World Vitiligo Day: ఆ మచ్చలకు భయపడిపోలేదు.. భయపెట్టింది!

చర్మంపై చిన్న మచ్చ పడితేనే ఓర్చుకోలేం.. అలాంటిది మరికొన్ని రోజుల్లో చర్మం మొత్తం తెల్లగా, పాలిపోయినట్లుగా మారిపోతుందన్న చేదు నిజం తెలిస్తే.. ‘ఇక బతికేం ప్రయోజనం?!’ అంటూ కుమిలిపోతాం. అయితే ఇలాంటి ప్రతికూల పరిస్థితి నుంచి బయటపడినప్పుడే జీవితాన్ని జయించగలమని.....

Published : 25 Jun 2022 14:17 IST

(Photos: Instagram)

చర్మంపై చిన్న మచ్చ పడితేనే ఓర్చుకోలేం.. అలాంటిది మరికొన్ని రోజుల్లో చర్మం మొత్తం తెల్లగా, పాలిపోయినట్లుగా మారిపోతుందన్న చేదు నిజం తెలిస్తే.. ‘ఇక బతికేం ప్రయోజనం?!’ అంటూ కుమిలిపోతాం. అయితే ఇలాంటి ప్రతికూల పరిస్థితి నుంచి బయటపడినప్పుడే జీవితాన్ని జయించగలమని నిరూపించింది ముంబయికి చెందిన ఆస్తా షా. ఎనిమిదేళ్ల వయసులోనే విటిలిగో సమస్య బారిన పడిన ఆమె.. పెరిగి పెద్దయ్యే క్రమంలో, చర్మం రంగు మారే కొద్దీ సమాజం నుంచి ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. ఒకానొక సమయంలో నాలుగ్గోడలకే పరిమితమవ్వాలనుకుంది. కానీ ప్రతి జీవితానికి ఓ అర్థం, పరమార్థం ఉంటుందని గ్రహించిన ఆమె.. ఏ సమస్యతోనైతే తాను కుంగిపోయిందో.. దాని పైనే అందరిలో అవగాహన పెంచాలనుకుంది.. స్వీయ ప్రేమను పెంచుకొని.. ప్రస్తుతం సోషల్‌ స్టార్‌గా/డిజిటల్‌ కంటెంట్‌ క్రియేటర్‌గా రాణిస్తోంది. ‘ఎలా ఉన్నా మనల్ని మనం అంగీకరించడంలోనే అసలైన సంతృప్తి, సంతోషం దాగున్నాయం’టోన్న ఈ యంగ్‌ సెన్సేషన్‌ కథ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం!

‘అప్పుడు నేను రెండో తరగతి చదువుతున్నా. ఉన్నట్లుండి ఒక రోజు నా చర్మంపై తెల్ల మచ్చ కనిపించింది. అది చూసిన అమ్మానాన్నలు నాకు తగిలిన గాయం వల్ల వచ్చిన మచ్చేమో అనుకున్నారు. కానీ అది మానకపోగా.. మరింత పెద్దదవడం గమనించాం. దీంతో డాక్టర్‌ని సంప్రదించాం.. అప్పుడు ఆయన చెప్పిన చేదు నిజం నేను, అమ్మానాన్న జీర్ణించుకోలేకపోయాం. ‘ఇది విటిలిగో.. దీంతో చర్మంపై తెల్లమచ్చలు విస్తరించి.. చివరికి చర్మమంతా తెల్లగా, పాలిపోయినట్లు తయారవుతుంద’ని చెప్పారు.

స్కూలుకెళ్లలేక.. ఇంట్లో ఉండలేక..!

డాక్టర్‌ మాటలు విన్నాక మనసులో ఎన్నెన్నో ప్రశ్నలు.. స్కూల్లో ఫ్రెండ్స్‌కి ఏం చెప్పాలి? చూసే వాళ్లు వెక్కిరించకుండా ఉండగలరా? నలుగురిలోకి వెళ్లగలనా?.. ఇలా మనసు నిండా ప్రతికూల ఆలోచనలే నిండిపోయాయి. ఆ తర్వాత నా రొటీన్‌ కూడా మారిపోయింది. స్కూల్‌కి వెళ్లి రావడం, డాక్టర్‌ అపాయింట్‌మెంట్స్‌, గంటల తరబడి క్లినిక్‌లోనే గడపడం, మందులు వాడడం.. ఇలా ‘జీవితమంతా ఇంతేనేమో?!’ అన్నట్లుగా సాగేది. ఈ సమస్య తగ్గదని డాక్టర్‌ చెప్పినా.. ఏదో మూల చిన్న ఆశ. దాంతో మచ్చలున్న చోట పలు వంటింటి చిట్కాలు కూడా ప్రయత్నించేదాన్ని. కానీ ఎన్ని చేసినా బూడిదలో పోసిన పన్నీరే! అసలే నేనీ సమస్యతో కుంగిపోతున్నానంటే.. స్కూల్లో చాలామంది నన్ను ‘డాల్మేషన్‌ డాగ్‌’ అని పిలిచేవారు. చుట్టూ ఉన్న వారు నానా మాటలూ అనేవారు. ఇవన్నీ నా మనసుకు బాణాల్లా గుచ్చుకునేవి.

