అమ్మాయిగా వేరు... అమ్మగా వేరు

నా చిన్నప్పుడు అమ్మాయి అంటే కట్నమిచ్చి పంపేయడమే! మా ఇంట్లో మాత్రం చదువు, ఆటలకే ప్రాధాన్యం. నా 9 ఏళ్ల వయసులో టెన్నిస్‌ మొదలుపెట్టా. నావంతు వచ్చే వరకూ టెన్నిస్‌ కోర్టులో కూర్చొని హోం వర్క్‌ చేసే దాన్ని. పోటీలకు వెళ్లినా పుస్తకాలు నావెంటే.

Updated : 03 Jan 2023 01:59 IST

అనుభవ పాఠం

నా చిన్నప్పుడు అమ్మాయి అంటే కట్నమిచ్చి పంపేయడమే! మా ఇంట్లో మాత్రం చదువు, ఆటలకే ప్రాధాన్యం. నా 9 ఏళ్ల వయసులో టెన్నిస్‌ మొదలుపెట్టా. నావంతు వచ్చే వరకూ టెన్నిస్‌ కోర్టులో కూర్చొని హోం వర్క్‌ చేసే దాన్ని. పోటీలకు వెళ్లినా పుస్తకాలు నావెంటే. సాధనయ్యాక ఫిట్‌నెస్‌ కోసం 3 మైళ్ల దూరమైనా ఇంటికి పరుగెత్తేదాన్ని. ఎవరైనా ఏడిపిస్తే ఊరుకునేదాన్ని కాదు. ఇవే పోటీతత్వం, నాయకత్వ లక్షణాలు, సమయపాలన, నిర్భీతి వంటివి నేర్పాయి. నేను పెద్దయ్యే నాటికి మహిళా ఐపీఎస్‌లు లేరని తెలియదు. నేనే మొదటి ఆఫీసర్‌ని. బాధ్యతలు తీసుకునేప్పుడూ ‘చేయగలవా?’ అని ఎంతోమంది అడిగారు. కోరి ఎంచుకున్న కెరియర్‌.. కష్టమని తెలిసే వచ్చా.. చేయగలను అని చెప్పా. నన్ను నేను నిరూపించుకోవడానికి నిత్యం కష్టపడే దాన్ని. అమ్మాయి వేరు.. అమ్మగా మారాక వేరు. ప్రాధాన్యాలు మారిపోతాయి. నాకు ఇల్లు, కెరియర్‌ రెండూ ముఖ్యమే. ఎవరికైనా రోజుకు 24 గంటలే. కాబట్టి, దాన్నే తెలివిగా ప్లాన్‌ చేసుకున్నా. ఒక్కో సారి రెండు చోట్లా నా అవసరం ఉండేది. ఎక్కడ అత్యవసరమో దాన్ని బట్టి నిర్ణయం తీసుకునేదాన్ని. ఆఫీసు పార్టీలు వంటి వాటికి వెళ్లాల్సి వచ్చినా ‘ఇంట్లో పాప ఎదురు చూస్తుంటుంది. త్వరగా వెళ్లాలి’ అని ముందే చెప్పేదాన్ని. కొన్ని సార్లు ‘నో’ చెప్పడానికీ వెనకాడలేదు. క్రమంగా పనిచేసే చోట, ఇంట్లోవాళ్లు నా ప్రాధామ్యాలను అర్థం చేసుకున్నారు. ముందు నుంచీ ప్రణాళికతో ఉండటం, ఎప్పటికప్పుడు నన్ను నేను మలచుకోవడం వల్లే ఇదంతా సాధ్యమైంది. అమ్మాయిలకు నా సలహా ఒక్కటే! మీ కాళ్ల మీద మీరు నిలబడ్డాకే పెళ్లి చేసుకోండి. కెరియర్‌ ఎంచుకునేప్పుడే పిల్లలు పుట్టినా కొనసాగించగలనా అనేది చూసుకోండి. అప్పుడు ‘భవిష్యత్‌ ఇబ్బంది’కి ఆస్కారముండదు.

- కిరణ్‌ బేడీ, మాజీ ఐపీఎస్‌ అధికారి, పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్