స్ఫూర్తి పద్మాలు!

సేవ, కళ, సైన్స్‌.. ఎంచుకున్న రంగమేదైనా మనసా, వాచా తమ జీవితాలని అంకితం చేశారు. ప్రతి క్షణం తమదైన ముద్ర కోసం తపించారు. మరెంతోమంది జీవితాల్లో స్ఫూర్తి వెలుగులని నింపగలిగారు. అందుకే నేడిలా పద్మాలై వికసించారు...

Updated : 27 Jan 2023 02:35 IST

సేవ, కళ, సైన్స్‌.. ఎంచుకున్న రంగమేదైనా మనసా, వాచా తమ జీవితాలని అంకితం చేశారు. ప్రతి క్షణం తమదైన ముద్ర కోసం తపించారు. మరెంతోమంది జీవితాల్లో స్ఫూర్తి వెలుగులని నింపగలిగారు. అందుకే నేడిలా పద్మాలై వికసించారు...


నిరాడంబరతకు నిదర్శనం..

‘ఇంత చదువుకున్నావ్‌.. నీవల్ల ఇతరులకొచ్చిన ఉపయోగమేంటి?’ అన్న కూతురి ప్రశ్నతో సేవపై దృష్టిపెట్టానంటారు సుధామూర్తి. ఇంజినీరింగ్‌ చదివి టాటా సంస్థలో ఇంజినీర్‌గా, యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గానూ పని చేశారు. 1996లో.. 45 ఏళ్ల వయసులో ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ను ప్రారంభించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, దేశవ్యాప్తంగా గ్రంథాలయాలు, ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్య, వైద్య సహకారం, గ్రామీణాభివృద్ధి, కళలు, సంస్కృతి, స్వయం ప్రతిపత్తి సాధించేలా శిక్షణ వంటి ఎన్నో కార్యక్రమాల్ని దీని ద్వారా నిర్వహిస్తున్నారు. ఈ ఫౌండేషన్‌కు సుధా మూర్తే ఛైర్పర్సన్‌. 2021లో పదవీ విరమణ తీసుకొని మూర్తి ఫౌండేషన్‌ ద్వారా సేవలు కొనసాగిస్తున్నారు. సెక్స్‌ వర్కర్ల జీవితాలను మార్చి వాళ్లకి ఓ మార్గం చూపించడంలోనూ కృషి చేస్తున్నారీవిడ. సేవను పనిలా కాక పిల్లల్ని పెంచినంత బాధ్యతగా చేయాలంటారీమె. ఈ సేవలకు గుర్తింపుగా ఎన్నో పురస్కారాలు అందుకున్న ఈవిడని 2006లో పద్మశ్రీ.. ఈ ఏడాది పద్మభూషణ్‌ వరించాయి. ఆడంబరాలకు దూరంగా ఉండే 72 ఏళ్ల సుధా.. 30కిపైగా పుస్తకాలనూ రచించారు.


‘లత’ అనుకునేవారు

డుగురు తోబుట్టువుల్లో పెద్ద సుమన్‌ కళ్యాణ్‌పూర్‌. స్వస్థలం కర్ణాటక అయినా పుట్టింది ఢాకా (1993)లో. తర్వాత ముంబయిలో స్థిరపడ్డారు. అభిరుచితో సంగీతం నేర్చుకున్నా ఇంట్లోవాళ్ల ముందే పాడేవారు. ఓసారి తప్పక కళాశాలలో పాడినప్పుడు సినిమాలో పాడే అవకాశమొచ్చింది. ఈవిడ గొంతు లతా మంగేష్కర్‌ని పోలి ఉండేది. సుమన్‌ పాడిన చాలా పాటలు ‘లత’ పాడారనుకునేవారట. అసలే సిగ్గరి, సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. దీంతో వేదికలపై పాడటానికి ఒప్పుకొనేవారు కాదు. దూరదర్శన్‌లో పాడే అవకాశాన్ని మాత్రం అంగీకరించారు. అప్పుడేమో పాడేవారి పేర్లు చెప్పే సంప్రదాయం లేకపోవడంతో అప్పుడూ ‘లత’నే గాయని అనుకునేవారు. కొన్ని కారణాల రీత్యా ‘రఫి’తో లతా మంగేష్కర్‌ పాడకపోవడం.. ఆవిడ డేట్లు అందుబాటులో లేకపోయినా, రూ.100 పారితోషికం ఇచ్చుకోలేకపోయినా నిర్మాతలు సుమన్‌ను ఆశ్రయించేవారట. అలా సుమన్‌కి ‘పేదోళ్ల లత’గా పేరొచ్చింది. హిందీ, మరాఠీ, అసోమీ, గుజరాతీ, కన్నడ, ఒడియా, బెంగాలీ, రాజస్థానీ, భోజ్‌పురి భాషల్లో 750కిపైగా పాటలు పాడారీవిడ. భారతీయ సంస్కృతిని పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఎన్నో విదేశీ ప్రదర్శనలిచ్చారు. 20 ఏళ్లపాటు సినీ సంగీత ప్రియుల్ని ఓలలాడించిన సుమన్‌ ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. తాజాగా ‘పద్మభూషణ్‌’ వరించింది.