ఆ ఆలోచనలే మనసు మార్చాయి!

ఇలా ఈ చీకట్లోనే ఏళ్లు గడిచిపోయాయి. 14 ఏళ్లొచ్చేసరికి దాదాపు సగం చర్మం తెల్లగా మారిపోయింది. షార్ట్స్‌, స్లీవ్‌లెస్‌ దుస్తులు వేసుకోవడానికి భయపడేదాన్ని. ఇతరులతో మాట్లాడడానికి వెనకాడేదాన్ని. నాలుగ్గోడల మధ్య ఒంటరిగా ఉండడానికే ఇష్టపడేదాన్ని. అయితే ఇలా ఆలోచిస్తున్న క్రమంలోనే ఓ రోజు ‘అసలు నేనెందుకు ఈ సమస్యను, ప్రతికూల ఆలోచనల్ని అధిగమించకూడదు?!’, ‘నాకంటూ ప్రత్యేకమైన జీవితాన్ని ఎందుకు సృష్టించుకోకూడదు?!’ అనుకున్నా. ఈ ఆలోచనలు నాలో ఎన్నడూ లేనంతగా సానుకూల దృక్పథాన్ని నింపాయి. వెంటనే నాన్న దగ్గరికి వెళ్లా.. ‘ఎవరేమనుకున్నా.. నేను నాలాగే ఉంటా.. నన్ను నేను నిరూపించుకుంటా..’ అని చెప్పా. దాంతో వాళ్లూ సంతోషించి నన్ను ప్రోత్సహించారు. ఇక అప్పట్నుంచి మందులు, ఆహార నిబంధనలు.. వంటివన్నీ పక్కన పెట్టేశా. నా మనసుకు ఏదైతే నచ్చుతుందో అదే చేస్తున్నా. అందులోనే నాకు బోలెడంత సంతోషం దొరుకుతుంది.

స్వీయ ప్రేమతో మొదలుపెట్టి..!

నేనొక్కదాన్నే కాదు.. నాలా ఎంతోమంది ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారు. వాళ్లలో స్ఫూర్తి నింపాలనుకున్నా. అందుకు సోషల్‌ మీడియాను వారధిగా చేసుకున్నా. ఒకప్పుడు మచ్చలతో నిండిపోయిన నా చర్మాన్ని చూపించడానికే భయపడిన నేను.. ఏటికేడు నా చర్మం మారిపోయిన తీరును ఫొటోలు, వీడియోల రూపంలో ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ.. ఈ క్రమంలో నేనెదుర్కొన్న సవాళ్లనూ క్యాప్షన్‌గా అక్షరీకరించడం మొదలుపెట్టా. వీటికి కొంతమంది నుంచి విమర్శలు వచ్చినా.. చాలామంది మాత్రం సానుకూలంగా స్పందించేవారు. నా పారదర్శకతను ప్రశంసించేవారు. కొన్ని కంపెనీలు నాకు మోడలింగ్‌ అవకాశాలనూ అందించాయి. అన్నింటినీ సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్నా. నాకు డ్యాన్స్‌ అంటే ప్రాణం.. నా జీవితంలోని గడ్డు రోజుల్ని ఎదుర్కోవడంలో డ్యాన్స్‌దీ ప్రధాన పాత్రే! అందుకే ఇప్పటికీ నాకు నచ్చిన పాటలకు స్టెప్పులేస్తుంటా. ఇలా ఓవైపు సోషల్‌ మీడియాలో బిజీగా ఉంటూనే.. నా చదువునూ కొనసాగించా. ప్రస్తుతం ఓ బ్యాంక్‌లో ఫైనాన్షియల్‌ అనలిస్ట్‌గా పనిచేస్తున్నా.

ప్రత్యేకతలపై దృష్టి పెట్టాలి!

ఆఖరుగా అందరికీ ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నా.. విటిలిగోపై చాలామందిలో చాలా రకాల అపోహలున్నాయి. ఇది క్యాన్సర్‌ తరహా వ్యాధి అని.. దీనివల్ల అంతర్గత అవయవాలకు నష్టం జరుగుతుందని.. అనుకుంటారు. కానీ ఇది కేవలం చర్మానికి సంబంధించిన సమస్య. ఈ సమస్య ఉన్న మరికొంతమంది నలుగురిలోకి వెళ్లకపోవడం, ఆత్మన్యూనతకు గురవడం, పిల్లలకు ఉంటే ఎవరేమనుకుంటారోనని వాళ్లనూ నలుగురితో కలవనివ్వకపోవడం.. వంటివి చేస్తుంటారు. ఇలాంటి ఆలోచనల వల్ల మనకే నష్టం. కాబట్టి స్వీయానుభవంతో చెప్తున్నా.. బాహ్య సౌందర్యం ముఖ్యం కాదు.. అలాగని ఎవరూ ఏ విషయంలోనూ పర్‌ఫెక్ట్‌ కారు. మనలోని లోపాలపై పెట్టే దృష్టిని ప్రత్యేకతలపై పెట్టగలిగితే మనమేంటో ఈ సమాజానికి నిరూపించుకోగలుగుతాం. నా జీవితం నుంచి నేను నేర్చుకున్న పాఠమిదే!’

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్