Japanese Exercises : ఇలా చేస్తూ.. అలా పొట్ట తగ్గించుకుందాం!

హార్మోన్ల అసమతుల్యత, మెనోపాజ్‌, అనారోగ్యపూరిత ఆహారం తీసుకోవడం, వ్యాయామాలు చేయకపోవడం.. వంటివి పొట్ట భాగంలో కొవ్వు పేరుకుపోవడానికి ముఖ్య కారణాలవుతాయంటున్నారు నిపుణులు. అయితే ఈ కొవ్వుల్ని కరిగించుకోవాలంటే సాధారణ వ్యాయామాల కంటే జపనీయులు చేసే కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాలు మరింత సమర్థంగా పనిచేస్తాయంటున్నారు....

Updated : 22 Jan 2024 12:48 IST

నడుం భాగం నాజూగ్గా ఉన్నప్పుడే శరీరాకృతి ఇనుమడిస్తుంది. కానీ పొట్ట భాగంలో పేరుకుపోయే కొవ్వులు ఈ తరహా శరీరాకృతిని దెబ్బతీస్తాయి. హార్మోన్ల అసమతుల్యత, మెనోపాజ్‌, అనారోగ్యపూరిత ఆహారం తీసుకోవడం, వ్యాయామాలు చేయకపోవడం.. వంటివి పొట్ట భాగంలో కొవ్వు పేరుకుపోవడానికి ముఖ్య కారణాలవుతాయంటున్నారు నిపుణులు. అయితే ఈ కొవ్వుల్ని కరిగించుకోవాలంటే సాధారణ వ్యాయామాల కంటే జపనీయులు చేసే కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాలు మరింత సమర్థంగా పనిచేస్తాయంటున్నారు. ఇంతకీ ఏంటవి? పొట్ట భాగంలో పేరుకున్న కొవ్వుల్ని కరిగించడానికి అవి ఎలా ఉపయోగపడతాయి? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!

నాలుగు నిమిషాల వ్యాయామం!

సాధారణంగా వ్యాయామాలంటే అరగంటో, గంటో చేసి ఆపై విశ్రాంతి తీసుకుంటాం.. కానీ ‘టబాటా వ్యాయామాలు’ ఇందుకు భిన్నం! ఎందుకంటే వీటిని కేవలం నాలుగు నిమిషాలు మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఇందులోనూ 20 సెకన్లు ఎక్సర్‌సైజ్‌ చేసి.. 10 సెకన్లు విశ్రాంతి తీసుకోవాలి.. ఇలాగే ఎనిమిది సార్లు రిపీట్‌ చేయాలి. తద్వారా ఎంచుకున్న వ్యాయామం పూర్తయ్యే సరికి నాలుగు నిమిషాలు పూర్తవుతుంది. లాంజెస్‌, బర్పీ జంపింగ్‌, జంప్‌ స్క్వాట్‌, పుషప్స్‌, క్రంచెస్‌, స్కీ జంప్స్‌.. వంటివన్నీ టబాటా వ్యాయామాల కిందికే వస్తాయి. జపాన్‌లో పుట్టిన ఈ అధిక తీవ్రత-విరామ వ్యాయామాలు (HIIT) చేస్తున్నప్పుడు పొట్టపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. తద్వారా ఆ భాగంలో పేరుకున్న కొవ్వులు కరుగుతాయి. అలాగే ఆయా వ్యాయామాన్ని బట్టి చేతులు, కాళ్లు, తొడలపైనా ఒత్తిడి పడి ఆ భాగాలూ నాజూగ్గా మారతాయి. ఇక వీటిలో కాస్త అనుభవం వచ్చే కొద్దీ వ్యాయామం చేసే సమయాన్ని, విశ్రాంతి సమయాన్ని పెంచుకుంటూ పోవాలి. అంటే.. 40 సెకన్లు వ్యాయామం చేస్తే.. 20 సెకన్లు తప్పనిసరిగా విశ్రాంతికి కేటాయించాలి. తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రభావవంతంగా పనిచేసే ఈ వర్కవుట్లు.. ఫిట్‌నెస్‌లో అనుభవం ఉన్న వారే చేయాలంటున్నారు నిపుణులు. వ్యాయామాలు కొత్తగా ప్రారంభించినా, బీపీ, గుండె సంబంధిత సమస్యలున్న వారు ఈ తరహా వ్యాయామాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదట!

‘రేడియో టైసో’తో రోజు ప్రారంభం!

మనలో చాలామంది వర్కవుట్‌ రొటీన్‌తోనే తమ రోజుని ప్రారంభిస్తారు. అందులోనూ జపనీయులు మాత్రం ‘రేడియో టైసో’ అనే ప్రత్యేక వ్యాయామాలతో తమ రోజును ప్రారంభిస్తారట! ఎక్కువగా చేతులు, కాళ్లను వేగంగా కదిలిస్తూ.. శరీరాన్ని ముందుకు, వెనక్కి వంచుతూ చేసే ఈ వ్యాయామాల వల్ల ఆయా భాగాలకే కాదు.. పొట్ట, నడుంపైనా ఒత్తిడి పడుతుంది. తద్వారా అక్కడ పేరుకున్న కొవ్వులు కరిగిపోతాయి. ఇక వీటిలోని కొన్ని భంగిమలు మనం చేసే యోగాసనాల్ని పోలి ఉంటాయంటున్నారు నిపుణులు. అలాగే ఇందులో కొన్ని కూర్చొని చేసే వ్యాయామాలూ ఉండడంతో.. అక్కడి కంపెనీలు విరామ సమయంలో తమ ఉద్యోగులతో ఈ తరహా వ్యాయామాలు సాధన చేయిస్తాయట! తద్వారా వారి పని ఒత్తిడి కాస్త తగ్గి ఉత్పాదకత పెరిగేందుకు ఇవి దోహదం చేస్తాయంటున్నారు అక్కడి నిపుణులు.

