గడ్డంతోనే అనుకున్నది సాధించింది!

ముఖంపై చిన్న మచ్చ ఉంటేనే ఓర్చుకోలేని అమ్మాయిలు.. అవాంఛిత రోమాలుంటే అంగీకరిస్తారా? ఆత్మన్యూనతకు గురవుతారు. వాటిని నలుగురికీ కనిపించకుండా దాచేస్తారు.. లేదంటే ఎప్పటికప్పుడు తొలగించుకుంటారు. అంతేనా.. ఈ క్రమంలో తమ శరీరాన్ని తాము అసహ్యించుకునే వారూ.....

Published : 30 Nov 2022 18:50 IST

(Photos: Instagram)

ముఖంపై చిన్న మచ్చ ఉంటేనే ఓర్చుకోలేని అమ్మాయిలు.. అవాంఛిత రోమాలుంటే అంగీకరిస్తారా? ఆత్మన్యూనతకు గురవుతారు. వాటిని నలుగురికీ కనిపించకుండా దాచేస్తారు.. లేదంటే ఎప్పటికప్పుడు తొలగించుకుంటారు. అంతేనా.. ఈ క్రమంలో తమ శరీరాన్ని తాము అసహ్యించుకునే వారూ లేకపోలేదు. లాస్‌ ఏంజెల్స్‌కు చెందిన డకోటా కూక్ కూడా ఇదే సమస్యతో బాధపడేది. టీనేజ్‌ వయసు నుంచే హిర్సుటిజం సమస్యతో బాధపడుతోన్న ఆమెను అవాంఛిత రోమాల సమస్య ఎక్కువగా వేధించేది. దీనికి తోడు అధిక బరువు తనను ఇబ్బంది పెట్టేది. అయినా ఈ ప్రతికూలతల్ని ఎదిరించి.. తాను కోరుకున్న మోడలింగ్‌లోకి అడుగుపెట్టిందామె. మనలో ఏ సమస్య ఉన్నా, ఏ లోపమున్నా స్వీయ ప్రేమతో ముందుకు సాగితే సాధించలేనిదంటూ ఏదీ లేదని నిరూపిస్తోన్న డకోటా స్ఫూర్తి గాథ ఇది!

లాస్‌ ఏంజెల్స్‌కు చెందిన డకోటాకు టీనేజ్‌ వయసు నుంచే హిర్సుటిజం అనే సమస్య ఉంది. ఫలితంగా తన ముఖం, శరీరంపై అవాంఛిత రోమాలు ఎక్కువగా పెరిగేవి. 13 ఏళ్ల వయసులో ఈ సమస్యను గుర్తించిన ఆమె.. ఎంతో ఆత్మన్యూనతకు, అభద్రతా భావానికి లోనైంది. ఈ క్రమంలోనే తరచూ బ్యూటీ పార్లర్లో వ్యాక్సింగ్‌ చేయించుకునేది. మరోవైపు రోజూ రెండుమార్లు ఇంట్లోనే షేవింగ్‌ చేసుకునేది. ఒక దశలో ఇవీ తన చర్మంపై ప్రతికూల ప్రభావం చూపాయంటోంది డకోటా.

‘మోడల్‌ని కాలేనేమో’ అనుకున్నా!

‘నాకు మోడలింగ్‌ అంటే చాలా ఇష్టం. అయితే నా శరీరాన్ని చూసుకున్న ప్రతిసారీ ఈ లక్ష్యాన్ని చేరుకోలేనేమో అనిపించేది. గడ్డంపై పెరిగే వెంట్రుకలు నన్ను ఒక రకమైన అభద్రతా భావంలోకి, తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేసేవి. వీటిని దాచడానికి తరచూ ఇంట్లోనే షేవింగ్‌ చేసుకోవడంతో పాటు వ్యాక్సింగ్‌ కోసం వారానికోసారి పార్లర్‌కి వెళ్లేదాన్ని. అయితే వీటి వల్ల చర్మంపై ఎర్రటి దద్దుర్లు, ర్యాషెస్‌.. వంటివి వచ్చేవి. వీటిని మేకప్‌తో కవర్‌ చేయడానికి తాపత్రయపడేదాన్ని. ఇక మరోవైపు నాకున్న సమస్య కారణంగా సమాజం నుంచి కూడా వివక్ష ఎదుర్కొన్నా. ఈ ప్రతికూల పరిణామాలన్నీ ఒక దశలో నా శరీరాన్ని నేనే అసహ్యించుకునేలా చేశాయి. ఈ నెగెటివిటీలోనే సుమారు పదేళ్ల సమయం వృథాగా గడిచిపోయింది..’ అంటూ చెప్పుకొచ్చింది డకోటా.

