వీగన్‌ డైట్‌.. గర్భిణులకు మంచిదేనా?

అమ్మ కావడమనేది ఓ మధురానుభూతి. అందుకే ఈ ప్రత్యేక సందర్భాన్ని సెలబ్రేట్‌ చేసుకోవడానికి సీమంతం వేడుకను నిర్వహించడం పరిపాటే! ఇందులో భాగంగా కాబోయే అమ్మకు ఇష్టమైన, సంపూర్ణ పోషకాలతో నిండిన పండ్లు-పదార్థాలతో ఆమె ఒడి నింపడం ఆనవాయితీ! అయితే తన సీమంతం వేడుకలో....

Published : 27 Sep 2022 20:11 IST

అమ్మ కావడమనేది ఓ మధురానుభూతి. అందుకే ఈ ప్రత్యేక సందర్భాన్ని సెలబ్రేట్‌ చేసుకోవడానికి సీమంతం వేడుకను నిర్వహించడం పరిపాటే! ఇందులో భాగంగా కాబోయే అమ్మకు ఇష్టమైన, సంపూర్ణ పోషకాలతో నిండిన పండ్లు-పదార్థాలతో ఆమె ఒడి నింపడం ఆనవాయితీ! అయితే తన సీమంతం వేడుకలో మాత్రం అన్నీ వీగన్‌ వంటకాలే ఉండాలని కోరుకుందట బాలీవుడ్‌ డింపుల్‌ బ్యూటీ ఆలియా భట్‌. ఇందుకు కారణం.. రెండేళ్ల క్రితమే ఆమె పూర్తి వీగన్‌గా మారిపోవడమే! ఈ క్రమంలో- గర్భిణులు వీగన్‌ డైట్‌ పాటించడం సరైందేనా? ఈ ఆహార పద్ధతి వల్ల కడుపులోని బిడ్డకు అన్ని పోషకాలు అందుతాయా? అన్న సందేహాలు సహజం. మరి, దీనిపై నిపుణులేమంటున్నారో తెలుసుకుందాం రండి..

గర్భం ధరించాక మహిళలు ఎంత జాగ్రత్తగా ఉంటే.. కడుపులోని శిశువు అంత ఆరోగ్యంగా ఎదుగుతుంది. ఈ క్రమంలో కాబోయే తల్లులు సంపూర్ణ పోషకాహారం తీసుకోవడం తప్పనిసరి! అయితే పూర్తిగా మొక్కల ఆధారిత ఆహారమైన వీగన్‌ డైట్‌లో కొన్ని పోషకాలు తక్కువ మొత్తంలో ఉంటాయి. దీంతో బిడ్డకు సరైన పోషకాలు అందక వివిధ అనారోగ్యాలు తలెత్తుతాయన్నది చాలామంది భావన. కానీ ఇది సరికాదంటున్నాయి పలు అధ్యయనాలు. వీగన్లూ పోషకాహార నిపుణుల సలహా మేరకు సరైన ఆహార ప్రణాళిక పాటిస్తే సాధారణ గర్భిణుల్లాగే ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనివ్వచ్చని చెబుతున్నాయి.

ఈ పోషకాలు తక్కువట!

కడుపులోని బిడ్డ ఎదుగుదలకు కొన్ని పోషకాలు కీలకం. ముఖ్యంగా విటమిన్‌-బి12, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, ఐరన్‌, అయొడిన్‌, క్యాల్షియం, జింక్‌.. వంటివి గర్భిణిగా ఉన్నప్పుడు తలెత్తే ఎన్నో సమస్యల్ని నివారిస్తాయి. అయితే ఈ పోషకాలు వీగన్‌ డైట్‌లో తక్కువ మొత్తంలో లభిస్తాయి. ఇక ఈ పోషకాలు అందకపోవడం వల్ల బిడ్డలో పోషకాహార లోపం, తక్కువ బరువుతో జన్మించడం, ప్రి మెచ్యూర్‌ డెలివరీ, కొన్ని కేసుల్లో అబార్షన్‌ అయ్యే ప్రమాదమూ లేకపోలేదంటున్నారు నిపుణులు. అయితే వీగన్‌ డైట్‌ పాటించినప్పటికీ అన్ని పోషకాలు అందేలా ఆహార ప్రణాళిక వేసుకుంటే అందరు తల్లుల్లాగే వీగన్‌ తల్లులూ ఆరోగ్యకరమైన శిశువులకు జన్మనివ్వచ్చంటున్నారు.

ఏం తినాలి?

వీగన్‌ డైట్‌ పాటించే తల్లులు ఆయా పోషకాల కోసం కొన్ని ఆహార పదార్థాల్ని మెనూలో చేర్చుకోవడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. అవేంటంటే..!

సాధారణంగా పాలు, మాంసం.. వంటి వాటిలో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. కానీ వీగన్లు వీటిని తీసుకోరు. కాబట్టి కావాల్సిన మోతాదులో ప్రొటీన్లు పొందాలంటే సోయా ఉత్పత్తులు తీసుకోవడం మేలంటున్నారు నిపుణులు.

వీగన్లు ఎక్కువగా మొక్కల ఆధారిత ఆహారం పైనే ఆధారపడతారు. అంటే.. కాయగూరలు, పండ్లు, తృణధాన్యాలు, పప్పులు, నట్స్‌, గింజలు.. వంటివి ఎక్కువగా తీసుకుంటుంటారు. అయితే వీగన్ల కోసం ఈ పదార్థాలతో తయారుచేసిన ప్రత్యేకమైన Mock Meat కూడా ప్రస్తుతం మార్కెట్లో లభిస్తోంది. అయితే ఇందులో కొవ్వులు, ఉప్పు ఎక్కువ మోతాదులో ఉంటాయి. కాబట్టి నిపుణుల సలహా మేరకే దీన్ని తగిన మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది.

