ఎంత ప్రమాదకరమైన పామునైనా ఇట్టే పట్టేస్తుంది..!

పట్టణీకరణ, ప్రకృతిలో వస్తోన్న మార్పుల వల్ల మనుషులకు, వన్యప్రాణులకు మధ్య సంఘర్షణలు ఏర్పడుతున్నాయి. దీనివల్ల జంతుజాలంతో పాటు మనుషులకూ నష్టాలు వాటిల్లుతున్నాయి. మన దేశంలోని కశ్మీర్‌ లోయలో కూడా ఇలాంటి సంఘటనలు ఎక్కువ. కానీ వీటికి తన వంతుగా పరిష్కారం....

Published : 01 Apr 2023 12:28 IST

(Photos: Wildlife SOS)

పట్టణీకరణ, ప్రకృతిలో వస్తోన్న మార్పుల వల్ల మనుషులకు, వన్యప్రాణులకు మధ్య సంఘర్షణలు ఏర్పడుతున్నాయి. దీనివల్ల జంతుజాలంతో పాటు మనుషులకూ నష్టాలు వాటిల్లుతున్నాయి. మన దేశంలోని కశ్మీర్‌ లోయలో కూడా ఇలాంటి సంఘటనలు ఎక్కువ. కానీ వీటికి తన వంతుగా పరిష్కారం చూపించాలనుకున్నారు జంతు సంరక్షకురాలు ఆలియా మిర్‌. కశ్మీర్‌లోనే మొదటి జంతు సంరక్షకురాలైన ఆలియా దాదాపు రెండు దశాబ్దాలుగా పక్షులు, పాములు, ఎలుగుబంట్లతో పాటు పలు వన్యప్రాణులనూ సంరక్షిస్తున్నారు. ఆమె సేవలను గుర్తించిన అక్కడి ప్రభుత్వం ఇటీవలే ‘వైల్డ్‌ లైఫ్‌ కన్జర్వేషన్‌ అవార్డు’తో సత్కరించింది. తద్వారా ఈ అవార్డు అందుకున్న తొలి కశ్మీర్‌ మహిళగా పేరు సొంతం చేసుకున్నారు. మరి, ఆమె వివరాలు తెలుసుకుందామా...

కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జన్మించిన ఆలియా మిర్‌.. సైన్స్‌, మేథమెటిక్స్‌ రెండిటిలోనూ పీహెచ్‌డీ చేశారు. అయితే ఆమె మొదట మ్యాథ్స్‌ టీచర్‌గా రాణించాలని కలలు కన్నారు. కానీ విధి మరోలా ఆలోచించింది. ఆమె భర్త ‘వైల్డ్‌ లైఫ్‌ ఎస్‌ఓఎస్‌’ స్వచ్ఛంద సంస్థలో పని చేస్తుండడంతో ఆమె కూడా భర్తతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలా క్రమంగా వన్యప్రాణుల సంరక్షణపై మక్కువ పెంచుకున్నారు. దాంతో 2004లో అదే సంస్థలో వాలంటీర్‌గా చేరి సంస్థ తరఫున వీధి జంతువుల సంరక్షణ బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత 2006లో అదే స్వచ్ఛంద సంస్థలో ఉద్యోగిగా మారారు.

ఆ సంఘటన షాక్‌కు గురి చేసింది..!

2006లో జరిగిన ఒక సంఘటన ఆలియాను షాక్‌కు గురి చేసింది. కశ్మీర్‌ లోయలోని ఓ ప్రాంతంలో ఎలుగుబంటి జనావాసాల్లో ప్రవేశించింది. దాంతో అక్కడి ప్రజలు భయాందోళనలకు గురై ఆ ఎలుగుబంటిని రాళ్లతో కొట్టి చంపారు. అది ఆమెను ఎంతో కలిచివేసింది. పట్టణీకరణ, ప్రకృతిలో వస్తోన్న మార్పుల వల్ల మనుషులు, వన్యప్రాణుల మధ్య సంఘర్షణ ఏర్పడుతోందని; దీనివల్ల జంతువులతో పాటు మనుషులకు కూడా నష్టం జరుగుతోందని గమనించారు. ఈ విషయంపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు గాయపడిన వన్యప్రాణులను సంరక్షించాలని భావించారు.

