ఉగాది పచ్చడిలో ఆరోగ్య రహస్యాలు!

ప్రతి పండక్కీ ఏదో ఒక ప్రత్యేకమైన వంటకం ఉండనే ఉంటుంది. ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాలను కొనసాగిస్తూ తయారు చేసుకునే ఈ విభిన్న వంటకాల్లో మన ఆరోగ్యాన్ని పెంచే సుగుణాలు బోలెడుంటాయి. తెలుగు సంవత్సరాది ఉగాదికి చేసుకునే ఉగాది పచ్చడీ ఇందుకు మినహాయింపు కాదు.

Updated : 08 Apr 2024 21:41 IST

ప్రతి పండక్కీ ఏదో ఒక ప్రత్యేకమైన వంటకం ఉండనే ఉంటుంది. ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాలను కొనసాగిస్తూ తయారు చేసుకునే ఈ విభిన్న వంటకాల్లో మన ఆరోగ్యాన్ని పెంచే సుగుణాలు బోలెడుంటాయి. తెలుగు సంవత్సరాది ఉగాదికి చేసుకునే ఉగాది పచ్చడీ ఇందుకు మినహాయింపు కాదు. ఆరు రుచులు మేళవించి తయారుచేసుకునే ఉగాది పచ్చడి రుచిలోనే కాదు.. సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడంలోనూ మిన్నే! శ్రీ క్రోధి నామ సంవత్సరంలోకి అడుగిడుతోన్న వేళ.. ఉగాది పచ్చడిలోని ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకుందాం రండి..

పచ్చడి.. ఇలా!

ఉగాది పచ్చడిలోని ఆరు రుచుల్ని మన జీవితంలోని వివిధ భావోద్వేగాలతో పోల్చుతుంటారు. తీపి (బెల్లం), చేదు (వేప పువ్వు), వగరు (మామిడి పిందె), కారం (కారం), ఉప్పు (ఉప్పు), పులుపు (చింత పండు).. వంటి షడ్రుచులతో ఉగాది పచ్చడిని ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

కావాల్సినవి

⚛ సన్నగా తరిగిన మామిడి ముక్కలు

⚛ చింతపండు రసం - కప్పు (చిన్న నిమ్మకాయంత చింతపండును నానబెట్టి దాన్నుంచి రసం తీసుకోవాలి)

⚛ బెల్లం - అరకప్పు

⚛ వేప పువ్వు - కొద్దిగా

⚛ కారం - టీస్పూన్

⚛ ఉప్పు - రుచికి సరిపడా

తయారీ

పైన తెలిపిన పదార్థాలన్నీ ఒక గిన్నెలోకి తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటికి సరిపడినన్ని నీళ్లు కలుపుకొంటే ఉగాది పచ్చడి రడీ అయిపోతుంది. కావాలనుకుంటే ఈ పచ్చడిలో కారానికి బదులుగా సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, అదనపు రుచి కోసం కొబ్బరి ముక్కలు, వేయించుకున్న పుట్నాల పప్పు.. వంటివి కూడా వేసుకోవచ్చు.


ఆరు రుచులు - ఆరోగ్య రహస్యాలు!

బెల్లం

ఉగాది పచ్చడిలో మనం వాడే బెల్లం శరీరంలోని విషపదార్థాల్ని బయటికి పంపించడంలో సహకరిస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, జింక్‌, సెలీనియం.. వంటి పోషకాలు ఫ్రీరాడికల్‌ డ్యామేజ్‌ నుంచి శరీరాన్ని కాపాడతాయి. అలాగే రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా రక్షిస్తాయి. ఇక ఇందులోని ఐరన్‌ రక్తహీనతను నివారిస్తుంది. దగ్గు, అజీర్తి, మలబద్ధకం.. వంటి సమస్యలకు బెల్లం పరిష్కారం చూపుతుంది.

