ఆమె.. ఆదివాసీల గొంతుక!

ఆదివాసీలు అనగానే అడవుల్లో నివసించేవారు, అభివృద్ధి ఎరుగరన్న సమాధానాలను మార్చాలనుకున్నారామె. వారిపట్ల జరిగే హింస, దోపిడీలకు అడ్డుకట్ట వేయడానికి విలేకరిగా మారి వారి గళాన్ని ప్రపంచానికి వినిపిస్తున్నారు.. జసింతా కెర్‌కెటా.

Published : 24 Dec 2022 00:14 IST

ఆదివాసీలు అనగానే అడవుల్లో నివసించేవారు, అభివృద్ధి ఎరుగరన్న సమాధానాలను మార్చాలనుకున్నారామె. వారిపట్ల జరిగే హింస, దోపిడీలకు అడ్డుకట్ట వేయడానికి విలేకరిగా మారి వారి గళాన్ని ప్రపంచానికి వినిపిస్తున్నారు.. జసింతా కెర్‌కెటా. ఆ పల్లెల్లో మార్పునీ తెస్తున్నారు. ఆవిడ ప్రయాణమిది!

‘ఝార్ఖండ్‌లోని ‘ఒరాన్‌’ తెగ మాది. ఖుద్‌పోష్‌ స్వస్థలం. నాన్న జయప్రకాష్‌ అథ్లెట్‌. స్పోర్ట్స్‌ కోటాలో పోలీసయ్యారు. ఆయన ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాల్లో చదివా. పట్టణం స్కూల్లో చేరినప్పుడు ఆదివాసీల పట్ల చిన్నచూపును మొదటిసారి చూశా. ఇతరులతో పోలిస్తే నేను నల్లగా ఉండేదాన్ని. అడవి పిల్ల, ఏమీ తెలియదంటూ నానా మాటలనేవారు. కోపమొచ్చేది.. దాన్ని చదువుపై పెట్టా. పరీక్షల్లో సాధించిన రెండో స్థానం ఆత్మ విశ్వాసాన్నిచ్చింది. ఆ తర్వాత స్కూలుకి మారా. అక్కడ పరిస్థితి మరీ దారుణం. మనుషుల్లా కూడా చూసేవారు కాదు. ఇక్కడా నా దృష్టి చదువుపైనే! ఈసారి మొదటి ర్యాంకు. కాపీ కొట్టానని విడిగా కూర్చోబెట్టి రాయించేవారు. అయినా ర్యాంకు అలాగే కొనసాగింది. టీచర్లూ మెచ్చకపోగా గుర్రుగా ఉండేవారు. అప్పట్నుంచి ఇక వాళ్ల అభిప్రాయం మార్చదలచుకోలేదు’ అంటారు 39 ఏళ్ల జసింతా.

బాధకి అక్షరరూపం..

ఎనిమిదో తరగతి అమ్మాయి.. బాధ ఎవరికి చెప్పాలో తెలియక దానికి కథలు, కవితలుగా అక్షర రూపమిచ్చారు. ‘రాహి’ అనే పత్రికకు పంపేవారు. అయిదేళ్లలో అవి ఎంతోమంది అభిమానుల్ని, స్నేహితుల్ని తెచ్చిపెట్టాయి. ‘జర్నలిజంపై ఆసక్తికి మాత్రం ఓ సంఘటన కారణం. నాన్నతో విభేదాలొచ్చి అమ్మ గ్రామానికి వెళ్లిపోయింది. సెలవుల్లో ఊరెళ్లేదాన్ని. ఓసారి ఓ ఆదివాసీ జంటపై కొందరు పెద్దమనుషులు ఆయుధాలతో దాడి చేశారు. పంటలు బాగా పండాలని ఓ చిన్నమ్మాయిని బలిచ్చారని...అందుకే అలా చేశామన్నారు. భర్తను చంపేసి, భార్యను జైలుకి పంపారు. పత్రికల్లోనూ ఇదే అచ్చయ్యింది. కానీ అక్కడ జరిగింది వేరు. ఎవరో ఆ అమ్మాయిని చంపి, పొలంలో పడేశారు. తర్వాత విషయం తెలిశాక పత్రికల్లో ఆ ప్రస్తావనే లేదు. అప్పుడే ఆదివాసీల గొంతుక అవ్వాలని జర్నలిజంలోకి వచ్చా’నంటారు జసింతా.

విదేశాల్లోనూ గుర్తింపు

మాస్‌కమ్యూనికేషన్స్‌లో మాస్టర్స్‌ చేశారీమె. కొన్నాళ్లు వివిధ పత్రికలకు పనిచేశాక.. ఫ్రీలాన్సర్‌గా మారారు. బిహార్‌, ఒడిశా, ఝార్ఖండ్‌.. వివిధ రాష్ట్రాల ఆదివాసీల సమస్యలు, భూవివాదాలు, వారిపై జరిగే అత్యాచారాలు వంటివెన్నింటినో బయటపెట్టారు. ఆవిడ వ్యాసాలు జాతీయ, అంతర్జాతీయ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. వాళ్ల జీవితాలను పుస్తకం, కవితల రూపంలో తెచ్చారు. ఇవి పలు భాషల్లోకీ అనువాదమయ్యాయి. ఆదివాసీ గ్రామాల్లో పిల్లలు, మహిళలకు చదువు చెప్పిస్తున్నారు. పట్టణాలకు వలసపోయిన వారిని తీసుకొచ్చి సేవాకార్యక్రమాల్లో భాగం చేస్తున్నారు. వాళ్లూ వాళ్ల మూలాలు మర్చిపోకూడదనే ఇలా చేస్తున్నా అంటారీమె. జసింతా ఆదివాసీలపై ఉండే అభిప్రాయాలను మార్చడానికి ఓ ఎన్‌జీఓతో కలిసి పిల్లల ప్రత్యేకంగా కథలు, కవితలతో ఓ మ్యాగజీన్‌నీ తీసుకొస్తున్నారు. అంతర్జాతీయ వేదికపై ‘ఆదివాసీ జీవనం’పై ప్రసంగాలిచ్చిన జసింతా రచనలు రష్యా, జర్మనీ సహా ఎన్నో భాషల్లోకి అనువాదమయ్యాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్