అందమైన మనసు...

టి, మోడల్‌గానే కాదు..సేవాపరంగానూ రవీనా టాండన్‌కు గుర్తింపు ఎక్కువే! పుట్టింది ముంబయి. డిగ్రీ చదువుతుండగా మనసు మోడలింగ్‌ వైపునకు మళ్లింది. ఓరోజు షూట్‌లో హీరోయిన్‌గా ప్రయత్నించమన్న సలహా వచ్చింది. అలా 1991లో ‘పత్తర్‌ కే ఫూల్‌’ ద్వారా బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఆపై తెలుగు, తమిళ, కన్నడ, బెంగాలీ పరిశ్రమల్లోనూ రాణించారు. 2001లో జాతీయ అవార్డు సహా ఎన్నో పురస్కారాలూ వరించాయి. పెళ్లయ్యాక సినిమాలకు దూరమైన 48 ఏళ్ల రవీనా.. కొన్నాళ్లయ్యాక టీవీ కార్యక్రమాలతోపాటు సినిమా, ఓటీటీ వేదికల్లోనూ అడుగుపెట్టి అక్కడా నిరూపించుకున్నారు. ఆ ప్రతిభకు గుర్తింపుగానే ఈ ఏడాది ‘పద్మశ్రీ’ దక్కింది. రూపేకాదు రవీనా మనసూ అందమైనదే అంటారు తెలిసినవాళ్లు. సాయానికి ఎప్పుడూ ముందుండే ఆమె 21 ఏళ్ల వయసులో అగ్రతారగా రాణిస్తున్నప్పుడే ఇద్దరు అమ్మాయిలను దత్తత తీసుకున్నారు. బాంబే వెల్వెట్‌ సినిమాకు ఉచితంగా పనిచేశారు. పర్యావరణ పరిరక్షణతోపాటు పెటాతో కలిసి అందం, ఆభరణాల కోసం జంతువధకు వ్యతిరేకంగా పోరాడారు. మహిళా సాధికారత, బాలికా విద్య కోసం కృషి చేసి, మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ నుంచి పురస్కారాన్నీ పొందారు. తాజాగా జీ20లో మహిళా సాధికారత విభాగం డబ్ల్యూ20కి భారత ప్రతినిధి అయిన తొలి బాలీవుడ్‌ నటిగానూ నిలిచారు.


కుట్టుతో జీవితంపై పట్టు

కుట్టుతో ఎందరో మహిళల జీవితాల్లో వెలుగులు నింపిన గొప్పతనం ప్రీతికనా గోస్వామిది. కోల్‌కతాలోని 24 పరగణాల జిల్లాకు చెందిన ప్రీతి జీవితం తండ్రి మరణంతో అనూహ్యంగా మలుపు తిరిగింది. దిక్కుతోచని పరిస్థితుల్లో స్నేహితురాలి సాయం అడుగుదామని వెళ్లిన ఆమెకి.. వాళ్లింట్లో సగం కుట్టి వదిలేసిన కాంతా డిజైన్‌ చీర కనిపించింది. దాన్ని క్షణాల్లో పూర్తిచేసిన ఆమె నైపుణ్యాన్ని స్నేహితురాలు గుర్తించి, కోల్‌కతాలో చీరలపై కుట్టే పనికి సిఫారసు చేసింది. కానీ అక్కడ ఇంటికి చీర ఇవ్వాలంటే రూ.50 డిపాజిట్‌ చేయాలి. తన దగ్గర అంత లేవు. ‘సరే ఇక్కడే కుట్టి వెళ్లిపో’ అంది యజమాని. అలా కుడుతున్నప్పుడు ఆమె వేగం, పనితనం చూసిన యజమాని ఇంటికే చీరలు ఇవ్వడం మొదలుపెట్టింది. 15 ఏళ్లపాటు కుడుతూనే ఉన్న ప్రీతి పనితనాన్ని గుర్తించిన క్రాఫ్ట్‌ కౌన్సిల్‌ ఆమెని వర్క్‌షాప్‌ పెట్టి తోటి ఆడవాళ్లకు ఆ కళని పంచాల్సిందిగా కోరింది. అలా కోల్‌కతాలో కొన్ని వేలమందికి ఈ కళని నేర్పిన ఆమె మాజీ రాష్ట్రపతి కలాం చేతుల మీదుగా అవార్డుని అందుకున్నారు. తాజాగా పద్మశ్రీ వరించింది. ఆమె ఇద్దరు కూతుళ్లలో ఒకరైన మహువాలాహిరి నిఫ్ట్‌లో చేరి డిజైనర్‌గా పేరు తెచ్చుకోవడంతోపాటు తల్లి కళనీ, లక్ష్యాన్ని అందరికీ చేరువ చేస్తున్నారు.


