Dada Saheb Phalke Award: ఆ ‘ఆశే’ అవకాశాలు తెచ్చిపెట్టింది!

బాలనటిగా బాలీవుడ్‌ తెరకు పరిచయమైంది.. కానీ అన్నీ ఫ్లాప్‌లే ఎదురొచ్చాయి. అయినా పట్టు వీడకుండా ప్రయత్నించి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. షూటింగ్‌ మొదలైన రెండు రోజులకే తొలగించారు.. కానీ ఆమె మాత్రం సంయమనంతో అవకాశాల కోసం....

Published : 27 Sep 2022 20:49 IST

(Photos: Twitter)

బాలనటిగా బాలీవుడ్‌ తెరకు పరిచయమైంది.. కానీ అన్నీ ఫ్లాప్‌లే ఎదురొచ్చాయి. అయినా పట్టు వీడకుండా ప్రయత్నించి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. షూటింగ్‌ మొదలైన రెండు రోజులకే తొలగించారు.. కానీ ఆమె మాత్రం సంయమనంతో అవకాశాల కోసం ఎదురుచూసింది. అలా వచ్చిన తొలి అవకాశంతో హిట్టు కొట్టడమే కాదు.. 60, 70 దశకంలో బాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసింది. ఆమే.. బాలీవుడ్‌ అలనాటి నటి ఆశా పరేఖ్‌. నటిగా, దర్శకనిర్మాతగా చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన ఆశ.. తాజాగా ప్రతిష్టాత్మక ‘దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు’కు ఎంపికయ్యారు. 2020 సంవత్సరానికి గానూ ఈ పురస్కారం అందుకోబోతున్న ఈ అలనాటి అందాల నాయిక గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం..!

డ్యాన్సింగ్‌ క్వీన్!

ఆశ 1942, అక్టోబర్‌ 2న గుజరాతీ కుటుంబంలో పుట్టారు. ఆమె తల్లి ముస్లిం.. తండ్రి గుజరాతీ. చిన్న వయసులోనే తన తల్లి ప్రోత్సాహంతో శాస్త్రీయ నృత్యం నేర్చుకున్న ఆమె.. స్కూల్లో, ప్రత్యేక కార్యక్రమాల్లో తన డ్యాన్సింగ్‌ నైపుణ్యాలతో ప్రతి ఒక్కరినీ మెప్పించేవారు. ‘ఆస్‌మాన్‌’ అనే సినిమాతో బాలనటిగా బాలీవుడ్‌ తెరకు పరిచయమైన ఆమె.. చాలా సినిమాల్లో నటించారు.. అయినా అనుకున్నంత పేరు సంపాదించలేకపోయారు. ఆపై సినిమాలకు కామా పెట్టి చదువు పైనే తన పూర్తి దృష్టి పెట్టారామె.

తొలి సినిమాతో చేదు అనుభవం!

చదువుపై శ్రద్ధ పెట్టినా సినిమా ప్రయత్నాల్ని మాత్రం విస్మరించలేదామె. ఈ క్రమంలోనే 16 ఏళ్ల వయసులో ‘గూంజ్‌ ఉతీ షెహ్‌నాయి’ అనే సినిమాలో తొలిసారి హీరోయిన్‌గా నటించే అవకాశం ఆమెను వరించింది. అయితే షూటింగ్‌ మొదలైన రెండు రోజులకే పలు కారణాల వల్ల తిరస్కరణకు గురయ్యారు ఆశ. ఇలా చేదు అనుభవంతోనే కథానాయికగా కెరీర్‌ను మొదలుపెట్టిన ఆమెకు.. నాసిర్‌ హుస్సేన్‌ దర్శకత్వంలో ‘దిల్‌ దేఖే దేఖో’ అనే సినిమాలో మరో అవకాశం వచ్చింది. షమ్మీ కపూర్‌ సరసన నటించిన ఆమె.. ఈ సినిమాతో తొలి హిట్‌ను అందుకున్నారు. ఇక ఆపై వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదామెకు.

ఆయనతో ఆల్కహాల్‌ మాన్పించి..!

‘Aaye Din Bahar Ke’ అనే సినిమాలో ధర్మేంద్రతో కలిసి నటించారు ఆశ. అయితే ఈ షూటింగ్‌ జరుగుతున్నప్పుడు ధర్మేంద్రతో మద్యం అలవాటును మాన్పించారట ఆమె. అలా ఆ తర్వాత వీళ్లిద్దరూ మంచి స్నేహితులుగా మారారట! ఇక 1959-73 దాకా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన ఆశ.. ధర్మేంద్ర, రాజేశ్‌ ఖన్నా.. వంటి మేటి నటులందరితో తెరను పంచుకున్నారు. ఒకానొక సమయంలో అత్యధిక సంపాదన కలిగిన నటిగానూ గుర్తింపు సొంతం చేసుకున్నారామె.

ఆ ప్రశంస మర్చిపోను!

తన అభినయానికి ఎన్ని ప్రశంసలొచ్చినా ఓ సందర్భంలో ఓ దర్శకుడు ఇచ్చిన ప్రశంస మాత్రం ఎప్పటికీ మర్చిపోనంటారు ఆశ. ‘నిజ జీవితంలో చాలామంది అబ్బాయిలు నాతో మాట్లాడడానికి వెనకాడేవారు. కానీ ‘అచ్ఛా తో హమ్‌ చల్తే హై’ చిత్ర షూటింగ్‌ సమయంలో నేను తెలుపు రంగు షరారా ధరించాను. అది నాకెంతో నచ్చింది. అదే సమయంలో చిత్ర దర్శకుడు ఓం ప్రకాశ్‌ నా ఆహార్యాన్ని ప్రశంసించడం నేను మర్చిపోను. అంతేకాదు.. తన కూతురికీ ఈ తరహా షరారానే ప్రత్యేకంగా డిజైన్‌ చేయించి అందించారాయన!’ అంటూ ఓ సందర్భంలో గుర్తు చేసుకున్నారామె.


ఒంటరిగానే..

ప్రస్తుతం 80 ఏళ్లున్న ఆశ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే జీవితం గడపాలనుకున్నారు.

1998లో ‘సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌’కు ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆశ.. ఈ ఘనత సాధించిన తొలి హీరోయిన్‌గా కీర్తి గడించారు. 2001 దాకా ఈ పదవిలో కొనసాగారామె.

తన నట ప్రతిభకు గుర్తింపుగా 1992లో ‘పద్మశ్రీ’ పురస్కారం అందుకున్నారామె.

‘కతి పతంగ్‌’ అనే సినిమాకు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకున్నారు.

ప్రస్తుతం ఓ డ్యాన్స్‌ అకాడమీ నిర్వహిస్తోన్న ఈ అలనాటి అందాల తార పేరు మీద ప్రస్తుతం ముంబయిలో ఓ ఆస్పత్రి కూడా ఉంది.

సినీ రంగంలో తాను చేసిన సేవలకు గుర్తింపుగా తాజాగా ప్రతిష్టాత్మక ‘దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు’ ఆమెను వరించింది. 2020కి గానూ ఈ పురస్కారం అందుకోనున్నారు ఆశ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్