నేర్పుగా పాముల్ని పట్టేస్తారు!

సాధారణంగా చాలామంది పామును చూడగానే ఆమడ దూరం పారిపోతుంటారు. కానీ, ఆలియా మాత్రం అలా కాదు. ఎంత ప్రమాదకరమైన పామునైనా అవలీలగా పట్టేస్తారు. ఆ తర్వాత వాటిని సురక్షితమైన ప్రాంతాల్లో విడిచిపెడుతుంటారు.
‘పట్టణీకరణ, పర్యావరణంలో జరుగుతోన్న మార్పుల వల్ల చాలా రకాల పాములు జనావాసాల్లోకి వస్తున్నాయి. వీటి గురించి సరైన అవగాహన లేక చాలామంది స్థానికులు వాటిని చంపేస్తుంటారు’ అంటోంది ఆలియా. ఈ సమస్యను నివారించడానికి తనవంతుగా వాటిని రక్షించాలనుకున్నారు. అలా ఎవరైనా సమాచారం ఇచ్చిన వెంటనే అక్కడికి వెళ్లి వాటిని సురక్షితమైన ప్రాంతాల్లో వదిలి పెట్టడం మొదలుపెట్టారు. ఇలా కొన్ని సంవత్సరాలుగా ఎన్నో పాములను ఆమె రక్షించారు. ఇందులో అత్యంత విషపూరితమైనవి కూడా ఉన్నాయి.

పాములు పట్టే క్రమంలో ఓ సందర్భంలో ఆలియా వార్తల్లో నిలిచారు. ముఖ్యమంత్రి నివాసంలోకి వచ్చిన ఓ విషపూరితమైన పామును ఆమె గంట పాటు శ్రమించి పట్టుకున్నారు.

అందుకే పురస్కారం!

కశ్మీర్‌ లోయలో మనుషులు-చిరుతలు.. మనుషులు-ఎలుగుబంట్ల మధ్య సంఘర్షణలు ఎక్కువగా జరుగుతాయంటున్నారు ఆలియా. వీటికి కూడా పట్టణీకరణ, మారుతోన్న వాతావరణ పరిస్థితులే కారణమంటారామె.  ఈ క్రమంలో జంతు సంరక్షకురాలిగా ఆలియా ఎన్నో వన్యప్రాణులను సంరక్షించారు. అలాగే ఇటు ప్రజల్లోనూ పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. వీటితో పాటు ఆలియా రెండు ఎలుగుబంట్ల సంరక్షక కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఆమె రక్షించిన వన్యప్రాణుల్లో పక్షులు, పాములు చిరుతలతో పాటు ఆసియా నల్ల ఎలుగుబంట్లు, హిమాలయన్ గోధుమ రంగు ఎలుగుబంట్లు, ఇతర వన్యప్రాణులు కూడా ఉన్నాయి. ‘వైల్డ్‌లైఫ్‌ ఎస్‌ఓఎస్‌’ ప్రవేశపెట్టిన రెస్క్యూ హెల్ప్‌లైన్‌ కూడా ఆలియా నేతృత్వంలోనే కొనసాగుతోంది. ఇవే కాకుండా వన్యప్రాణుల్లో అరుదైన జాతులకు సంబంధించిన సర్వేల్లో కూడా ఆలియా పాలుపంచుకున్నారు. ఒక మహిళగా వన్యప్రాణుల సంరక్షణ కోసం చేస్తోన్న సేవలను గుర్తించిన ప్రభుత్వం ఆలియాను ఇటీవలే ‘వైల్డ్‌ లైఫ్‌ కన్జర్వేషన్‌ అవార్డు’తో సత్కరించింది. ఆమె ఈ అవార్డును జమ్మూ కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ చేతుల మీదుగా అందుకున్నారు. ఆలియా ప్రస్తుతం ‘వైల్డ్‌లైఫ్‌ ఎస్‌ఓఎస్‌’ సంస్థకు ప్రోగ్రామ్ హెడ్, ఎడ్యుకేషన్ ఆఫీసర్‌గా సేవలందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్