వేప

పచ్చడిలో చేదు కోసం వాడే వేప పువ్వుకు వివిధ రకాల వ్యాధులతో పోరాడే శక్తి ఉందని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. శరీరంలోకి చేరి అనారోగ్యాలకు గురిచేసే క్రిములను నాశనం చేయడంలో వేపకు సాటి మరొకటి లేదనడం అతిశయోక్తి కాదు. రక్తాన్ని శుద్ధి చేసి అనేక చర్మ వ్యాధులను నివారించడంలో ఇది దోహదం చేస్తుంది. అలాగే మధుమేహులకు వేప చక్కటి ఔషధంలా పనిచేస్తుంది.

మామిడి

మామిడి పిందెతో పచ్చడికి వగరు రుచి వస్తుంది. గాయాలు, వాటి కారణంగా జరిగే రక్తస్రావాన్ని నివారించడంలో ఇది సహకరిస్తుంది. ఇక వేసవి వేడి వల్ల వడదెబ్బ తగలకుండా, డీహైడ్రేషన్ బారిన పడకుండా ఇది కాపాడుతుంది. ఇక ఇందులోని విటమిన్‌ ‘సి’ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహకరిస్తుంది. గ్యాస్ట్రిక్‌, ఛాతీలో మంట.. వంటి సమస్యల్ని తొలగించడంతో పాటు పొట్టను పరిశుభ్రంగా ఉంచడానికి మామిడిలోని పీచు పదార్థం సహకరిస్తుంది.

కారం

చర్మ ఇన్ఫెక్షన్లతో పోరాడి రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు కారంలో ఉన్నాయి. అందుకే దీన్ని ఇమ్యూనిటీ బూస్టర్‌గా పేర్కొంటారు. అలాగే ఇందులో ఉండే క్యాప్సైచిన్‌ అనే పదార్థం నొప్పి నివారిణిగా పనిచేస్తుంది. జీర్ణశక్తిని పెంచడం, బరువును తగ్గించడంతో పాటు ముక్కు దిబ్బడ నుంచి త్వరిత ఉపశమనం కలిగిస్తుంది.

ఉప్పు

వేసవిలో మన శరీరం డీహైడ్రేషన్‌ బారిన పడే ప్రమాదం ఎక్కువ. ఈ సమస్య నుంచి విముక్తి పొందాలంటే తగినంత సోడియంను శరీరానికి అందించడం ముఖ్యం. ఉగాది పచ్చడిలోని ఉప్పు ఇందుకు దోహదపడుతుంది. అదేవిధంగా నీరసాన్ని తరిమికొట్టడంలో ఇది సహకరిస్తుంది. అయితే ఆహారంలో ఉప్పు ఎక్కువగా తీసుకోవడం కూడా మంచిది కాదు.

చింత

మనం తీసుకున్న ఆహారంలోని ఖనిజాల్ని శరీరం సులభంగా గ్రహించేందుకు.. శరీరంలోని విష పదార్థాలను తొలగించేందుకు చింతపండు సహకరిస్తుంది. ఇక అజీర్తి వల్ల కలిగే అసౌకర్యానికి చెక్‌ పెట్టడంతో పాటు శరీరంలోని కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో దీని పాత్ర కీలకం. ఇక అందాన్ని పెంచే శక్తి కూడా చింతపండుకు ఉందని చెబుతున్నారు సౌందర్య నిపుణులు. అందుకే దీన్ని వివిధ సౌందర్య ఉత్పత్తుల్లోనూ వాడుతుంటారు. కొంతమంది దీంతో ఫేస్‌ప్యాక్స్‌ కూడా ప్రయత్నిస్తుంటారు.

అయితే ఉగాది పచ్చడి ఆరోగ్యదాయకం.. ఎంత తింటే అంత మంచిదనుకుంటే పొరపాటే! ఎందుకంటే ఏదైనా మితంగా తీసుకుంటేనే దాని ప్రయోజనాలు పొందచ్చంటున్నారు నిపుణులు.
అందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్