అందుకే.. నాలుగు ఖండాలు దాటి ఫుడ్‌ డెలివరీ చేసింది!

సాధారణంగా ఫుడ్‌ డెలివరీ అంటే దేశవ్యాప్తంగా ఆయా జిల్లాలు, రాష్ట్రాలు.. ఇలా కొంత పరిధి మేరకే అందుబాటులో ఉంటుంది. అదే ఏవైనా ముఖ్యమైన వస్తువుల వంటివి ఆర్డర్‌ చేసుకుంటే కొన్ని సందర్భాల్లో రాష్ట్రాలు దాటి కూడా.. వాటిని వినియోగదారుల వద్దకు చేర్చుతుంటారు డెలివరీ చేసే వారు. కానీ ఆర్డర్‌ చేసిన ఆహార పదార్థాల్ని....

Updated : 08 Dec 2022 19:04 IST

(Photo: Instagram)

సాధారణంగా ఫుడ్‌ డెలివరీ అంటే దేశవ్యాప్తంగా ఆయా జిల్లాలు, రాష్ట్రాలు.. ఇలా కొంత పరిధి మేరకే అందుబాటులో ఉంటుంది. అదే ఏవైనా ముఖ్యమైన వస్తువుల వంటివి ఆర్డర్‌ చేసుకుంటే కొన్ని సందర్భాల్లో రాష్ట్రాలు దాటి కూడా.. వాటిని వినియోగదారుల వద్దకు చేర్చుతుంటారు డెలివరీ చేసే వారు. కానీ ఆర్డర్‌ చేసిన ఆహార పదార్థాల్ని డెలివరీ చేయడానికి ఏకంగా నాలుగు ఖండాలు దాటింది చెన్నైకి చెందిన మానసా గోపాల్‌. సింగపూర్‌ నుంచి మొదలుకొని అంటార్కిటికా వరకు సుమారు 30 వేలకు పైగా కిలోమీటర్లు ప్రయాణించి.. ఆర్డర్‌ చేసిన వ్యక్తి వద్దకు ఆయా పదార్థాల్ని చేర్చింది. తద్వారా ప్రపంచంలోనే అత్యధిక దూరం ప్రయాణించి ఫుడ్‌ డెలివరీ చేసిన మహిళగా కీర్తి గడించిందామె. ఇలా తన సుదీర్ఘ ప్రయాణాన్ని ఓ డాక్యుమెంటరీగా చిత్రీకరించి తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది మానస. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది. అయినా ఫుడ్‌ డెలివరీ కోసం మానస ఇంత దూరం ఎందుకు ప్రయాణించినట్లు? రండి.. తెలుసుకుందాం..!

సాధారణంగా ఫుడ్ డెలివరీ సంస్థల్లో పని చేసే సిబ్బందే ఆయా ఆహార పదార్థాలు, ఇతర వస్తువులను వినియోగదారులకు  డెలివరీ చేస్తారు. కానీ మానసా గోపాల్‌ వృత్తి అది కాదు.. అయినా ఖండాలు దాటి మరీ పదార్థాలు డెలివరీ చేసే అవకాశాన్ని అందుకుందామె. అదెలాగని అడిగితే..

అవకాశం అలా వచ్చింది!

‘నాకు ప్రయాణాలంటే విపరీతమైన మక్కువ. ఇప్పటికే పలు ఖండాల్ని చుట్టేసిన నేను.. గతేడాది అంటార్కిటికా యాత్ర కోసం నిధులు సమీకరించుకునే పనిలో ఉన్నాను. ఈ యాత్రను స్పాన్సర్‌ చేసే బ్రాండ్‌ కోసం వెతికాను. ఈ క్రమంలోనే ఫుడ్‌పాండా సంస్థ అయితే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది. ఎందుకంటే నేను ఆహార పదార్థాలు, నిత్యావసరాల కొనుగోలు కోసం ఎక్కువగా ఈ సంస్థ యాప్‌నే వినియోగించుకునేదాన్ని. ఇది విశ్వసనీయమైన సంస్థే కాదు.. పర్యావరణహితం కోరుకునే సంస్థ కూడా! కాబట్టి నా ఆలోచనను ఓ మెయిల్‌లో పొందుపరిచి వారికి పంపించాను. నిజానికి వాళ్ల దగ్గర్నుంచి రిప్లై వస్తుందని కూడా ఊహించలేదు. అయితే నేను అనుకున్నట్లుగానే నా కలను నెరవేర్చుతామని దాదాపు నెల రోజుల తర్వాత ఫుడ్‌పాండా సంస్థ తిరిగి నాకు మెయిల్‌ పంపింది. ఈ క్రమంలో అంటార్కిటికా ఖండం నుంచి వచ్చిన ఆర్డర్‌ మేరకు అక్కడి వ్యక్తికి ఆహారం, ఇతర వస్తువులు అందించాలని నన్ను కోరింది. అందుకు ఆనందంగా ఒప్పుకున్న నేను.. ఇటీవలే ఈ యాత్రను పూర్తిచేసుకొని.. నా కల నెరవేర్చుకున్నా.. మరోవైపు అక్కడి వినియోగదారులకు ఫుడ్‌ డెలివరీ కూడా చేశాను..’ అంటూ చెప్పుకొచ్చిందామె.

4 ఖండాలు దాటి..!

