరోవైపు ఎంతోమంది మహిళలు క్రికెట్‌ను ఎంచుకునేందుకు హర్మన్‌ స్ఫూర్తిగా మారిందంటూ టైమ్ పత్రిక ఆమె సేవల్ని కొనియాడింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్