ఇస్రో కోసం అంటార్కిటికా వెళ్లా!

అంతరిక్ష రంగంలో.. ఇస్రో చేస్తున్న అద్భుతాల గురించి పరిచయం అవసరం లేదు. అటువంటి సంస్థలో ఇంటర్న్‌షిప్‌తో మొదలైన ఆమె ప్రయాణం నేడు కొత్త శిఖరాలని చేరుకుంది.

Updated : 30 Jan 2023 07:15 IST

అంతరిక్ష రంగంలో.. ఇస్రో చేస్తున్న అద్భుతాల గురించి పరిచయం అవసరం లేదు. అటువంటి సంస్థలో ఇంటర్న్‌షిప్‌తో మొదలైన ఆమె ప్రయాణం నేడు కొత్త శిఖరాలని చేరుకుంది. భూటాన్‌లో ఇస్రో కొత్తగా స్థాపించిన గ్రౌండ్‌ స్టేషన్‌కి సారథిగా బాధ్యతలు తీసుకున్నారు తెలుగు తేజం.. షాద్‌నగర్‌ ఆడపడుచు గొట్టిముక్కల ఉమాదేవి. ఇస్రోలో కీలక శాస్త్రవేత్తగా తనదైన ముద్రవేసిన
ఆమె వసుంధరతో తన ప్రయాణాన్ని పంచుకున్నారు..

మానాన్న గోపాలరావు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వద్ద 15 ఏళ్లపాటు పీఎస్‌గా పనిచేశారు. అమ్మ లక్ష్మీబాయి. నేను హైదరాబాద్‌లోనే పుట్టిపెరిగా. మాడపాటి బాలికల ఉన్నత పాఠశాలలో చదువుకున్నా. కమలా నెహ్రూ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలలో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేశా. రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకర్‌గా బంగారు పతకాన్ని అందుకున్నా. ఇంటర్న్‌షిప్‌ కోసమని బాలానగర్‌లోని పరిశ్రమల్లో ప్రయత్నిస్తున్నప్పుడు ఇస్రోకు చెందిన నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ)కు వెళ్లా. అక్కడున్నవారు ఓ మంచి ఉద్యోగం ఉంది దరఖాస్తు చేసుకొమ్మని సలహా ఇవ్వడం... 1984లో విధుల్లో చేరిపోవడం చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌ (ఏఎంఐఈటీఈ) పూర్తిచేసి అక్కడే ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నా. అప్పటికి ఇస్రో అంతర్జాతీయంగా తన సేవలని విస్తరించేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా భారతీయ రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహాలకోసం కొత్త గ్రౌండ్‌స్టేషన్‌ సిస్టమ్‌లు ఏర్పాటు చేసి నిపుణుల కోసం చూస్తోంది. ఎన్‌ఆర్‌ఎస్‌సీలో నాకున్న అనుభవం, పరిజ్ఞానంతో ఆ అవకాశాన్ని అందుకుని గ్రౌండ్‌ స్టేషన్‌లోని శాటిలైట్‌ డేటా రిసెప్షన్‌ సిస్టమ్‌ విభాగంలో ఉన్నతోద్యోగినిగా చేరిపోయాను. అధికారుల ప్రోత్సాహం.. నూతన ఆవిష్కరణలపై ఉత్సుకతతో కెరియర్‌లో ఎన్నో విజయాలు సాధించా.


కొత్త బాధ్యతలు...

భూటాన్‌కు ఉపగ్రహ సేవలతోపాటు సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ సహకారం అందిస్తోన్న ఇస్రో తాజాగా అక్కడో గ్రౌండ్‌ స్టేషన్‌ను స్థాపించింది. ఆ స్టేషన్‌కి సారథ్యం వహించే బాధ్యతలని నాకప్పగించారు. అంటార్కిటికాలోని గ్రౌండ్‌ స్టేషన్‌ని ఆధునికీకరించే పనులూ మొదలుపెట్టాం. ఇందుకోసం భూటాన్‌, గడ్డకట్టే చలిలో అంటార్కిటికా వెళ్లి స్వయంగా ఆ పనులు పర్యవేక్షించా.

భవిష్యత్తులో అంటార్కిటికా, తెలంగాణలోని షాద్‌నగర్‌ గ్రౌండ్‌ స్టేషన్‌కి మధ్య మెరుగైన అనుసంధానం కోసం పనులు చేపట్టాం. ఇక్కడి నుంచి విదేశీ అంతరిక్ష సంస్థలు సైతం సేవలు పొందే వీలుంది. దీని ద్వారా ఇస్రోకు వాణిజ్యపరంగా మరింత రాబడీ రానుంది. అంటార్కిటికాలోని భారతి స్టేషన్‌లో ట్రై-బ్యాండ్‌ గ్రౌండ్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేసినందుకూ, షాద్‌ నగర్‌ గ్రౌండ్‌ స్టేషన్‌లో ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌ల కోసం ఇంటిగ్రేటెడ్‌ మల్టీమెషీన్‌ గ్రౌండ్‌ సెగ్మెంట్‌ను ఏర్పాటు చేసినందుకూ మా బృందంతో కలిసి ఎక్స్‌లెన్స్‌ అవార్డులని అందుకున్నా. ఇక స్పేస్‌ సిస్టమ్‌ మేనేజ్‌మెంట్‌లో నా సేవలకు ఆస్ట్రోనాటికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా నుంచి వ్యక్తిగతంగా ఎక్స్‌లెన్స్‌ అవార్డు అందుకున్నా.


ఆ బాధ కుంగతీసినా...

నా విజయాలకు కారణం నాభర్త శ్రీనివాస్‌, తల్లిదండ్రులే. వారి ప్రోత్సాహంతోనే ఇవన్నీ సాధ్యమయ్యాయి. అమ్మానాన్నలు ఇద్దరూ రెండేళ్ల వ్యవధిలోనే చనిపోయారు. ఆ సమయంలో మానసికంగా చాలా కుంగిపోయాను. అప్పటికి మా పిల్లలు స్కూల్‌కి వెళ్తున్నారు. ఆ బాధని దిగమింగుకుని ఇటు కెరియర్‌ని, అటు ఉద్యోగాన్ని సమన్వయం చేసుకున్నా.


పరిశోధనైనా, ఆవిష్కరణైనా, మరే బాధ్యతైనా.. చిత్తశుద్ధి, అంకితభావం, అభిరుచితోనే సాధించవచ్చు. సమయ నిర్వహణ, పనితీరు, షెడ్యూల్‌కు తగిన మార్పులు చేసుకోవడంతో కుటుంబ బాధ్యతలను సైతం చక్కగా సమన్వయం చేసుకోవచ్చు.

- కల్లిపూడి దేవేంద్రరెడ్డి, శ్రీహరికోట

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్