Mompower360 : ఇది ‘అమ్మల’ కమ్యూనిటీ!

‘ప్రతి పుట్టుకకు ఓ పరమార్థం ఉంటుందం’టారు. ఇదే సిద్ధాంతాన్ని నమ్ముతుంది మాజీ మిసెస్‌ ఇండియా యూనివర్స్‌ లక్ష్మీ శేషాద్రి.

Published : 01 Aug 2022 13:13 IST

‘ప్రతి పుట్టుకకు ఓ పరమార్థం ఉంటుందం’టారు. ఇదే సిద్ధాంతాన్ని నమ్ముతుంది మాజీ మిసెస్‌ ఇండియా యూనివర్స్‌ లక్ష్మీ శేషాద్రి. ఇంజినీర్‌గా, మోడల్‌గా, అమ్మగా సక్సెసైన ఈ ముద్దుగుమ్మకు.. తన వంతుగా ఈ సమాజానికి ఏదైనా చేయాలన్న తపన చిన్న వయసు నుంచే ఉండేది. కరోనా తర్వాత దానికి కార్యరూపమిచ్చి విశ్వవ్యాప్తంగా ఎంతోమంది అమ్మల్లో స్ఫూర్తి నింపుతోంది. తల్లయ్యాక వివిధ కారణాల వల్ల ఆగిపోయిన వాళ్ల జీవితాలను తిరిగి గాడిలో పడేసే పనిలో నిమగ్నమైందామె. ఇందుకు ఓ ఆన్‌లైన్‌ కమ్యూనిటీని సైతం ప్రారంభించిందామె. ‘ఓ మహిళే సాటి మహిళను ముందుకు నడిపించగలదు..’ అంటోన్న లక్ష్మి తన స్ఫూర్తిదాయక ప్రయాణం గురించి ఏం చెబుతున్నారో తెలుసుకుందాం రండి..

ప్రస్తుతం యూఎస్‌ఏలోని ఫ్లోరిడాలో స్థిరపడిన లక్ష్మీ శేషాద్రి 2016లో ‘మిసెస్‌ ఇండియా యూనివర్స్‌’ కిరీటాన్ని గెలుచుకుంది. దాంతో అదే ఏడాది ‘మిసెస్‌ యూనివర్స్‌’ పోటీల్లో పాల్గొన్న ఆమె.. టాప్‌-10లో చోటు దక్కించుకుంది.. ‘మిసెస్‌ పర్‌ఫెక్షన్‌’గా నిలిచింది. ఇంజినీరింగ్‌ విద్యను అభ్యసించిన లక్ష్మికి మోడలింగ్‌ రంగంలోనూ ప్రవేశముంది. సుమారు 15 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకొని అమెరికా వెళ్లిపోయిన ఆమె.. ప్రస్తుతం తన భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి అక్కడే నివసిస్తోంది.

అనాథల కోసం..!

ప్రతి పుట్టుకకు ఓ పరమార్థం ఉంటుందని నమ్మే లక్ష్మికి చిన్న వయసు నుంచే సమాజ సేవ చేయడమంటే మక్కువ! ఈ క్రమంలోనే ‘ది జాయ్‌ బాక్స్‌’ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను నెలకొల్పింది. ఉపయోగించిన వస్తువులు, దుస్తుల్ని సేకరించి.. అనాథాశ్రమాలకు, ఇతర స్వచ్ఛంద సంస్థలకు పంపిణీ చేయడం దీని ముఖ్యోద్దేశం. ఇలా తన సేవతో ఎంతోమంది ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తోన్న లక్ష్మికి కరోనా తర్వాత ఓ ఆలోచన వచ్చింది. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో చాలామంది గృహిణులు అటు ఇంటి పనిని, ఇటు కెరీర్‌ని సమతుల్యం చేసుకోలేక తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ఇంటి బాధ్యతల కోసం కెరీర్‌నీ త్యాగం చేసిన వారున్నారు. మరోవైపు కొత్తగా తల్లైన మహిళలు తమ చిన్నారుల ఆలనా పాలనలో పడిపోయి.. తమను తామే నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితులు వారిని శారీరకంగా, మానసికంగా కుంగదీస్తున్నాయని అర్థం చేసుకుందామె. ఈ క్రమంలో తన వంతుగా ఏదైనా చేయాలని సంకల్పించుకుంది. ఈ ఆలోచనతోనే కొవిడ్‌ తగ్గుముఖం పట్టాక ‘మామ్‌ పవర్‌ 360’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందీ బ్యూటిఫుల్‌ మామ్‌.

ఇది ‘అమ్మల’ కమ్యూనిటీ!