బీన్స్‌, బఠానీ, కాయధాన్యాల్లో ఫైబర్‌ ఎక్కువ మొత్తంలో లభిస్తుంది. కాబట్టి వీటిని మొలకల రూపంలో తీసుకోవడం లేదంటే నానబెట్టుకొని ఉడికించుకొని తీసుకోవడం.. ఇలా ఎలా తీసుకున్నా మంచిదేనట!

నట్స్‌, గింజల ద్వారా శరీరానికి కావాల్సిన ఐరన్‌, జింక్‌ లభిస్తాయి. అలాగే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలూ ఈ పదార్థాల్లో ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అయితే వీటిని రోజుకు ఎంత మోతాదులో తీసుకోవాలో నిపుణుల్ని అడిగి తెలుసుకోవడం మంచిది.

సాధారణంగా పాల నుంచి క్యాల్షియం ఎక్కువగా లభిస్తుందన్న విషయం తెలిసిందే! అయితే వీగన్లు ఈ పోషకం కోసం మొక్కల ఆధారిత పాలను ఎంచుకోవచ్చంటున్నారు నిపుణులు. అంటే.. బాదం, సోయా, జీడిపప్పు, కొబ్బరి, ఓట్స్‌.. వంటి పదార్థాల నుంచి తయారుచేసిన పాలను తీసుకోవచ్చు.

తృణధాన్యాలు, సెరల్స్‌లో విటమిన్‌-బి, ఫైబర్‌ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆయా పోషకాల కోసం బార్లీ, బ్రౌన్‌ రైస్‌, చిరుధాన్యాలు.. వంటివి తీసుకోవాల్సి ఉంటుంది.

వీటన్నింటితో పాటు ఎరుపు, ఆరెంజ్‌, పర్పుల్‌ రంగులో ఉండే పండ్లు, కాయగూరలతో పాటు ఆకుకూరల్నీ ఆహారంలో చేర్చుకుంటే సకల పోషకాలూ శరీరానికి అందించచ్చంటున్నారు నిపుణులు.

అలాగే ఆయా ఆహార పదార్థాలతో పాటు నిపుణుల సలహా మేరకు సప్లిమెంట్లు కూడా తీసుకోవచ్చు.


వీటికి దూరంగా..!

సాధారణ గర్భిణుల్లాగే వీగన్లూ కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండడం మంచిదంటున్నారు నిపుణులు.

ముఖ్యంగా కెఫీన్‌ ఎక్కువగా ఉండే కాఫీని సాధ్యమైనంత దూరం పెట్టాలి. అది కూడా రోజుకు ఒకటి లేదా రెండు కప్పులకు మించకుండా చూసుకోవాలి.

ఎక్కువగా ప్రాసెస్‌ చేసిన వీగన్‌ పదార్థాల్లో చక్కెర, కొవ్వులు అధికంగా ఉంటాయి. కాబట్టి వీటిని ఎంత దూరం పెడితే అంత మంచిది.

పచ్చిగా తీసుకునే ఆహార పదార్థాల ద్వారా బ్యాక్టీరియా, క్రిములు శరీరంలోకి ప్రవేశించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పండ్లు మినహాయించి సాధ్యమైనంత వరకు ఉడికించిన పదార్థాలకే ప్రాధాన్యమివ్వమంటున్నారు నిపుణులు. ఇక పండ్లను తీసుకునే ముందు బాగా శుభ్రం చేయడం మర్చిపోవద్దు.


ప్రసవానంతర ఒత్తిళ్లు తగ్గుతాయట!

వీగన్‌ డైట్‌ వల్ల గర్భిణులకు సకల పోషకాలు అందడమే కాదు.. దీనివల్ల వారికి మరెన్నో ప్రయోజనాలు చేకూరతాయంటున్నారు నిపుణులు.

వీగన్‌ డైట్‌ పాటించిన గర్భిణుల్లో ప్రసవానంతర ఒత్తిళ్లు, ఆందోళనలు తగ్గినట్లు ఓ అధ్యయనంలో తేలింది. అలాగే వీరు సిజేరియన్‌ నుంచి త్వరగా కోలుకున్నట్లు, మాతా శిశుమరణాల రేటు కూడా చాలావరకు తగ్గినట్లు ఈ రీసెర్చ్‌ స్పష్టం చేసింది.

వీగన్ ఆహార పద్ధతిలో చక్కెరలు, కొవ్వులు తక్కువ మొత్తంలో శరీరానికి అందుతాయి. తద్వారా జెస్టేషనల్‌ డయాబెటిస్‌ (ప్రెగ్నెన్సీలో మధుమేహం) రిస్క్‌ చాలా తక్కువంటున్నారు నిపుణులు.

ఈ ఆహార పదార్థాల్లో ఫైబర్‌ శాతం అధికంగా ఉంటుంది. ఇది గర్భిణిగా ఉన్నప్పుడు రక్తపోటు పెరగకుండా (ప్రి-ఎక్లాంప్సియా) అదుపు చేస్తుంది.

కడుపులోని బిడ్డ ఎదుగుదలలో సమస్యల్లేకుండా ఈ డైట్‌ కాపాడుతుందని కొన్ని అధ్యయనాల్లో స్పష్టమైంది.

అయితే ఈ ఆహార పద్ధతి వల్ల బహుళ ప్రయోజనాలున్నప్పటికీ ఇంకా దీనిపై లోతుగా అధ్యయనాలు జరగాల్సి ఉందంటున్నారు పరిశోధకులు. కాబట్టి వీగన్ డైట్ పాటించే వారు గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన ఆహారం విషయంలో సంబంధిత నిపుణుల సూచనలు, సలహాలు తీసుకోవడం అవసరం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్