బామ్మగారి ఇడ్లీ... రెండు రూపాయలకే

అదో మట్టి గుడిసె. అది కూడా టార్పాలిన్‌ పట్టాలతో కప్పి ఉంటుంది. కూర్చోడానికి కుర్చీలూ బల్లలూ అటుంచితే కనీసం ఆ గుడిసెకు తలుపులు కూడా ఉండవు. కానీ, తెల్లవారే సరికి స్కూలు పిల్లల నుంచి దినసరి కూలీలు, ఆఫీసుల కెళ్లే వాళ్ల వరకూ చాలామంది అక్కడికి చేరుకుంటారు.

Published : 30 May 2024 05:15 IST

!

అదో మట్టి గుడిసె. అది కూడా టార్పాలిన్‌ పట్టాలతో కప్పి ఉంటుంది. కూర్చోడానికి కుర్చీలూ బల్లలూ అటుంచితే కనీసం ఆ గుడిసెకు తలుపులు కూడా ఉండవు. కానీ, తెల్లవారే సరికి స్కూలు పిల్లల నుంచి దినసరి కూలీలు, ఆఫీసుల కెళ్లే వాళ్ల వరకూ చాలామంది అక్కడికి చేరుకుంటారు. ఎందుకో తెలుసా? దానం బామ్మ వడ్డించే వేడి వేడి ఇడ్లీ, సాంబార్‌ కోసం! తమిళనాడులోని పుదుక్కోటైకి చెందిన ఈమె నాలుగు దశాబ్దాలుగా ఈ ఇడ్లీల వ్యాపారం చేస్తోంది. అదీ చాలా తక్కువ ధరకే. ప్రస్తుతం ఒక్కో ఇడ్లీ ధర 2 రూపాయలే. నాలుగు దశాబ్దాల కిందట భర్త అనారోగ్యంతో మంచం పట్టడంతో ఈ ఇడ్లీ వ్యాపారం ప్రారంభించింది బామ్మ. మొదట్లో ఒక్కో ఇడ్లీ 3 పైసలకు అమ్మడం మొదలుపెట్టి, ఆ తర్వాత కేవలం కుటుంబ అవసరాలు గడిచేలా మాత్రమే ధరలు పెంచింది. నాలుగేళ్ల క్రితం వరకూ ఒక్కో ఇడ్లీ రూపాయికే అమ్మింది. భర్త మరణానంతరం ధరని రూ.2కు పెంచింది. ప్రస్తుతం చుట్టుపక్కల హోటళ్లలో ఒక్కో ఇడ్లీ రూ.10 రూపాయలకు అమ్ముతున్నా తను మాత్రం పది రూపాయల్లోనే అందరి పొట్టా నిండాలని కోరుకుంటోంది. బామ్మ గురించి తెలిసిన చుట్టుపక్కల వాళ్లు మాత్రం తనకు పప్పు దినుసులు ఇవ్వడం, ఆర్థికసాయం లాంటివి చేస్తుంటారు. 84ఏళ్ల వయసులోనూ ఉదయం 5గంటలకు నిద్రలేచి, ఒంటిచేత్తో పనులన్నీ పూర్తిచేస్తుంది. 7గంటలయ్యే సరికి ఇడ్లీ, చట్నీ, సాంబార్‌ అన్నీ తయారుచేసి వినియోగదారుల కోసం ఎదురుచూస్తుంది. రోజుకు తనకు వచ్చే ఆదాయం రూ.50 మాత్రమే. నిజానికి అవి కూరగాయల ఖర్చుకే సరిపోతాయి. తక్కువ ధరలోనే అందరి కడుపు నింపాలని చూసే ఈ బామ్మ... తను మాత్రం పిడికెడు అన్నం, మిగిలిన సాంబార్‌తో రోజు గడిపేస్తుంది. ఆత్మసంతృప్తితో నిండిన కళ్లు, పెదవులపై చిరునవ్వుని మాత్రం ఎప్పుడూ చెరగనీయదు!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్