పెళ్లైనా చదువాపలేదు...

బెంగళూరులో పుట్టిపెరిగిన డా.సుజాత రామదొరై బీజగణిత సంఖ్యా సిద్ధాంత కర్త. ఈ మ్యాథ్స్‌ ప్రొఫెసర్‌ ప్రసుత్తం కెనడాలోని బ్రిటిష్‌ కొలంబియా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. అంతకుముందు తాను పరిశోధన సాగించిన టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రిసెర్చ్‌లోనే చాలా ఏళ్లపాటు ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించారు. సుజాతకి మొదట్లో లెక్కలంటే మహా భయమట. కానీ, అప్పటి ఉపాధ్యాయులు ఇచ్చిన ప్రోత్సాహంతో పాటూ, ‘ది కమర్షియల్‌ సక్సెస్‌ ఆఫ్‌ జాన్‌ నాషెస్‌ లైఫ్‌హిస్టరీ’ అనే పుస్తకం ఆ అభిప్రాయాన్ని మార్చేశాయట. అందుకే, మొదట ఇంజినీరింగ్‌ చదవాలనుకున్న ఆమె...తర్వాత బీఎస్సీ మ్యాథ్స్‌లో చేరారు. అయితే, డిగ్రీ పూర్తవ్వకుండానే పెళ్లయినా... చదువాపలేదు. ఆపై దూరవిద్యలో ఎంఎస్సీ కూడా పూర్తి చేశారు. భర్త కూడా గణిత శాస్త్రవేత్తే. టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రిసెర్చ్‌లో చేరి పీహెచ్‌డీ పూర్తిచేసి.. అక్కడే ఉద్యోగంలో చేరారు. 2007 నుంచి 2009 వరకూ నేషనల్‌ నాలెడ్జ్‌ కమిషన్‌లో సభ్యురాలిగా వ్యవహరించారు. ప్రస్తుతం భారత ప్రధానికి సైంటిఫిక్‌ అడ్వైజరీ కౌన్సిల్‌ సభుర్యాలిగానూ, నేషనల్‌ ఇన్నోవేషన్‌ కౌన్సిల్‌ మెంబర్‌గానూ ఉన్నారు.


మగవారు వద్దన్నా...

క్షరం ముక్క రాదు...అయినా సరే అభివృద్ధిలో వెనకబడిన తమ జాతి పురోగతి చూడాలనుకున్నారామె. హీరాబాయి లోబీది జునాగఢ్‌కి దగ్గర్లోని జాంబూరు. ఇక్కడ సిద్ధి తెగ ప్రజలు ఉంటారు. ఒకప్పుడు వీరంతా గిర్‌ సాసన్‌ అడవుల్లో ఉండేవారు. ఐదువందల ఏళ్లక్రితం అప్పటి పాలకులు బయటకు రప్పించి స్థలాలు ఇచ్చారు. అక్కడ ఊరైతే ఏర్పడింది కానీ, ఆ తెగ ప్రజల జీవితాల్లో ఏ మార్పూ లేదు. పద్నాలుగేళ్ల వయసులో అత్తారింటికి వచ్చిన హీరాబాయి అక్కడి పరిస్థితుల్ని చూసి ఆలోచనలో పడ్డారు. ప్రభుత్వం అందిస్తోన్న పథకాలూ, వివిధ కార్యక్రమాలను స్థానికంగా అమలు చేయాలనుకున్నారు. ఇంటింటా తిరిగి పిల్లల్ని బడికి పంపమని అడిగారు. మొదట ససేమిరా అనడంతో, ముందు మహిళల్లో మార్పు తేవాలనుకున్నారు. తమ పొలంలో సేంద్రియ ఎరువుల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేసి వారికి ఉపాధినివ్వడం ప్రారంభించారు. మార్పు మొదలయ్యింది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. ఆ ధైర్యమే హీరాబాయిని సర్పంచిని చేసింది. ఇప్పుడు అక్కడి యువత ఆర్మీ, నేవీతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఆర్థిక స్థితిగతులు మెరుగుపడ్డాయి.