ఫ్రెండ్‌ సలహా పనికొచ్చింది!

అయితే ఇలాంటి ప్రతికూల ఆలోచనల్లో మునిగిపోయిన డకోటా.. తన స్నేహితురాలిచ్చిన ఓ సలహాతో మనసు మార్చుకొని సానుకూలత దిశగా అడుగేశానంటోంది.

‘అవాంఛిత రోమాల సమస్యకు తోడు అధిక బరువుతో నా జీవితం ప్రశ్నార్థకంగా మారిన సమయంలో నా కుటుంబం, స్నేహితులే నాకు అండగా నిలిచారు. తమ మాటలు, చేతలతో నాలో సానుకూల ఆలోచనలు నింపారు. ఈ క్రమంలోనే ‘నువ్వు గడ్డంతోనే ఫ్యాషన్‌ షోలో ఎందుకు పాల్గొనకూడదు?’ అని ఓసారి నా ఫ్రెండ్‌ ఒకరు అడిగారు. ఇదివరకు ఎప్పుడూ నాకు అలాంటి ఆలోచన రాలేదు.. కానీ తన మాటలు నాలో ఆసక్తి రేకెత్తించాయి. ఇక అప్పట్నుంచి నా మనసు మార్చుకున్నా.. నా శరీరాన్ని నేను ప్రేమించడం మొదలుపెట్టా. రేజర్‌, వ్యాక్సింగ్‌ పక్కన పెట్టి.. పెరిగే గడ్డాన్ని, అవాంఛిత రోమాల్ని ప్రేమించడం నేర్చుకున్నా. ఈ ఆత్మవిశ్వాసంతోనే న్యూయార్క్‌ ఫ్యాషన్‌ వీక్‌తో పాటు పలు ఫ్యాషన్‌ షోలు, సర్కస్‌ షోస్‌, టీవీ కార్యక్రమాల్లో పాల్గొన్నా. ఈ జీవితం చాలా చిన్నది. అనవసరమైన ఆలోచనలతో సమయం వృథా చేసుకోకుండా సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలన్న విషయం తెలుసుకున్నా. అప్పుడే మన బాహ్య సౌందర్యంతో పని లేకుండా మనం అనుకున్నది సాధించగలం.. నా జీవితం నుంచి నేను నేర్చుకున్న పాఠమిదే!’ అంటూ తన మాటలతోనూ నేటి యువతలో స్ఫూర్తి నింపుతోంది డకోటా. ప్రస్తుతం గడ్డంతోనే బయట కనిపించడానికి, షోల్లో పాల్గొనడానికి, ఫొటోలకు పోజులివ్వడానికి తాను వెనకాడకపోవడం ఆమె ఆత్మవిశ్వాసానికి నిదర్శనం అని చెప్పచ్చు.

ఇలా తనొక్కర్తే కాదు.. బ్రిటిష్‌ సెలబ్రిటీ హర్నామ్‌ కౌర్‌, కేరళకు చెందిన శైజ.. వంటి వారు కూడా తమ మీసాలు, గడ్డాలతో బాడీ పాజిటివిటీని చాటుతూ సోషల్‌ మీడియాలో పాపులారిటీ సంపాదించారు. ఇలాంటి హార్మొనల్‌ సమస్యలున్న ఎంతోమంది మహిళల్లో స్ఫూర్తి నింపుతున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్