Ekta Kapoor : సీరియల్‌ క్వీన్‌ సిగలో మరో ఘనత!

‘ఓటమి గెలుపుకి నాంది’ అంటుంటారు. బాలీవుడ్‌ నిర్మాత ఏక్తా కపూర్‌కు ఈ మాటలు అచ్చుగుద్దినట్లు సరిపోతాయి. సరిగ్గా ముప్ఫై ఏళ్ల క్రితం ఆమె చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పుడు పురుషాధిపత్యమే ఆమెకు స్వాగతం పలికింది.

Updated : 06 Dec 2023 18:59 IST

(Photos: Instagram)

‘ఓటమి గెలుపుకి నాంది’ అంటుంటారు. బాలీవుడ్‌ నిర్మాత ఏక్తా కపూర్‌కు ఈ మాటలు అచ్చుగుద్దినట్లు సరిపోతాయి. సరిగ్గా ముప్ఫై ఏళ్ల క్రితం ఆమె చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పుడు పురుషాధిపత్యమే ఆమెకు స్వాగతం పలికింది. స్టార్‌ కిడ్‌ హోదా ఉన్నా.. తాను రూపొందించిన కంటెంట్‌ పలుమార్లు తిరస్కరణకు గురైంది. అయినా దర్శకనిర్మాత కావాలన్న ఆమె కలను నిజం చేసుకోవడానికి ఎంతో శ్రమించింది.. ఎన్నో సవాళ్లను సానుకూలంగా జయించింది.. ఈ పట్టుదలే నేడు ఆమెను ‘సీరియల్‌ క్వీన్‌’గా నిలబెట్టింది. బాలీవుడ్‌ చలనచిత్ర రంగంలో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న ఏక్తా సిగలో తాజాగా మరో ఘనత చేరింది. అంతర్జాతీయంగా టీవీ రంగంలో విశేష కృషి సలిపిన వారికి అందించే ‘ఇంటర్నేషనల్‌ ఎమ్మీ అవార్డు’ల్లో భాగంగా ‘ఎమీ డైరెక్టరేట్‌ అవార్డు’ అందుకుంది ఏక్తా. తద్వారా ఈ పురస్కారం వరించిన తొలి భారతీయ మహిళగా ఖ్యాతి గడించింది. ఈ నేపథ్యంలో ఈ సీరియల్‌ క్వీన్‌ సుదీర్ఘ టీవీ కెరీర్‌లోని కొన్ని ఆసక్తికర మలుపుల గురించి తెలుసుకుందాం..!

తిరస్కరణతో మొదలు..!

ఏక్తా కపూర్‌(Ekta Kapoor).. బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు జితేంద్ర, శోభా కపూర్‌ల గారాల పట్టి ఈమె. దర్శకనిర్మాతగా స్థిరపడాలన్న స్పష్టమైన కెరీర్‌ లక్ష్యాన్ని చిన్నవయసులోనే ఏర్పరచుకున్న ఆమె.. పదిహేనేళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలోనే తొలినాళ్లలో టీవీ యాడ్స్‌ కోసం కంటెంట్‌ రూపొందించినా.. అవి తిరస్కరణకే గురయ్యాయి. దీంతో తన 19 ఏళ్ల వయసులో సొంతంగా ‘బాలాజీ టెలీఫిలింస్‌’ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించిన ఆమె.. ఇక వెనక్కి తిరిగి చూడలేదు. ‘క్యూంకీ సాస్‌ భీ కభీ బహూ థీ’, ‘కుంకుమ్‌ భాగ్య’, ‘పవిత్ర రిష్తా’, ‘కసౌటీ జిందగీ కే’.. వంటి హిట్‌ సీరియల్స్‌తో దూసుకుపోయింది. ఇప్పటివరకు సుమారు 134 సీరియల్స్‌తో పాటు పలు సినిమాల్నీ నిర్మించిన ఆమె.. 17 వేల గంటల టెలివిజన్‌ కంటెంట్‌ని రూపొందించి.. భారతీయ టీవీ రంగంలో ఎవరికీ అందనంత స్థాయిలో నిలబడింది. ఈ ఘనతే ఆమెకు ‘క్వీన్‌ ఆఫ్‌ ఇండియన్‌ టెలివిజన్‌’ అనే కీర్తిని సంపాదించి పెట్టాయి.

‘K’ లక్కీ లెటర్‌!

ఏక్తా రూపొందించిన సీరియల్స్‌ పేర్లను పరిశీలిస్తే.. ఎక్కువగా ‘కె’ అక్షరంతో మొదలవడం గమనించచ్చు. దీనికీ ఓ కారణముంది. జ్యోతిష్య శాస్త్రాన్ని, సంఖ్యాశాస్త్రాన్ని ఎక్కువగా నమ్ముతుందట ఈ సీరియల్‌ క్వీన్‌. ఈ క్రమంలోనే ‘K’ తన లక్కీ లెటర్‌ అని, అందుకే తాను ఏ ప్రాజెక్ట్‌ ప్రారంభించినా.. ఈ అక్షరానికి ప్రాధాన్యమిస్తానని ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది ఏక్తా. ఇక ఈ అక్షరంతో ప్రారంభించిన ప్రాజెక్టులన్నీ సూపర్‌ సక్సెస్‌ అయ్యాయి. ఈ టీవీ క్వీన్‌కు ఆధ్యాత్మిక భావన కూడా ఎక్కువేనట!

పవర్‌ఫుల్‌ లేడీ!