గాయనిగా చేరి...

గాయనిగా అడుగుపెట్టి.. ప్రముఖ సంగీతనాటక బృందానికి సారథ్యం వహించే స్థాయిని అందుకొన్నారీమె. అర్ధ శతాబ్దానికిపైగా ఆ బాధ్యతలు చేపట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. మహారాష్ట్రకు చెందిన కూమీవాడియా లండన్‌ ట్రినిటీ కాలేజీలో రెండు డిప్లొమాలు చేసిన పియానిస్ట్‌. ముంబయిలో డాక్టర్‌ విక్టర్‌ పరంజ్యోతి స్థాపించిన ‘మ్యూజిక్‌ ఆఫ్‌ పరంజ్యోతి అకాడమీ కోరస్‌’లో తొలుత గాయనిగా చేరారు. ఈ బృందం చేసే ప్రదర్శనలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉండేవారు. ఆరవ పోప్‌పాల్‌, దలైలామా, పండిట్‌ రవిశంకర్‌, మాజీ రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌వంటి వారెందరో వీరి గానానికి ముగ్ధులైనవారే. జపాన్‌, అమెరికా వంటి విదేశీ వేదికలపైనా ఈ బృందం కచేరీలు నిర్వహించింది. 1967లో పరంజ్యోతి మరణంతో కూమీ వాడియా ఆ సంస్థ బాధ్యతలు తీసుకున్నారు. ‘గాయనిగా అడుగుపెట్టి, అదే బృందాన్ని నడిపించడం ఛాలెంజ్‌గా మారింది. ఆ తర్వాత ప్రయోగాలెన్నో చేశా. వాయిద్యాల్లేకుండా గాత్రంతోనే శ్రోతలను మెప్పించే ‘కాపెల్లా’ వంటి వాటిని 22 భాషల్లో అనువదించాం. శతాబ్దాలనాటి సంగీతాన్ని కంపోజ్‌ చేయించి రిహార్సల్స్‌ చేయించేదాన్ని. ఈ 50ఏళ్ల సంగీత ప్రయాణం తృప్తిగా ఉంది’ అంటున్నారు 84ఏళ్ల కూమీవాడియా.


చేనేతతో.. భగవద్గీత

చేనేతలో అద్భుతమైన తన కళా కౌశలాన్ని ప్రదర్శించి పద్మ అవార్డుకి ఎంపికయ్యారు అసోమ్‌కి చెందిన హేమప్రభా చుటియా. దిబ్రూగఢ్‌ జిల్లాలోని మోరాన్‌ దగ్గరున్న అభయపురి ఆమె స్వస్థలం. పదకొండేళ్ల వయసులోనే నేత కళని నేర్చుకున్నా... భర్త, ఇద్దరు కొడుకుల ప్రోత్సాహంతో ఆ నేతలో ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు. 2014లో 80 అడుగుల ముగ సిల్క్‌ వస్త్రంపై అసోమీ సాహిత్యమైన శంకరదేవుని గుణమాలని నేశారామె. అత్యంత క్లిష్టమైన ఈ నేతపనికి ఆమెకి తొమ్మిది నెలల సమయం పట్టింది. ఆ తర్వాత.. 15వ శతాబ్దానికి చెందిన నామ్‌ ఘోష సాహిత్యాన్ని వస్త్రంపై నేశారు. ఈ ప్రయోగాల తర్వాత ఆమెలోని కళానైపుణ్యం గురించి దేశం మొత్తానికి తెలిసింది. అవార్డులు వెల్లువెత్తాయి. ‘ఒక రోజు గుణమాలని వస్త్రంపై నేయాలని బలంగా అనుకున్నా. అది చాలా క్లిష్టమైన పనని తెలిసినా వెనక్కి తగ్గలేదు’ అనే హేమప్రభ 2016 తర్వాత భగవద్గీతలోని శ్లోకాలని సంస్కృతంలోనూ, ఆ తర్వాత ఇంగ్లిష్‌లోకి అనువదించి వాటిని కూడా 200 అడుగుల వస్త్రంపై నేశారు. ‘నేను కోరేది ఒక్కటే. వీటిని మ్యూజియమ్‌లో పెట్టి తర్వాత తరాలకు నేత గొప్పతనం చెబితే చాలు’ అంటారీ పద్మశ్రీ గ్రహీత.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్