Nanjamma: పశువుల కాపరి.. ఉత్తమ నేపథ్య గాయని!

గుర్తింపు తెచ్చుకోవాలంటే ఉన్నత చదువులే చదవాలా? అవార్డులు అందుకోవాలంటే అత్యున్నత స్థాయిలోనే ఉండాలా? అంటే.. కాదని నిరూపిస్తోంది కేరళకు చెందిన 62 ఏళ్ల నంజమ్మ. ఓ మారుమూల గిరిజన గ్రామంలో పుట్టిపెరిగిన ఆమె నిరక్షరాస్యురాలు. ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు ఇతరులపై.....

Updated : 25 Jul 2022 19:23 IST

(Photos: Facebook)

గుర్తింపు తెచ్చుకోవాలంటే ఉన్నత చదువులే చదవాలా? అవార్డులు అందుకోవాలంటే అత్యున్నత స్థాయిలోనే ఉండాలా? అంటే.. కాదని నిరూపిస్తోంది కేరళకు చెందిన 62 ఏళ్ల నంజమ్మ. ఓ మారుమూల గిరిజన గ్రామంలో పుట్టిపెరిగిన ఆమె నిరక్షరాస్యురాలు. ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు ఇతరులపై ఆధారపడకూడని.. పశువులు మేపుతూ జీవనం సాగించేది. ఈ క్రమంలో అలసటను మర్చిపోవడానికి కొన్ని జానపద గీతాలు ఆలపించేది. ఇవే నేడు ఆమెకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెడతాయని ఆనాడు ఆమె ఊహించి ఉండదు. తనలో నిక్షిప్తమై ఉన్న ఈ గాత్ర నైపుణ్యమే తాజాగా ‘ఉత్తమ నేపథ్య గాయని’గా జాతీయ చలన చిత్ర పురస్కారం తెచ్చిపెట్టింది. ‘అయ్యప్పనుమ్ కోషియమ్‌’ అనే చిత్రంలో ఆమె పాడిన టైటిల్‌ సాంగ్‌కు గాను ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైన ఈ అవ్వకు.. అసలు పాటలు పాడే అవకాశం ఎలా వచ్చిందో తెలుసుకుందాం రండి..

కేరళ పాలక్కడ్‌లోని అట్టప్పడి గ్రామంలో ఇరుల అనే గిరిజన తెగలో పుట్టిపెరిగారు నంజమ్మ. పేదరికం, అవగాహన లేమి కారణంగా విద్యకు నోచుకోలేకపోయిందామె. పదిహేనేళ్ల వయసులోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. తన ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు ఇంట్లో వాళ్లపై ఆధారపడకుండా తన కాయ కష్టం తానే చేసుకోవాలనుకునేది. ఈ క్రమంలోనే ఆరు పదుల వయసు దాటినా పశువులు మేపుతూ జీవనం సాగించేదామె.

అలా మొదలైంది!

ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపే ఉండదన్నట్లు.. ఓవైపు పశువులు మేపుతూ.. మరోవైపు తన మాతృభాష (ఇరుల భాష)లో జానపద గేయాలు పాడుతూ ఆ అలసటను మర్చిపోయేదామె. ఇలా తనలో నిక్షిప్తమై ఉన్న గాత్ర నైపుణ్యం అక్కడి ‘ఆజాద్‌ కళాసంఘం అట్టకాలమ్‌’ అనే జానపద కళాకారుల సంగీత బృందంలో ఆమెను చేరేలా చేశాయి. మలయాళ నటుడు, ఇరుల నృత్య కళాకారుడు అయిన పఝాని స్వామి దీన్ని నెలకొల్పారు. ఈ బృంద సభ్యురాలిగా చేరాకే నంజమ్మ కెరీర్‌ మలుపు తీసుకుందని చెప్పచ్చు. ఈ క్రమంలోనే 2015లో ఓ డాక్యుమెంటరీతో గాయనిగా పరిచయమైన ఆమె.. ఆ మరుసటి ఏడాదే ‘వెలుత రాత్రికల్‌’ అనే సినిమాలో ఐదు పాటలు పాడి మెప్పించింది. ఇక అప్పట్నుంచి ఈ పాటల బామ్మకు అవకాశాలు వరుస కట్టాయి.