సరదాగా తగ్గించుకోండి!

వ్యాయామం అంటేనే చాలామందికి నీరసం వచ్చేస్తుంటుంది. ఈ చలికాలంలో అయితే మరీనూ! మరి, ఇలాంటి వారు వ్యాయామ ఫలితాలతో పాటు సరదానూ సొంతం చేసుకోవాలనుకుంటే హూలాహూప్ వ్యాయామం ఎంచుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. వ్యాయామ రొటీన్‌లో సరదాను పెంచుకోవడానికి జపనీయులూ ఇదే పద్ధతిని అనుసరిస్తారట! ముఖ్యంగా ఈ వర్కవుట్‌ పొట్ట భాగంలో పేరుకున్న కొవ్వుల్ని కరిగించడంలో సమర్థంగా పనిచేస్తుందంటున్నారు. హూలాహూప్‌ రింగ్‌ని నడుం భాగం నుంచి జారిపోకుండా బ్యాలన్స్‌ చేస్తూ తిప్పడం వల్ల నడుం, పొట్ట కండరాలకు చక్కటి వ్యాయామం అందుతుంది. తద్వారా ఆయా భాగాలు నాజూగ్గా మారతాయి. ఇక ఈ హూలాహూప్‌ రింగ్‌తోనూ ట్విస్ట్‌లు, స్క్వాట్స్‌.. వంటి వ్యాయామాలు చేయడం వల్ల కాళ్లు, చేతులు, కోర్‌ కండరాల (శరీర మధ్య భాగంలో ఉండే కండరాల)కు చక్కటి వ్యాయామం అందుతుంది. తద్వారా అక్కడి కొవ్వులు, క్యాలరీలు కరిగి ఆ భాగాలు నాజూగ్గా మారతాయి.

సిటప్సే.. కాస్త కొత్తగా!

రోజువారీ వ్యాయామ రొటీన్‌లో భాగంగా.. నేలపై వెల్లకిలా పడుకొని ముందుకు లేవడం, తిరిగి యథాస్థానానికి రావడం.. ఇలా విభిన్న భంగిమల్లో చేసే ‘సిటప్స్‌’ వ్యాయామాలు చాలామందికి అలవాటే! అయితే జపనీయులు దీన్నే కాస్త భిన్నంగా ప్రయత్నిస్తుంటారు. ‘సీజా (Seiza) సిటప్స్‌’గా పిలిచే ఈ వర్కవుట్స్‌ని సీజా భంగిమలో కూర్చొని చేయాల్సి ఉంటుంది. అంటే.. ఒక మోకాలిని మడిచి.. మరో మోకాలిని నేలపై చాచి ఈ వ్యాయామాలు చేస్తుంటారు అక్కడి వారు. మరికొందరు రెండు మోకాళ్లని వెనక్కి మడిచి వాటిపై కూర్చొని విభిన్న భంగిమలు సాధన చేస్తుంటారు. ఇలా శరీరాన్ని బ్యాలన్స్‌ చేసే క్రమంలో పొట్ట కండరాలపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. తద్వారా అక్కడి కొవ్వులు, క్యాలరీలు కరిగిపోయి.. పొట్ట తగ్గుతుంది.

‘నిహాన్‌ బుయో’ డ్యాన్స్‌!

పొట్ట భాగంలో పేరుకుపోయిన కొవ్వుల్ని కరిగించడానికి వ్యాయామాలే కాదు.. కొన్ని రకాల నృత్యరీతులూ దోహదం చేస్తాయి. వీటిలో బెల్లీ డ్యాన్స్‌, సాల్సా, జుంబా, బ్యాలే.. వంటివి మనకు తెలిసినవే! ఈ పాశ్చాత్య రీతులే కాదు.. మన సాంస్కృతిక నృత్యమైన భరతనాట్యం కూడా అధిక బరువును, పొట్ట భాగంలో పేరుకున్న కొవ్వుల్ని తగ్గించడంలో సహకరిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇదే విధంగా జపనీయులకూ ఓ సాంస్కృతిక నృత్యముంది. దాని పేరు ‘నిహాన్‌ బుయో’ (Nihon Buyo). అక్కడి మహిళలు సంప్రదాయబద్ధమైన వస్త్రధారణను ధరించి.. చేతులు, కాళ్లు, నడుం భాగాల్ని కదిలిస్తూ విభిన్న భంగిమల్లో ఈ నృత్యం చేస్తుంటారు. ఇది తమ శారీరక, మానసిక ఆరోగ్యానికి, ఫిట్‌నెస్‌కు ఎంతగానో దోహదం చేస్తున్నట్లు వారు చెబుతున్నారు. జపాన్‌ మహిళలు సన్నగా, నాజూగ్గా ఉన్నారంటే అందుకు రోజూ ఈ నృత్య సాధన చేయడమూ ఓ కారణమేనట!

ఇక వీటితో పాటు బ్యాండ్‌తో చేసే వ్యాయామాలు, బాల్‌ ట్విస్ట్‌, కెటిల్‌బెల్‌తో చేసే టవల్‌ స్వింగ్స్‌, మార్షల్‌ ఆర్ట్స్‌.. వంటివీ రోజూ సాధన చేస్తుంటారట జపనీయులు. ఇవి ఇటు పొట్ట భాగంలో పేరుకున్న కొవ్వులు కరిగించడంతో పాటు.. అటు శరీరంలోని ప్రతి భాగానికీ చక్కటి వ్యాయామాన్ని అందిస్తాయట!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్