వేఫుల్ స్నాక్స్.. ఆరోగ్యకరంగా అందించేందుకు..!

‘అతిగా తింటే విషం.. మితంగా తింటే అమృతం’ అంటుంటారు. భోజనానికే కాదు.. స్నాక్స్‌కీ ఇది వర్తిస్తుంది. నచ్చిన స్నాక్‌ తినాలనిపించినప్పుడు అలా ఒక్క బైట్‌ నోట్లో వేసుకుంటే మనసుకు ఏదో తెలియని సంతృప్తి.

Published : 05 Aug 2023 20:10 IST

‘అతిగా తింటే విషం.. మితంగా తింటే అమృతం’ అంటుంటారు. భోజనానికే కాదు.. స్నాక్స్‌కీ ఇది వర్తిస్తుంది. నచ్చిన స్నాక్‌ తినాలనిపించినప్పుడు అలా ఒక్క బైట్‌ నోట్లో వేసుకుంటే మనసుకు ఏదో తెలియని సంతృప్తి! స్నాక్‌ ప్రియులకు ఆ సంతోషాన్ని ఆరోగ్యకరంగా అందించాలనుకున్నారు ఇద్దరు స్నేహితులు. ఈ ఆలోచనతోనే నిర్దిష్ట పోషకాహార ప్రమాణాలకు అనుగుణంగా క్రిస్పీ స్నాక్స్ వ్యాపారాన్ని ప్రారంభించారు.  స్మార్ట్‌ స్నాకింగే లక్ష్యంగా.. తాము ప్రారంభించిన క్రంచీ, క్రిస్పీ స్నాక్స్‌ వ్యాపారం.. ఎంతోమంది ఫుడీల మనసును తృప్తిపరుస్తోందంటున్నారు ‘మేక్‌ ది జంప్‌’ సహ వ్యవస్థాపకురాలు నటాషా. తమ వ్యాపార ప్రయాణాన్ని వసుంధర.నెట్‌తో ఇలా ప్రత్యేకంగా పంచుకున్నారు.

నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే! బెంగళూరులో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ చదివాను. చదువు పూర్తయ్యాక త్రీడీ మోడలింగ్‌లో కొన్నేళ్ల పాటు ఉద్యోగం చేశా. మాది వ్యాపార నేపథ్యం ఉన్న కుటుంబం.. నాన్న వేఫుల్స్, కోన్స్‌ మెషినరీ తయారుచేస్తారు. ఆయన స్ఫూర్తితోనే వ్యాపారంలోకి రావాలనుకున్నా.

ఆహారంతో ఆత్మ సంతృప్తి!

అదే సమయంలో జిమ్‌లో నాకు పరిచయమైన హేమ కూడా సరిగ్గా ఇదే ఆలోచనతో ఉంది. ఈ మక్కువతోనే ఇద్దరం కలిసి తొలుత హెల్త్‌ బార్స్‌ ప్రయత్నించాం. కానీ కొన్నాళ్లకు నాన్న స్ఫూర్తి, ప్రోత్సాహంతో.. వేఫుల్స్, కోన్స్‌ తయారుచేయాలనుకున్నాం. మార్కెట్లో పరిశీలిస్తే.. ప్రిజర్వేటివ్స్‌ ఉపయోగించని ఉత్పత్తి ఒక్కటీ కనిపించలేదు. అందుకే ప్రిజర్వేటివ్స్‌ ఉపయోగించకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండేలా.. సహజసిద్ధమైన ఫ్లేవర్లలో వేఫుల్స్, కోన్స్‌ తయారుచేయాలని నిర్ణయించుకున్నాం. ఈ క్రమంలోనే 2018లో ‘మేక్‌ ది జంప్‌’ సంస్థను ప్రారంభించాం. మనం తీసుకునే ఆహారం మన మనసును ప్రభావితం చేస్తుంది. ఏ పదార్థమైనా మోతాదుకు మించకుండా తీసుకుంటే మంచిదే. అదే మనకెంతో నచ్చిన స్నాక్స్‌ని ఓ బైట్‌ నోట్లో వేసుకోగానే మనసుకు ఏదో తెలియని సంతృప్తి! అందుకే మా ఉత్పత్తులకు ‘హ్యాపీ వైబ్స్‌.. హ్యాపీ బైట్స్‌’ అనే ట్యాగ్‌లైన్ ఎంచుకున్నాం.