ప్రకృతితో మమేకమై..!

ఈ క్రమంలోనే 2020లో దర్శకుడు సాచి (అదే ఏడాది చనిపోయారు) తెరకెక్కించిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్ (ఏకే)’ అనే సినిమాలో నంజమ్మకు అవకాశం వచ్చింది. ఇందులో మూడు పాటలు పాడారామె. అంతేనా.. వీటికి బాణీలూ తానే స్వయంగా సమకూర్చారు కూడా! సహజంగానే ప్రకృతితో మమేకమయ్యే ఈ బామ్మ.. పచ్చటి పొలాలు, పశువులు, పూలు, పండ్లు, అడవులు.. వీటికి సంబంధించిన పదాలతోనే బాణీలు కడుతుంటారు. ఏకే చిత్రానికీ ఇదే సంప్రదాయాన్ని కొనసాగించారామె. ఇక ఈ పాట కోసం పరాయ్‌, డావిల్‌, కోకల్‌, జాల్త్రా.. వంటి గిరిజన వాయిద్య పరికరాల్నే ఉపయోగించడం విశేషం. ఇలా ఆమె రాసి పాడిన ‘కాలకట్ట’ అనే పాటకు తాజాగా ‘ఉత్తమ నేపథ్య గాయని’గా జాతీయ పురస్కారం అందుకున్నారు నంజమ్మ. పైగా ఇరుల భాషకు ప్రత్యేకంగా లిపి కూడా లేదు. అలాంటి భాషకు తన గాత్రంతో జాతీయ గుర్తింపు తీసుకొచ్చారీ పాటల బామ్మ. 2020లో చిత్ర విడుదలకు ముందే యూట్యూబ్‌లో ఈ పాట సెన్సేషన్‌ సృష్టించింది. నెల రోజుల్లోనే 10 మిలియన్ల వ్యూస్‌ సొంతం చేసుకొని ది బెస్ట్‌గా నిలిచింది. అంతేకాదు.. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కూడా నటించారీ బామ్మ.

నమ్మలేకపోతున్నా..

ఇలా తన పాటలతో, నటనతో అనతికాలంలోనే గుర్తింపు తెచ్చుకున్న నంజమ్మ తనకు జాతీయ పురస్కారం రావడం పట్ల ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.

‘నా పాటకు జాతీయ అవార్డు వచ్చిందంటే నేనే నమ్మలేకపోతున్నా. ఓ మారుమూల గిరిజన తెగకు చెందిన నేను తొలిసారి దిల్లీ వెళ్లి అవార్డు స్వీకరించబోతున్నానంటే.. ఇదంతా సాచి వల్లే సాధ్యమైంది. ఆయన నా దేవుడు. నేను నా సహజశైలిలో పాట పాడే స్వేచ్ఛ ఆయన నాకు అందించారు. ఇప్పుడు ఆయన మన మధ్య లేకపోవచ్చు.. కానీ ఆయన ప్రోత్సాహంతో నాకు అందిన ఈ పురస్కారాన్ని తిరిగి ఆయనకే అంకితమిస్తున్నా..’ అంటూ ఈ సందర్భంగా ఒకింత భావోద్వేగానికి లోనయ్యారీ పాటల బామ్మ. తాజా జాతీయ పురస్కారమే కాదు.. తన గాత్ర నైపుణ్యంతో 2020లో ‘కేరళ రాష్ట్ర పురస్కారం’ కూడా అందుకున్నారు నంజమ్మ.

ఈ బామ్మకు ఒక కొడుకు, ఒక కూతురు. గతంలో చిన్న పూరి గుడిసెలో ఉండే ఆమెకు.. సినీ పరిశ్రమకు చెందిన కొందరు ప్రముఖులు, గిరిజన కళాభిమానులు కొత్తిల్లు కట్టించారు. ప్రస్తుతం అదే ఇంట్లో తన కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జీవిస్తున్నారు నంజమ్మ.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్