సింగపూర్‌ నుంచి అంటార్కిటికా వెళ్లాలంటే అంత సులభం కాదు.. ఈ క్రమంలో నాలుగు ఖండాలు దాటి 30 వేలకు పైగా కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఇలా సింగపూర్‌లో మొదలైన ఆమె ప్రయాణం.. జర్మనీలోని హాంబర్గ్‌ చేరుకుంది. ఆపై అక్కడి నుంచి మరో విమానంలో అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిరిస్‌కు ప్రయాణించింది. అక్కడ మరో విమానమెక్కి అంటార్కిటికా ఖండంలో అడుగుపెట్టి.. వినియోగదారుడికి ఫుడ్‌ డెలివరీ చేసిందామె. ఈ మొత్తం ప్రయాణంలో కాలి నడకన కొన్ని కిలోమీటర్లు, బురదలో మరికొంత దూరం ప్రయాణించడమే కాదు.. మంచుకొండల్లో ట్రెక్కింగ్‌ చేస్తూ, పడవ ప్రయాణం చేస్తూ ఆఖరికి గమ్యం చేరుకుంది మానస. ఈ సుదీర్ఘ ప్రయాణంలో తనకెదురైన అనుభవాల్ని, అనుభూతుల్ని ఓ లఘు వీడియో రూపంలో రూపొందించి ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిందామె.

‘సింగపూర్‌ నుంచి అంటార్కిటికాకు ప్రత్యేకమైన ఫుడ్‌ డెలివరీ చేశాను. ఇందులో భాగంగా వెజిటేరియన్‌ స్నాక్స్‌, బిస్కట్స్‌, ఫుడ్‌ క్రాకర్స్‌తో పాటు మరికొన్ని నిత్యావసర వస్తువులున్నాయి. 4 ఖండాలు, 30 వేల కిలోమీటర్లు దాటి భూమిపై ఉన్న ఓ మారుమూల ప్రదేశానికి చేరుకోవడం ఓ మధురానుభూతి! ఇక ఈ ప్రయాణం పర్యావరణహితంగా జరగడం మరింత సంతృప్తినిచ్చింది..’ అంటూ తన ఆనందాన్ని క్యాప్షన్‌గా రాసుకొచ్చింది మానస.

డెలివరీ ఛార్జ్‌ ఎంత?

మొత్తానికి ఇలా సుదీర్ఘ ప్రయాణం చేసి తన కల నెరవేర్చుకున్న మానస.. ప్రపంచంలోనే అత్యధిక దూరం ప్రయాణించి ఫుడ్‌ డెలివరీ చేసిన మహిళగానూ కీర్తి గడించింది. ఇక ఆమె వీడియో చూసిన చాలామంది నెటిజన్లు ‘మీ జర్నీ ఓ అద్భుతం’ అంటూ ప్రశంసిస్తున్నారు. మరోవైపు ‘ఇంతకీ డెలివరీ ఫీజు ఎంతో చెప్పనే లేదు?!’ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.


ఐదేళ్లు.. ఏడు ఖండాలు!

మానసా గోపాల్‌ది చెన్నై. ప్రస్తుతం సింగపూర్‌లో నివసిస్తోన్న ఆమె.. అక్కడ ఓ సంస్థలో క్రియేటివ్‌ హెడ్‌గా పనిచేస్తోంది. గతంలో భారత్‌, సింగపూర్‌, ఆస్ట్రేలియా, తూర్పు ఆఫ్రికా.. వంటి ప్రాంతాల్లో పర్యావరణ-జీవ రసాయన శాస్త్ర పరిశోధకురాలిగా పలు అంశాలపై పరిశోధనలు చేసింది మానస. మరోవైపు ప్రయాణాలపై మక్కువతో ఐదేళ్లలో ఏడు ఖండాల్ని ఒంటరిగా చుట్టేసింది.

‘ఈ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు, మరెన్నో అనుభూతుల్ని సొంతం చేసుకున్నా. ఇరాన్‌లో లిఫ్ట్‌ అడుగుతూ కొంత దూరం ప్రయాణించాను.. దక్షిణాఫ్రికా వీధుల్లో పాటలు పాడుతూ/సంగీతం వాయిస్తూ ముందుకు సాగాను.. ఇక జింబాబ్వే నుంచి జాంబియా వరకు కాలి నడకన వెళ్లాను.. ఉత్తర కొరియా సరిహద్దుల దాకా వెళ్లాను.. సుమత్రా అడవిలో గడిపాను.. ఆఖరికి విమానంలో అంటార్కిటికా చేరుకున్నాను. ఈ క్రమంలో ప్రపంచంలోని అందమైన ప్రదేశాలెన్నో చూశాను.. అక్కడి ప్రజల్ని కలిశాను.. చరిత్ర గురించి తెలుసుకున్నాను. ఇవన్నీ నా జీవితంలో మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి..’ అంటున్న మానస.. తన ప్రయాణ ఖర్చులు, ఇతర అవసరాల కోసం కావాల్సిన డబ్బును తానే స్వయంగా ఫండింగ్ రూపంలో సమకూర్చుకుంది.

ప్రస్తుతం వృత్తి రీత్యా సింగపూర్‌లో ఉంటున్నప్పటికీ చెన్నై, శాన్‌ఫ్రాన్సిస్కోలోనూ సమయం గడుపుతానంటోందామె. ఇక తన ప్రయాణ అనుభవాల్ని ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో పాటు టెక్నాలజీ, ఫైనాన్స్‌, సైకాలజీ.. వంటి అంశాలపై మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడతానంటోందీ ట్రావెల్‌ లవర్.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్