విశ్వవ్యాప్తంగా ఉన్న మహిళల్ని ఒక చోటుకు చేర్చి.. తమ జీవితానుభవాలతో ఒకరికొకరు స్ఫూర్తి నింపుకొనేలా ప్రోత్సహించే వేదిక ఇది. ఇందులో భాగంగా ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లలో వర్క్‌షాప్స్‌, సమావేశాలు, నిపుణుల ఉపన్యాసాలు, కౌన్సెలింగ్‌.. వంటి విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అంతేకాదు.. ఈ కమ్యూనిటీలో పిల్లల బాధ్యతలు చూసుకునే గృహిణులు, వృత్తి ఉద్యోగాలు చేసే అమ్మలు, వ్యాపారంలో స్థిరపడిన అమ్మలు, ఒంటరి తల్లులు.. ఇలా అందరూ పాల్గొనే ఏర్పాటు చేస్తోంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ తమ జీవితంలోని తీపి-చేదు అనుభవాల్ని, వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తోన్న వారు తమ విజయగాథల్ని పంచుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ మహిళలంతా తమ బాధ్యతల్ని సమర్థంగా నిర్వర్తిస్తూనే.. స్వీయ ప్రేమను పెంచుకునేలా, కెరీర్‌లో సక్సెసయ్యేలా నిపుణులతో ఉపన్యాసాలు కూడా ఏర్పాటు చేస్తోంది లక్ష్మి. శారీరక, మానసిక సమస్యలతో బాధపడే వారికి నిపుణులతో కౌన్సెలింగ్‌ ఏర్పాటుచేసి వారికి అండగా నిలుస్తోంది. ఇలా ఎంతోమంది తల్లులకు ఈ వేదికగా మద్దతు కల్పిస్తోందీ మాజీ విశ్వసుందరి.

వాళ్ల ప్రోత్సాహం కావాలి!

మహిళలు అన్నింటా విజయం సాధించాలంటే.. కుటుంబ సభ్యులూ వారికి మద్దతుగా నిలవాలంటోంది లక్ష్మి. ‘ఈతరం అమ్మలు ఎన్నో బాధ్యతల్ని తమ భుజాలపై మోస్తున్నారు. కుటుంబాన్ని, పిల్లల్ని సంరక్షిస్తూనే.. మరోవైపు కెరీర్‌లోనూ రాణిస్తున్నారు. ఈ బిజీలో పడిపోయి తమను తాము నిర్లక్ష్యం చేస్తున్నారు. తద్వారా వ్యక్తిగతంగా, వృత్తిపరంగా తమ లక్ష్యాల్ని నెరవేర్చుకోలేకపోతున్నారు. ఇదే వారిలో ఒత్తిడి, ఆందోళనలకు కారణమవుతుంది. ఇలాంటి అమ్మల్లో స్వీయ ప్రేమను పెంచి.. వారిలో ఆత్మవిశ్వాసం ప్రోది చేసి.. కన్న కలల్ని సాకారం చేసుకునే దిశగా ప్రేరేపించడానికి మా వేదిక కృషి చేస్తోంది. ఒక మహిళ సమస్య మరో మహిళకే అర్థమవుతుంది.. అందుకే మా కమ్యూనిటీలో సభ్యులు, నిపుణులు.. అందరూ మహిళలే ఉండేందుకు ప్రాధాన్యమిస్తున్నా.. ఒక మహిళ తను సంతోషంగా ఉన్నప్పుడే తన కుటుంబాన్నీ హ్యాపీగా ఉంచగలదు..’ అంటోందీ మామ్‌ప్రెన్యూర్‌.

నన్ను నేను నిర్లక్ష్యం చేయను!

ముగ్గురు పిల్లల తల్లైన లక్ష్మి.. ప్రస్తుతం తన ఆన్‌లైన్‌ కమ్యూనిటీ, ఎన్జీవో బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. మరోవైపు తన చిన్నారుల ఆలనా పాలనా చూస్తోంది. ‘ఈ బిజీలో పడిపోయి నన్ను నేను అస్సలు నిర్లక్ష్యం చేయను. నాకు ప్రకృతిలో గడపడమంటే ఇష్టం. గార్డెనింగ్‌, సైక్లింగ్‌, ఈత, హ్యామక్‌లో సేదదీరుతూ స్ఫూర్తిదాయక పుస్తకాలు చదవడం.. ఇవన్నీ నా మనసుకు ఆహ్లాదాన్ని పంచేవే. అందుకే రోజులో కాసేపైనా వీటికి సమయం కేటాయిస్తా..’ అంటూ తన లైఫ్‌స్టైల్‌తోనూ ఈ కాలపు తల్లుల్లో ప్రేరణ కలిగిస్తోందీ సూపర్‌ మామ్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్