బాలీవుడ్‌లో దర్శకనిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఏక్తాకు ధైర్యశాలిగానూ పేరుంది. ముఖ్యంగా మహిళలకు సంబంధించిన అంశాలు, స్త్రీల పట్ల వివక్షపై ముక్కుసూటిగా స్పందించే ఈ డేరింగ్‌ బ్యూటీ.. బాలీవుడ్‌లో అత్యంత ప్రతిభాశాలిగా, ప్రభావవంతమైన మహిళగా పేరు తెచ్చుకుంది. ఇక దేశవ్యాప్తంగా ఉన్న టాప్-50 మహిళా వ్యాపారవేత్తల్లో ఏక్తా కూడా ఒకరు. అడిగిన వారికి కాదనకుండా డబ్బు సహాయం చేసే మంచి మనసూ ఈ స్టార్‌ డాటర్‌ సొంతం!

అవంటే భయం!

మనలో ఒక్కొక్కరికీ ఒక్కో ఫోబియా ఉంటుంది. కొంతమందికి విమానమెక్కాలంటే భయం.. మరికొందరు చీకట్లో ఒంటరిగా ఉండలేకపోతారు. అయితే తన అక్క మాత్రం ఎత్తైన భవంతులు ఎక్కడానికి చాలా భయపడుతుందని, చీకట్లో ఒంటరిగా ఉండలేదని ఓ సందర్భంలో ఏక్తా సోదరుడు, బాలీవుడ్‌ నటుడు తుషార్‌ కపూర్‌ చెప్పుకొచ్చాడు.
ఇక తనకు బాగా ఇష్టమైనవేంటని అడిగితే.. పెట్స్‌ అని చెబుతోందీ సీరియల్‌ క్వీన్‌. కుక్కలు, పిల్లుల్ని బాగా ఇష్టపడే ఆమె.. వాటి ఆలనా పాలన కోసం తన ఇంట్లో ప్రత్యేకంగా ఓ షెల్టర్‌ని కూడా ఏర్పాటుచేసిందట!

అమ్మకూచి!

సాధారణంగా కూతుళ్లకు నాన్నతో అనుబంధం ఎక్కువగా ఉంటుంది. అయితే తనకు మాత్రం తన తల్లి శోభతోనే అనుబంధం ఎక్కువంటోంది ఏక్తా. ఈ క్రమంలోనే ఏ పార్టీకి హాజరైనా.. తన తల్లితో కలిసి ఫొటోలకు పోజిస్తూ తెగ సందడి చేస్తుంటుందీ ఫిల్మ్‌మేకర్‌. అంతేకాదు.. ఈ తల్లీకూతుళ్లిద్దరూ కలిసి కొన్ని సినిమా ప్రాజెక్టుల్ని కూడా నిర్మించారు.

సింగిల్‌ మామ్‌!

ప్రస్తుతం 48 ఏళ్లున్న ఏక్తా పెళ్లి చేసుకోలేదు. అయితే తనకు 36 ఏళ్ల వయసున్నప్పుడే ఎగ్‌ ఫ్రీజింగ్‌ పద్ధతిలో తన అండాల్ని భద్రపరచుకున్న ఆమె.. 2019లో సరోగసీ విధానంలో ఓ బాబుకు తల్లైంది. ఆ చిన్నారికి రావీ కపూర్‌ అని పేరు పెట్టుకున్న ఆమె.. ప్రస్తుతం ఓవైపు తన కెరీర్‌ని కొనసాగిస్తూనే.. మరోవైపు సింగిల్‌ మదర్‌గా తన కొడుకు ఆలనా పాలనను చూసుకుంటోంది.

బెస్ట్‌ ఫిల్మ్‌మేకర్‌!

చిత్రరంగంలో తన మూడు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో ‘ఉత్తమ దర్శకనిర్మాత’గా పలు ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్న ఏక్తాను.. 2021లో భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’తో సత్కరించింది. ఇక తాజాగా న్యూయార్క్‌ వేదికగా నిర్వహించిన ‘ఇంటర్నేషనల్‌ ఎమ్మీ అవార్డు’ల్లో భాగంగా ‘ఎమ్మీ డైరెక్టరేట్‌ అవార్డు’ అందుకుంది ఏక్తా. అంతర్జాతీయంగా టీవీ రంగంలో విశేష కృషి సలిపిన వారికిచ్చే ఈ పురస్కారాన్ని అందుకున్న తొలి భారతీయ మహిళగా ఖ్యాతి గడించిందీ బుల్లితెర క్వీన్‌.

‘ప్రతి ఒక్కరి జీవితంలో సవాళ్లు, అవరోధాలు ఉంటాయి. అయితే వాటిని ఎదుర్కొనే ఓర్పు, నేర్పు, పట్టుదల ఉన్నప్పుడే విజయం సాధించగలుగుతాం. ప్రపంచవేదికపై ఇంతటి ప్రతిష్టాత్మక అవార్డు అందుకోవడం గర్వంగా అనిపిస్తోంది. అయితే ఈ పురస్కారంతో నా బాధ్యత మరింతగా పెరిగింది. మరింత మందికి నా కథలు వినిపించే అవకాశం నాకు దొరికింది. ఈ అవార్డును భారతీయ టీవీ పరిశ్రమకు, అభిమానులకు అంకితమిస్తున్నా..’ అంది ఏక్తా. ప్రస్తుతం రెండు సీరియల్స్‌, మూడు చిత్రాల నిర్మాణ బాధ్యతలు నిర్వర్తిస్తోందీ బాలీవుడ్‌ ఫిల్మ్‌మేకర్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్