‘స్మార్ట్‌ స్నాకింగే’ లక్ష్యంగా..!

స్నాక్స్‌ని ఆరోగ్యకరంగా అందించేందుకు ‘స్మార్ట్‌ స్నాకింగే’ లక్ష్యంగా మా వ్యాపారాన్ని అభివృద్ధి చేశాం. అంటే.. నిర్దిష్ట పోషకాహార ప్రమాణాలకు అనుగుణంగానే మా వద్ద వేఫుల్స్, కోన్స్‌ తయారవుతున్నాయి. ప్రస్తుతం వేఫుల్ చిప్స్, వేఫుల్ క్రిస్ప్‌ (బిస్కెట్‌ తరహావి), వేఫుల్ మినీ కోన్స్‌.. వంటి మూడు రకాల స్నాక్స్‌ని ఉత్పత్తి చేస్తున్నాం. ఇందులో వాడే క్రీమ్స్‌, చాక్లెట్‌ వంటి.. ఫ్లేవర్లన్నీ ఇంట్లో లభించే పదార్థాలతో సహజసిద్ధంగా తయారుచేసినవే! అంతేకాదు.. మేం వాడే ప్రతి పదార్థానికీ FSSAI లైసెన్స్‌ ఉంది. ఇతర ఫుడ్‌ సర్టిఫికేషన్స్‌ కూడా తీసుకున్నాం. ఇక మా వద్ద తయారయ్యే మూడు ఉత్పత్తుల్లో మినీ కోన్స్‌ని ఎక్కువమంది ఇష్టపడుతున్నారు.

మరిన్ని హెల్దీ ఆప్షన్లతో..!

ప్రస్తుతం ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ మాధ్యమాలు, ప్రముఖ రిటైల్‌ స్టోర్స్‌లో మా ఉత్పత్తుల్ని వినియోగదారులకు అందుబాటులో ఉంచాం. మరోవైపు ముంబయి, దిల్లీ, పంజాబ్‌, అహ్మదాబాద్‌, ఒడిషాలలోనూ డిస్ట్రిబ్యూటర్స్‌ సహాయంతో వీటిని స్నాక్‌ ప్రియులకు చేరువ చేస్తున్నాం. అలాగే కొన్ని ఎయిర్‌పోర్టుల్లో వెండింగ్‌ మెషీన్స్‌ కూడా ఏర్పాటుచేశాం. భవిష్యత్తులో మా వేఫుల్ స్నాక్స్‌ వ్యాపారాన్ని మరింత ఆరోగ్యకరంగా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన ఉంది. ఈక్రమంలో చిరుధాన్యాలు, పప్పులతో వేఫుల్స్; చక్కెర ఉపయోగించకుండా క్రీమ్స్‌, మధుమేహుల కోసం ప్రత్యేకమైన వేఫుల్స్.. వంటివి అందుబాటులోకి తీసుకురావాలనుకుంటున్నాం. త్వరలోనే విదేశాలకూ మా వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం.

ఆ స్పష్టత ఉండాలి!

వ్యాపారమనే కాదు.. ఏ రంగంలోనైనా సవాళ్లు సహజం. మన కెరీర్‌లో ఉన్నతి సాధించాలంటే రెండు విషయాల్లో స్పష్టత ఉండాలి. ఒకటి - తపన, రెండోది - నైపుణ్యాలు. ప్రతి సవాలును బరువుగా కాకుండా బాధ్యతగా స్వీకరిస్తే.. మనం వేసుకున్న ప్రణాళిక ప్రకారమే లక్ష్యాన్ని చేరుకోవచ్చు. దీనికి తోడు ఇంటా, బయటా మనకు తగిన ప్రోత్సాహం కావాలి. మన ఆసక్తుల్ని అర్థం చేసుకొని మనల్ని సపోర్ట్‌ చేసే వాళ్లు మన చుట్టూ ఉండాలి. ఇలాంటప్పుడు మనం ఏమాత్రం కష్టపడ్డా అనుకున్నది సాధించగలుగుతాం. మా వ్యాపారాభివృద్ధిలో నా భర్త ప్రోత్సాహం కూడా ఎంతో! మరోవైపు వీహబ్‌ సహకారం, వారి ప్రోత్సాహం మరువలేను. నేను ఆర్థికంగా, నెట్‌వర్కింగ్‌ పరంగా నిలదొక్కుకోగలగడానికి వాళ్లిచ్చిన ప్రేరణే కారణం!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్